Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 13


    "అర్థమయింది సార్! మీరెలా అయినా పెద్ద! నేను ఎలా అయినా చిన్న. మీరు మీరే. నేను నేనే. మీ తెలివి నాకెలా వస్తుంది సార్! మీరు తెలివిగలవారు కాబట్టి ఆ సీటులో కూర్చోగలిగారు. నేను మీ ముందు నిలబడి ఉన్నాను!" టు నాటు టు అహోబిలం మాటలతో ఉబ్బేసాడు.


    దాంతో_


    అసలే వుబ్బుగా వుండే వర్ధనరావు పొట్టా, ఛాతీ మరింతగా వుబ్బాయ్.


    "ఈయనగారికేమో మాటకి ముందు ముక్కు ఎగబీల్చే అలవాటు వుంది. తను పాటించడు గాని నాకు నీతులు చెబుతాడు. పడ్డవాడు చెడ్డవాడు కాదులే!" తనకు తాను సర్ది చెప్పుకున్నాడు అహోబిలం.


    "మనం అసలు విషయం వదిలేసి అరగంట అయింది" ఇన్ స్పెక్టర్ వర్ధనరావు సీరియస్ గా అన్నాడు.


    "నిజమే సార్!" బుద్ధిమంతుడిగా వప్పుకున్నాడు అహోబిలం.


    "కోటీ యాభయ్ లక్షలను" ఎప్పుడయినా చూశావా అని అడిగాను. నువ్వు బుర్ర గోక్కుంటూ ఆలోచనలో పడ్డావు. గుర్తుందా?"


    "గుర్తుంది సార్! నేను చూసిన సినిమాల గురించి ఆలోచిస్తూ బుర్ర గోక్కున్నాను. "కోటి యాభయ్ లక్షల" రూపాయలను, ఏ తెలుగు సినిమాలోనూ చూపించలేదు సార్! ఆఖరికి "వద్దంటే డబ్బు" సినిమాలో కూడా చూపించలేదు సార్!"


    'ఇంతేనా నీ తెలివి' అన్నట్లు చూశాడు వర్ధనరావు.


    చాలాసార్లు వుబ్బేసి పబ్బం గడుపుకున్న అహోబిలం ఇప్పుడూ అలాగే ఇన్ స్పెక్టర్ ని మాటలతో వుబ్బేస్తూ "కోటీ యాభయ్ లక్షలు" మీ రెప్పుడయినా చూశారా సార్!" అని అడిగాడు.


    "కళ్ళతో చూడకపోయినా వూహించి తెలుసుకోవాలి. రూపాయి నోట్లు కనుక అయితే "కోటి యాభయ్ లక్షలు" పది బస్తాలను మించి రావయ్యా!" తను కరెక్టుగా అంచనా వేసి చెప్పినట్టు ముఖం పెట్టాడు వర్ధనరావు.


    "నిండా పది బస్తాలు కూడా రావా సార్!"


    "నా అంచనా ప్రకారం రావు. అయినా ముందు చేతికి రావాలి కదా! ఆ తరువాత కదా మన బస్తాల గురించి ఆలోచించవలసింది నిరాశగా అన్నాడు వర్ధనరావు.


    "అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది సార్?" పది గోతాలలో రెండు గోతాలయినా తనకు దక్కకపోతాయా అన్న ఆశతో అడిగాడు అహోబిలం.


    "కోటీ యాభయ్ లక్షలు డబ్బు రూపేణాలేదు. వజ్రాల రూపంలో వున్నాయ్. కోట్లకు పడగలెత్తిన ముకుందదాస్ గారింట్లో కోటి యాభై లక్షల విలువగల వజ్రాలు మాయమయ్యాయట. ఆ వజ్రాలు పోయిన ఆయన ఏనాడో కంప్లయింట్ చేశాడు. ఆ కేసు గురించి నేనూ అంతగా పట్టించుకోలేదు. కోటీ యాభయ్ లక్షలు చేజిక్కించుకున్నవాడు ఇంకా ఇక్కడ తగలడతాడా? ఎప్పుడో విదేశాలకు పారిపోయి వుంటాడు. ఫైల్ మూసేద్దాం కదా అని నేను అనుకుంటూంటే పై అధికార్లు నా మీద వత్తిడి తెస్తూ వార్నింగ్ ఇస్తూ మెత్త మెత్తగా చివాట్లు పెట్టారు. ఎలాగైనా ఈ కేసును మనం సాల్వ్ చెయ్యక తప్పదు. ముందు నా వుద్యోగానికి ఆ తరువాత నీ వుద్యోగానికి పై అధికారులు మంగళం పాడతారు."


    "ఒకటా, రెండా కోటీ యాభయ్ లక్షలు కద సార్! ఇలాంటి ఒక్క కేసుని మనం పట్టగలిగితే, పేరు ప్రఖ్యాతులూ ఖాయం, ప్రమోషనూ ఖాయం."


    "కోటీ యాభయ్ లక్షల కన్నా పేరు ప్రఖ్యాతులూ, ప్రమోషనూ ఎక్కువంటావా? అవి మనకంట పడాలే గానీ.... ఏం లేదులే! ఏం లేదులే! మనం ఈ రోజు నుంచీ ఈ కేసు విషయంలో రాత్రింబవళ్ళూ కష్టపడి రక్తం ధారపోసి అయినా సాధించాలి. ఒకటా రెండా కోటీ యాభయ్ లక్షలు" ఇన్ స్పెక్టర్ వర్ధనరావు సీరియస్ గా అన్నాడు.


    "అలాగే సార్!" వినయంగా అన్నాడు అహోబిలం.


    'ఇన్ స్పెక్టర్ వర్ధనరావుకి "కోటీ యాభయ్ లక్షల" మీద ఎప్పుడో కన్ను పడిందని, అది తను ఒక్కడే పరిశోధించబోతే కుదరలేదని, దానికి తోడు పైవాళ్ళ వత్తిడి ఇవన్నీ కలిసి ఇప్పుడు ఇన్ స్పెక్టర్ తనతో ఈ విషయాన్ని చెప్పేలా చేశాయని అహోబిలం గ్రహించాడు.


    పరిశోధనలో ఎలా ముందుకు సాగాలన్నదే ఇరువురికీ అర్థం కాలేదు.


    కాళ్ళు బార్లా జాపుకుని కుర్చీలో వెనక్కి జార్లబడి కళ్ళు మూసుకుని ముక్కు ఎగబీలుస్తూ దీర్ఘాలోచనలో పడ్డాడు వర్ధనరావు.


    జెండా బొంగులాగా నుంచుని ఎర్ర టోపీని చంకలో ఇరికించుకుని బుర్ర గోక్కుంటూ తనూ ఆలోచనలో పడ్డాడు అహోబిలం.


    ఇరువురి ఆలోచనలూ ఒకే విధంగా సాగుతున్నాయి.


    ఈ కేసుని ఎలా పరిశోధిద్దామా అని కాదు.


    వాళ్ళ కళ్ళ ముందు కోటీ యాభయ్ లక్షలు కనబడుతున్నాయి.


    అవి ఎలా సొంతం చేసుకుందామా అని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS