Previous Page Next Page 
రాక్షసుడు పేజి 9


    కారిడార్ ఖాళీగా వుండటం చూసి అతడు తిరిగి లోపలికి వెళ్ళబోతూ వుంటే అకస్మాత్తుగా ఎదుటి గది తలుపు తెరుచుకుంది. అందులో భార్యాభర్తలు వున్నట్టున్నారు. లోపల మంచంమీద ఆమె కూర్చొని వుంది. అతడికి నలభై ఏళ్ళు వుంటాయి. కళ్ళు ఎర్రగా వున్నాయి. అమితమయిన తాగుడు వల్ల అనుకుంటా, శరీరం లావెక్కింది. తలుపు తీస్తూనే క్రిందకు జారిపడబోయి, బలవంతాన నిలదొక్కుకుని, "మీ దగ్గిర గదిలో నెపోలియన్ బ్రాందీ వుంది కదూ" అన్నాడు. తాగుడువల్ల గొంతు తడబడింది. అయినా అతడి ఇంగ్లీషు స్వచ్చంగా వుంది.

 

    "మీకెలా తెలుసు?" ఫాస్టస్ ఆశ్చర్యంగా అడిగాడు.

 

    "ఈ ముక్కు రంధ్రాలు- వీటికి పాతిక సంవత్సరాలుగా ట్రెయినింగ్ ఇస్తున్నాను- వాసనని బట్టి బ్రాండు కనుక్కోవటం".

 

    ఫాస్టస్ నవ్వి "నిజమే. నా దగ్గిర వుంది" అన్నాడు.

 

    "నా దగ్గిర గోల్కొండ వైన్ వుంది. ఈ హైద్రాబాద్ ద్రాక్షసారా ప్రపంచంలో అన్ని వైన్స్ కన్నా మంచిది. మీరు మీ బ్రాందీ ఒక పెగ్గు ఇచ్చిన పక్షంలో నేను నా వైన్ రెండు పెగ్గులు ఇవ్వటానికి సిద్ధంగా వున్నాను".

 

    ఫాస్టస్ నవ్వుతూ "బార్టర్ వద్దు. రండి" అంటూ ఆహ్వానించాడు.

 

    ఇద్దరూ లోపలికి ప్రవేశిస్తూ వుంటే "నేను తెలివైన వాణ్నని మీరొప్పుకోవాలి" అన్నాడు.

 

    ఫాస్టస్ తెల్లబోయాడు. "ఎందుకు?"

 

    "నా దగ్గిర వైన్ లేదు. మీరెలాగూ వద్దంటారని అలా చెప్పాను".

 

    "తెలివైనవారో కాదో గానీ, మీరొక అద్భుతమైన వ్యక్తి!"

 

    "తెలివైనవాడినే గానీ, అమితమయిన తాగుడు వలన తెలివికి ముందు 'అతి' వచ్చి చేరిందని మా ఆవిడ అంటూ వుంటుంది. ఛీర్స్"

 

    "ఛీర్స్"

 

    "నేను తాగుడు మానెయ్యాలని మా ఆవిడ ప్రతిరోజూ తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వుంటుంది. తులసి అంటే తెలుసా మీకు? మా సినిమావాళ్ళకి అక్షయపాత్ర లాంటిది. మా ఆడ పతివ్రతలు గొంతెత్తి పాడితే కాటేసే పాములు కూడా వెనక్కి వచ్చి హీరో నుంచి విషాన్ని వెనక్కి లాక్కుంటాయి. మా ఆడవాళ్ళు ఆ హీరోయిన్ లో తమని ఊహించుకుంటూ తమ మొగుళ్ళకి అలాంటి కష్టాలు రావాలని తాము రక్షించాలానే శాడిస్టిక్ తృప్తితో భక్తిగా చూస్తారు. మొన్నొకసారి ఇలాగే మా ఆవిడ డబ్బు లివ్వకుండా కట్టడి చేసింది. గొంతు తడారిపోతుంటే సినిమా హాలు ముందు మట్టితో పెద్ద పుట్ట కట్టించి, ఇందులో వేసిన డబ్బులు తిన్నగా నాగలోకానికి పోతాయని బోర్డు పెట్టాను. ముక్కుచీదుకుంటూ హాలునుండి బయటికి వచ్చిన వాళ్ళంతా ప్రదక్షిణలు చేసి మరీ డబ్బు లేశారు. నిర్మాతలకన్నా నాకే ఎక్కువ డబ్బు లొస్తున్నాయని భయపడి హాలు వాళ్ళు నన్నక్కడ నుంచి ఖాళీ చేయించారనుకోండి. అది వేరే సంగతి. ఇంతకీ చెప్పొచ్చే దేమిటంటే..."

 

    బెల్ మోగింది.

 

    "...నిశ్చయంగా మీరు వెళ్ళి తలుపు తీయకండి. అక్కడ మా ఆవిడ వుంటుంది".

 

    మళ్ళీ బెల్ మోగింది.

 

    "మొగవాడు ఆనందంగా వుండటం ఇష్టం లేక స్త్రీని సృష్టించాడు భగవంతుడు".

 

    మళ్ళీ మోగబోతూ వుంటే డాక్టర్ వెళ్ళి తలుపుతీశాడు.

 

    ఆమెకి ఇరవై ఎనిమిది ఏళ్ళుంటాయి. నిండుగా బొట్టుపెట్టుకుంది. భుజాల చుట్టూ పైట కప్పుకుంది.ఆమెలో అదోలాటి పవిత్రత వుంది. చూసేవారికి అప్రయత్నంగా భక్తి భావం కలుగుతుంది.

 

    స్వచ్చమైన ఇంగ్లీషులో "నా భర్త మీకు కలిగించిన ఇబ్బందికి మమ్మల్ని క్షమించమని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని, అతడేదో అనబోయేంతలో పక్క నుంచి లోపలికి చూస్తూ "మీరు బయటికి రండి" అంది. ఆమె కంఠంలో అదోలాటి ఆజ్ఞ వుంది. అప్పటివరకూ లొడలొడా వాగుతున్న భర్త పిల్లిలా లేచి ఎదుటి గదివైపు నడిచేడు. ఆమె లోపలికి వెళ్ళాక, అతడు తలుపు సందులోంచి మొహం బయట పెట్టి "రాత్రికి కలుసుకుందాం. జీసస్ మనకో చక్కటి రాత్రిని ప్రసాదించే కరుణామయుడు" అన్నాడు.

 

    తలుపు మూసుకుపోయింది.

 

    ఫాస్టస్ ఇంకా తేరుకోలేదు. అతడికీ అనుభవం చాలా గమ్మత్తుగా అనిపించింది. విచిత్రమయిన జంట అనుకున్నాడు. ముఖ్యంగా భర్త అతడికి బాగా నచ్చాడు. తెలివైన వాళ్ళందరూ ఈ ప్రపంచంలో ఫ్రస్ట్రేటెడ్ గానో, క్రిమినల్స్ గానో తయారవటం మనిషి జాతి చేసుకున్న దురదృష్టం.

 

                                      *    *    *

 

    ఆ రోజు సాయంత్రం అయిదింటికి విద్యాభవన్ లో ప్రోగ్రాం ప్రారంభమయింది. ముందు సీట్లో ముఖ్యమంత్రి, ఆయనకి ఒక పక్కన డాక్టర్ ఫాస్టస్ కూర్చున్నారు. కేంద్రం నుంచి వచ్చిన మరో కేంద్ర మంత్రి ఇటుపక్క కూర్చుని వున్నాడు. ఈ సభకి మరో విశేషమేమిటంటే ప్రతిపక్ష నాయకుడు కూడా హాజరవటం.

 

    వెనుక వరుసలో, సరిగ్గా ఫాస్టస్ వెనుక కూర్చొని వున్నాడు 'అతడు'. ముందు వరుసలో కూర్చుని అనవసరంగా అందరికంట్లో పడటం ఇష్టం లేదు.

 

    కార్యదర్శి వరుసగా ఒకర్నొకర్నే వేదిక మీదికి పిలవసాగేడు. ప్రతిపక్ష నాయకుడు కూడా వేదిక ఎక్కటం ఆశ్చర్యమనిపించింది. వచ్చే ఎన్నికల్లో యీ మంచినీటి సమస్య కీలకపాత్ర వహించబోతుందన్న మాట.

 

    ముందు ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఇంతకాలం ఇంత పెద్ద సమస్యని పట్టించుకోనందుకు పాత ప్రభుత్వాన్ని తిట్టాడు. ఆంధ్ర రాష్ట్రపు మంచినీరు పాడవటానికి కారణం కేంద్రమే అని ఆరోపణ చేశాడు. ఆంధ్ర సోదరుల ఆరోగ్యం కోసం తన ప్రభుత్వం ఎన్ని కోట్లయినా ఖర్చు పెడుతుందనీ, అందుకోసమే విదేశాల్నుంచి ప్రొఫెసర్ని పిలిపించామనీ, ఇంతవరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇటువంటి చర్య తీసుకోలేదనీ అన్నాడు. ఈ సమస్య కూకటివేళ్ళతో సహా పెరికించి పారేసేవరకూ, ఈ రోజు నుంచీ కేవలం 'బావి నీళ్ళు' మాత్రమే తాగుతాననీ ప్రతిజ్ఞ చేసేసరికి సభలో హర్షధ్వానాలు పెల్లుబికాయి. అతడిని సపోర్టుచేసే వార్తాపత్రిక తాలూకు విలేఖర్లు ఈ వార్తని హెడ్డింగ్ గా పెట్టటానికి హడావుడిగా వ్రాసుకోసాగారు.

 

    తరువాత ప్రతిపక్ష నాయకుడు లేచాడు. తమ ప్రభుత్వంలో అయితే ఒక ముఖ్యమంత్రికి కాస్త జ్వరం వస్తే తీసేసి, వేరొకర్ని పెట్టటానికి చాలామంది వుండేవారనీ, ఈ ప్రస్తుత పార్టీలో ముఖ్యమంత్రి తప్ప పార్టీలో ఇంకెవరూ లేరనీ, బావి నీళ్ళు తాగిన ముఖ్యమంత్రికి డిసెంట్రీ పట్టుకొంటే కష్టమనీ అనేసరికి సభలో ఒక వర్గం నవ్వుల్తో చప్పట్లు కొట్టింది.

 

    పోటీ వార్తాపత్రికా విలేఖర్లు ఈ విషయాన్ని హెడ్డింగ్ గా పెట్టటానికి ఆయత్తపడసాగారు.

 

    తరువాత కేంద్ర మంత్రి లేచారు. ఒకవైపు చైనా, మరోవైపు లంక, ఒక వైపు పాకిస్తాన్, మరోవైపు బంగ్లాదేశ్ ఇన్ని దేశాల్నుంచి ప్రమాదాలు ముంచుకొస్తూ వుండగా, ఇలాటి చిన్న సమస్య గురించి ఆలోచించకుండా దేశ సమైక్యత గురించీ కేంద్ర, రాష్ట్ర సత్సంబంధాల గురించీ ఆలోచించాలని చెప్పాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS