గొప్ప యంత్రాంగం ఇది. సెక్రటేరియేట్లలోనూ, ఆఫీసుల్లోనూ జనం పనిచేస్తారు. అయిదు సంవత్సరాలు గడిచేసరికి మహా సంబరపడిపోతూ ఓట్లు వేస్తారు. మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది. మళ్లీ అయిదేళ్ళు పనిచేస్తారు. పనిచేసేవాళ్ళు చేస్తూనే వుంటారు. తెలివైనవాళ్ళు సంపాదిస్తూనే వుంటారు. అన్నిటిలోకి పెద్ద బిజినెస్ రాజకీయం...
... అరగంటలో వాణి పక పేపరుతో వచ్చింది. దాని హెడ్డింగ్ ఈ విధంగా వుంది- "ఒకటో క్లాసుకూడా పాసవకుండా డాక్టరేట్ సంపాదించటం ఎలా? - మూడు పద్ధతులు" అని.
4
విమానం రొద చేసుకుంటూ వచ్చింది ఆగింది. ప్రయాణీకులు ఒకరొకరే దిగసాగారు. మెట్లు దిగుతూన్న వృద్ధుడు దగ్గిరకి రాగానే "ఫాస్టస్!" అన్నాడతడు. "-మీ కోసమే వేచి వున్నాం. వెల్ కమ్ టు అవర్ కంట్రీ" అంటూ చెయ్యి అందించాడు.
"సో దిస్ ఈజ్ ఇండియా" అన్నాడు ఫాస్టస్ ఎత్తుమీద నుంచి చుట్టూ పరికించి చూస్తూ. "ఏ దేశం గురించి మేము పవిత్రమయిన కథల్ని చెప్పుకుంటామో, ఏ దేశం నెహ్రూ, గాంధీలాటి వారికి జన్మనిచ్చిందో, ఏ దేశంలో మనిషి స్వేచ్చగా గొంతువిప్పి తన ప్రభుత్వపు అవకతవకల గురించి నిర్బయంగా మాట్లాడగలడో సశ్యశ్యామలమయిన పొలాల్తో, సదా ప్రవహించే నదీ జలాల్తో ఏ భూమి తల్లి పచ్చగా కళకళలాడుతుందో, ఎక్కడ మనుష్యులు శాంతి కాముకులో, ఎక్కడ స్త్రీలు శీలవంతులో- ఆ దేశ గడ్డమీద కాలిడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది".
ఫాస్టస్ కి 'అతడు' సమాధానం చెప్పలేదు. మనసులో మాత్రం అనుకున్నాడు.
"అవును. ఏ దేశంలో కేవలం గతమే పవిత్రంగా మిగిలిందో... ఏ దేశంలో నాయకులు తమ పూర్వీకులైన గాంధీ, నెహ్రూల పేర్లు చెప్పి ఓట్లు కొనుక్కుంటారో, ఏ దేశంలో మనిషి తనకి తిండి, నీరు, గుడ్డ లేకపోయినా కేవలం మాట్లాడే స్వేచ్చ వుంది కదా అని వెన్ను చరుచుకుంటూ సంతృప్తిపడతాడో, ఉన్న స్వేచ్చని ఉపయోగించుకుంటూ వార్తాపత్రికలు ఏ దేశంలో నిజాలకి చుట్టూ అద్భుతమయిన కథలల్లి వార్తలకి బదులు కల్పనలని ప్రజలకు అమ్ముతాయో, చొంగలు కార్చుకుంటూ ఆ వార్తల్ని చదివి ఏ దేశంలో ప్రజలు రాజకీయ పార్టీలపట్ల తమ అమూల్యాభిప్రాయాల్ని ఏర్పర్చుకుని కేవలం "చర్చలతోనే" కాలం గడిపే శాంతి కాముకులో, ఏ దేశంలో సదా ప్రవహించే నడుల్లోంచి పొలాల్లోకి నీళ్ళు వదలటానికి కూడా 'రేటు' వసూలు చేసే ప్రభుత్వ డిపార్టుమెంటులున్నాయో, ఏ దేశంలో స్త్రీలు గోడ పక్కనే నడుస్తూ 'స్త్రీ యొక్క అంగరహస్యములు' పోస్టర్లు చూసి కూడా దయతో, సహనంతో జీవితం గడిపే శీలవతులో, ఆ పవిత్ర భూమికి ఇదే మా హృదయ పూర్వక స్వాగతం..."
కస్టమ్స్ క్లియరెన్సు అయ్యాక హైద్రాబాద్ బయల్దేరారు. డాక్టర్ ఫాస్టస్ "రాష్ట్ర" ప్రభుత్వాధికారి కాబట్టి కేంద్రం నుంచి ఎవరూ అక్కడ విమానాశ్రయానికి రాలేదు. కేంద్రానికీ, రాష్ట్రానికీ సంబంధ బాంధవ్యాలు సరీగ్గాలేకపోవటం- అది వేరే సంగతి. ఫాస్టస్ మాత్రం అతడిని ప్రభుత్వ తరఫు మనిషే అనుకున్నాడు.
హైదరాబాద్ విమనాశ్రయంలో ప్రభుత్వాధికారులు ఫాస్టస్ ని రిసీవ్ చేసుకోవటానికి రాగానే 'అతడు' అక్కడి నుంచి తప్పుకున్నాడు.
ఇక తన అవసరం లేదు.
....
డాక్టర్ ఫాస్టస్ కి స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేయబడింది. అతిథి గృహాలు ఖాళీలు లేవు. ఒక ప్రభుత్వ రెస్ట్ హౌస్ లో దేశపు రాష్ట్రపతిగారి బంధువర్గం 'బతకమ్మ పండుగల వైభావాల్ని' చూడటం కోసం వారం రోజుల్నుంచి తిష్టవేసి వుంది. మరో అతిథి గృహంలో ఆర్థికశాఖా మంత్రిగారి బావమరిది సినిమా షూటింగు ఏర్పాటు చేసుకున్నాడు... అఫీషియల్ గా! మరో అతిథి గృహంలో ముఖ్యమంత్రిగారి కొడుకు ఉంపుడుగత్తె తన భర్తతో సహా విడిది చేసి వుంది. అన్ అఫీషియల్ గా.
డాక్టర్ ఫాస్టస్ ని హోటల్లో దింపి, అధికారులు నాలుగింటికి వస్తామని, రెస్ట్ తీసుకొమ్మని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన అయిదు నిముషాలకి 'అతడు' హోటల్లోకి ప్రవేశించి తలుపు తట్టాడు.
"ఉన్నట్లుండి ఎయిర్ పోర్టు నుంచి ఎక్కడికి మాయమైపోయావు" తలుపుతీస్తూ అడిగాడు ఫాస్టస్.
"మీ కోసం ఇది తీసుకురావటానికి-" అంటూ నెపోలియన్ బ్రాందీ బల్లమీద పెట్టాడు. ఫాస్టస్ సంభ్రమంతో చూస్తూ "మైగాడ్! నా టేస్టు మీకు ఎలా తెలుసు? నిజంగా మీ ప్రభుత్వం చాలా గొప్పది?" అన్నాడు.
"క్షమించండి. నాకూ ప్రభుత్వానికీ ఏ సంబంధమూ లేదు. మీరంటే నాకు గౌరవం, భక్తి! అంతే. లిమ్నాలజీలో మీరు పబ్లిష్ చేసిన ప్రతి పేపరూ నేనూ అత్యంత శ్రద్ధతో చదువుతాను. మీ ఇష్టాయిష్టాలూ, అభిరుచులూ అన్నీ ఉత్సాహంతో తెలుసుకుంటాను. మా గ్రంథాల్లో ఏకలవ్యుడని ఒకడున్నాడు. అలా అన్నమాట! కేవలం మీరంటే ఉన్న ఆరాధనతో నేను అక్కడికొచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నానే తప్ప ప్రభుత్వం పంపగా వచ్చిన వాణ్ని కాదు".
ఒక క్షణం తెల్లబోయినా, ఫాస్టస్ అమితంగా సంతోషించాడు. దేశం కాని దేశంలో తనని గుర్తించిన మనిషి వుండటం- తన కోసం అంతదూరం రావటం! అంతలో అతడన్నాడు -
"మీ కిష్టమని దీన్ని కష్టపడి తెప్పించాను. అదృష్టవశాత్తూ నా తండ్రి జి.కె.కి చాలా పరపతి వుంది. కోట్ల కోట్ల డబ్బు మూలుగుతూ వుండటంతో పోలీస్ డిపార్టుమెంటు నుంచి ఎక్సయిజు డిపార్టుమెంటు వరకూ ఇలాటివి తెచ్చి ఇచ్చి సావనీర్ల కోసం చందాలు వసూలు చేసుకుపోతారు".
"ఇంతకీ నువ్వేం చేస్తున్నావ్ అబ్బాయ్"
"రెండ్రోజులక్రితమే లిమ్నాలజీలో నాకు డాక్టరేట్ వచ్చిందండీ".
* * *
ముఖ్యమంత్రితో మీటింగ్ ఇంకా గంట టైమ్ వుంది. ఈలోపు ఒక పెగ్ తాగుదామనుకున్నాడు డాక్టర్ ఫాస్టస్. నిజంగా అతడికి నెపోలియన్ బ్రాందీ అంటే చాలా ఇష్టం.
ఫోన్ లో 'రూమ్ సర్వీస్ ని' పిలిచి ఐస్ కావాలని అడిగాడు. స్టార్ హోటల్ కాబట్టి మమూలుగా అది పావుగంట వరకూ రాలేదు. విసుగ్గా తలుపులు తీసుకుని బయట కారిడార్ లోకి వచ్చాడు. వరుసగా తలుపులు మూసి వున్న గదులు - క్రింద ఎర్రటి తివాచీ- సన్నగా శబ్దం చేస్తూ వేస్తూన్న చల్లటి గాలి.
