Previous Page Next Page 
రాజ హంస పేజి 9

 

    కొందరు పెళ్ళిళ్ళు చేసుకుని కాపురాల కెళ్ళి పోయారు.
    అందులో పెద్దచేత ఏర్పాటు చేయబడిన వివాహాలు వున్నాయి. ప్రేమ వివాహాలు వున్నాయి. కులాంతర వివాహాలు వున్నాయి.
    రాజహంసకు ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. తనకైతే గట్టిగా ఉద్యోగం చెయ్యాలని వుంది. పై చదువులు మీద కూడా ఆసక్తి లేకపోలేదు. పైగా క్లాసు కూడా వచ్చింది. తన ఆలోచన్లోకి వచ్చిన కోర్స్ లన్నిటికీ అప్లేయి చేసింది. ఆశ్చర్యమేమంటే ఒక్క దాంట్లోనూ సీటు రాలేదు. చాలా బిజీ కోర్సులకు, టెక్నికల్ కోర్సులకు ఎంట్రన్స్ ఎగ్జామినేషనులున్నాయి. శ్రద్దగా , ఓపిగ్గా చదివి చాలా పరీక్షలు రాసింది. ఒక్క దాంట్లోనూ సీటు రాలేదు. ఉద్యోగాల కోసం రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసింది. ఒక్క దాంట్లోనూ సెలక్ట్ కాలేదు. ఆమెకు తన తెలివితేటల మీద, మేధా సంపత్తి మీద అపారమైన నమ్మకం , అతంవిశ్వాసం వున్నాయి. తాను ఎందులోనూ సెలక్ట్ కాకపోవటం చేత అవేమీ చెదిరిపోలేదు. అహంకారం జారిపోలేదు. ఎందుకూ పనికిరాని చవటలందరికీ ఉద్యోగాలు సీట్లు వస్తున్నాయి ఈ రోజుల్లో టాలెంట్ కు అవకాశాలు లేవు అని సమర్ధించుకుంది. కాలక్షేపం కోసం రెండు మూడు ప్రయివేటు కంపెనీలలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసింది. జీతం అయిదారు వందల కంటే ఎక్కువ లేదు. అదయినా సరిగ్గా ఇచ్చేవారు కాదు. పైగా అవసరమున్నా లేకపోయినా యజమాని కల్పించుకుని మాట్లాడటం, వెకిలి చూపులు..... ఒకడైతే సినిమాకి వస్తావా? అని అడిగాడు. తన స్టేటస్ ను చూసి తన స్థాయికి యిలాంటి ఉద్యోగాలు పనికి రావనుకుని వెళ్ళటం మానేసింది. వాళ్ళు తన వెంటబడటం , తనమీద కోరిక వెళ్ళబుచ్చటం  ఆమెకు కోపం తెప్పించలేదు. కాని తనని ఆశించే అర్హత వాళ్ళకు లేదన్న ఆలోచన వాళ్ళనుంచి దూరంగా జరిగేలా చేసింది. తనలో ఓ ప్రత్యేకత వుంది. కాని ఆ ప్రత్యేకతకు తగ్గ గుర్తింపు లభించటం లేదు. ఈ  బాదే అసంతృప్తే ఆమెను నిరంతరం వేధిస్తూ వుండేది.
    రాజహంసకు పెళ్ళి చెయ్యాలి.
    ఈ తొందర ఆమె తలిదండ్రులకి ఆమె చదువు పూర్తయినప్పట్నుంచి వెంటాడుతూ వచ్చింది.
    "నాకిప్పుడే పెళ్ళా?" అంది రాజహంస ఎగతాళిగా నవ్వి.
    ఆమె తండ్రి వున్నట్లుండి ఒక్కోసారి కటువుగా మాట్లాడుతూ వుంటాడు.
    "ఏం నీకు పెళ్ళి చేసుకునే వయసు రాలెదనుకుంటున్నావా?" అన్నాడు.
    "ఆ సంగతి నాకు తెలుసు" అన్నది రాజహంస కసిగా.
    "తెలిస్తే అభ్యంతరమేమిటి?"
    "అభ్యంతరమేమి లేదు లెండి. కాని కట్నాలూ, కానుకలు నాకసహ్యం. కట్నాల కోసం ఆశపడేవాడిని నేను చస్తే పెళ్ళి చేసుకోను."
    "కట్నం యివ్వకుండా ఈరోజుల్లో పెళ్ళేవరు చేసుకుంటారు? ప్లీడరు గుమాస్తా చేసేవాడు కూడా ఈరోజుల్లో యాభయి వేలు తీసుకుంటుంటే ఏదో మన కులంలో యింకా కట్నాలు తక్కువ. కనీసం పాతికవేలన్నా యివ్వకుండా ఎవరొస్తారు?"
    రాజహంస నవ్వుకుంది. తన అందచందాలు, సోయగాలు, పర్శనాలిటీ , గ్లామరు - ఈ సొసైటీలో తానంటే వున్న ఆకర్షణ తండ్రికి తెలీదు, తను ఊ అంటే చాలు, ఎగరేసుకు పోటానికి పెద్ద పెద్ద ఆఫీసరు సైతం ఉవ్విళ్ళూరి పోతారని పాపం తండ్రి అర్ధం చేసుకోలేకపోతున్నాడు. ఒక రకంగా తండ్రి అమాయకత్వాన్ని చూస్తే జాలి కూడా వేసింది.
    తన భావాలు అయన గ్రహించులేదన్నట్లు తల ఆడించి వూరుకుంది.
    సుందరేశం గారు సంబంధాలు చూడటం మొదలు పెట్టాడు. చాలామంది మధ్యవర్తులకి చెప్పాడు.
    సంబంధాలు ఒకటొకటీ రాసాగాయి.
    రాజహంసకు తన వైవాహిక జీవితం మీద చాలా ఆశలూ కోరికలూ వున్నాయి. ఐ.ఎ.ఎస్. ఐ.పి. ఎస్ . ఐ.ఆర్. ఎస్ కనీసం ఆర్.డి.ఓ.సి.టి.ఓ లేకపోతే పెద్ద బిజినెస్ మేగ్నేట్ . యిలా ఊహించుకుంటుంది. తాన కొచ్చిన వందల కొద్ది ప్రేమ లేఖలకు, జీవితానికి సమన్వయం చేసుకుంటోంది.
    కాని వచ్చిన సంబంధాలు దారి వేరుగా వున్నాయి. బ్యాంక్ లో క్లార్క్, అప్పుడే ప్రాక్టీస్ పెట్టిన ప్లీడరు, ప్రయివేట్ కంపెనీల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తోన్న వాళ్ళు ఆయా వివరాలు విని కనీసం వారిని చూడటానిక్కూడా ఇష్టపడలేదు రాజహంస.
    ఆమె ప్రవర్తన చూసి తల్లి నెత్తి నోరు మొత్తుకుంది.....ఇలా వచ్చిన సంబంధాలన్నీ తిరగ్గోడితే నీకు పెళ్ళేలా వుంతుందే. నీ వెనుక యిడు కొచ్చిన యిద్దరు ఆడపిల్లలున్నారు. వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? అడిగింది బాధగా.
    'అయితే వాళ్ళ గురించి నా జీవితాన్ని , ఆశల్ని త్యాగం చేసుకోమ్మంటావా?"
    "త్యాగం చేసుకొమ్మని ఎవరన్నారు? నీ జీవితాన్ని నాశనం చేసేటంతటి మూర్కులం కాదు. అత్యశాలకు పోకుండా రాజీపడటం మంచిదంటున్నాను" అన్నాడు తండ్రి.
    రాజహంస భావయుక్తంగా నవ్వి వూరుకుంది.
    ఆమె అభిప్రాయాలు గమనించి, ఆమెలో వున్న ఆత్మవిశ్వాం చూసి పోనీ ప్రయత్నించి చుద్దమనుకున్నాడు సుందరేశంగారు.
    తన తాహతుకు మించి , అంతస్తుకు మించి గాలించి పెద్ద పెద్ద సంబంధాలు తీసుకొచ్చాడు.
    నిజానికి వాటిలో కొన్ని చాలా మంచి సంబంధాలున్నాయి. పెళ్ళి కొడుకులు పెద్ద పదవుల్లో వున్నారు. చూడటానికి అందంగా, హుందాగా కూడా వున్నారు.
    పెళ్ళి చూపుల తతంగాలు కూడా జరిగాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS