సత్యము చెప్పుము అనునది వేదవాక్యము. హరిశ్చంద్రుని కథ ద్వారా "సత్యము చెప్పుము" అనుధర్మమును నిర్వచించినాడు. సత్యము చెప్పుట సమయ సందర్భములను బట్టి యుండును అని వ్యాఖ్యానించినాడు. భారతమున వ్యాసుడు చెప్పని ధర్మముగాని, వ్యాఖ్యగాని లేదనిన అతిశయోక్తి మాత్రము కాదు.
భారతము భారతీయులకు మాత్రము వర్తించునది కాదు. అది సకల మానవాళికి ఉపకరించు మహద్గ్రంథము.
ఇంత మమోపకారము చేసిన వ్యాసుడు తన కొఱకు ఏమియు అర్ధించలేదు. ఆర్జించలేదు. అట్టి అభిలాష సహితము అతనికి లేదు.
రచయితలు ఎట్లుండవలెనో, ఏమి రచించవలెనో ఆచరించి చూపినాడు వ్యాస భగవానుడు. భోగ భాగ్యముల జోలికి పోక, జటావల్కలముల ధరించి రాజాశ్రయము కోరక, స్వతంత్రముగా, నిర్వికారముగా, మానవశ్రేయస్సు సాధించుటకు కవులు, రచయితలు కృషి చేయవలెనని నడిచి చూపినాడు.
వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్ర మకల్మషం
పరాశరాత్మజం వన్దే శుకతాతం తపోనిధిం.
జ్యోతిర్గమయ
"ఇతిహాస ప్రదీపేన మోహావరణఘాతినా
లోకగర్భ గృహం కృత్స్నం యథావత్ సంప్రకాశితమ్"
మహాభారత ఇతి హాసము జాజ్వల్యమానమై వెలుగు దీపము. ఇది మోహాంధ కారమును దూరము చేయును. మానవుల అంతఃకరణములను పునీతము చేయును. జ్ఞాన జ్యోతిని వెలిగించును. అంతఃకరణములను వెలుగులతో నింపును.
మహాభారతం మహాగ్రంథి. అపూర్వ ఇతిహాసం. మానవ జాతికి మహావరప్రసాదం.
మహాభారతం సమస్త మానవజాతి కథ. అది భారతదేశంలో చెప్పబడింది. కాబట్టి మహాభారతము అయినది. అవాస్య మహర్షిచే మహాభారతము రచింపబడినది. మన దేశానికి ఉజ్వలయుగం. ఆనాడు కాదు నేడు కూడా భారతదేశమే అన్ని దేశాలకు జ్ఞాన భిక్ష పెట్టింది. పెడ్తున్నది. పెడ్తుంది.
"అనాశ్రిత్యైచజా ఖ్యానం కథాభువి న విద్యతే
ఆహారమన పాశ్రిత్య శరీర స్యేవధారణమ్"
అన్నమును ఆశ్రయించక శరీరమును నిలుపుట అసాధ్యము. మహాభారత కథను ఆశ్రయించక లోకమున కథ ఉండుట అసాధ్యము. అన్నంలేక మనిషి బ్రతకలేడు. మహాభారతపు కథలేక లోకంలో కథ ఉండడానికి వీల్లేదు. ఇది అక్షరసత్యం. మానవజాతి చరిత్రను - మానవ మనస్తత్వాన్నీ - మానవధర్మములను - నీతులను - నిబంధనలను సంపూర్ణంగా వివరించింది మహాభారతం. మిగిలిందేమీ లేదు. ఎవడు రచించినా వ్యాసుని ఎంగిలి మాత్రమే అని గ్రహించాలి.
అంత పరిపూర్ణం అయిన మహా - మహా - మహాగ్రంథం మహాభారతం. ఇలాంటి గ్రంథం ప్రపంచంలో ఏ దేశానికీ లేదు. ఇది అతిశయోక్తి కాదు. అభిమానము కాదు. దిగంబర సత్యం. దీన్ని ప్రపంచంలోని రచయితలు, మేధావులూ అందరూ అంగీకరించినారు. అన్ని భాషల్లోకి అనువదించుకున్నారు. ప్రయోజనం పొందుతున్నారు.
భారతజాతి గర్వించదగిన విషయం ఏమంటే మనకు అనంతమయిన సాంస్కృతిక సంపద ఉన్నది. మనం ఒక మహా సంస్కృతికి వారసులం. ఇలాంటి సంస్కృతి కోసం ఇతర దేశాలవాళ్ళు అర్రులు చాస్తున్నారు. అరువు తీసుకొంటున్నారు.
మహాభారతం మానవ ఇతిహాసం. ఇందులో లేనిది ఎందునా లేదు. బి.బి.సి., టెలివిజన్ నుండి రామాయణ - భారతాలు ప్రసారం అయినపుడు యూరోపు సాంతం ఆశ్చర్యంలో మునిగింది. ఇంతటి మహత్తరమయిన కథలు - పాత్రలు - సంఘటనలు - నీతులు ఉంటాయని వారు అనుకోలేదు. సరిహద్దులను, జాతి భేదాలను మరిచి సమస్త మానవాళి ఆ మహాగ్రంథాలను నెత్తికెత్తుకుంది.
ఇందుకు మనం గర్వించాలి. పొంగిపోవాలి. ఆ గ్రంథాలను గురించి ఎలుగెత్తి చాటాలి. ఎగరాలి. ఆడాలి. మనం అంత గర్వించగల గ్రంథాలు అవి.
శ్రీమద్రామయణం - శ్రీ మహాభారత, శ్రీమద్భాగవతాలు మనకు అందిన గొప్ప - గొప్ప వారసత్వం. అది అనంతమయిన సంపద. చెరగని సంపద. తరగని సంపద.
భారతదేశం మీద అనేకులు దండెత్తారు. రత్నరాసులను కొల్లగొట్టారు! దేశాన్ని బానిస బంధాల్లో ఇరికించారు. కాని ఈ మహాగ్రంథాల సంస్కృతిని ఎవరూ దొంగిలించలేకపోయారు.
యుగాలు తెలియక నిరంతరం ప్రవహించే పవిత్ర గంగానది వలె మన మహాగ్రంథాలు నిత్యనూతనం అయి నిలిచాయి.
"క్షీయంతే ఖలు భూషణాని సకలం - వాగ్భూషణం భూషణం" అన్నాడు భర్త్రుహరి. సకల సంపదలూ క్షీణిస్తాయి. కాని వాఙ్మయ సంపద నిత్యం. నశించేది కాదు. నశించదు.
దానిని దొంగిలించే సత్తా ఎవరికీ లేదు.
హిమవన్నగం - గంగానది - రామాయణ భారత భాగవతాలు నిలిచి ఉన్నంత కాలం ఈ జాతి - ఈ సంస్కృతి సగర్వంగా నిలుస్తాయి.
సూర్య - చంద్ర - నక్షత్రాదులు ఉన్నంత కాలం ఇవి ఉంటాయి.
ఇవి ఎన్నో యుగాలు వెలుగు బాటలు పరచాయి. ఇప్పుడు పరుస్తున్నాయి. ముందు పరుస్తాయి.
అయితే మనం దివాంధులం కాకుండా ఉండాలి. ఈ వెలుగులను మనలో నింపుకోవాలి. వెలుగు మనుషులు - వెలుగుజాతి - వెలుగులోకం అయి వర్ధిల్లాలి.
మహాభారతం మనలో ఆనందాన్ని కలిగిస్తుంది. ఆహ్లాదం నింపుతుంది. ఆత్మోన్నతి కలిగిస్తుంది. మనసును పులకింపచేస్తుంది. కన్నుల నీరు నింపుతుంది. మహాజ్యోతిని ముందు నిలుపుతుంది. మనసు పులకింపచేస్తుంది. పరవశింప చేస్తుంది.
మనను మానవులను చేస్తుంది.
మహోన్నతికి తీసుకుపోతుంది.
పరమపదం చేతికి అందిస్తుంది.
మానవజాతి సాంతం వ్యాస భగవానునికి ఋణపడి వుంది. ఏమి చేసినా అతని ఋణం తీరదు. అతడు మనకు తరగని సంపద ఇచ్చాడు. అది అక్షయపాత్ర! మీరు ఇవ్వదలచుకున్నంత ఇవ్వండి. ఇంకా ఉంటుంది.
మీకు ఇచ్చే దమ్ముకావాలి! సత్తాకావాలి!! శక్తి కావాలి!!!!
మనం ఎంత బలహీనులం అంటే వాళ్ళు ఇచ్చినదాన్ని పంచలేకపోతున్నాం.
వ్యాసుని మించినవాడు లోకంలో లేడు. అందుకు అతిశయోక్తి అడ్డురాదు. ఇది 'నగ్నసత్యం! ఎవరూ కాదనలేని సత్యం!! తిరుగులేని సత్యం.
జటావల్కలములు - కమండలము ధరించిన శ్యామాంగుడు - వ్యాసదేవుడు ప్రత్యక్షం అయితే అతని పాదాలను చుంబించాలనిపిస్తుంది. అంతటి మహిమాన్వితుడు అతడు.
వ్యాసుడు భరతవంశాన్ని నిలిపాడు. మహా భారతం రచించాడు. ధర్మాన్ని నిర్వచించాడు. ధర్మాన్ని రక్షించాడు. ఇంత చేసిన త్యాగమూర్తికి ఇల్లు లేదు. సంపద లేదు. సామ్రాజ్యం లేదు. పిడికెడు మెతుకులతో తృప్తి చెందాడు. ఏమీ కోరలేదు!
ఒక చెట్టు నీడన ఇంత మహాత్కార్యాన్ని సాధించాడు. అతనే చెప్పినట్టు "కర్మణ్యే వాధికారస్తే" కర్మ - మహత్కర్మ చేసినాడు. ఫలితం ఇసుమంత ఆశించలేదు!!
వ్యాసునకు - కనీసం తన కొడుకు -తనకు దక్కలేదు!
ఇంతటి మహాకవి - స్రష్ట - ద్రష్ట - మహాత్ముడు - మహనీయుడు - మహానుభావుడు మనవాడు! మన భారతీయుడు - మనదేశంవాడు!!!!
మంచి ఏం చేయలన్నా వ్యాసుని నుంచే నేర్చుకోవాలి. మానవజాతిని ఉద్దరించడానికి అతడు పడిన శ్రమ, అతని తపన - అతని ఆర్తి - అతని ఆవేశం - అతని ఆవేదన శ్రీ మహాభారతంలో ప్రతి అక్షరంలో కనిపిస్తుంది. నరుని మానవునిగా చేయడంలో అతడు పడిన పాట్లకు అంతులేదు. వ్యాసుని గురించి మళ్ళీ మహాభరతం అంత చెప్పినా తక్కువే! అంత సత్తా ఉన్నవారు లేరు. అందుకే వ్యాసునకు నమస్కరిద్దాం.
"వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమ కల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం".
తపోనిధి. వశిష్ఠునికి మునిమనమడు, శక్తికి మనుమడు, పరాశరుని కొడుకు, శ్రీశుకునకు తండ్రి అయినటువంటి తపోనిధి వ్యాసునకు నమస్కారం. నమస్కారం.
అయిదు తరాలవారు పవిత్రులు!
