"అహం వేద్మి శుకోవేత్తి సంజయో వేత్తివానవా" అట్టివాని అర్ధములు నాకు తెలియును. శ్రీశుకునకు తెలియును. సంజయునకు తెలియునో తెలియదో! అన్నాడు. అంతటితో మహాభారత రచనా కార్యక్రమము ముగిసినది. అయినను వ్యాస మహర్షికి సంతృప్తి కలుగలేదు. రచన పూర్తి అయినది. దానిని మానవాళికి అందించవలసి ఉన్నది. అందుకు ప్రచారం అవసరమయి ఉన్నది. అప్పుడు మహర్షి ప్రచార కార్యక్రమమునకు నలుగురిని నియమించినాడు. దేవలోకమున నారద మహర్షిని, పితృలోకమున అసితదేవలుని, గంధర్వ లోకమున శుకదేవుని నియమించినారు. మానవ లోకమున వైశంపాయనుడు నియుక్తుడయినాడు. జనమేజయుడు సర్పయాగము చేసినాడు. ఆ సందర్భమున వైశంపాయనుడు మహాభారత కథను వినిపించినాడు. అప్పుడు ఉగ్రశ్రవుడు అక్కడ ఉన్నాడు. ఆ కథ సాంతము అతడు విన్నాడు. ఆ కథను నైమిశారణ్యమున మునులకు వినిపించినాడు.
రోమహర్షణుని కుమారుడు ఉగ్రశ్రవుడు. అతడు మునులకు వినిపించిన కథయే మన మహాభారత సంహిత.
సర్వేషాం కవిముఖ్యానాముపజీవ్యో భవిష్యతి.
పర్జన్య ఇవ భూతానా మక్షయ్యో భారత ద్రుమః
సర్వప్రాణులకు పర్జన్యుడు జీవన ప్రదాత. అట్టిదే ఈ మహాభారత వృక్షము. సర్వ కవిముఖ్యుల రచనలకు ఆధారభూతమగును పర్జన్యునివలె.
పురాణ పూర్ణచంద్రేణ శ్రుతిజ్యోత్స్నాః ప్రకాశితాః
నృబుద్ధికైరవాణాంచ కృతమేతత్ ప్రకాశనమ్.
ఈ పురాణము పూర్ణచంద్రుని వంటిది. వేదముల వెన్నెలలు విరజిమ్ముచున్నది. మానవునిలో మనోరూపమయిన వెన్నెలలు విరబూయిస్తున్నది.
నతాం స్వర్గగతిం ప్రాప్య తుష్టిం ప్రాప్నోతి మానవ
యాం శృత్వైవ మహాపుణ్యమితిహాస మాశ్నుతే.
ఇది మహాపుణ్యప్రదమయిన ఇతిహాసము. దీనిని విన్నవారికి స్వర్గప్రాప్తి కలుగును, సంతోషమునకున్న మిన్న అయిన ఆనందము కలుగును.
య ఇదం భారతం రాజన్! వాచకాయ ప్రయచ్చతి
తేన సర్వా మహీదత్తాభవేత్ సాగర మేఖలా
రాజా! భారత గ్రంథమును చదువుకొనుటకు దానము చేసినవాడు సాగర మేఖల అయిన సకల భూమండలమును దానము చేసిన వాడగును.
దీపిక:
సకల మానవ శ్రేయస్సాధనకు తమ జీవితములను, మేధను కప్పురమువలె వెలిగించి వెలుగులు వెదజల్లిన మహాత్ములు ఎందరో వున్నారు. వారిలో వ్యాస మహర్షి అగ్రగణ్యుడు. అతడు రచించిన భారత సంహిత మానవాళికి మార్గదర్శకం.
మానవునకు మేధ ఉన్నది. అతడు సహజముగా స్వార్ధపరుడు. తన మేలు మాత్రమే చూచుకొనుట అతని స్వభావము. అందుకు అతడు ఇతరులను బాధించును. వ్యధపరచును. పరస్పర ప్రయోజనములకు సంఘర్షణ కలుగును. జీవితము, సమాజము, ఘర్షణకు లోనుకాక తప్పదు.
ఘర్షణ మానవుడు పుట్టినది ఆదిగా జరుగుచున్నది. దొరికిన రాతితో ఎదుటివాడిని కొట్టి వాని దగ్గరిది గుంజుకొనుట రాతియుగపు పద్దతి. ఆయుధము వచ్చిన తరువాత బలవంతులు ఆయుధములతో దండెత్తి బలహీనులను పరిమార్చుట జరిగినది. నాగరికత మరింత బలిసిన ఈనాడు శక్తిమంతములయిన మారణాయుధాలతో మందిని మట్టుపెట్టుమహాప్రయత్నములు కొనసాగుతున్నవి. ఉపకరణములు మారినవి. కాని మానవుని బుద్ధి మారలేదు.
మానవుడు స్వార్ధజీవి. నిజము. కాని అతనిలో స్వార్ధము మాత్రమే లేదు. అతనికి ఒక హృదయమున్నది. ఒక మనసున్నది. మంచితనము కూడా ఉన్నది. అయితే స్వార్ధము అను అంధకారము మిణుకు - మిణుకుమను మంచిని మింగివేయుచున్నది. మహాత్ములు, మహర్షులు మిణుకు మిణుకు మను దీపాల వెలుగును పెంచి స్వార్ధమును చీకటిని పారద్రోలుటకు ప్రయత్నించినారు. మానవుని సంస్కారవంతుని చేయుటకు నిరంతర యత్నము కొనసాగుతున్నది. ఆ ప్రయత్నము వ్యాస మహర్షి చేసిన కృషి అనన్య సాధ్యము.
మానవుని మంచి మార్గమున నడిపించుటకు రెండు శాఖలుగా నిరంతర యత్నము సాగుతున్నది. ఒకటి రాజకీయ శక్తి, రెండవది సాహిత్య శక్తి. రాజకీయము నిర్దుష్టము, శక్తిమంతముగా లేనపుడు సాహిత్య శక్తియే ఈ కృషిని కొనసాగించినది.
మానవుని జంతుదశ నుంచి ఉద్భువించినది వేదము. అతనికి స్వప్రయత్నము నేర్పినది వేదము. వేదము ప్రభు సమ్మితము. అనగా అది ప్రభువువలె శాసించును. "సత్యంపద" నిజము పలుకుము అది ఒక శాసనము, అట్లు చేయవలసింది. వేదము మానవుని శాసించినది. వేదము అపౌరుషేయము అన్నారు. అనిన ఏదో బలవత్తరమయిన భగవచ్చక్తి దాని వెనుక వున్నది అని చెప్పినారు వేదకర్తలు. ఆ శక్తికి వెరచి మానవుడు సన్మార్గగామి అగునని వారి సంకల్పము.
వేదము శ్రుతి. అది వినవలసినది. దానికి అక్షరాకృతి లేదు. ఒక నిర్దిష్టత లేదు. కాబట్టి స్వార్ధపరులు బలిసి తాము చెప్పినదే వేదము అన్నారు. అట్ల వేదమునకు నిర్దిష్ట రూపము లేక అది స్వార్ధపరుల చేతి కీలుబొమ్మ అయినది. విస్సన్న చెప్పినదే వేదము అనే దశకు వచ్చినది. ఏది వేదము, ఏది కాదు మానవులు తెలుసుకొనలేకపోయారు. అట్టి అయోమయ దశలో వేదవ్యాస మహర్షి అవతరించినారు. సర్వవ్యాప్తము, అవ్యాప్తము అయిన వేదమునంతయు సేకరించినాడు. దానిని పరిష్కరించినాడు. క్రోడీకరించినాడు. నాలుగు వెధములుగా విభజించి దానికి ఒక నిర్దిష్టతను ఏర్పరచినాడు.
అట్టి అయోమయము సర్వకాలములందును జరుగుచుండును. ఆంగ్లేయులు భారతదేశమున స్థిరపడినారు. వారు హిందువులకు వర్తించు శాసనము కొఱకు వెదికినారు. అనేక స్మృతులు, అనేక సంహితలు, అనేక వ్యాఖ్యానములు వారిని గజిబిజి చేసినవి. అందుకు సంబంధించిన శాసనములు లేవు. వ్యాజ్యములే శాసనములు అయినవి. మనకు స్వాతంత్ర్యము వచ్చి హిందూ కోడ్ బిల్ వచ్చునంతవరకు ఈ గజిబిజి కొనసాగినది. ఇంత ఆధునిక సమాజమున హిందూకోడ్ బిల్లు కొఱకు ఎందరో మేధావులు నిరంతర కృషి, సాంఘిక కార్యకర్తల నిరంతర ఉద్యమము అవసరము అయినవి.
ఇంత మహత్కార్యమును వ్యాసమహర్షి ఒక్కడు, ఆ కాలమున సాధించినాడు.
వ్యాసమహర్షి వేదములను క్రోడీకరించినాడు. కాని వారికి ఫలితము కనిపించలేదు. మానవుడు అప్పటికే వేదమును నిర్లక్ష్యము చేయసాగినాడు. అతనికి వేదమునందున్న విశ్వాసము సన్నగిల్లినది. వేదము వెనుక ఉన్న భగవద్భక్తి అంత బలీయము కాదని తెలుసుకున్నాడు. అందువల్ల అతడు ప్రభు సంహితకు లొంగలేదు. అచ్చము భయపెట్టి మానవుని లొంగదీయుట దుస్సాధ్యము. మనము చూచుచుండగనే నిరంకుశ రాజ్యములు ప్రభుత్వములు కూలుట ఈ చిన్న సూత్రమునకు లోబడియే.
మానవుని మంచి మార్గమునకు మలచవచ్చునని వ్యాస మహర్షి వేదమును క్రోడీకరించినాడు. ఆ ప్రయత్నము అంతగా ఫలించినట్లు కనిపించలేదు. అతని మనసు విలవిలలాడినది. మనిషిని మంచి మార్గమున నడిపించుటను గురించి తపించినాడు. తపస్సు చేసినాడు. మహాత్ములు తమ యత్నములు మానరు. ఫలసిద్ది వరకు ప్రయత్నింతురు. వ్యాస మహర్షికి ఒక అద్భుతమయిన ఆలోచన వచ్చినది. మానవుడు పశుబలమునకు లొంగడు. రాజునకు బలము ఉన్నది. శక్తిఉన్నది. అయినను మనిషి అతని మాట వినుటలేదు. మానవుని ప్రకృతిలోనే శాసన ధిక్కారమున్నది. రాజుగా చెప్పిన విననివాడు మిత్రునిగా చెప్పిన వినును అను సూత్రమును వ్యాసమహర్షి ఆవిష్కరించినాడు. ఇంత మహాసూత్రమును ఆవిష్కరించుట ఎంత కష్టమో సాంఘిక శాస్త్రవేత్తలు పరిశోధించవలె. వారు పరిశోధించరు. ఎందుకనగా వారి వ్రేళ్ళు పాశ్చాత్య దేశములందున్నవి.
వ్యాసమహర్షి మహాభారతమును పంచమవేదముగా కల్పించినాడు. వేదములందును, ఉపనిషత్తులందును ఉన్నదంతయు అందుచేర్చినాడు. కానీ ప్రక్రియను మార్చినాడు. వేదములందువలె ఉపనిషత్తులందువలె చెప్పలేదు. మిత్ర సంహితను సృష్టించినాడు. మనిషికి ఆసక్తి కలిగించు కథలల్లినాడు. ఆ కథలందు నీతులను ధర్మములను ప్రతిష్టించినాడు. ఇది ఒక మహత్కార్యము. ఒక బృహదావిష్కరణ.
