.jpg)
ఉరిశిక్ష పడిన ఖైదీని ఉరికంబం ఎక్కించారు. ముసుగు తొడగబోతుంటే వద్దన్నాడు ఖైదీ.
"ముసుగేసుకోకపోతే భయమేస్తుంది" అన్నాడు తలారి.
"నీకా?" అడిగాడు ఖైదీ.
"కాదు. నీకు" అన్నాడు తలారి.
ఖైదీ నవ్వాడు. "నా ఆఖరి శ్వాసదాకా ఈ దరిద్రగొట్టు అవకతవక కంగాళీ ప్రపంచాన్ని చూడనీ. బాగా గుర్తు పెట్టుకోవాలి. పొరపాటున మళ్లీ ఈ భూమ్మీద పుట్టి ఛస్తానేమో. అలా జరక్కూడదని కళ్ళు తెరిచే ప్రార్థించుకుంటా" అన్నాడు. తలారికి ఏం అర్థం కాలా. తల గోక్కుంటూ తాడు అతని కంఠానికి ఎడ్జెస్ట్ అయ్యేలా సరిచేసి చక్రం దగ్గరికి వెళ్లి జైలర్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాడు.
జైలర్ టైమ్ చూసుకున్నాడు. ఇంకా రెండు నిమిషాలు ఉంది. పక్కన జైలు సిబ్బంది, మేజిస్ట్రేటు, డాక్టరు, ఉత్కంఠగా చూస్తున్నారు. వారిలో చాలామందికి ఉరితీతను ప్రత్యక్షంగా చూడటం ఇదే మొదటిసారి.
ఇంకా నలభై సెకండ్లుంది. ఇంతలో "సార్! జైలర్ సాబ్!" అంటూ పెద్దకేక.
జైలు ఆఫీసు క్లర్కు వగర్చుతూ పరుగెత్తుకుంటూ వచ్చాడు.
"సార్ మీకు మోస్ట్ అర్జంట్ మెసేజ్" అని అరిచాడు.
జైలర్ అయోమయంగా చూసాడు. సుప్రీంకోర్టులో స్టే వచ్చిందేమో! ప్రెసిడెంటు చివరిక్షణంలో ఉరిశిక్షను రద్దు చేసారేమో! ఎన్ని సినిమాల్లో చూడటం లేదు ఇలా ఆఖరు క్షణంలో రద్దు కావటం?
క్లర్కు ఇచ్చిన మెసేజిని చదువుకుని, ఉరికంబం మీద నిల్చున్న ఖైదీ దగ్గరికి వెళ్లి ఏదో అడిగాడు. ఖైదీ అడ్డంగా తలూపాడు. వెంటనే జైలర్ తలారికి సైగ చేశాడు. అతనొచ్చి తాడు తీసేశాడు.
జైలర్ గంభీరంగా నడుచుకుంటూ వచ్చాడు. అందరూ ఆత్రంగా అడిగారు - ఏమయిందని.
జైలర్ చెప్పాడు. "ఈ ఖైదీకి ఆధార్ కార్డు లేదుట. అది ఉంటేగానీ ఉరిశిక్షకు అర్హుడు కాదుట. ఈ పద్ధతి అరగంట కిందే అమల్లోకి వచ్చిందట."
అందరూ ఉస్సురంటూ నిట్టూర్చారు. 'ఎంచక్కా ఉరితీయటం కళ్లారా చూస్తామని ఆశపడ్డాం. ఏమిటో ఈ కొత్త పద్ధతులు' అని గొణుక్కుంటూ వెళ్లిపోతారు.
జైలర్ సుబ్బారావు ఇంటికొచ్చాడు నీరసంగా. ఇంకొక్క సంవత్సరంలో రిటైర్ అవబోతున్నాడు - తన హయాంలో ఒక్క ఉరి అయినా తీయకపోతే ఎంత నామర్దా? తన తోటి జైలర్లందరూ నిన్నటి వరకూ ఎంత కుళ్లుకున్నారు? ఇప్పుడు ఈ విషయం మీడియాలో వచ్చాక చాటుగా ఎంత నవ్వుకుంటారు?
భర్త రావటం చూసి, ఆయన భార్య మంచినీళ్లు తెచ్చి అందిస్తూ సంతోషంగా "ఏమండీ పెందలాడే వచ్చారే! ఉరితీత బాగా జరిగిందా? పనయ్యాక అంతా గ్రూప్ ఫోటో దిగారా?" అని పలకరించింది.
ఆయన మౌనంగా ఉండటం చూసి, మూడ్ మార్చటానికి "ఇదిగోండి పెళ్లి ఇన్విటేషను. కొరియర్ లో వచ్చింది" అని ఇచ్చింది. తీసుకుని చూసాడు. ఫ్రెండు కూతురి పెళ్లి. తప్పకుండా రావాలని విడిగా నోట్ కూడా పెట్టాడు. తేదీ చూసాడు సుబ్బారావు. అరె! ఇవ్వాళే పెళ్లి. కొరియర్ వాడు లేటుగా ఇచ్చాడన్నమాట. టైమ్ చూసుకున్నాడు.
10-30 అయింది. పన్నెండుకి ముహూర్తం. ఒంటిగంటకి లంచ్. "తొందరగా తయారవు. అన్నట్టు అమ్మాయేది?" అడిగాడు. భార్య ముసి ముసిగా నవ్వుతూ "కాబోయే శ్రీవారితో షాపింగ్ కి వెళ్లింది. వచ్చేనెలేగా పెళ్లి?" అంది.
ఇద్దరూ వెళ్లి పెళ్లి చూసి అక్షింతలు వేసి డైనింగ్ హాల్ కి వెళ్లారు. అక్కడ సగంపైగా టేబుల్స్ ఖాళీ.
"మనం మరీ ముందే వచ్చామేమో...అందరూ వచ్చాక కూర్చుంటే బాగుంటుంది" అని భార్యతో అంటుంటే అప్పుడే వచ్చిన పెళ్లికుమార్తె అన్నయ్య "రండి అంకుల్! చాలామంది వచ్చి తిరిగి వెళ్లిపోయారు. మీరు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా! ఫరవాలేదు. భోంచెయ్యండి" అని వారిని తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు.
"అదేమిటి? ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవటానికీ భోజనానికీ సంబంధమేమిటి" అని బైటకే అనేశాడు సుబ్బారావు.
"ఏం లేదంకుల్! మీరు ఇన్విటేషన్ సరిగ్గా చదివుండరు. భోజనానికి వచ్చేవాళ్ళు తప్పని సరిగా ఆధార్ కార్డ్ వెంట తీసుకు రావలెను అని అందులో వేయించాం." అన్నాడతను.
సుబ్బారావు అయోమయంగా "అదేంటీ? మీరు పిలిచిన బంధుమిత్రులంతా మీకు తెలిసినవాళ్లేగా? ఆధార్ కార్డు ఎందుకు?" అన్నాడు.
"లేదంకుల్! ఆరునెలలక్రితం మా అక్కయ్య పెళ్లికి-మీరు రాలేదనుకుంటా-మా అంచనా ప్రకారం 1500 మంది వస్తారనుకుంటే నాలుగు వేలమంది వచ్చి భోజనాలు చేసి వెళ్లారు. మళ్లీ మళ్లీ హడావుడిగా వంటలు చేయించి పెట్టాల్సొచ్చింది. వాళ్లలో చాలా మంది మేం ఎరగని వాళ్లే. కానీ ఎలా అడుగుతాం? ముష్టోళ్లు కూడా కాస్త మంచి బట్టలేసుకొచ్చి తినేసి వెళ్లినట్టున్నారు. అందుకనే ఈ ఏర్పాటు. ఈ రోజు కూడా చాలా మంది ఆధార్ కార్డు లేకుండా వచ్చారు. నిర్మొహమాటంగా పంపించేశాం" అని గర్వంగా నవ్వాడా అబ్బాయి. సుబ్బారావు భార్య కాస్తంత ఉత్సాహపడి, లడ్డూ కొరుకుతూ "మనం కూడా ఆ కార్డుని తెమ్మని ఇన్విటేషన్ లో వేద్దామండీ" అంది. అసలే పొద్దుట్నుంచీ చిరాకు చిరాగ్గా ఉన్న సుబ్బారావు "ఛ...నోర్ముయ్" అన్నాడు.
నెల తర్వాత కూతురి పెళ్లి గ్రాండ్ గా చేసాడు సుబ్బారావు.
రెణ్ణెల్ల తరువాత దసరాపండగకి కూతురూ అల్లుడూ వచ్చారు. అల్లుడు బాగానే వున్నాడు గానీ కూతురు ఎందుకో ముభావంగా ఉండటం గమనించింది సుబ్బారావు భార్య. అక్కడ ఉన్న నాలుగురోజులూ రోజూ పదింటినుంచీ మధ్యాహ్నం రెండింటిదాకా పోస్టుమాన్ కోసం గుమ్మంలో నిల్చోవటం, తర్వాత నిరాశగా లోపలికి రావటం గమనించింది తల్లి.
ఒకరోజు బీరువా అంతా కెలుకుతూ దేనికోసమో వెతుకుతూంటే "ఏంటమ్మా? ఏంకావాలి?" అని అడిగింది. "ఓ రసీదు కోసం వెతుకుతున్నానమ్మా" అంది కూతురు. "ఏ రసీదమ్మా? పెళ్లి కాకముందు పీజీకి అప్లయ్ చేసి రెండువేలు కట్టినట్లున్నావ్.. ఆ రసీదా?" అడిగింది.
"కాదమ్మా... సంవత్సరం క్రితం ఆధార్ కార్డుకి అప్లయ్ చేసి ఫొటో కూడా దిగాను కదమ్మా? ఓ వారంలో వస్తుందన్నారు పోస్టులో.. ఇంతవరకూ రాలేదు" అంది కన్నీళ్లతో కూతురు. కూతురిని అక్కున చేర్చుకుని ఊరడిస్తూ "ఆ కార్డు లేకపోతే అంత దిగులెందుకు తల్లీ? గ్యాస్ సిలిండర్ ఇవ్వనంటున్నారా? అంత అవసరమైతే మన ఇంట్లో నాలుగు సిలిండర్లున్నాయి. మీ నాన్నగారికయితే డబ్బులు కూడా వద్దంటూ వంగి వంగి నమస్కారాలు పెడుతూ ఎన్ని సిలిండర్లు కావాలన్నా వేసి పోతారు ఆ గ్యాసు కంపెనీ వాళ్లు. నువ్వూ ఓ రెండు తీసుకెళ్లమ్మా" అని ఓదార్చింది తల్లి.
