దేవదాసు ఆమె తల నిమిరి "చెప్పలేను... ఒక్కమాట మాత్రం ఇవ్వగలను. నేను పోయేలోపు తప్పకుండా నీ దగ్గరకి వస్తాను" అని కదలబోతుంటే-
"మా వూరు యశోధరాపూర్" చెప్పింది చంద్రముఖి.
దేవదాసు తలపంకించి బండెక్కబోతుంటే "దేవ్ బాబూ! మళ్లీ పొరపాటున కూడా తాగనని మాటివ్వండి" అంది. దేవదాసు సిన్సియర్ గా మాటిచ్చాడు. "మళ్లీ తాగితే నేను చచ్చినంత ఒట్టు" అన్నాడు. చంద్రముఖి కన్నీళ్లతో చూస్తుండగా బండి కదిలింది.
* * *
రైలు పరుగెడుతోంది. దేవదాసు ఆ లగ్జరీ కంపార్టుమెంటులో ఒక్కడే వున్నాడు. ధర్మదాసుది జనరల్ బోగీ. ఏదో స్టేషన్ లో ఆగి మళ్లీ కదులుతుండగా భగవాన్, దేవదాసు కంపార్ట్ మెంటులోకి ఎక్కాడు. దేవదాసుని చూసి ఆశ్చర్యపోయి కావలించుకున్నాడు. దేవదాసు కూడా చాలా సంతోషించాడు భగవాన్ ని చూసి. కాసేపు ఆ మాటా ఈ మాటా మాట్లాడుకున్నాక భగవాన్ బాటిల్ పైకి తీసి రెండు గ్లాసుల్లో పోశాడు. దేవదాసు ఇబ్బందిగా చూశాడు.
"నేను తాగటం మానేశాను భగవాన్" అన్నాడు.
భగవాన్ అదేదో జోక్ గా తీసుకుని "ఎప్పట్నించీ? నిన్నట్నించా?" అని పెద్దగా నవ్వాడు.
"డాక్టర్ తాగొద్దన్నాడు" చెప్పాడు దేవదాసు.
అప్పటికే తాగివున్న భావాన్- "ఆఁ... డాక్టర్లలాగే చెబుతారులే భాయ్! సరే ... ఈ ఒక్కసారికి మీ మిత్రుడి కోసం తీసుకో. రేపట్నించీ ఆ డాక్టరు మాటే విందువుగానిలే" అని బలవంతం చేశాడు.
దేవదాసుకి కూడా- ఈ ఒక్కసారికీ తీసుకుంటే ఏమీకాదులే అనిపించింది. గటగటా తాగేశాడు.
అంతే. అర్థరాత్రి దాకా ఇద్దరూ తాగుతూనే వున్నారు.
* * *
భగవాన్ కిందపడుకుని నిద్రపోతున్నాడు.
దేవదాసు కునికిపాట్లు పడుతున్నాడు. అంతలో దేవదాసుకి పెద్దగా దగ్గొచ్చింది. బాత్ రూం కెళ్లి వాష్ బేసిన్ లో కక్కుకున్నాడు.. రక్తం పడింది. అది చూసి తనకి ఇక ఆఖరి ఘడియలొచ్చేశాయి - అనుకున్నాడు. వెళ్లి తన బెర్తు మీద కూర్చుని భగవాన్ వైపు చూశాడు. అతను చలికి ముడుచుకు పడుకున్నాడు. లేచి అతని మీద దుప్పటి కప్పాడు. ఇంతలో రైలు కీచుమంటూ ఆగింది.
దేవదాసు డోరు తెరిచి నుంచున్నాడు.
"యశోధరాపూర్.. యశోధరాపూర్..." అని అరుస్తున్నాడు రైల్వేపోర్టర్. లోపలికి వెళ్లబోతూ ఆగి, - ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అనుకున్నాడు. చంద్రముఖి తన వూరి పేరు చెప్పటం గుర్తొచ్చింది. ఇంకేమీ ఆలోచించకుండా దిగేశాడు. రైలు వెళ్లిపోయింది. ఒక కళాసీని ఆపి, "బాబూ! యశోధరాపూర్ ఇదేనా?" అని అడిగాడు.
అతను "లేదు బాబూ ... 20 మైళ్లు బండి కట్టించుకుని వెళ్లాలి" అన్నాడు.
దేవదాసు స్టేషన్ బయటికొచ్చి ఓ ఎద్దుల బండి వాడొస్తానంటే ఎక్కి కూర్చున్నాడు.
బండి కదిలింది. ఆకాశం మేఘావృతమై ఉంది. నెమ్మదిగా వర్షం మొదలయింది. ఓ అరగంట గడిచాక "బాబూ! ఇంకా ఎంత దూరం వుంది. యశోధరాపూర్?" అడిగాడు దేవదాసు ఆయాసపడుతూ.
"ఎక్కడయ్యా ... ఇంకా ఐదుమైళ్లు కూడా రాలా... పాడు రోడ్డు ... అంతా గతుకులమయమే" అన్నాడు బండివాడు ఎద్దులని అదిలిస్తూ.
దేవదాసు "కాస్త తొందరగా పోనియ్యి బాబూ" అని వెనక్కి వాలాడు. వర్షం పెద్దదయింది. దేవదాసు దగ్గుతూ దగ్గుతూ అలా పడుకునే వున్నాడు.
తెలతెలవారుతోంది.
"బాబూ యశోధరాపూర్ వచ్చేశాము. దిగండి" అన్నాడు బండివాడు. దేవదాస్ చేతిలో వెయ్యి ఐదు రూపాయల నోట్లున్నాయి. బలవంతంగా చెయ్యి లేపి బండివాడికిచ్చాడు. బండివాడు కంగారుగా "బాబూ...బాబూ..." అని లేపటానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పటికే నలుగురూ మూగారు. దేవదాసుని చేతుల్తో ఎత్తుకుని రచ్చబండ మీద పడుకోబెట్టారు.
దేవదాసు కళ్లు తెరిచే వున్నాయి. అక్కడ మూగిన వాళ్లందర్నీ చూస్తున్నాయి కళ్లు.
ఒక పెద్దాయన దేవదాసు మొహంలో మొహం పెట్టి "ఎవరింటికి వెళ్లాలండీ" అని అడిగాడు.
దేవదాసు అతి కష్టం మీద "చన్...చన్ ద్ర" అంటున్నాడు.
"ఒరేయ్ మన చంద్రశేఖరరావుగారిని కేకెయ్... తొందరగా" అని ఒకణ్ణి పంపాడాయన.
దేవదాసు ముఖంలో నిరాశ.
తన ఇంటి ముందరనించే పరుగెత్తుకుంటూ వెడుతున్న కుర్రాణ్ణి ఆపి "ఏమైందిరా ఏమిటి హడావుడి?" అని అడిగింది చంద్రముఖి.
"చంద్రశేఖరరావుగారని పిలవాలక్కా అర్జెంటుగా" అన్నాడు కుర్రాడు వగరుస్తూ.
"ఇంత పొద్దున్నే ఆయనతో పనేంట్రా నీకు?" అంది చంద్రముఖి.
"ఏమో అక్కా - రచ్చబండ మీద ఒకాయన్ని పడుకోబెట్టారు. ఇంకాసేపట్లో చచ్చిపోయేట్టున్నాడు. చంద్ర....చంద్ర.... అని కలవరిస్తున్నాడు. చంద్రశేఖరరావుగారి బంధువని అనుకుంటున్నారు"
"మనిషెలా వున్నాడ్రా?" అడిగింది అనుమానంగా చంద్రముఖి.
"అబ్బో మహారాజులాగా బట్టలేసుకున్నాడు. సిల్కులాల్చీ, బంగారు గుండీలు, శాల్వా కప్పుకుని ఉన్నాడు. చాలా గొప్పోడు" అన్నాడు కుర్రాడు.
ఇంతలో ఇంకొకాయన వచ్చి "ఏరా చంద్రశేఖరరావుగారిని పిలవమంటే ఇక్కడ కబుర్లు చెబుతూ నుంచున్నావా?" అని తిట్టాడు.
"ఏమైందండీ?" అని అడిగింది చంద్రముఖి.
"ఏం లేదండీ ఎవరో గొప్పింటి బిడ్డ. చావుబతుకుల్లో వున్నాడు...."
"అతని పేరేమైనా చెప్పాడా?" అడిగింది చంద్రముఖి.
"లేదండీ! మాట్లాడలేకపోతున్నాడు. అతని జేబులో వాళ్ల అమ్మగారు రాసిన ఉత్తరం బట్టి అతని పేరు దేవదాసు అని కనుక్కున్నాం...." ఇంకా ఏదో చెప్తున్నాడు.
అంతే... తారాజువ్వలా పరుగెత్తింది చంద్రముఖి.
"దేవ్ బాబూ.... దేవ్ బాబూ...." అని అరుస్తోంది.
ఆమెకు కావల్సినవాళ్లు ఆమెని ఆపటానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్లని విదిలించుకుని మరీ పరుగెత్తుతోంది.
వర్షం కురుస్తూనే ఉంది. ఎక్కడో పెద్ద చప్పుడుతో పిడుగు పడింది. చంద్రముఖి తూలి పక్కనే ఉన్న రాయి మీద పడింది. తలనించి రక్తం కారుతూ వాన నీటిలో కలిసిపోతోంది.
అదే సమయానికి రచ్చబండ మీద దేవదాసు ఆఖరి శ్వాస విడిచాడు.
* * *
"శుభం" అని పూర్తి చేశాడు రైటరు.
"నీ బొంద. అక్కడ వాళ్లిద్దరూ చస్తే శుభం కార్డు ఎలా వేస్తావయ్యా ... ఊఁ... సరే కథ బాగానే అల్లావు. టైటిల్ ఏంపెడదాం?" అన్నాడు ఆసామీ.
