ఆ వూళ్ళో దిగేవరకే టికెట్ తీసుకున్న మోహన్ రావు మళ్ళీ బస్సు ఎక్కటం వల్ల తానుకూడా టికెట్ తీసుకున్నాడు.
వీళ్ళకి టికెట్స్ ఇచ్చి అవతలకి వెళ్ళాడు కండక్టర్.
"ఇప్పుడు చెప్పు మామయ్యా!" అన్నాడు మోహన్ రావు.
"చంద్రం పరిస్థితి చాలా ప్రమాదంలో వుంది...."
శివరావు చెబుతూంటే "చంద్రానికేం జరిగింది మామయ్యా!" మోహన్ ఆదుర్దాగా అడిగాడు.
"అదికాదు" అంటూ పార్వతి విషయం చెప్పబోయింది.
"నువ్వుండు" అని శివరావు జరిగినదంతా మేనల్లుడికి చెప్పాడు.
"ఓ మైగాడ్!" అన్నాడు మోహన్ రావు. అతనికి కూడా ఒక్కక్షణం బుర్ర పనిచెయ్యలేదు.
ఇందాకటి నుంచీ నా మనస్సు మనస్సులో లేదు. నువ్వు పక్కన వున్నావు కాస్త ధైర్యంగా వుంది మోహన్!" అన్నాడు శివరావు.
మోహనరావు ఏంచేస్తాడు తలాడించి వూరుకున్నాడు.
"మా కన్నా మూడు గంటల ముందు బయలుదేరి వెళ్ళాడు బాబాయ్. బాబాయ్ కన్నా ముందు మనం పట్నం వెళ్ళగలమో లేదో! అదే నాకు భయంగా వుందయ్యా మోహన్!" అన్నాడు శివరావు.
"మన ప్రయత్నం మనం చేద్దాం మామయ్యా! భగవంతుడు మంచివాళ్ళకి అన్యాయమెప్పుడూ చెయ్యడు" అన్నాడు మోహన్ రావు.
"మంచివాళ్ళకి కూడా అన్యాయం జరిగిన సంఘటనలు పార్వతి కళ్ళముందు మెదిలాయి. అయినా భగవంతుడి మీద భారం వేసి మిన్నకుండి పోయింది పార్వతి.
"బాబాయ్ కన్నా మనం ముందు పట్నం వెళ్ళాలి అంటే ఏం చెయ్యవలసి వుంటుంది మోహన్? అడిగాడు శివరావు.
"మనం ముందు రాజన్ పేట వరకూ వెళితే, మనం అక్కడి నుంచీ ఏమన్నా ప్రయత్నం చెయ్యవచ్చు. ఏం చెయ్యాలి అన్నది ఆలోచిస్తాను!" అంటూ అప్పటికప్పుడు ఆలోచనలో పడ్డాడు మోహన్ రావు.
మేనల్లుడి ఆలోచనకు అంతరాయం కలిగించటం ఇష్టంలేక తనూ మౌనంగా వుండిపోయాడు శివరావు.
శివరావుకి ఇప్పుడు కాస్త ధైర్యంగా వుంది. 'తన మేనల్లుడు చదువుకున్నవాడు. అవసరమయితే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఏదయినా చెయ్యగలుగుతాడు. ఇంగ్లీషు కూడా బాగా దంచి మాట్లాడుతాడు. ఏమో! ఆ భగవంతుడి దయవలన చంద్రాన్ని తను క్షేమంగా చూస్తామేమో! సమయానికి తన మేనల్లుడు మోహన్ కనపడ్డాడంటే అర్థమేమిటి? అంతా దైవ లీల కాక. శివరావు నిబ్బరంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు అంతా దైవం మీద భారం వేసి.
బస్సు వేగంగా ముందుకు సాగుతూనే వుంది.
బస్సు ఓ మైలు దూరం దాటి ముందుకి వచ్చేసరికి నెమ్మదిగా వాన తుంపరలు పడటం మొదలుపెట్టాయి.
బయట వానకన్నా గాలి జోరు ఎక్కువగా వుంది.
పెద్దవాన కురిస్తే వాగు పొంగే ప్రమాదం వుంది.
అదే జరిగితే ప్రయాణం ఆగిపోతుంది.
ఆ దోవన ప్రయాణించే చాలా మందికి ఆ విషయం అనుభవమే.
"వాన వచ్చేటట్లు వుంది!" భయం లోపల దాచుకుంటూ పార్వతితో అన్నాడు శివరావు.
"ఈ గాలి చూస్తుంటే పెద్దవాన వచ్చేటట్లే వుంది. ఎలాగండీ?" కాస్త వణుకుతూ అంది పార్వతి.
"అదేమిటి వణుకుతున్నావ్? గాలికా!"
"గాలికే కాబోలు చలిచలిగా వుంది. కాస్త ముడుచుకుని కూర్చుంటూ చెప్పింది పార్వతి.
"నాకేం చలి వెయ్యటం లేదే?" అన్నాడు శివరావు.
"వళ్ళంతా వూదరగా కూడా వుంది. అలసట వల్లనేమో అంది పార్వతి.
శివరావు భార్య వంటిమీద చెయ్యివేసి చూశాడు. చూస్తూనే 'బాగా జ్వరం వచ్చినట్లు వుంది. అందుకే ఈ చలి' అన్నాడు.
వీళ్ళ మాటలు విన్న మోహనరావు, "మీతో ఏమీ తెచ్చుకోలేదా? చిన్న సంచీ అయినా!" అన్నాడు.
