Previous Page Next Page 
ప్రసన్నకుమార్ సర్రాజు కథలు 2 పేజి 10


    రైటరు కాసేపు ఆలోచించి "ఈ జీవితమే విఫలము" అని పెడదాం సార్. కాప్షన్ - 'అను దేవదాసు పార్వతీల కథ' అని కూడా తగిలిద్దాం సార్"
    "బాగాలేదయ్యా! ఆళ్లు చేతులారా విఫలం చేసుకుంటే ఎవరేం చేస్తారు? ఇంకోటి చెప్పు. మెయిన్ టైటిల్ లోనే ఇది దేవదాసుకి సంబంధించిన కథ అని తెలియాలి"
    "పోనీ! 'దేవదాసు మళ్లీ చచ్చాడు' అని పెడదాం సార్..."
    "ఏడ్చినట్టుంది... దేవదాసు ఎన్నిసార్లు చచ్చినా జనానికి కొత్తేముంది? ఇంకో మాట చెప్పు"
    రైటర్ బాగా ఆలోచించి, "దేవదాసు వెడ్స్ పార్వతి - అని పెడదాం సార్" అన్నాడు.
    ఆసామీకి నచ్చిందీ టైటిల్. "బాగుందయ్యా! ఆళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోవటమే పెద్ద సెన్సేషన్. ఇక ఆళ్ల కాపురం ఎలా వుంటుందో సూడాలని జనం ఇరగబడ్తారు. ఏం బావా?" అనగానే బామ్మర్ది కూడా ఒప్పుకున్నాడు.
    "పబ్లిసిటీ గురించి కూడా ఓ మాట ఇప్పుడే అనుకుంటే బావుంటుంది గదా బావా" అన్నాడు బామ్మర్ది.
    "అవునవును. ఈ రోజుల్లో అన్నీ సరిగ్గా వుంటే ఎపుడూ పట్టించుకోడు. నెగటివ్ పబ్లిసిటీ ఇస్తేనే అంతా ఆసక్తిగా చూస్తారు. ఉదాహరణకి... అవేం గేమ్స్ బావా?"
    "వీడియో గేమ్స్" అన్నాడు రైటర్.
    "కాదెహే .. అవే ... ఢిల్లీలో జరుగుతున్నై!"
    "అవా బావా! కామన్ వెల్త్ గేమ్స్..." అందించాడు బామ్మర్ది.
    "ఆఁ... అంతా సక్రమంగా జరిగితే ఏముంటుంది వాటి గురించి మాట్లాడుకోవడానికి? అంతా మామూలే. చూసేవాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు ఏ క్రికెట్టో చూస్తారు. కానీ ఎప్పుడు ఏ పెచ్చులూడి ఎవడి మీద పడుతుందో, ఏ స్టేడియం ఎప్పుడు కూలుతుందో, ఏ టెర్రరిస్టు ఎంత మందిని చంపుతాడో అని ఆద్యంతం లైవ్ లు చూస్తూ కూర్చున్నారు. మన దేశానికి నెగటివ్ గా నైనా, మంచి పబ్లిసిటీ వస్తోంది కదా! అలాగ ... రాసుకో రైటరూ ... నేనే సెప్తా ... మన సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే రాస్తారోకోలూ, ధర్నాలూ జరగాల ..." చెప్తున్నాడు ఆసామీ.
    "అదేంటి బావా! మన సినిమాలో అంత గోల చెయ్యడానికి ఏముంది?"
    "ఆళ్లు సెయ్యరు బావా! మనమే డబ్బులిచ్చి సేయిస్తాం..."
    "ఎవరితో చేయిద్దాం?" అడిగాడు బామ్మర్ది.
    "దేవదాసులం అంటూ కులపోళ్లు బ్యానర్లు పట్టుకుని రోడ్డుకడ్డంగా బైఠాయిస్తారు"
    "అదేం కులం బావా?!"
    "నిరంతరం మందుకొట్టేవోళ్ళు. 'తాగటం మా జన్మహక్కు - తాగొద్దని చెప్పటానికి పార్వతులకి, చంద్రముఖులకు ఏం హక్కుంది?" అంటారు. ఈ లోపల 'మేం పార్వతులం' అంటూ ఆడోళ్లంతా పెద్ద ధర్నాకి దిగుతారు..."
    "పార్వతులా! ఆళ్లెవరు బావా?"
    "అదో కొత్త కులం. 'మందుని నిషేధించాలి. లేకపోతే మా కాపురాలు కూలిపోతున్నై' అని వాళ్లూ ... కులగణన శాఖోడు వచ్చి ఈ రెండు కొత్త కులాలనూ రిజిస్ట్రీ చేస్తూంటే మీడియా వాళ్లు రావటం, అలా పెద్ద దుమారం లేవడంతో మన థియేటర్లు ఫుల్లుగా వుంటాయన్నమాట" విశదీకరించాడు ఆసామీ.
    "అన్నట్టు మన సినిమా ఆడే మల్టీ ప్లెక్సులలో అటాచ్ డ్ బార్ లు పెట్టిద్దాం. మూడొందలు పెట్టి టిక్కెట్టు కొన్నవోడికి ఒక లార్జ్ ఉచితం అని పబ్లిసిటీ ఇద్దాం ... దేవదాసులందరూ చూస్తారు" మళ్లీ చెప్పాడు ఆసామీ.
    "చాలా బాగుంది బావా" ... అన్నాడు బామ్మర్ది.
    "సార్ ... వర్మని మించిపోయారు సార్ పబ్లిసిటీలో..." అని పొగిడాడు రైటరు.
    "ఆఁ ... ఆయనెక్కడ? మనమెక్కడ? ... ఐనా సరదాగా ఓ మాట సెప్పనా? వర్మ గనక దేవదాసు కొత్తగా తీస్తే మాత్రం - దేవదాసు వాళ్ల నాన్న పార్వతిని తిట్టగానే, ఆ అవమానం భరించలేక పార్వతి బావిలో దూకుద్ది. దేవదాసుకేమో ఈత రాదు. పార్వతిని ఎవరూ రక్షించలేకపోతారు. ఆమె దెయ్యమై ఆ ప్యాలెస్ లో అందర్నీ పీక్కుతింటూ తిరుగుతుంటుంది - పాటలు పాడుకుంటూ ... ఎలా ఉంది?" అన్నాడు ఆసామీ.
    "యూ ఆర్ సూపర్బ్ సార్" అన్నాడు రైటరు ఆనందబాష్పాలతో.

                                                                  *  *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS