Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 12


    "నార్త్ లో వుద్యమం మొదలైందిగా_అది నెగ్గితే పరిస్థితి మారిపోతుంది."
    "నెగ్గితే యేం మారుతుంది? ఒక దోపిడి జట్టు పోయి యింకో దోపిడీ జట్టు అనుకోవాలి. యీ రకం ఉద్యమాలు అర్ధరహితం__" అని యింకేదో అంటుండగా__
    "హలో కామ్రేడ్ యీ చక్కని ఫిబ్రవరి సాయంత్రాలని వేడెక్కించేస్తున్నావు!" అని తెలుగులో అంటూ వచ్చాడు శ్రీపతి.
    "యేమ్ చేసేది యీ ఇందిరమ్మ తల్లి పుణ్యమా అని!" అన్నాడు వెంకటేష్.
    "మీ విరసం చీలిపోయిందిటగా!"
    "లే. రియాక్షనరీ క్రూక్ బయటకు పోయిన్రు."
    "బయటికి వెళ్ళిన వాళ్ళది యేఁవిఁరసం? నిన్న వొక కవి మిత్రుడు__ కేవలం ఉభయకవి మిత్రుడే కాదు. సర్వ కవి మిత్రుడు, వివరిస్తున్నాడు__విరసం అంటే విరిచే రచయితలట. ఆరసం అంటే అరిచే రచయితలట. వూరికే సరదాకి అంటున్నాను సుమా." అన్నాడు శ్రీపతి.
    "నేను కరసం అని పెట్టదలిచాను. అంటే కరిగే రచయితల సంఘం" అని అన్నాడు వొకతను.
    "కరిగే సామర్థ్యం వున్నవాడు రచయిత అవడు. యేమీ చాతకాక రాయటానికి దిగుతాడు మనిషి. మహా అయితే నేను చేసి యాడవలేను. యిలా చెయ్యొచ్చు. చెయ్యండి__అని. మన రామ్మూర్తిగానీ యిప్పుడిక్కడుంటే__చరసం అని స్థాపిస్తాను__అంటే చవట రచయితల సంఘం అని. ఐతే యిది విశ్వవిద్యాలయాలకే పరిమితం. యెందుకంటే అది దాని సహజ లక్షణం__అని వుండును." అని చిన్నగా నవ్వాడు శ్రీపతి.
    "రామ్మూర్తి యెక్కడ కనిపిస్తలేడు?"
    "నీకు తెలియదా? థీసిస్ సబ్ మిట్ చేసి వెళ్ళిపోయాడు. వుద్యోగం వేటలో వున్నాడు_ సోషల్ వెల్ ఫేర్ వెల్ లో యేదో వో టెంపరరీ ఖాళీ వుందని తెలిసింది. దానికోసం ప్రయత్నిస్తున్నాడు. అంతలో వూరినుంచి ఉత్తరం వస్తే బందరెళ్ళాడు. యీ బందరు కుర్రాడి కేదో పెళ్ళి బందోబస్తు చేస్తున్నట్లున్నాడు వాళ్ళ నాన్న. పెళ్ళి జరిగితే మేలు. ఆడ పొందు దొరికితే కాస్త తెరిపిన పడతాడు మన రామ్మూర్తి" అన్నాడు శ్రీపతి.
    రామమూర్తి వొళ్ళంతా రాగిరంగు నూగు వెంట్రుకలుంటాయి, పాలిపోయిన ఎర్రటి పండుకోతి ఎరుపు చర్మం మీద.
    "పోవాల, ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ వస్తున్నది" అన్నాడు వెంకటేష్.
    "కాస్త జాగ్రత్తగా మెసలండి. మన కొత్త వీ.సీ. జేబులో పిస్టలూ చాకూ పెట్టుకుని గస్తీ తిరుగుతున్నాడట. మొన్న ఒక జట్టుని నిలేశాడట. ఆంధ్ర యూనివర్శిటీలో నియామకమైన అప్పారాయల వంటి సాత్వికుడు కాదు" అన్నాడు శ్రీపతి.
    "ఇంపోటెంట్ కోర్ట్ కాదు యూనివర్శిటీ అంటే. కోర్టులో వేషమేసుకుని కూర్చొనుడు కాదు వైస్ ఛాన్సలర్ షిప్ అంటే. పులులతోటి చెలగాటం ఆడుటని జల్దీనే గ్రహిస్తాడు" అన్నాడు వెంకటేష్.
    "యీ యూనివర్శిటీ గొడవలు పెద్ద తలనొప్పిగా అయిపోయింది నాకు. అయ్యా, జగన్మోహనరెడ్డిగారూ మీకు సర్వాధికారాలూ ఇస్తున్నాను. మీ యిష్టమొచ్చిన కారాలూ మిరియాలూ నూరండి అని మన వెంగళ్రాయల వారు అన్నాడట. అలా సర్వాధికారాలూ యిస్తేనే యిక్కడికి రావటానికి వొప్పుకున్నాడట" అన్నాడు శ్రీపతి.
    "వాని చాకూ గోలీ మన తాన నహీ చల్తా. తన కుర్చీలో తాను కూర్చొని తన పని చేస్కోమను. అంతే స్టూడెంట్స్ యూనియన్ ప్రాబ్లమ్స్ ల కొచ్చిండంటే __పింగళి సాబ్ కొ పకడ్ కె పింజ్ రే మె రఖేంగే!" అని బయటికి నడిచాడు వెంకటేష్.
    సోషియాలజీ విద్యార్థులు __ క్రితం సంవత్సరం తప్పిన అట్లూరి గాంధీ, విరుడు తప్పిన చెరుకూరి వెంకటేశ్వరరావు, గుండు శఠగోపం __ పేపర్లో సినిమా పేజీల్లో ముఖాలు దూర్చి చూస్తున్నారు. ముగ్గురూ పరీక్షలు రాసే పేరుమీద యీ నెలలోనే వచ్చారు.
    మజ్ బూర్, రొటీ, వో మె నహీ, పోకెట్ మార్, మొగుడా పెళ్ళాము, ఐనా పాత దేవదాసు, అభిమానవతి, సిద్ధార్థ_
    "గాంధీజీ తిరిగి చదువుకి నామం పెట్టారు. ఆ గాంధీకేం, వాడి బాబు దగ్గిర పాపిష్టి డబ్బు బోలెడుంది పెరుగుతూ. ఈ బికారి వెధవలు మట్టిగొట్టుకుపోతారు. ఈ రెండు నెలలైన బుద్ధిగా చదివిచస్తే__" అనుకుంటున్నాడు శ్రీపతి.
    సిద్ధార్థ సినిమా బొమ్మకేసి కన్నార్పకుండా చూస్తున్నాడు, గాంధీ.
    "గాంధీ, ఆ నిండా దిసమొలగా నుంచున్న సిమీ గుంట ముందు మోకగిల్లిన శశీ గుంటణ్ని చూసి లొట్టలేస్తున్నట్లున్నావు. కాన్ రాడ్ రూక్స్, హెర్ మన్న్. హెప్స్ కి యేమంత అన్యాయం చెయ్యలేదు. చెడితే నువ్వు అన్యాయమైపోతావుం నిరుత్సాహంతో జీనల్ సినిమాక సైరా సినిమాకో పర్వీన్ సినిమాకో వెళ్ళు. వీళ్ళిద్దర్నీ వొదిలేసెయ్యి పాపం చదువుకుంటారు" అన్నాడు శ్రీపతి.
    వాళ్ళిద్దరూ గుర్రుగా చూశారు శీపతివంక. గాంధీతో సినిమా కెడితే ; సినిమా, ఇరానీలో బిరియానీ దక్కుతాయి. రెండు పెగ్గులతో నోరు తడిపినా తడవవొచ్చు. గాంధీ సహచర్యంలో, శఠగోపం చికెన్ బిరియానీ రుచి, రిగాడు బాగా, గడిచిన రెండేళ్ళలో.
    "వరంగల్, గుంటూర్లలో పీజీ సెంటర్స్ ని యూనివర్శిటీలు చేస్తారట. మరికొన్ని పి.జి. సెంటర్లు పెడతారట. విద్యామంత్రిమండలి అభిభాషణ." అన్నాడు నిరంజనరావు.
    "బుద్ధిలేకపోతే సరి. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య దేనికి గుమస్తాల పనికి? గ్రాడ్యుయేషన్ అనవసరం అనుకుంటూంటే పోస్ట్ గాడ్యుయేషన్ విద్య, ఆయా రంగాల్లో విశేషమైన కృషి చేస్తూ వుండిపోదలిచిన వాళ్ళకిగానీ __ ఇళ్ళలో ఏం తోచకపోతేనూ, యిప్పట్లో వుద్యోగం రాదని తెలిసి యేం చెయ్యటానికీ లేక వొచ్చి చేరటానికి, కట్నం రేటు పెంచుకోటానికీ కాదు" అన్నాడు శ్రీపతి.
    "నువ్వు పోవా సిన్మాకు. పోకెట్ మార్ ల సైరాబానూ వున్నది. ధర్మేంద్ర గూడ. పోయి చూడు నే చూన్న" అన్నాడు వొకతను.
    ఆ రెండో అతను "జ్వరంగా వుంది" అన్నాడు.
    "ముఖం చూస్తే అట్లా లేదు" అని చెయ్యి పట్టుకుని చూసి, "వెచ్చగా లేదే?" అన్నాడు నిరంజనరావు.
    "మరి అదేమి జ్వరమ్?" అన్నాడు వొకతను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS