6
పావని ఇంటినుంచి బయల్దేరింది. భుజానికి సంచి, చేతిలో పుస్తకాలతో బయల్దేరింది. ఆమె వీధివెంట వెళ్తూంది. అంతా ఆమెను వింతగా చూస్తున్నారు. "పెళ్ళి కావలసిన పిల్ల, ఏందమ్మా ఇట్ల తిరుగుతాంది" - ఒక అమ్మ విస్తుపోయింది. "పట్నంల నయితె చెల్లుతది ఊళ్ళల్ల ఇదేందమ్మా" - ఒక అక్క వ్యాఖ్యానించింది. "ఆడపిల్లలకు కొలువేంది!" ఒక తల్లి వ్యాఖ్యానించింది.
పావని చెవిని పడుతూనే ఉన్నాయి అన్నీ. అయినా ఆమె పట్టించుకోవడం లేదు, సాగిపోతూంది. ఆడదాన్ని అనాదిగా అణచిపెట్టడం జరుగుతూంది. ఆమెను ఆట వస్తువుగా వాడుకోవడం జరుగుతూంది .మగవారికి అవసరం కాబట్టి ఆడదానికి ప్రాణం ఉందని గుర్తించారు. కాకుంటే ఆమెనూ ఒక విలాస వస్తువుగా పరిగణించేవారు. ఇప్పుడిప్పుడే స్త్రీ కాస్త స్వేచ్చ సంపాదించుకుంటూంది, చదువుకుంటూంది, ఉద్యోగాలు చేస్తూంది. ఇందుకు ఆడవాళ్ళు సంతోషించాలి. తనతోటిది ముందడుగు వేస్తూంటే అభినందించాలి. అలా జరగడం లేదు. తన జాతివాళ్ళే తనను ఎత్తి పొడుస్తున్నారు, ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు. బానిసజాతి అభివృద్ధిని కోరుకోలేదా? బానిసత్వంలోనే మురిసిపోతుందా? మురికిలోనే వారికి ఆనందం ఉందా?
పావని ఆలోచనలు పలు రకాలుగా పయనిస్తుండగా ఆమె సాగిపోతూంది. ఆలోచనలు తెగడంలేదు. దారి తెగింది. ఆమె బ్రహ్మయ్య ఇంటికి చేరుకుంది. కాస్త ఆగింది. అటూ ఇటూ చూచింది. ఇంకా తనను అంతా వింతగానే చూస్తున్నారు. బ్రహ్మయ్య ఇల్లు అదే అని ధ్రువపర్చుకుంది. ఇంట్లో ప్రవేశించింది.
బ్రహ్మయ్య బాడిశతో ఏదో చెక్కుతున్నాడు. అతడు పావనిని చూసి, "రాండి, లోపలికి రాండి అట్ల మంచం మీద కూర్చోండి" అని, పని వదిలివచ్చి మంచం పక్కన కింద కూలబడ్డాడు.
"బాగున్నారా బ్రహ్మయ్య మామా?"
"ఏం బాగమ్మా! ఇట్లున్నం కలికాలం వచ్చిందమ్మా! బొక్కలిరుచుకున్నా కూటికి ఎల్తలే. ఎంత పనిచేసినా దొర వడ్డీకే చాల్తాంది. మీ అత్త బీమారయి మంచం పట్టింది. చేసెటోండ్లు లేరు. తల్లిగారింటికి పోయింది, ఎప్పుడు గుటుక్కుమంటదో ఎరకలే"
స్కూలు ప్రారంభించడంలో తనకు సహకరించవలసిందని బ్రహ్మయ్యను అడగడానికి వచ్చింది. అతని మాటలు వింటూంటే ఆమె తల తిరిగిపోతూంది. పట్నంతో పోల్చుకుంటే పల్లెలు నరకంగా కనిపిస్తున్నాయి. పట్నం స్వర్గంగా కనిపిస్తూంది. తన ఊళ్ళో కాస్త వెలుగు ప్రసరింపచేయాలనే సంకల్పంతో వచ్చింది. ఇక్కడి జనం చీకట్లో ఉండడమే సుఖంగా భావిస్తున్నారు. బ్రహ్మయ్య ఇబ్బందులను విన్నప్పుడు ఆకలిగొన్నవారికి అన్నం కంటే చదువు గొప్పది కాదని తేల్చుకుంది. అయినా తాను చదువు చెప్పడానికి వచ్చింది. అన్నం పెట్టే నాధుడు లేడు.
"అట్లెందుకంటరు? అత్తకి బాగవుతుంది, వస్తుంది కటికచీకటి కలకాలం ఉండదు మామా!"
"పిచ్చిదానివమ్మా, నీకెరుకలే. మందు లేకుంటే రోగం తగ్గుతదా? తిండి లేనోండ్లకు మందులెట్ల వస్తయమ్మా? ఇగో చూడమ్మా, ఒక్కొక్కపాలి చావు మంచిదనిపిస్తది. మీ అత్త జల్ది చావాల్నని దేవునికి మొక్కుతున్న- ఇన్నవా?" బ్రహ్మయ్య కళ్ళు చెమ్మగిల్లాయి. గొంతులో దుఃఖపు జీరలు కనిపించాయి.
దారిద్ర్యం, ఆకలి, అశక్తత దిగంబరంగా కనిపించాయి పావనికి. ఎంత దుఃఖంలోనూ జీవించాలనుకుంటాడు మనిషి. ప్రాణం కంటే ప్రియతమమయింది మానవునికి మరొకటి లేదు. చావు కోరుకుంటున్నాడంటే అతని దుఃఖాన్ని కొలవడం కష్టం. బాధలను అంచనా వేయడం తరంకాదు.
ఏం చెప్పాలో, ఎలా ఓదార్చాలో అర్థంకాలేదు పావనికి. తాను చాలా చదువుకుంది, లోకజ్ఞానం అర్జించింది. ఈ దరిద్రానికి మందేమిటి? ఈ బాధలకు నిష్కృతి ఎక్కడ? ఈ ప్రశ్నలకు జవాబు తాను చదివిన చదువులో కనిపించలేదు. విద్య తనకు అవాస్తవికతను బోధించింది. వాస్తవాలు తనముందు వికటాట్టహాసం చేస్తున్నాయి. ఏం చేయాలి? బ్రహ్మయ్యను ఎలా అడగాలి?
"అమ్మా పావనమ్మా, కోరి చిచ్చులో దునకకమ్మా! శివయ్య సంగతి నీకు ఎరుకలే. పచ్చినెత్తురు కుండలతో తాగుతడు. నెత్తుటి మరక పెదవిమీద కనపడనియ్యడు. అసలు పంతులు బదిలీ అయితే ఎట్ల ఊరుకున్నడో ఊరందరికి వింతగున్నది. నువ్వు ఈ ఊరికి ఎందుకొచ్చినవు? కొరివితో తలెందుకు గోక్కుంటున్నవు? పెండ్లి చేసుకో, కాపురానికి పో, సుఖపడు"
"మామా! మీరట్లంటే ఎట్ల? నేనీ ఊరికి చదువు చెప్పటానికి వచ్చా. అందుకు నాకు గవర్నమెంటు జీతం ఇస్తూంది. ఈ ఊళ్ళో చదువు చెప్పాలని ఉన్నది. కారు చీకట్లో కాంతిరేఖలు చూపాలని ఉన్నది మామా! నాకు సాయం చేయలేవా? వెలుగు తేవడానికి ఉపకరించలేవా?" పావని ఆవేశంగా మాట్లాడింది. ఆమె ధ్వనిలో దృఢ సంకల్పం, దీక్ష కనిపించాయి.
"పావనమ్మా! అనుకునేటప్పుడు అన్నీ బాగుంటాయి. తీరా చెయ్యబోతే తిప్పలొస్తది. నువ్వు అనుకునేది శానా బాగున్నది. కానీ నీ దారిలో ముండ్లకంచెలున్నయి, మండే మంటలున్నయి, ఎందుకమ్మా నీకీ బాధలు! మానుకో, నీకు మంచిది. మీ నాయన నీకివన్నీ ఎందుకు చెప్పుతలేడు?"
"మామా! అందరూ సుఖపడాలనుకుంటే ఈ దేశం ఎలా బాగుపడాలి? ఈ సమాజం ఎన్నడు కళ్ళు తెరవాలి? ఈ అజ్ఞానపు చీకటి ఎలా దూరం కావాలి? మామా, కోరి నేనీ బాటను వరించాను. మీ సహకారం ఉంటే గెలుస్తాననే నమ్మకం ఉంది. నాకు సాయం చేయరా?"
పావని మాటలకు బ్రహ్మయ్య గుండె కరిగింది, ద్రవించింది, నీరయింది, కళ్ళలో కనిపించింది. బ్రహ్మయ్య తమకోసం సాయం అడిగిన వాళ్ళను చూచాడు. తాము బాగుపడడానికి మందిని ముంచిన వాళ్ళను చూచాడు. కాని ఊరికోసం, సమాజం కోసం తపించే పావని లాంటి వాళ్ళను చూడలేదు. పరులకోసం, ప్రజల కోసం సాయం అర్థించే పావని అతనికి దేవతలా కనిపించింది.
"అమ్మా! పావనీ నువ్వు మనిషివి కావమ్మా. దేవతవు. మా గురించి బాధపడే తల్లివమ్మా నీవు, మంచితనానికి మూర్తివమ్మా నీవు. ఇంత కాలానికి ఒకానొక తల్లి మమ్ములను గురించి ఆలోచిస్తున్నది చాలు తల్లీ, ఇది చాలు మాకు, నిన్ను రక్షించుకుంటామమ్మా! నువ్వేం చెయ్యమంటవో చెప్పు చేస్తం"
"మామా! చాలు, ఎక్కువ అభిమానం చూపవద్దు. నేను దేవతను కాను. ఒట్టి మనిషిని తోటివారి బాగు కోరడం మనిషి లక్షణం, తోటివారి బాగుకోసం ప్రయత్నించడం మనిషి గుణం. ఈ రెండూ లేనివాడు మనిషి కాడు. మీకు ఇంతకాలంగా మనుషులు కనిపించలేదు. ఒకవైపు రాక్షసులు, ఒకవైపు పశువులు కనిపించారు. అందరినీ మనుషులను చేయడమే మన పని మామా! ఎవరినీ దేవుళ్ళను చేయకు. వాళ్ళు నెత్తినెక్కి కూర్చుంటారు. కానుకలు కావాలని కినుకలు వహిస్తారు"
"అమ్మా! పావనమ్మా! నీ మాటలు వింటుంటే అమృతం చిలికినట్లున్నదమ్మా! నువ్వు బండరాళ్ళలో గుండెలు పట్టించగలవు. నువ్వు చెప్పింది నిజం. మేము గొడ్లం. గొడ్లకన్నా హీనం మేము, మనుషులం కాము. పురుగుల కన్నా హీనంగా బతుకుతున్నం, మమ్ములను మనుషులుగా చేయటానికి అవతరించినావమ్మా! నిన్ను ఎట్ల పొగడాలె, ఎట్ల కాపాడుకోవాలె అది మేం చూచుకుంటం. ఏం చెయ్యమంటవో చెప్పు, అది చేస్తం"
"చాలు బ్రహ్మయ్య మామా, చాలు ఇప్పుడు నేను ఏకాకిని కాను. నాకు నీ సాయం ఉంది. మనిషికి మనిషి సాయం మహాపర్వతాలను కదిలిస్తుంది. మనం చేయాల్సిందేమీ లేదు. ఈ ఊళ్ళో స్కూలు ప్రారంభించటం. అదీ సర్కారు బడి. చదువు చెప్పమని గవర్నమెంటు నన్నిక్కడికి పంపించింది. నలుగురు పిల్లలను కూర్చు. చదువు చెప్పుత, చెట్టు కిందయినా సరే. అంతే నువ్వు చేయాల్సింది. ఆపైన ఏం జరుగుతుందో చూద్దాం"
"అట్లనే నమ్మా! ఆ పని చేస్త. అది అంత చులకన అనుకోకు. శివయ్య బడి నడవనిస్తడా అని, అయినా చూస్త అందరినీ అడుగుత, బడి మొదలు పెట్టిస్త. నీ అడుగు జాడన నడుస్తం. పోతదా పానమే - అది ఒక్క పాలే గద పోయెడిది"
"చాలు మామా! ఆ ధైర్యంతో ముందుకు సాగుదాం, వస్తామరి"
పావని బయల్దేరింది. ఆమెకు గాలిలో తేలిపోతున్నట్లుంది. తాను ఒక మనిషి సాయం సాధించ గలిగింది చాలు. తన మార్గం సుగమం అయింది. తాను ఎడారిలో అడుగు పెట్టాననుకుంది. ఒక చెలిమి దొరికింది. ఇహ ఈ ఊరు ఎడారిగా ఉండదు. కేదారంగా మారుతుందా? చూడాలి.
"బ్రహ్మయ్యింటికి పోయినట్లున్నరు?" ఆ మాటలు విని ఈ లోకంలోకి వచ్చింది. పావని చూస్తే నర్సిమ్మ బల్లెం పట్టుకుని కనిపించాడు.
"బమ్మయ్య పెండ్లాం కూడ లేదు. వయసులో ఉన్న ఆడపిల్లవు అట్ల పోవటం మంచిది కాదు. ఊళ్ళో వాండ్లు ఏమనుకుంటరు? మీ నాయనగారితోని చెప్పనా?" అని వెకిలిగా నవ్వాడు.
పావనికి వళ్ళు మండింది. పరమ అసహ్యంగా చూచింది. వాణ్ణి పురుగును చూచినట్లు చూచింది. కనీసం వాడితో మాట్లాడలేదు. చరచరా సాగిపోయింది. కేదారం అవుతుందనుకున్న ఊరు వడగాలిలా అనిపించింది. తుఫాను హోరులా వినిపించింది.
