7
వేగుచుక్క పొడిచింది. ఇంకా తెల్లవారలేదు. శివయ్య ఇంట్లో మల్లమ్మ మేల్కుంది. శివయ్యా సుభద్రమ్మా ఇంకా నిద్రలోనే ఉన్నారు. మల్లమ్మ పొరకతో వాకిట్లోకి వెళ్ళింది. ఏదో చూచి దడుచుకున్నట్లు పొరక అక్కడ పారేసింది గబగబ వెళ్ళి తలుపులు బాదసాగింది.
"దొరా! ఎవరో ఏమో పెట్టిన్రు, తలుపు తియ్యండి.
దొరా! తలుపు తీయి.
దొరసానీ తలుపు తీయి"
మల్లమ్మ తలుపులు బాదుతుంది అరుస్తుంది, అడావుడి చేస్తుంది మల్లమ్మ అరుపులు, కేకలు శివయ్య దాకా అందడానికి చాలాసేపు పట్టింది వారు శయనించిన గదికి ఇవతల చాలా ద్వారాలున్నాయి అవన్నీ బంధించి గాని పడుకోడు శివయ్య.
శివయ్యా, సుభద్రమ్మ ఆ కేకలు విన్నారు. దొంగలు పడ్డారేమో అనుకున్నారు, భయంగా లేచారు . ఒక్కొక్క తలుపూ హడావుడిగా తీస్తూ సాగారు తలుపులన్నీ భద్రంగా ఉన్నాయి అతలాకుతలం అయిన వారి మనస్సు కొంత కుదుటపడింది మల్లమ్మ కేకలకు కారణం తెలియలేదు.
శివయ్య వాకిట తలుపు తీశాడు.
మల్లమ్మ వణికిపోతూ కనిపించింది.
"ఏందే దొంగముండ! అట్ల అరుస్తున్నావు కొంపమునిగిందా? ఎవడన్న చచ్చిండా?" శివయ్య గట్టిగా అరిచినట్లు అడిగాడు.
":శివమెక్కినట్లు అరుస్తావేమే లంజముండ! ఏమైంది?" సుభద్రమ్మ సాయించింది.
"దొరా! ఇంటిముందర ఏమో పెట్టిన్రు నాకు బుగులుగున్నది రండి చూపిస్త" అని దారితీసింది మల్లమ్మ.
శివయ్య గుండెలో బుగులు బయలుదేరింది . సుభద్రమ్మ గడగడలాడింది వారు మల్లమ్మను అనుసరించారు.
"ఇగో చూడండి" మల్లమ్మ చూపింది మౌనంగా నుంచుంది.
సరిగ్గా గుమ్మం ముందు వాకిట్లో నాలుగు నిమ్మకాయలు, ఎర్రని అన్నం కుప్ప, పోసి వుంది. దాని చుట్టూ నల్లని దారాలు పడి ఉన్నాయి.
శివయ్య అవాక్కయిపోయాడు.
సుభద్రమ్మ వళ్ళు తిరిగిపోయేంత పని అయి నిలదొక్కుకుంది.
శివయ్య పిచ్చివానిలా చుట్టూ చూచాడు మల్లమ్మ పారేసిన పారక తప్ప ఏమీ కనిపించలేదు.
ఆకాశం ఎర్రవారింది. ఈ రక్తపు కూడు ఆకాశంలో వ్యాపించినట్లు అనిపించింది
"ఎవరో సేతబడి చేసిన్రు ఈ ఇంటి కేదో మూడింది నాకు కళ్ళు తిరుగుతున్నాయి నేను నిలబడలేను" అన్నది సుభద్రమ్మ నిజంగానే పడిపోయేట్లుంది .
"చూస్తవెమే దొంగముండా! పట్టుకో" అన్నాడు శివయ్య మల్లమ్మతో తాను ఉన్నచోట నుంచి కదల్లేదు.
మల్లమ్మ సుభద్రమ్మను పట్టుకుంది. మెల్లగా మెట్లేక్కించి లోనికి తీసికెళ్ళింది సుభద్రమ్మ మంచి నీళ్ళడిగింది . మల్లమ్మ ఇచ్చింది ఆమె అక్కడే నుంచుంది.
"ఈడ నిలబడ్తవేమే లంజముండా! ఆడికిపో , ఆయనొక్కడున్నాడు ఈ కొంపకేమో వచ్చిందమ్మా!' అని సన్నగా ఏడుపులంకించుకుంది సుభద్రమ్మ.
మల్లమ్మ వాకిట్లోకి వచ్చింది పక్కగా నుంచుంది. శివయ్యను పరికిస్తుంది. ఊరిని గడగడ లాడించిన శివయ్య తాను గడగడలాడుతున్నాడు. మల్లమ్మ మౌనంగా నుంచుంది. ఆమెను అంతరాంతరాల్లో ఎక్కడో సంతోషంగా ఉంది శివయ్య వణుకుతున్నాడు శివయ్య గడగడలాడుతున్నాడు.
శివయ్య స్థాణువులా నుంచొని ఉన్నాడు . అతను ఏమి ఆలోచిస్తున్నాడో చెప్పడం కష్టం కాని, అతని అధికారానికి, ప్రభుత్వానికి గండి పడింది. పంతులు బదిలీ కావడంతో గండి పడింది. ఇప్పుడు తాను వణకిపోతున్నాడు. తన ఇంటి ముందు ఏదో శవం ఉన్నట్లు అనిపిస్తుంది. వాకిట్లో ఊడుపు లేదు, కళ్ళాపి లేదు. కళకళలాడే వాకిలి కళావిహీనంగా ఉంది శ్మశానంలా ఉంది. తన ఇల్లు శ్మశానం అయినట్టూ , తన ఇంటిముందు తన శవమే ఉన్నట్లూ అనిపించింది బలహీనతలు చాలా చెడ్డవి అవి మనిషిని కూల్చి వేస్తాయి. మంత్రాల సంగతి తెలియదు గాని మనసు కృంగిమనిషి కూలిపోతాడు.
పెంటయ్య పాటకి తెరచుకుని లోన ప్రవేశించాడు. అతడు పశువులను తోలుకు పోవడానికి వచ్చాడు. ఎదుట నిమ్మకాయలు, నెత్తుటి అన్నం, నల్ల దారాలు చూచాడు. ఉలికిపడి 'వామ్మో' అని అరిచాడు. ఉరికి పోవడానికి ప్రయత్నించాడు.
పెంటయ్య కేకతో ఈ లోకంలోకి వచ్చాడు శివయ్య. ఉరికిపోతున్న పెంటయ్యను చూచాడు . 'అరే! నిలబడు ఇట్లా!" అరచాడు.
పెంటయ్య శివయ్యను చూచాడు అతని అరుపు విన్నాడు.
'దొరా! నాకు బుగులైతాంది నేనుండను, బతకనీండ్రీ" అని పరుగు లంకించుకున్నాడు.
శివయ్య అతని వెంటబడి పరిగేట్టలేదు. కనీసం అడుగు ముందుకు వేయలేదు. పక్కకు చూస్తె మల్లమ్మ కనిపించింది.
"దొంగముండా! నంగనచోలె చూస్తవేమే! ఊడువు అయ్యి తీసెయ్యి తీసేయ్యవే ముండా, నిలబడ్డవేమే ఇంకా! ఊ కానియ్యి , ఊడువు"
'దొరా! అయ్యినేం తాకను నీ కాళ్ళు మొక్కుతా వాటిని నేను అంటను నీబాంచనయిత నన్ను ఊడవ మనకు నీకు గులాం నైత నన్ను కొట్టకు " మల్లమ్మ దీనంగా ప్రార్ధిస్తుంది.
శివయ్య మల్లమ్మను చూచాడు. అతనికి జాలి కలుగలేదు. మల్లమ్మతో ఆ పదార్ధాలను తొలగింపచేసే తన శక్తిని గురించి ఆలోచించాడు. అతనికి పోచయ్య కనిపించాడు. పోచయ్యను తాను చావబాదాడు. పోచయ్య పల్లెత్తు ఎడురుమాట అనలేదు. ప్రాణాలు విడిచాడు. మనిషిలో ఏదో అపారం అయిన శక్తి ఉంది. మనిషి ప్రాణాలయినా వదులుకుంటాడు తాను చేయదలచని పని చేయడు చంపినవాడు జయించాననుకుంటాడు వాస్తవంగా ఓడేది అతనే, జయించేది చనిపోయిన వాడే! తాను ఒకసారి ఓడేడు మళ్ళీ అదే అవలంభించలేడు. అర్ధం కాక అటూ ఇటూ తిరగసాగాడు. మల్లమ్మ అలాగే నుంచొని ఉంది కదల్లేదు. పశువుల కొట్టంలో దూడలు, పశువులు 'అంబా" అంటే "అంబా" అని అరుస్తున్నాయి. బిడ్డలను చేర్చుకోవాలనే తల్లుల ఆవేదనా, తల్లులను చేరాలనే దూడల ఆరాటం వాటి అంబారావాలలో వ్యక్తం అవుతుంది. లోన సుభద్రమ్మ మూలుగుతుంది ఆమెకు అనుమాన పిశాచం పట్టింది నర్సిమ్మ వాకిట్లో ప్రవేశించాడు. అప్పటికి ఆ వార్తా అంతటా పాకింది. నర్సిమ్మను చూచి శివయ్యకు ప్రాణం లేచి వచ్చింది. "నర్శిమ్మా! చూడు ఇయన్నీ ఎవడో పెట్టి పోయిండు తీసి పారెయ్యి అవతల" శివయ్య మాటలు అజ్ఞలా లేవు ప్రార్ధనలా ఉన్నాయి. శివయ్య ధ్వనిలో నర్శిమ్మ మీద విశ్వాసం కనిపించింది. నిర్శిమ్మ తన పెంపుడు కుక్క తప్పక ఈ పని చేస్తాడనుకున్నాడు.
నర్శిమ్మ ఒకసారి వాకిలిని చూచాడు. అక్కడున్న నిమ్మకాయలను, నెత్తుటి కూటిరాసిని, నల్ల దారాలను చూచాడు. తన క్షేమం తలచుకొన్నాడు. తన కుటుంబాన్ని తలచుకున్నాడు ఒక్క అడుగు సైతం ముందుకు వేయలేదు, తిరిగి చూచాడు మల్లమ్మ కనిపించింది.
"ముండా! తియ్యి వాటిని, నీకేమన్నా పిల్లలున్నారా జల్లలున్నారా? మొండి మొదబారిన ముండ ఊ తియ్యవే" నర్శిమ్మ అడుగు ముందుకు వేశాడు. మల్లమ్మ మెడపట్టి ముందుకు నెట్టి , ఆమెతో ఆ పని చేయించాలని అతని సంకల్పం తనమీడికి వస్తుందనుకున్న పీడ మల్లమ్మ మీదికి తోలాలనుకున్నాడు.
మల్లమ్మ తనమీదికి వస్తున్న నర్శిమ్మను చూచింది . "నర్శిమ్మన్నా! అడనే నిలబడు , అడుగు వేయకు, నేను తియ్యనని చెప్పిన ఇన్నవా?"
నర్శిమ్మ మల్లమ్మను చూచాడు, మల్లమ్మ మాటలు విన్నాడు. ఆమెలోని దృడ సంకల్పం గమనించాడు.
"తియ్యనంటాంది ముండ - చూసిన్రా దొరా!" పిర్యాదు చేశాడు నర్శిమ్మ.
"నర్శిమ్మా! నిన్ను తియ్యమన్నా, మల్లిని కాదు - విన్నావా?" శివయ్యలో వచ్చిన మార్పు ఆశ్చర్యం కలిగించింది నర్శిమ్మకు.
'పిల్లలు గలోన్ని -- నేనేం తీస్తమండి?" దూరంగా నుంచున్నాడు నర్శిమ్మ
"హు" నిట్టూర్చాడు శివయ్య అతనికి ఏమీ తోచలేదు . సుభద్రమ్మ ఇంట్లో మూలుగుతుంది. కొట్టంలో పశువులు అంబారావాలు చేస్తున్నాయి. ఇంటి ముందు ఊడ్పూ లేదు, ఇల్లు పీనుగును పెట్టుకున్న కొంపలా ఉంది. తనలో ఏదో నీరసం ప్రవేశించింది తన అధికారం జారిపోతుంది. తాను ఈ చిన్న పని చేయించలేక పోతున్నాడు. ఊరు సాంతం ఒక్కటి అయినట్లుంది. అంతా తన మోచేతి కింద బతికినారు. తాను ఆపదలో ఉన్నాడంటే ఒక్కడూ తొంగి చూడడం లేదు. జనం ఎంత కృతఘ్నులు అనుకున్నాడు. ప్రతిరోజూ అప్పులకోసం పడిగాపులు కాసినవాళ్ళలో ఒక్కడూ ఇటు తొక్కి చూడడం ;లేదు. వాళ్ళందరినీ మాడ్చి చంపాలి ఒక్కడికీ డబ్బివ్వ రాదు. ఆకలికి అలమతించాలి జనం అనుకున్నాడు.
శివయ్య కుర్చీలోనే ఉన్నాడు కదలలేదు. కాలం కదలకుండా నిలిచినట్లనిపించింది. అది అనుకోవడమే కాలాన్ని నిలిపిన ఘనుడు ఇంతవరకు పుట్టలేదు . ఎండ ఎక్కిపోతూంది. శివయ్య వాకిట్లో ఎండ పరచుకుంది అయినా, అక్కడ ఊపిరి ఆడుతున్న జాడ కనిపించడం లేదు. అక్కడున్న ముగ్గురూ బొమ్మల్లా ఉన్నారు. వారిలో కదలిక లేదు.
