ముఖ్యంగా అతను తనకి మేనత్త కొడుకు.
అంటే తనయింట్లో ఆవిడ వంటచేసేది.
అతన్ని తన భర్తగా చెప్పుకోవటం ఎంత సిగ్గుచేటు. ఎంత అవమానం!
ఆమె కోపం, కసి, కక్ష మళ్ళీ తిరగబడసాగాయి.
శ్యామసుందర్ కి తను నచ్చింది.
తన అంగీకారం తెలిపితే పెళ్ళి జరిగిపోతుంది.
ఇప్పుడు కాదంటే!
కృష్ణమౌళి మంచివాడు కాదు.
మళ్ళీ ఏదో ప్లానువేసి తనని యింటిలోనుండి ఎత్తుకుపోతాడు.
అదిమాత్రం ఖచ్చితంగా నిజం.
ఇప్పుడు తన అంగీకారం తెలియచేస్తే శ్యామసుందర్ తో తన పెళ్ళి జరిగిపోతుంది.
తండ్రిమాట నిలబెట్టినట్లవుతుంది.
ఇక కృష్ణమౌళి గొడవే ఉండదు.
అలా అనుకుంటూ మనసులో ఒక నిశ్చయానికి వచ్చేసింది.
అంబిక అడిగిన ప్రశ్నకు తన అంగీకారం తెలియచేసింది.
ఆమెకు ఇష్టమే అని తెలిసిన తరువాత ఛీ నువ్వు ఒక ఆడదానివేనా? నీకు సిగ్గనేది వుందా! కట్టిన తాళిని నేలమీదకు విసిరికొట్టి మరొక అతన్ని పెళ్ళిచేసుకోవటానికి ఇష్టపడుతున్నావంటే నువ్వు ఎంతకు దిగజారిపోయావు.
నువ్వు ఏమి ఆలోచించుకుని మురిసిపోతున్నావో ఆ భగవంతుడికే తెలియాలి అనుకొని మనసులో అంబిక ఆడపడుచుని అసహ్యించుకుంది.
ఇందూకి తెలియదు వదిన తన గురించి ఏమనుకొంటుందో.
ఆ రోజు శ్యామ్ సుందర్, ఇంద్రసేనల పెళ్ళి నిశ్చయం అయిపోయింది.
తాంబూలాలు తీసుకున్నారు.
అదేరోజు పౌరోహితుణ్ని పిలిపించి పెళ్ళికి ముహుర్తాలు పెట్టించేరు.
శ్యామ్ సుందర్ శలవు ఎక్కువ లేని కారణంగా ఒక నెలలోపు ముహూర్తం నిశ్చయం చేశారు.
ఇంకా దగ్గరగా ముహూర్తంలేదు.
ఆ రోజుకి పెళ్ళి సరిగ్గా ఇరవై ఒక్కరోజు ఉంది.
అంబిక, సుభద్రమ్మ ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారు.
ఇద్దరూ మవునంగా ఉండిపోయారు.
వాళ్ళందరూ వెళ్ళిపోయారు.
గణేశ్ రావు గారికి, జయరామ్ కు చాలా ఆనందంగా ఉంది.
చెల్లెలికి పెళ్ళి జరిపించేసి స్టేట్స్ పంపించేస్తే కృష్ణమౌళితో గొడవ వదిలిపోతుంది.
తగిన శాస్తి చేసినట్లవుతుంది అనుకున్నారు.
అంబికకు ఆ రాత్రి నిద్రపట్టలేదు.
జయరామ్ చెల్లెలి పెళ్ళి విషయాలు చెబుతున్నా పరధ్యానంగా ఊ కొట్టిందేగాని ఉత్సాహం చూపించలేదు.
ఆ మర్నాడు ఉదయమే ఎవ్వరికి తెలియకుండా అంబక ఫోన్ చేసింది. కృష్ణమౌళి ఉన్నాడా వెళ్ళిపోయాడా అని.
అతను ఉన్నాడు.
"మీరు వెళ్ళలేదా?"
"ఈ రోజు వెళ్ళిపోతున్నాను."
"ఇందూకి సంబంధం నిశ్చయమయిపోయింది. పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టేశారు"
"అలాగా."
"మీకు బాధగా అనిపించటంలేదూ?"
అతను నవ్వాడు.
"ఆడదానికి ఆమెకే సిగ్గులేనప్పుడు నాకెందుకు బాధ? పెళ్ళి చేసుకోనియ్యి. చూద్దాం ఆ కధ ఎంతవరకు వస్తుందో ఎవరు గెలుస్తారో చూద్దాం" అన్నాడు.
"అంతేనంటారా!"
"అంతే అంబికా. నేను అమ్మకు ఇచ్చినమాట నిలబెట్టుకున్నాను. భూదేవీ కూతుర్ని జయరామ్ కిచ్చి పెళ్ళి చెయ్యాలని, అన్నగారి కూతుర్ని తన కొడుక్కిచ్చి పెళ్ళి చెయ్యాలన్న అమ్మ ఆశ నెరవేర్చాను అంబికా."
"మీరు మీ అమ్మగారికోరిక నెరవేర్చారు. భూదేవి కూతుర్ని అయిన నన్ను ఆదరించి చదువు చెప్పించి జయరామ్ గారికిచ్చి పెళ్ళి జరిపించారు. మేము సుఖంగానే ఉన్నాం మీరు! ఇందూని పెళ్ళిచేసుకుని ఏం సుఖంగా ఉన్నారు? అందుకే నేను బాధపడుతున్నాను" అంది అంబిక.
"నువ్వు బాధపడకు అంబికా. నువ్వు సుఖంగా, సంతోషంగా వుండు. అదే నే కోరుకునేది" అంటూ చెప్పి రిసీవరు పెట్టేశాడు.
అంబిక రిసీవర్ పెట్టేసి పైటచెంగుతో కళ్ళు తుడుచుకుంది.
ఒక్క క్షణం ఆలోచించింది.
ఈ విషయం భర్తకు చెప్పేస్తే.
జరిగింది ఇది అని.
ఆయన ఏమంటారు!
పెళ్ళి జరిగిపోయింది ఇంక ఏమనగలరు!
మళ్ళీ భయపడింది.
జయరాంలో ఒక విధమైన మూర్ఖత్వం ఉంది. అతనికి కోపం రావచ్చు.
చెప్పలేదు.
అతనికి చెప్పే ప్రయత్నం మానుకుంది.
ఆ మాటలు ఎవ్వరూ వినలేదు కదా అనుకుని చుట్టూ చూసింది.
చుట్టుపక్కల ఎవ్వరూ లేరు.
ఎలా జరగవలసింది అలా జరుగుతుంది అనుకుంది మనసులో.
