Previous Page Next Page 
రాక్షసుడు పేజి 10


    అతడు కళ్ళు మూసుకున్నాడు. విచారంగా ఆలోచించాడు. మనుషులు తాగే మంచి నీళ్ళని కూడా తమ స్వప్రయోజనాలకి వాడుకోగలిగే ఈ కుహనా నాయకుల్నుంచి దేశం ఎప్పుడు బయటపడుతుంది? ఒక క్షణంపాటు అతడి కళ్ళ ముందు ఒక దృశ్యం కదలాడింది. భవిష్యత్తులో తన దేశం... అక్కడ ప్రజలు... ప్రజల కోసమే పనిచేస్తారు. కేవలం ప్రొడక్టివ్ వర్క్ మాత్రమే అక్కడ చేయబడుతుంది. వేల వేల గుమాస్తాలు కూర్చొని లక్షల లక్షల ఫైళ్ళు నింపరు. ఏ స్త్రీ తన రెండో అంతస్థుమీద నుంచి చెత్తని రోడ్డు మీద పడవేయదు. ఏం చేసినా, ఎవరు చేసినా తోటి ప్రజల ఆనందం కోసమే చేస్తారు. తలుపులుతీసి బయటకు చూస్తే ఊరు అందంగా వుంటుంది. నిరుద్యోగులందరూ ఆనకట్టలు కట్టడంలోనూ, రాళ్ళు కొట్టడంలోనూ పనిచేయటానికి సిద్ధమవుతారు. ఇదంతా సాధ్యమవుతుందా? ఎందుకు కాదు? పక్క దేశంలో సాధ్యమయినప్పుడు మన దేశంలోనూ అవుతుంది. డబ్బు సంపాదించటానికి కేవలం 'పని' ఒక్కటే మార్గం అని, మిగతాదార్లన్నీ మూసేసిన రోజున సాధ్యమవుతుంది!! ఏ పనీ లేకుండా డబ్బు సంపాదించగలిగే మొట్టమొదటి మార్గం రాజకీయం ఒక్కటే! ఒకడు వెధవ, మరొకడు పరమవెధవ. ఎవరికి ఓటు వెయ్యాలి? ఆప్షన్ లేదు. అసలు మొత్తంగా వీళ్ళని ఏరేసి ఎలక్షన్లు బ్యాన్ చేసి పునర్నిర్మాణానికి మొదటి ఇటుక పేర్చాలి. ఏం చేస్తుంది ఈ అసెంబ్లీ? ఆర్నెల్లకొకసారి కలుస్తుంది. ఆ ఆర్నెల్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన రేపులూ, పోలీసుల అత్యాచారాలూ, సాటి ఎమ్మెల్యేలు చేసిన దురాగతాలూ చర్చిస్తుంది. మళ్ళీ వాయిదాపడుతుంది. దీని కోసం వేలు - లక్షలు - కోట్లు ఖర్చు. అతడి కళ్ళముందో మనిషి కదలాడాడు. చేతిలో తుపాకి వుంది. అతడి ముందు ఆర్మీ చీఫ్స్ ముగ్గురూ నమ్రతగా నిలబడి వున్నారు. రాజకీయ నాయకులు గోచీలు సర్దుకుని పారిపోతున్నారు. విద్యార్థి నాయకులు స్కూల్లో విప్లవ నినాదాలు మానేసి వణికేవేళ్ళతో పాఠ్య పుస్తకాలు తెరిచారు. ఆడవాళ్ళు భర్తల్ని ఆఫీసుకి పంపి పక్కింటికెళ్ళి కబుర్లు చెప్పకుండా ప్రతీ ఇంటి యాభైగజాల పరిసరం శుభ్రంగా వుంచే బాధ్యత వాళ్ళకి అప్పగించాడు. లంచం తీసుకున్న వాళ్ళ వేళ్ళు నరకబడుతున్నాయి. మొసం చేసిన వాళ్ళు ఉరి తీయబడుతున్నారు. మునుపటి స్వేచ్చ లేదు. భయమే! అయితేనేం! మనిషి మునుపటి కంటే ఆనందంగా బ్రతుకుతున్నాడు. ఎందుకొచ్చిన స్వేచ్చ యిది? తగలెయ్యనా? అతడి ఆధ్వర్యంలో అంతాపని! పనే!! ఎవరికైనా తెలుసా? ఆస్ప్రో టాబ్లెట్ నుంచీ బాల్ పాయింట్ పెన్ ఫార్ములా వరకూ ఏదో ఒక ఇతర దేశమే కనుక్కుంది తప్ప భారతదేశంలో ఇంతవరకూ చెప్పుకోదగ్గ ఒక్క వస్తువు కనుక్కోబడలేదు. అతడు అధికారంలోకి వచ్చాక అలా వుండదు. మన సైంటిస్టులు విదేశాలకు వలస వెళ్ళి నోబుల్ ప్రైజ్ సంపాదించరు. అంతరిక్షంలోకి ఎగరటానికి మీ వాహనంలో కాస్త చోటివ్వరూ అని పక్క దేశం వాళ్ళని బ్రతిమాలరు. మనమే ఎందుకు నిర్మించుకోలేమా అని ఆలోచిస్తారు. లేకపోతే మురిక్కాలవలో పడి ఆత్మహత్య చేసుకుంటారు. వీళ్ళందర్నీ అలా మార్చటం అతడి కొక్కడికే సాధ్యం. ఎవరతను? ఎక్కడో చూసినట్టు వుందే. రాక్షసుడులాటి అతడిని ఎక్కడ చూశాడు తను? ఆఁ... జ్ఞాపకం వచ్చింది. యస్... ఖాన్ .... చంగీజ్ ఖాన్!

 

    చప్పట్లు మార్మోగటంతో ఈ లోకంకి వచ్చాడు అతడు. కేంద్రమంత్రి ఉపన్యాసం పూర్తయింది. తరువాత డాక్టర్ ఫాస్టస్...

 

    ఆయన తను అక్కడికి వచ్చిన కార్యక్రమం వివరించాడు. మన చుట్టూ వున్న నీరూ, దాన్ని నిర్లక్ష్యం చేస్తే కలిగే ప్రమాదాల గురించి వివరించాడు. నీటిని మరింత శుభ్రపరచి నీటి విలువల పట్ల మరింత శ్రద్ధ తీసుకుంటే ఆస్పత్రులలో రష్ ని 75 శాతం తగ్గించవచ్చు అని అన్నాడు. ఆ పచ్చి నిజాన్ని విని ఎవరూ చప్పట్లుకొట్టలేదు. కొందరు వాచీలు చూసుకున్నారు. అంతలో ఆయన అన్నాడు-

 

    "నేనిక్కడ వారం రోజులు వుంటాను. వీలైనంత వరకూ ప్రతీ నీటి సోర్స్ నీ పరీక్షించి ప్రజలకుపయోగపడేలా ఏం చెయ్యాలో రిపోర్ట్ ఇస్తాను. నా మీద ఇంత నమ్మకం వుంచి అంత దూరం నుంచి నన్ను పిలిపించిన మీ దేశ నాయకులకు..." "రాష్ట్ర... రాష్ట్ర..." అంటూ సరిదిద్దాడు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ముఖ్యమంత్రి.

 

    "రాష్ట్ర నాయకులకు నేను కృతజ్ఞుడిని. నేనీ ప్రాంతంలో పర్యటిస్తూ, పరిశోధనలు చేసి తొందర తొందరగా రిపోర్టు ఇవ్వటానికి వీలుగా నా ఆప్తుడొకడు నాకు సాయపడతాడు. అతడు మీ వాడే. లిమ్నాలజీలో మొన్నే డాక్టరేట్ పొందాడు. అతడిని వేదిక మీదకు రమ్మని ఆహ్వానిస్తున్నాను".

 

    మామూలుగా వింటున్న అతడూ, అతడి వెనుక వరుసలో కూర్చున్న అతడి బాడీగార్డ్ రాబోట్ ఒకేసారి ఉలిక్కిపడ్డారు. కొన్ని తలలు వెనక్కి తిరిగినయ్.

 

    అతడు లేచి వేదిక మీదకు వెళ్ళక తప్పలేదు.

 

    చాలా మందికి ఇది తలముకనలయ్యేటంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అతడికి తెలుసు. లాబీల్లో పెద్ద చర్చనీయాంశం అవుతుంది కూడా. అతడు వేదిక ఎక్కుతూండగా ఫాస్టస్ కొనసాగించాడు.

 

    "నా కోసం విమానాశ్రయానికి వచ్చి అక్కణ్ణించి సాదరంగా తీసికొచ్చి ఈ యువకుడు నాతోపాటూ వుండి ఈ వారం రోజులూ శ్రమిస్తాడు. ఈ రిపోర్టు మేమిద్దరం కలిసి తయారుచేస్తాం. నాతోపాటూ అతడి పేరూ వుంటుంది. లిమ్నాలజీలో డాక్టరేట్ పొందిన-"

 

    "కాదూ..." అనే కేక వినబడింది. డాక్టర్ ఫాస్టస్ తన ఉపన్యాసాన్ని ఆపుచేశాడు. అకస్మాత్తుగా ఆ ఆడిటోరియంలో సూదిపడితే వినపడేంత నిశ్శబ్దం ఆవరించింది. అందరూ చప్పున వెనక్కు తిరిగి చూశారు.

 

    అక్కడొక యువకుడు నిలబడి వున్నాడు. అతడి గెడ్డం పెరిగి వుంది. జుట్టు సరి అయిన తైల సంస్కారం లేదు. వేదిక వైపు తర్జని చూపిస్తూ "అతడికి లిమ్నాలజీ డాక్టరేట్ లేదు... నా థీసిస్ అది. నేను వ్రాసిన థీసిస్...." అంటూ ఇంకా అరుస్తున్నాడు.

 

    అతడి మొహం ఎర్రగా మారింది. రాబోట్ మెరుపు కన్నా వేగంగా కుర్చీల వరుస మధ్యనుంచి పరుగెత్తాడు. కన్ను మూసి తెరిచేటంతలో అతడి దగ్గిరకు చేరుకొని చేతిని చాకులా మార్చి మెడ వెనుగ్గా కొట్టాడు. ఆ యువకుడు ముందుకు కూలిపోయాడు. ఈ లోపులో పోలీస్ కమీషనర్, మరో ఇద్దరు అతడిని చుట్టుముట్టారు. అది మంత్రుల మీద హత్యా ప్రయత్నం అనుకున్నారు వాళ్ళు. అతడు మాట్లాడింది వారికి అర్థం కాలేదు.

 

    అర్థమయింది అతడొక్కడికే! స్థాణువులా నిలబడి వున్నాడు అతడు. ఆ యువకుడిని పోలీసు వానువైపు తీసుకువెళుతున్నారు. సభ కొనసాగుతూంది. ఫాస్టస్ కూడా షాక్ నుంచి తేరుకుని అతడిని తిరిగి ఆహ్వానించాడు.

 

    అతడు కదల్లేదు. అంతలో వెనుక నుంచి ఒక కంఠం సన్నగా అతడికి మాత్రమే వినపడింది. అప్పటివరకూ జరిగినదంతా గమనిస్తూన్నట్టూ- "ఈ విషయం నేను చూసుకుంటాను. అతడి నోటినుంచి పోలీసులకి ఒక్కమాట కూడా చేరదు. ఒకవేళ చేరినా దాన్ని పట్టించుకోకుండా నేను చూసుకుంటాను. అన్నట్టు కంగ్రాచ్యులేషన్స్. మీ ప్రయత్నంలో అనుకున్న దానికన్నా చాలా దగ్గరగా వచ్చావు. ఫాస్టస్ నిన్ను అప్పుడే శిష్యుడిని చేసుకున్నాడే. నాకు తెలుసు, నువ్వు దేన్ని అనుకున్నా సాధించి తీరుతావని! పోతే వంకచెక్కా రామ్మూర్తి అడ్డు తగిలేటట్టు వున్నాడు. జాగ్రత్త. అతడినో కంట కనిపెట్టి వుంచు. వెళ్ళు. వాళ్ళు నీ కోసం చూస్తున్నారు".


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS