Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 12


    చేతులతో సౌంజ్ఞచేస్తూ ఇటువైపుకి తిరగమన్నాడు వర్ధనరావు కనకలింగాన్ని. ఆ తర్వాత చెప్పాడు.


    "బయటికి వెళ్ళి గుమ్మం అవతల నిలబడు?"


    "అంతపెద్దగా అరిచి చెప్పాలా సార్!" నెమ్మదిగా చెబితే వెళ్ళనా!" గొణుక్కుంటూ గుమ్మం అవతలకి వెళ్ళి నిలబడ్డాడు కనకలింగం.


    ఇలాంటి కేసు ఎక్కడయినా వుంటుందా అహోబిలం!" అడిగాడు వర్ధనరావు.


    కానిస్టేబుల్ అహోబిలం మళ్ళీ నెత్తిమీద టోపీతీసి మరోసారి బుర్ర గోక్కున్నాడు.


    "ఇది పోలీస్ స్టేషన్ కాదయ్యా! పిచ్చాసుపత్రి. మీరందరూ కలసి నాకు పిచ్చెత్తిస్తున్నారు. కానిస్టేబుల్ కనకలింగానికేమో కుడిచెవి బ్రహ్మాండంగా వినపడుతుంది. ఎడమచెవి ముందు ఫిరంగి పేల్చినా వినపడదు. అత్యావసర విషయాలు చెప్పేటప్పుడు, మాట్లాడేతప్పుడు ఎడమచెవి వొగ్గుతాడు. అనవసర విషయాల్లో కుడిచెవి వొగ్గి నా ప్రాణం తీస్తూ అడ్డువస్తాడు. ఎడమచెవి వినబడదని మాకన్నా నీకే బాగా తెలుసు. డ్యూటీలో వున్నప్పుడు కుడిచెవితో పని చెయ్యవయ్యా అంటే ఏమన్నాడో తెలుసా?"


    "ఏమన్నాడు సార్!" ఆత్రుతగా అడిగాడు అహోబిలం.


    "రెండు చెవులూ సమానంగా వుండటంవల్ల కుడి ఎడమల తేడా తనకి తెలియదుట. ఒకసారి నక్సలైట్లు దాడిలో ఎడమచెవి ప్రక్కనుంచీ తుపాకీ గుండు దూసుకు వెళ్ళిందట పెద్ద శబ్దంతో. ఆ మోతకి కర్ణభేరి బీట్లు పడిందట. అప్పటి నుంచీ ఏనుగుల ఘీంకారములు, తుమ్మెదల రొద, పక్షుల కిలకిల రావములు. కెరటాల హోరు ఇలాంటి శబ్దాలేకాక, 'కిర్' అని తలుపులు తీసిన శబ్దాలూ. "ధడేల్" మని గడియలు వేసే శబ్ధాలూ, ధభ్' మంటూ ఏదో క్రిందపడినప్పుడూ, ఒక్కో బీటుకీ ఒక్కో శబ్దం వినపడుతూ ఉంటుందట. ఈ శబ్దాలను భరించలేకుండా వున్నాసార్! వెధవ కర్ణభేరీ బీట్లు వారి వూరుకుంది పగిలిపోయినా సరిపోయేది సార్! ఏదీ వినపడకుండా వుండేది. ఎడమచెవిలో హోరుగాలి అలా వుంటే, కుడిచెవి డేంజర్ పొజిషన్ లోనే ఉంది. చీమ చిటుక్కుమంటే వినిపిస్తుంది. చెట్టుమీంచి రాలిన ఆకు క్రింద పడితే రాండోలు మ్రోగినంత పెద్దగా శబ్దం వినిపిస్తుంది. కుడిచెవి అతివృష్టి, ఎడమచెవి అనావృష్టి "సార్!" అని ఒకరోజు నాతో చెప్పి మొరపెట్టుకున్నాడు. అది వినగానే నాకు జాలివేసింది. రెండు చెవులూ వినపడకపోతే అదివేరు. కేసులూ అనంగానే ఎవరికైనా పోలీస్ స్టేషన్ లు, ఆసుపత్రులూ గుర్తుకువస్తుంటాయి. మనవాడే మన ప్రాణానికి ఒక పెద్ద కేసు" అంటూ ముగించాడు వర్ధనరావు.


    "ఇలాంటి కేసులు కూడా వుంటాయా సార్?"


    "ఇక్కడే వుందికదా ఒక కేసు! చూస్తూ కూడా అడుగుతావ్? అసలు నీదేం కేసయ్యా?" దిగ్రేట్ ఇన్ స్పెక్టర్ వర్ధనరావు కోపంగా అడిగాడు.


    మరోసారి బుర్ర గోక్కున్నాడు అహోబిలం.  


    "నీకీరోగం ఎప్పటినుంచీ?" వర్ధనరావు గద్దించి అడిగాడు.


    "నాకీ రోగం చిన్నప్పటి నుంచీ వుంది సార్! చిన్నప్పుడు పాలూ, మీగడా, వెన్నా తెగ తిన్నాను. ఆ తరువాత నుంచీ ఇప్పటిదాకా ఫాట్ వున్న పదార్థాలే తింటున్నాను. అయినా సరే సార్! నా శరీరం జెండాబొంగులాగా వుండటం తప్ప, పిసరంత లావెక్కింది కూడా సార్! మా ఆవిడ నన్ను రమణారెడ్డి అని ఏడిపిస్తూ వుంటుంది" చెప్పాడు అహోబిలం.


    "మా ఆవిడ నన్ను రేలంగితోనూ, పద్మనాభంతోనూ పోలుస్తూ వుంది. నాది బజ్జీ ముక్కట. మాటకు ముందు కుక్కలాగా వాసన చూస్తూ ముక్కు ఎగ బీలుస్తూ వుంటానుట. నా పెళ్ళం ఇన్ని మాటలన్నా నేను పట్టించుకుంటున్నానా! పెళ్ళాలకి అనే హక్కుందయ్యా. మనం పట్టించుకోకూడదు." అలవాటు ప్రకారం ముక్కు ఎగబీలుస్తూ చెప్పాడు వర్ధనరావు.


    "ఊరికినే చెప్పాను. నేనూ పట్టించుకోను సార్!"


    "ఊరికే చెప్పావా? అంటే నీ వుద్దేశ్యం ఏమిటి? నేనో పనికిమాలిన వెధవననేగా! ఇదిగో ఇలాంటి వేషాలు చేస్తూంటేనే నాకు వాళ్ళు మండేది. నేను ది గ్రేట్ ఇనస్పెక్టర్ వర్ధనరావుని. నువ్వు నా క్రింద పనిచేసే కానిస్టేబుల్ వి. పెద్దవాళ్ళ ముందు తగ్గి మాట్లాడటం ముందు నేర్చుకో.


    ఎడాపెడా మాటలతో వాయించాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు అహోబిలాన్ని.


    "ఈయనకి బి.పి. మళ్ళీ రైజ్ అయ్యింది. వూరుకునుంటే వుత్తమం బోడిగుండంత సుఖం లేదు" అనుకుంటూ మరోసారి బుర్ర గోక్కున్నాడు అహోబిలం.


    "మాటిమాటికీ బుర్ర గోక్కుంటున్నావ్ చుండ్రా? పేలా పేలా చిరాకుగా అడిగాడు వర్ధనరావు.


    "రెండూ కాదు సార్!" కంగారుగా జవాబు ఇచ్చాడు అహోబిలం.


    "రెండూ కాకపోతే మూడోది ఏమిటి? గద్దిస్తూ అడిగాడు వర్ధనరావు.


    "అలవాటు సార్! అలవాటు."


    "మనకి అలవాట్లు వుండకూడదు. దొంగలకి, మోసగాళ్ళకి మాత్రమే అలవాట్లు వుండాలి. వాళ్ళ అలవాట్లు, వాళ్ళు చేసే పొరబాట్ల వలన మనకి అంటే నాబోటి ది గ్రేట్ ఇన్ స్పెక్టర్ లకి చిక్కిపోతుంటారు మైండిట్?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS