Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 13

"భయం, కంగారు, ఏం తోచలేదురా! వున్నపళాన బయలుదేరాము" చెప్పాడు శివరావు.

వెంటనే మోహనరావు తన బ్రీఫ్ కేస్ తెరిచాడు. లోపల వున్న తన దుప్పటి తీసి పార్వతికి ఇచ్చాడు.

"దుప్పటి కప్పుకుని కాస్త పడుకో అత్తయ్యా!" సీటు కాస్త ప్రక్కకు జరుగుతూ అన్నాడు మోహన్.

శివరావు, మోహన్ బాగా ప్రక్కకి జరగటంతో పార్వతి దుప్పటి కప్పుకుని సీటుమీద ముడుచుకు పడుకుంది.

బస్సులో వాళ్ళు కూర్చున్నది వెనుక సీటు కావటం, ఆ సీటు మొత్తంమీద వున్నది వీళ్ళు ముగ్గురే కావటం వల్ల పార్వతి ఆ మాత్రం పడుకోటానికి వీలు కలిగింది.

బయట తుప్పరలు, గాలితో మొదలయిన వర్షం. అంతకంతకూ పెద్దదయి, జోరుగా కురవటం మొదలుపెట్టింది.

ముప్పావుగంట తరువాత.

బస్సు సడెన్ బ్రేక్ తో కీచుమంటూ ఆగిపోయింది.

ఆదిలోనే హంసపాదు అన్నట్లు. ప్రయాణంలో మొదటిసారిగా, వాళ్ళకో పెద్ద అడ్డు వచ్చింది.

అది.

రోడ్డు కడ్డంగా వాన నీరుతో పొంగిపొరలుతున్న వాన నీరు.

                                       8
బస్సు ఆగంగానే.

బస్సు ఎందుకు ఆగిందో తెలియని ప్రయాణీకులు 'ఏమైంది?' అంటూ ఆదుర్దాగా అడిగారు.

"వర్షానికి వాగు పొంగింది" నిర్లక్ష్యంగా జవాబిచ్చి దర్జాగా తన సీట్లో చేరగిలబడి కూర్చున్నాడు డ్రైవర్.

ఇలాంటి వర్షాలు వాగు పొంగడాలు డ్రైవర్ కి మామూలు విషయాలు.

కండక్టర్ కూడా బీడీ వెలిగించి, ప్రక్కావ్వాడితో కబుర్లేసుకుని కూర్చున్నాడు. డ్రైవర్ కి, కండక్టర్ కి ఏమీ తొందరలేదు. వెళితే ముందుకి లేకపోతే వెనక్కి. రెండు కాకపోతే బీడీలు త్రాగుతూ ఆ బస్ లోనే కూర్చుంటారు.

సమస్యల్లా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులకి. ముఖ్యంగా శివరావు దంపతులకిది జీవన్మరణ సమస్య.

"ఇప్పుడేం చేద్దాం?" మోహన్ని అడిగాడు శివరావు.

"ఈ బస్సు వాగుదాటి అవతలకి వెళితే కాని, ఏమీ చెయ్యలేం."

"అకాలంలో ఈ వర్షమేమిటి? మన కర్మ' నెమ్మదిగా నుదుటిమీద కొట్టుకున్నాడు శివరావు.

ఊరడింపుగా శివరావు చేతిమీద తట్టాడు మోహనరావు.

పది నిమిషాల తరువాత వాన తగ్గింది. పొంగిన వానలోంచి నీళ్ళు మాత్రం నెమ్మదిగా ప్రవహిస్తూనే వున్నాయి.

వర్షం ఆగటంతో బస్సులో సగంమంది క్రిందకు దిగారు.

పొంగినవాడు వరవడిగా ప్రవహిస్తూంటే దానిని చూస్తూ తలోరకంగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అర్జంట్ పనులుండి వెళ్ళవలసిన వాళ్ళు మాత్రం ఆకాలంలో వచ్చిన ఈ వర్షానికి, తనమానాన తను వుప్పొంగి పారుతున్న వాగుని చూసి తమమీద తామే విసుక్కుంటున్నారు.

ఈ ప్రయాణం వల్ల తొందరగా వెళ్ళాలని అనుకొని వారు తాపీగా ముచ్చటించుకుంటున్నారు.

"చల్లగాలి ప్రాణానికి ఎంత హాయిగా వుందో" వెచటి సిగరెట్ దమ్ములు రెండు పీల్చి తృప్తిగా, ఆనందంగా అన్నాడు ఒకాయన.

అది విన్న ప్రక్కనే వున్న ముసలాయన "నా బొంద చల్లగాలా! పాడా!" అన్నాడు.

"ఏంటి తాతగారూ? మీలో మీరే గొణుక్కుంటున్నారు!" అన్నాడు ఆయన.

"గొణుక్కోవటం లేదు. పైకే అంటున్నాను చల్లగాలా, పాడా" చిరచిర లాడుతూ అన్నాడు ఆ ముసలాయన.
"అయితే వాతావరణం చల్ల చల్లగా లేదంటారా?"

"వాతావరణానికేం చల్లగానే వుంది. నాకే వళ్ళుమండి వేడిగా అనిపిస్తున్నది. వెధవ వాన, వెధవ వాగు." ముసలాయన విసుక్కుంటూ అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS