అతను ఐ నిమిషమం పాటు సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు ఫోజు పెట్టాడు.
"ఆవిడ వినవన్నీ అబద్దాలని బుకాయించేస్తాను."
"మీరు బుకాయించినా నమ్మదనుకోండి"
జవాబు చెప్పటానికి చాలా అనీజీగా ఫీలవుతున్నాడు.
రాజహంస వ్యంగ్యంగా నవ్వింది. "ఆవిడ్ని సంతోషపెట్టడానికి మీ కాపురం పాడుకాకుండా వుండటానికి నన్ను దూరం చేసుకుంటారు. నన్ను క్రమంగా మరిచిపోతారు. కొన్నాళ్ళు మీతో ఉపయోగించుకోబడి మీ కోరికలు తీర్చినదాన్నై ఆఫ్ కోర్స్ నా కోరికలూ తీర్చుకున్న దాన్నవుతాననుకోండి. కాని నా జీవితం అటూ ఇటూ కాకుండా అయిపోదా? నాకో అందమైన జీవితం నన్ను కాపాడే రక్షణ నిచ్చే భర్త సమాజంలో గౌరవం ఓ స్థిరత్వం సంపూర్ణత్వం యివన్నీ కావాలని వుండదా? నేనల్లరిపాలయిపోయి, ఏం చెయ్యాలో తెలీని నిస్సహాయస్థితిలో మిగిలిపోనా? ఇతరుల ముందు చుల్కన అయిపోనా? చక్రపాణిగారూ! మీరు నన్ను దగ్గరకు తీసుకున్నారనీ, ముద్దు పెట్టుకోబోయారనీ నాకేం కోపం లేదు. నేనేదో కోల్పోయానని నేననుకోవటం లేదు. మీ మీద నాకే ద్వేషమూ లేదు. మిమ్మల్ని ఎప్పటికీ గౌరవంతోనే చూస్తాను. వస్తాను మాస్టారూ.
రాజహంస లేచి వయ్యారంగా నడుస్తూ బయటికెళ్ళిపోయింది.
చక్రపాణి అప్రతిభుడై సోఫాలో కూర్చుని వుండిపోయాడు.
4
చక్రపాణికి తనకూ మధ్య జరిగిన సంఘటన ఊర్వశికి చెప్పకుండా వుండాలనుకుంది. సహజంగా ఆమెలో ఎంతటి రహస్యమైనా దాచుకొనే శక్తి వుంది. కాని ఎందుకో ఈ సంగతి దాచుకోలేకపోయింది.
అంతా విని ఊర్వశి కొంచెం అసంతృప్తిగా ముఖం పెట్టింది.
"బహుశా .....నువ్వు చేసింది అంత సమంజసమైనది కాదనుకుంటాను హంసా అన్నది."
ఆమె అలా మాట్లాడుతుందని రాజహంసకి తెలుసు. అయినా "ఎందుకని?" అనడిగింది అర్ధం కానట్టు.
"చక్రపాణిలాంటి అందమైన వాళ్ళు మగసిరి వున్నా వాళ్ళు పురుషులలో ఏ లక్షలో ఒకరుంటారు. అతని గురించి చాలా మంది అమ్మాయిలు కలలు గంటూ వుంటారు.
రాజహంస జవాబు చెప్పకుండా ఆలోచిస్తోంది.
"జీవితం అందంగా జీవించటానికి గాని, అనుభవాన్ని దూరంగా వుంటూ, మనల్ని మనం పోగొట్టుకుంటూ , బ్రతకటానిక్కాదు. చక్రపాణిలాంటి మగసిరి పురుషుడితో అనుభవం గడిపే అవకాశం నాకే వస్తే చస్తే వదులుకోను. జీవిత మాధుర్యాన్ని జుర్రుకుంటాను. పెళ్ళయ్యాక పరిస్థితులతో ఎలాగూ ఘోరంగా రాజీ పడక తప్పదు. ఎందుకంటె మన అభిరుచులకు దగ్గ వ్యక్తీ దొరకటం ఎలాగూ దుర్లభం కాబట్టి.
"అనుభవం కోసం శీలాన్ని పోగొట్టుకోవటం తప్పు కాదంటావా?"
ఊర్వశి నవ్వింది. "తప్పు ఈ పదానికి సరియైన నిర్వచనం సృష్టిలో ఇంతవరకూ ఎవరూ చెప్పలేకపోయారు. ఎవరి స్వభావాన్ని బట్టి వారు అన్వయించుకోవటంలో దాని అర్ధం పరిమితమై వుంటుంది. ప్రతివాళ్ళు దానికి లోంగిపోతూనే వుంటారు. ఇతరుల ప్రసక్తి వచ్చినప్పుడు దాన్ని గురించి విపరీతంగా మాట్లాడుతూ వుంటారు. అందరూ చేసేది తప్పేలా అవుతుంది? మనం ఏ తప్పు చెయ్యలేదను కుంటూ జీవితాన్ని నిస్సారంగా పొడిగా గడపటం కన్నా అలా గడిపి ఏదో సాధించానన్న నిరరధకమైన ఆత్మవంచనతో గడిపెకన్నా, నిజమైన అనుభూతికి అవకాశ మొచ్చినప్పుడు అందులో లీనం కావటమే మంచిదేమో"
రాజహంస ఆలోచిస్తూ మౌనంగా వూరుకుంది. ఆమె మనస్సులో రకరకాల ఆలోచనలు చెలరేగుతున్నాయి.
* * *
రాజహంస డిగ్రీ పూర్తి చేసింది.
ఆమె స్నేహితురాళ్ళలో చాలా మంది డ్యాషింగ్ గా వుంటారు. వాళ్ళు సాధారణంగా ఇంగ్లీషులో తప్ప తెలుగులో మాట్లాడుకోరు. ఆ ఇంగ్లీషు కూడా పరిపూర్ణంగా వుండదు." హలో వాట్ హేపెండ్ టు యువర్ బ్రదర్? అసలిన్నాళ్ళూ కనబడటం లేదేమిటి?" యిలా ఓ వాక్యం ఇంగ్లీషు లో ఓ వాక్యం తెలుగులో మాట్లాడుకుంటూ వుంటారు.
వాళ్ళందరికీ సినిమాలంటే ప్రాణం. బోర్ అంటూనే వుంటారు, వచ్చిన సినిమాకేల్లా వెడుతూనే వుంటారు. కాని ఏ సినిమా పూర్తిగా వచ్చినట్లు పొరపాటున కూడా ఒప్పుకోరు.
ఎదుటి వారిలో వున్న ఏ సుగుణమూ వాళ్ళకు నచ్చదు. ఇతరుల్లోని అమాయకత్వం మెతకదనం వాళ్ళకు శాశ్వతంగా కనబడుతుంది.
మొగవారిలో నమ్రత సభ్యతా సంస్కారాలు వాళ్ళకు నచ్చవు అతిగా మాట్లాడటం అతి చొరవ తీసుకోవటం - వాళ్ళకు డైనమిజం కావాలి.
గ్రాడ్యుయేషనయినాక ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క మాదిరిగా మారసాగింది.
కొందరు పోస్ట్ గ్రాడ్యుయెట్ కోర్సుల కెళ్ళిపోయారు. జీవితంలో ఏమన్నా సాధిద్దామన్న గట్టి పట్టుదల వున్న వారు బ్యాంకి ఎగ్జామ్స్ గ్రూప్ వన్, గ్రూప్ టూ మొదలైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ శిక్షణ రాయసాగారు.
కొందరు రిసెప్షనిస్ట్ , టైపిస్టుల నంటి చిన్న చిన్న వుద్యోగాల్లో చేరారు.
