Previous Page Next Page 
శ్రీమద్భగవద్గీత పేజి 11


    భారతం - సంశయాలు
    
    "సంశయాత్మ నినస్యతి"-గీత
    ఒక నిర్ణయానికి రాకపోవడం సంశయం. అది నిరంతరం ఉండటం. సంశయాత్మ ప్రధానమైన అంశాల్లో ఊగిసలాట సంశయాత్మ అగుచున్నది.
    భారతపు తొలినామం జయ. వ్యాసుడు 14000 శ్లోకాలలోనే భారత కథ చెప్పినాడు.
    కావచ్చును.
    కాలచక్రం బహువేగం అయింది. చూస్తుండగా వసంతం వస్తుంది. పూస్తుంది. కోకిల కూస్తుంది. మందమారుతం వీస్తుంది.
    వసంతం సాంతం ప్రియమే - సుందరమే!
    అంతలో శిశిరం వస్తుంది - చెట్లు ఆకురాలుస్తాయి. చెట్లు దిగంబరములు అవుతాయి. చలి వణికిస్తుంది.
    ప్రకృతి పరిణామశీలం
    ఇది ఉదాహరణయే! సంవత్సరమే ఋతువులే! కాలం అనంతం సంవత్సరం అందులో పరమాణువు!
    భారత రచన కలియుగపు పూర్వసంధ్యలో జరిగింది. ఇది నిశ్చయం. ఇందులో సంశయం లేదు. అట్లని అయిదువేల సంవత్సరాల మాట! సముద్రాలు, భూఖండాలు, దేశాల హద్దులు, రాజ్యాలు, రాచరికాలు మారాయి. నదులు గతులు మార్చుకున్నాయి. సరస్వతి మున్నగు నదులు అదృశ్యం అయిపోయాయి.
    రామాయణంలో హిమాలయ ప్రసక్తిలేదు. వాల్మీకి రామాయణంలో అదనంగా బాలకాండ ఉత్తరకాండలు చేరాయి. వాటికే మరింత ఖ్యాతి ప్రఖ్యాతి!
    కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
    హిమాలయం భారతంలో కొంత భాగం కనిపిస్తుంది. మంచుకొండ నేటికీ పూర్తిగా ఏర్పడలేదు.
    కాళిదాసు హిమాలయాలను ఎంతో సుందరంగా వర్ణించారు వారు క్రీస్తుపూర్వపు వారు
    అస్త్యుత్తరాస్యాల దిశిదేవతాత్మా హిమాలయో నామనగాధీరాజః
    ఉత్తర దిక్కున ఉన్నది దేవ భూమి. హిమాలయమను పేర పర్వతరాజం
    జంతువులు మృగ జాతులు కూడా కొన్ని నశిస్తున్నాయి. కొత్తవి పుట్టు కొస్తున్నాయి!
    ప్రకృతి సుందరి చీర మార్చినట్లు సమస్తాన్ని మార్చుతుంది. మార్పును గుర్తు పట్టనీయదు!
    భారతం ప్రకృతి భాగమే! దానికీ మార్పు సహజాతి సహజం.
    కాలపు చెదలు వేదాన్ని కూడా వదల్లేదు. ఎల్లోరాలో శిలా శిల్పాలను కాలపు చెదలు తినేసింది. అందుకే దేవతా విగ్రహాలను గర్భాలయంలో భద్రపరుస్తారు!
    కాలానికి సమస్తం పెరుగుతుంది. విరుగుతుంది. దాన్ని ఆపటం ఎంతటి వారికీ అసాధ్యం.
    భారతంలో ఒక కథ ఉంది:
    ఒక విధవ, ఆమెకు ఒక కొడుకు. వారి ఇల్లు ఊరికి ఆవల ఉంది. అది అడవి దొప్ప బాలుడు ఆకులు, కాయలకోసం అడవికి వెళ్ళాడు. అంతే తిరిగి రాలేదు.
    అవ్వ అడవిని గాలించింది. బాలుని పాము కరచింది. చనిపోయాడు.
    ఆమెకు బాలుడే ఆధారం. ఆమె ఏడిచింది. మొత్తుకున్నది. అడవి. ఎవరు వింటారు? ఆమెకు ధర్మాగ్రహం వచ్చింది.
    నా బాలుని చంపిన సర్పం రావాలి అన్నది. పాము వచ్చింది. తల్లీ ఆగ్రహించకు. దోషం నాది కాదు. మృత్యువు ఆదేశం.
    మృత్యువా! రా!
    మృత్యువు వచ్చింది. తల్లీ! ఆగ్రహించకు, దోషం నాది కాదు. యముని ఆదేశం.
    యమా!రా!
    యముడు వచ్చాడు. తల్లీ ఆగ్రహించకు. దోషం నాది కాదు. నీవూ, నేను, సకల చరాచర ప్రపంచం కాలానికి అధీనులం.
    కాలాన్ని మించింది లేదు. కలం ఎవరి అధీనంలోనూ లేదు.
    
    కాలోయం దురతి క్రమః
    
    పర్యవసానం ఏమనగా కాలానికన్న కేవలం పరాత్పరుడే మిన్న ఆ స్వామియే సృష్టి, స్థితి, లయకారకుడు అగుచున్నాడు. అవి పుట్టుట, పెరుగుట, గిట్టుట అగుచున్నది.
    వేదమును కాలపు చెద తిను దాని కథా విధానంబు ఎట్టిదనగా-
    వేదం అపౌరుషేయం. అది మానవశక్తికి అతీతం అయింది. నరనారీ జనులకు అసాధ్యం అయింది.
    ఋషి తనను తెలియనివాడు, నిస్వార్ధుడు. లోకమే తానుగా భావించువాడు. మానవ కళ్యాణానికి జీవితాన్ని దివ్వెగా వెలిగించువాడు.
    దివ్వె తాను కాలుతుంది. లోకానికి వెలుగు ప్రసాదిస్తుంది.
    ఋషి నిరంతర నిమగ్నుడు. తపించువాడు. మంచికై మనసు అర్పించువాడు. అదియే తపస్సు.
    లోకానికి దూరంగా ముక్కుమూసుకొని కూలబడేది తపస్సుకాదు. పలాయనం. కోరికలు తీర్చుకోవడానికి చేసేదీ తపస్సు కాదు. పచ్చి స్వార్ధం.

                            
    నేటి ఆచార్యులు, బాబాలు, అమ్మలు మున్నగు వారిది కేవలం కార్పొరేట్ వ్యాపారం.
    వేద రుషి నిరంతర ధ్యాస, ధారణాల వలన అతీంద్రియ దర్శనుడు అగుచున్నాడు. అది సమాధిస్థ వ్యవస్థ.
    ఆ దశలో ఒక వెలుగు వెలుగుతుంది. ఒక జ్యోతిర్గోళం అవతరిస్తుంది. ఓ కాంతి పుంజం అవగతం అవుతుంది.
    అది సృజన సమయం. అపుడు ఓ మంత్రం ఆవిర్భవిస్తుంది.
    ప్రతి మంత్రం - సూక్తం ఒక వేదం అవుతుంది. అందువలన
    అనన్తావై వేదా:- వేదములు అనంతములు.
    ప్రతి మంత్రం వజ్రం - ముత్యం - పగడం - వైఢూర్యాలు.
    ఇవి చెల్లాచెదురుగ పడియుండినవి ఏది వేదమగునో, ఏది కాదో తెలియకుండినది.
    అందుకే విస్సన్న చెప్పినదే వేదం - అను సామెత. మహర్షి వ్యాసులు రాళ్ళను రత్నాలను వేరు చేసినాడు. రథనలను నాలుగు మణిహారాలు చేసినాడు.
    1. ఋగ్వేద సంహిత                 10,589 మంత్రాలు
    2. కృష్ణ యజుర్వేద సంహిత         19,200 మంత్రాలు
    2ఎ. శుక్లయజుర్వేద సంహిత        1,975 మంత్రాలు
    3. సామవేద సంహిత                1,875 మంత్రాలు
    4. అధర్వవేద సంహిత                5,975 మంత్రాలు
    వేదాలు మానవజాతికి భగవానుడు ప్రసాదించిన అనర్ఘ్య అమూల్య అపూర్వ అక్షర రత్నాలు. వేదాలు ఏ ఒక్కదేశానికి చెందినవి కావు. అవి సమస్తము. కవుల పరంజ్యోతి!
    పరాత్పరుడు మానవాళికి ప్రప్రధమముగా ప్రసాదించిన మహత్ అక్షర గ్రంథము వేదము. అక్షర వేదానికి పూర్వము సమస్తము శూన్యము. వేదమే మానవుని మూక దర్శనము నుండి వాచాల దశకు తెచ్చింది. జ్ఞానము కలిగించింది. విత్తము అందించింది. నరుని మానవునిగా మార్చడానికి కృషి చేసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS