Previous Page Next Page 
రాజ హంస పేజి 10

 

    రాజహంసకు వాళ్ళు నచ్చారు. వాళ్ళకి కూడా రాజహంస నచ్చింది. నచ్చటమే కాదు ఆమె సౌందర్యానికి ముగ్దులయారు కూడా - కాని కట్నాల ప్రసక్తి వచ్చేసరికి వాళ్ళెక్కడా రాజీపడలేదు. సుందరేశం యిస్తానన్న వాళ్లడిగింది మూడు నాలుగు రెట్లెక్కువగా వుంది. అప్పో సప్పో చేసి యివ్వటానికి కూడా ఆయనకంత పలుకుబడి స్థోమతా లేవు.
    రాజహంస అందచందాలు వాళ్ళ డబ్బు అతి ఆశనా తుడిచి పారేయ్యలేదు.
    ఫలితంగా ఆ సంబంధాలు కుదరలేదు.
    రాజహంస అహం దెబ్బతింది. ఈ ప్రపంచంలో వున్న అజ్ఞానం మీద ఆమె జాలిపడింది.
    రోజులు గడిచిపోతున్నాయి. ఆమెకు నచ్చకపోవటం వల్లో, అవతలి వాళ్ళ డబ్బు మీది ప్రలోభం వల్లనో ఒక్క సంబంధమూ కుదరటం లేదు.


                                                               5
    
    ఆమె పెళ్ళి ఆలశ్యం అవుతూ వుండటం మూలంగా యింట్లో క్రమంగా కలతలు ఏర్పడుతున్నాయి. తల్లీ తండ్రి విసుక్కుంటూ వుండటం రాజహంస ఎడురుతిరుగుతూ వుండటం తరచు జరుగుతున్నాయి.
    ఆమెకి కూడా అసహజంగానే వున్నది. దానికి తోడూ ఆమె స్నేహితురాళ్ళందరికీ ఒక్కొక్కరికి పెళ్ళిళ్ళయిపోతూ , ఆ జంటలు కళ్ళముందు కదలాడుతూ వుంటే మరీ మంటగా వుంది.
    నిజం చెప్పాలంటే ఆమెలో వయసుకి సంబంధించిన కోరికలూ లేకపోలేదు. అవి అప్పుడప్పుడూ శృతి మించి చెలరేగుతూ వుండకపోలేదు. కాని మనసును అదుపులో పెట్టుకుంటూ వుంది. తాను చాల అందగత్తె. యవ్వనాల రాశి ఈ యవ్వనాన్ని పొందగలగాలంటే ఎంతో వున్నతుడు హోదాగలవాడు , ఠీవి గలవాడు - యిన్ని అర్హతలు వున్న వ్యక్తికీ వీటిని ధారపోయాలి. తన జీవితం నిరర్ధకం కాకూడదు.
    అందుకే ఆత్మవిశ్వాసంతో తను ఊహించుకున్న వరుడు వచ్చేదాకా తలిదండ్రులతో పోరాటం సాగించటానికే నిశ్చయించుకుంది.
    సంబంధాలు వస్తున్నాయి. పోతున్నాయి. కానీ ఒక్కటీ కుదరటం లేదు.
    తాను బాగాలేనని ఎవరూ అనటం లేదు. కట్నాలు, కట్నాలు, ఆమెలో ఓర్పు దెబ్బ నశించిపోతోంది. అహం దెబ్బ తింటోంది.
    నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి.
    ఇంట్లో వాతావరణం రానురానూ భీభత్సంగా తయారవుతోంది. తాను రోజురోజుకీ ఎదిగిపోతూ తీరని సమస్యగా తయారవుతూ వుండటంతో తండ్రి రాను రానూ రెచ్చి పోతున్నాడు. మొహం మీద దారుణంగా తిడుతున్నాడు.
    రాజహంస చాలాసార్లు ఎదిరించింది. తానూ, తండ్రి ఘోరంగా తిట్టుకున్నారు కూడా.
    "నాకు నచ్చిన సంబంధం వచ్చేవరకూ నేను చేసుకోను. మీ తృప్తి కోసం మీ బాధ్యత వదిలించుకోవటం కోసం నా జీవితం నాశనం చేసుకోను" అంది రాజహంస.
    "నీకు నచ్చిన సంబంధమంటే? అమితాబచ్చన్ లాగానో, కమలహాసన్ లాగానో వుండాలా? లేకపోతే ఓ రాజకుమారుడు దిగి రావాలా?" అంటూ తండ్రి చిందులు తొక్కాడు.
    'అలా అని నేననలేదు గానీ, నన్ను గురించి నేను తక్కువ అంచనా వేసుకోవటం లేదు" అంది రాజహంస నిర్లక్ష్యంగా.
    "నిన్ను గురించి నువ్వు ఎక్కువ అంచనా చేసుకోవటం కూడా మంచిది కాదు."
    ఆమెకు అసహ్యమేసినట్లు జవాబు చెప్పకుండా వూరుకుంది.
    మళ్ళీ రోజులు గడిచిపోతున్నాయి. ఆమె కశ్చర్యంగా వుంది. తన సౌందర్య ప్రభావం ఆసౌందర్యం చుట్టూ పరి భ్రమించిన అరధకులూ, తనని ప్రేమించి మజ్నులయి పోయినవాళ్ళూ - వీళ్ళంతా ఏమయినారు.
    అందం కంటే డబ్బు ఎక్కువా? ఈ సమాజంలో కట్న ప్రభవం అంతగా వుందా?
    ఐ.ఎ.ఎస్ లూ, ఐ.పి.ఎస్ లూ, డాక్టర్లూ ఇంజనీర్లు తన తండ్రి స్టేటస్ చూసి చూడటానికే రావటం లేదు. తన తండ్రి స్టేటస్ అసలు వాళ్ళ సంబంధం గురించే ఆలోచించే స్థితికి రానివ్వటం లేదు. ఇహ వస్తున్నా ఎల్.డి,సి లూ, యు.డి.సి లూ అప్పుడప్పుడూ చిన్నసైజు ఆఫీసర్లూ..... వీళ్ళకి బోలెడు కట్నాలు .....
    ఈ పెళ్ళిళ్ళలో రెండు రకాలున్నాయి. పెళ్ళి కాకముందు బెరసారాల్లో ఎంతో నిక్కచ్చిగా నిర్మొహమాటంగా , ఖచ్చితంగా వ్యవహరించిన వాళ్ళు , పెళ్ళయాక వీళ్ళతో కలిసిపోయి చాలా అన్యోన్యంగా వుండటం. పెళ్ళికి ముందు ఎంతో సరళంగా కనిపించిన వారూ పెళ్ళయాక కఠినంగా ప్రవర్తించటం, రాజహంసకు యీ సంగతి తెలీదు. పెళ్ళి వ్యవహారానికి ముందే అంతా నిర్దిష్టంగా తేలిపోవాలనుకుంటోంది.
    తన మనస్సుకు వ్యతిరేకంగా జీవించటం ఆమె కిష్టం లేదు. ఆమె ఎక్కడా రాజీ పడి బంగారం వంటి భవిష్యత్తును నాశనం చేసుకోదల్చుకోలేదు. సుదీర్ఘంగా అలోచించి యింట్లోని వాతావరణం నుంచి కొంతవరకూ తప్పించుకోటానికి వెదికి వేడికి ఓ ఉద్యోగంలో చేరింది.
    అదో ప్రయివేటు కంపెనీ. ఫ్రిజ్ లూ, టేప్ రికార్డర్ లు, టి.వి. లూ వి.సి.పి లూ వి.సి.ఆర్ లు గ్రైడర్లూ వాక్యుమ్ కీనర్లూ.....ఒకటేమిటి సమస్తం అందులో అమ్మబడతాయి. స్టాక్ కూడా విపరీతంగా వుంది. రకరకాల స్కీమ్స్, ఇన్ స్టాల్ మెంట్ పద్దతులు వుండటం వల్ల సేల్స్ కూడా విపరీతంగా వున్నాయి.
    రాజహంస అందులో ఎకౌంట్స్ వగైరాలు చూసుకునే పాత్ర నిర్వహిస్తోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS