Previous Page Next Page 
పావని పేజి 11


    ఇది రానున్న తుఫాను సంకేతమా? ఆమెకేమీ అర్థంకాలేదు. భుజాన సంచీ, చేతులో పుస్తకాలతో చరచరా సాగిపోతూంది.
    జగన్నాధం దుకాణం ముందుకు వచ్చేసింది.
    ఒక చిన్నపిల్ల చింపిరి తలతో-చీమిడి ముక్కుతో, చిరిగిన చొక్కాలో పప్పు పట్టుకొని పరిగెత్తుతూ బోర్లా పడింది. పడడం పడడం నొసటికి రాయి తగిలింది. రక్తం వస్తూంది. ఆ అమ్మాయి లేచి కూర్చుంది. పప్పు సాంతం నెలపాలయింది. దెబ్బ తాకినందుకు కాదు - పప్పు నేల పాలయినందుకు ఎక్కెక్కి ఏడుస్తూంది.
    పావని చూచింది. పరిగెత్తి వచ్చింది. ఆ పాపను లేవనెత్తింది. "అబ్బో! ఎంత దెబ్బ తగిలిందమ్మా!" అని పయ్యెదతో రక్తం తుడిచింది.
    "పప్పు పోయింది - మా అమ్మ కొడ్తది"
    "దెబ్బ తగిలింది గద - నొప్పి లేదా?"
    "ఈ నొప్పి గింతంతది - మా అమ్మ ఇంకా కొడ్తది - పప్పు పోయింది" అని ఏడుపు సాగించిందాపిల్ల.
    జగన్నాధం గుమ్మంలో నుంచొని చూస్తున్నాడు.
    "ఆగు నేను ఎత్తిపెడ్తా" అని అపవని నేలపాలయిన పప్పు సాంతం ఎత్తి చొక్కాలో పోసింది. అంగికి చిల్లు ఉంది. పప్పు కారిపోతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. సంచి వెదికింది. కర్చీఫ్ కనిపించింది. పప్పు కర్చీఫ్ లో మూటకట్టి అందించింది.
    ఆ పాప ఆనందానికి అంతులేదు. పోయిన పప్పు దొకిరింది. కొత్త గుడ్డ కూడా దొరికింది. కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో తెలియదు. దానికి పదాలు రావు. దానికి కళ్ళల్లో కృతజ్ఞత వలకబోస్తూ చూసింది.
    "నువ్వు శాన మంచి దానివి"
    "అట్లనా?" అని దగ్గరికి తీసుకుంది. పావని సంచిలో చాక్లెట్లున్నాయి. ఒక చాక్లెట్టు తీసి చేతికిచ్చింది "నీ పేరేంది?"
    "ముత్యాలు" చాకలెట్టు అందుకుందేగాని ఏం చేయాలో తెలియలేదు ముత్యాలుకు. పావని చాకలెట్టు అందుకుంది. మీది కాగితం తీసేసింది. చాకలెట్టు ముత్యాలు నోట్లో పెట్టింది "ఎట్లున్నది?"
    "శాన బాగున్నది, మా అమ్మ కొడ్తది పోత" కిందపడిన చాకలెట్ కాగితం అందుకుని ఉరికింది. పావని చూస్తే_ ముత్యాలు పరుగులో కూడా ఆనందం గోచరించింది. ఒక్క చాకలెట్టు దొరికితే రాజ్యం దొరికినంత సంతోషించింది_ ఎంత అమాయకురాలు! అనుకుంది.
    "మాల ముండను ముట్టుకుంటావు! శాస్త్రిగారి మర్యాద మంటగలిపెడ్తున్నవు"
    పావని అటు తిరిగి చూచింది - జగన్నాధం! పావని సంతోషం ఆరిపోయింది. పావనికి కోపం పొంగింది.
    "జగన్నాధంగారూ! వాళ్ళ డబ్బుకు మైల లేదు. వాళ్ళు తెచ్చే గింజకు అంటరానితనం అంటదు. వాళ్ళు చేసే చాకిరీకి అస్పృశ్యత లేదు. వాళ్ళను మాత్రం అంటరాదు - అంతేనా?"
    జగన్నాథం బిత్తరపోయాడు. అలాంటి జవాబు వస్తుందని అతను ఊహించలేదు. నోరు వెళ్ళబెట్టి చూస్తూ నుంచున్నాడు. నోట మాట రాలేదు. పావని సాగిపోయింది.
    ఇంటి ముందు శాస్త్రిగారు జంధ్యం సరిచేసుకుంటూ నుంచున్నారు. పావని దూరం నుంచే చూచింది. వారి వాలకం చూస్తే వడగాలి ఇక్కడిదాకా వచ్చినట్లు అనిపించింది.
    పావని గుమ్మంలో అడుగుపెట్టింది. తలవంచుకుని గబగబా ఇంట్లో దూరింది. శాస్త్రిగారు ఆమె వెంటనే ఇంట్లోకి ప్రవేశించారు.
    "బ్రహ్మయ్య ఇంటికి పోయినవా?" ధ్వనిలోనే కోపం కనిపిస్తూంది.
    "అవున్నాన్నా! వెళ్ళాను, స్కూలు పెట్టాలిగా_ సహకరించమని అడగడానికి వెళ్ళాను_ వెళ్ళిన మాట నిజం_ దానికింత రాద్ధాంతం ఎందుకు?"
    "పెళ్ళి కావలసిన పిల్లవు"
    "నాన్నా! నా మీద నమ్మకం లేదా? నేను ఇక్కడికి ఒక ఉద్యోగం మీద వచ్చాను. నేను నీకు కూతుర్ని మాత్రమే కాదు నాన్నా - ఈ ఊరికి టీచర్ను, నా హద్దులు నాకు తెలియవంటావా? నువ్వూ నన్ను అనుమానిస్తావా?" తరువాత మాట రాలేదు. కళ్ళు చెమ్మగిల్లాయి. కను కొలకుల్లో నీరు నిలిచింది. ఎంత నిగ్రహించుకుందామనుకున్నా నిలవలేదు. ఒక కన్నీటి చుక్క బుగ్గమీద రాలింది. ఆ తరువాత జలజలా రాలాయి.
    శాస్త్రిగారు కరిగిపోయారు.
    "అమ్మా, ఏడవకు. మీ అమ్మ సరిగ్గా నన్ను ఇలాగే ఓడించేది" శాస్త్రిగారు పావనిని దగ్గరికి తీసుకున్నారు. పైపంచెతో కన్నీరు తుడిచారు. "అదికాదు తల్లీ, ఇది పల్లె. ఇక్కడ గోరంతలను కొండంతలు చేస్తారు. నాకు తెలుసు నువ్వు నిప్పులాంటి దానివి. అయినా జాగ్రత్తగా ఉండాలమ్మా!" పావనిని హెచ్చరించారు.
    "నాన్నా, నువ్వెంత మంచివాడివి" పావని తండ్రి ముఖంలోకి చూచింది. శాస్త్రిగారి కళ్ళలో నీరు నిలిచింది. అది దుముకడం లేదు. వారికి గతించిన భార్య గుర్తుకు వచ్చింది. పట్టుదలకు ఆమె పెట్టింది పేరు. సరిగ్గా తల్లి లక్షణమే పుణికి పుచ్చుకుంది పావని.
    "నాన్నా! నువ్వు ఏడుస్తావా? తప్పు కదూ?" అని పైట చెంగుతో తండ్రి కళ్ళు తుడిచింది పావని.
    ఓదార్చే వారుంటే దుఃఖం పొంగుతుంది. శాస్త్రిగారి గుండె చెరువయింది. కూతురు ముందు కనిపించనీయరాదు. పై పంచెతో దొడ్డి గుమ్మంవైపు నడిచారు స్నానానికి వెళ్తున్నట్లు.
    పావని గ్రహించింది. పలకలేదు. ఆమె తుఫాను చెలరేగుతుందనుకుంది. తండ్రికి తన విషయంలో ఉన్న వాత్సల్యం తండ్రిని ఓడించింది. తనకు ఈ రోజు రెండు గెలుపులు బ్రహ్మయ్య సాయం చేస్తానన్నాడు, తండ్రి తనను వారించలేదు.
    ముత్యాలు కళ్ళు కనిపించాయి. కృతజ్ఞత తొణికిసలాడే చూపులు కనిపించాయి. ఆమెలోని ఆనందం కనిపించింది. ఉత్సాహం కనిపించింది.
    పసివాళ్ళు ఎంత అమాయకులు! చాక్లెట్ దొరికితే రాజ్యం దొరికినంత సంతోషిస్తారు. పెద్దవాళ్ళు ఎంత మూర్ఖులు? రాజ్యం దొరికినా చాక్లెట్ దొరికినంత సంతోషించలేరు!
    రాత్రి అయింది పావని పడుకుంది, నిద్రపోలేదు "మాలపల్లి" చదువుతూంది. శాస్త్రిగారు గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. తలుపు తట్టిన చప్పుడు అయింది. పావని పుస్తకంలో మునిగి ఉంది. వినలేదు. మళ్ళీ చప్పుడు అయింది. ఆలాపాన అనుకుంది. మరోసారి చప్పుడు అయింది. పుస్తకం పక్కన పెట్టింది. లేచి కూర్చుంది. ఎవరు? ఎందుకొచ్చారు? ఈ రాత్రివేళ రావలసిన పనేమిటి? ఏం చేయాలి? తండ్రిని చూచింది, గాఢ నిద్రలో ఉన్నారు లేపాలా? వద్దా? ఎవరయి ఉంటారు? ఎందుకు వచ్చి వుంటారు? కాస్త భయం తొంగి చూచింది. ముందు భయాన్ని తొలగించాలి, తరవాత దేన్నయినా జయించవచ్చు అనుకుంది. లాంతరు పట్టుకుని బయలుదేరింది. గుమ్మందాకా వచ్చింది. గుమ్మం పక్కనే కిటికీ ఉంది. కిటికీ తెరిచి చూచింది.
    "ఎవరు?"
    "నేన్ అమ్మగారూ!" కిటికీ దగ్గరికి వచ్చి అన్నది మల్లమ్మ.
    "మల్లమ్మా! ఇంత రాత్రి వచ్చావు?" అని తలుపు తీసింది.
    "పగటిపూట దొర రానియ్యడు. దొరసాని కదలనియ్యదు, మీరు ఊళ్ళకు వచ్చిన కాణ్ణించి వస్తమనుకుంటున్న, పడ్తలేదు"
    "ఏమిటి? ఏం కావాలి నీకు?"
    "అమ్మగారూ! పట్నం నుంచి వచ్చిన్రు కద, మా ఆయన కనబడ్డాడా! రిచ్చ తొక్కుతున్నడని చెప్పిన్రు. కనబడితే నన్నడిగిండా? ఎప్పుడు వస్తనన్నడు? ఏమన్న చెప్పిండా? ఆయన వస్తడు వస్తడనే బతుకుతున్న. లేకుంటే ఉరిపోసుక చచ్చెడిదాన్ని, వస్తడండి, ఉండడు నన్నిడిచి. ఉంటడనుకున్రా_ఉండడు. అప్పు తీరుస్తనని పోయిండు. దొర అప్పు తీరుస్తడు, నన్ను కొంచపోతడు మీ కెరకలే మా ఆయన సంగతి. వస్తడు తప్పక వస్తడు. వస్తడులేగని మీకేమన్న కళ్ళపడ్డడా? ఎప్పుడొచ్చెడిది చెప్పిండా?"
    మల్లమ్మ వసారా అరుగు కింద నిలబడింది. వెన్నెల పుచ్చపూవులా ఉంది. రాత్రి నిశ్శబ్దంగా ఉంది. దూరంగా ఎక్కడో కీచురాళ్ళ రొద వినిపిస్తూంది.
    పావని అరుగుమీద ఉంది చీకట్లో ఉంది.
    మల్లమ్మ అరుగు కింద ఉంది. వెన్నెట్లో ఉంది.
    మల్లమ్మ స్పష్టంగా కనిపిస్తూంది. నల్లని గుండ్రని ముఖంలో ఆవేదన, ఆతురత, ఆశ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. పరమయ్య మల్లమ్మను పెళ్ళాడాడు. శివయ్య పెట్టిన బాధలు తట్టుకోలేకపోయాడు. పారిపోయాడు. పరమయ్య పెళ్ళాం అయినందుకు శివయ్య మల్లమ్మ మెడకు బానిస పాశం తగిలించాడు. అయినా మల్లమ్మ పరమయ్యను వదులుకోలేదు. ఆమెలో ఉన్న ప్రేమ బంధం విడిపోలేదు. పరమయ్య వస్తాడనే ఆశతో జీవిస్తూంది. తను సీత, సావిత్రి, అనసూయ, సుమతి కథలు కల్లబొల్లి కబుర్లనుకుంది. తన కళ్ళముందే ఒక సీత, ఒక సావిత్రి కనిపిస్తూంది. ప్రేమబంధం ఎంత ఉన్నతమయింది? ఎంత విశిష్టమయింది? ఎంత విచిత్రమయింది? ఎంత పవిత్రం అయింది? అది ఎంతటి త్యాగానికి పురికొల్పుతుంది? అనుకుంది.
    "మల్లమ్మా! నువ్వు చాలా గొప్పదానివి. పట్నంలో ఉన్న పరమయ్య మీద ఆశ నిలుపుకొని జీవిస్తున్నావు. పరమయ్య కూడా పట్నంలో అలాగే ఉన్నాడు. నాకు కనిపించాడు. నిన్ను జ్ఞాపకం చేశాడు. వస్తానన్నాడు. నిన్ను విడిపిస్తానన్నాడు. నేను మళ్ళీ వెళ్ళినప్పుడు చెపుతా, తీసుకువస్తా"
    "అమ్మా పావనమ్మా! పుణ్యం కట్టుకో. నీ కోసమే బతుకుతున్నదని చెప్పు. ఎట్లనన్న తీస్కరా! నీ కాళ్ళు పట్టుకుంట"
    మల్లమ్మ పావని కాళ్ళు పట్టుకుంది. పావని గుండె చెమ్మగిల్లింది. "వస్తడు మల్లమ్మా. పరమయ్యను నేను తీసుకొస్త, నిన్ను విడిపిస్త"
    "అమ్మా పావనమ్మా! నువ్వు మనిషివేనా? మా కోసం దిగివచ్చిన దేవతవా?"
    "ఎందు కట్లంటవ్?"
    "ఈ ఊళ్ళ మమ్ములను మనుషులల్లే ఎవడు చూచిండండి? మనసునిండ మాట మాట్లాడినోడెవడండి? అంటరానోండ్లమనిరి, ఆమడ దూరం ఉంచిరి, నువ్వు మనసు నిండ మాట మాట్లాడినావమ్మా చాలు చాలునమ్మా!"
    పావని పరిస్థితి అయోమయంగా ఉంది. మల్లమ్మ మాటలు ఆమె చెమ్మగిల్లిన గుండెను చెరువు చేశాయి. గొంతు పూడుకు పోయింది. మాట రాలేదు. మాట మాట్లాడినందుకు తనను మహిమాన్వితురాలనుకుంటున్నారు. ఎంత అమాయకులు పాపం!
    'అమ్మా! నువ్వు బడి పెడ్తవట. మా పోరలకు చదువు చెప్తవట. చెప్పుతల్లీ! మా పోరలన్న బాగుపడ్తరు ఇగ చూడు, ఒకమాట" అని చెవిలో చెప్పినంత మెల్లగా చెప్పింది "దొరకు మీ నాయనంతే భయం. దొర్సానికి మంత్రాలంటే గుబులు. అందుకే నిన్నేమంటలేదు. అనరు. నేను ఇంకంత బయపెడ్త దొర నీ జోలికి రాకుండ చూస్త. నువ్వు బడి పెట్టు, ఇన్నవా? పోరలకు చదువు చెప్పు. నర్సిగాడొస్తడు వాడు మంచోడు కాడు. శానాసేపు నిలబడటం మంచిదికాదు, పోతన్న"
    పావని జవాబు కోసం కూడా చూడలేదు. మల్లమ్మ వెళ్ళిపోతూంది వెన్నెట్లో. వెలుగులో పావని చూస్తూ నుంచుంది. మంచితనం నడిచిపోతున్నట్లనిపించింది. మానవత మల్లమ్మ దూరంలో సాగిపోతున్నట్లనిపించింది. మంచితనం, మానవత, ప్రేమ మనిషిలోంచి మాయం కావనుకుంది. బానిస బంధాల్లో ఉన్నా, చెరసాలలో మగ్గుతున్నా, నరకంలో నుగ్గవుతున్నా మనిషిలోని మానవతను మాయం చేయడం అసాధ్యం అనుకుంది.
    ఈ ఊళ్ళో ప్రతి మనిషీ ఒక పుస్తకంలా కనిపించాడామెకు. ప్రతి వ్యక్తీ ఒక నవలలా కనిపించాడు. ఒక్కొక్కరికీ ఒక చరిత్ర ఉంది. ఒక్కొక్కరిలో వైవిధ్యం ఉంది. అందరిలోనూ అంతరాంతరాలలో వెలిగే వెలుగుంది.
    ఉన్న వెలుగును పెంచడం తన పని.
    వెలుగు పెరుగుతుందా?
    తుఫానుకు ఆరిపోతుందా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS