"రేపు ఉదయం ఫోన్ చేస్తాను మళ్ళీ."
"అలాగే" అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు.
అంబిక నిజంగానే బాధపడింది.
ఎన్ని ఆశలతో ఈ ఊరు వచ్చాడు.
వెళ్ళిపోతున్నాడు.
అతను పెళ్ళిచేసుకోవటానికే నిర్ణయించుకున్నాడు.
అవును. ఎవరయినా అలాగే చేస్తారు.
ఇందు జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటుంది.
అతనికంటే అందగాడు, చదువుకున్నవాడు, బుద్ధిమంతుడు, ఐశ్వర్యవంతుడు భర్తగా దొరకొద్దూ!
అంబిక మనసంతా అదోలా అయిపోయింది.
అలా మవునంగా ఉండిపోయింది.
ఆరోజు ఉదయం గణేశ్ రావు గారికి, జయరామ్ కి ఒకటే హడావుడిగా ఉంది.
అంబిక హాస్పిటల్ కి వెళ్ళిపోయింది.
సుభద్రమ్మ ఏం హడావుడి పడలేదు.
వాళ్ళు ఎలా చెబితే అలా చేస్తుంది అంతే.
వాళ్ళు సాయంత్రం అయిదుగంటలకి వస్తామని కబురుచేశాను.
ఇందూ ఒకటే ఆలోచించసాగింది.
అతను ఎలా ఉంటాడు!
కృష్ణమౌళికంటే అందంగా ఉండాలి.
ఈ పెళ్ళి జరిగితీరాలి.
వాళ్ళు ఒప్పుకుంటే ఈ పెళ్ళి జరిగిపోతుంది.
అప్పుడు కృష్ణమౌళి?
ఇంద్రసేన మనసులో గర్వంగా నవ్వుకుంది.
తనని ఎన్నెన్ని అన్నాడు.
ఈ పెళ్ళి జరిగిపోవాలి. అప్పుడు చెప్పాలి.
ఇంద్రసేన కలల అలల్లో తేలిపోతుంది.
ఆమెకు సంతోషంకంటే పంతం ఎక్కువగా ఉంది.
తన పెళ్ళయిపోతే కృష్ణమౌళి కుమిలి కుమిలిపోవాలి. అదీ ఆమె ఆలోచన.
ఇంద్రసేనకి తండ్రి గొంతుక వినిపించింది.
"వాళ్ళు వచ్చేశారు జయరాం."
"ఆ వస్తున్నాను" అంటున్నాడు జయరాం.
ఇంద్రసేన ఆతృతగా వినసాగింది.
వాళ్ళు వచ్చేశారన్న ఆనందంతో గదిలోనే అలా ఉండిపోయింది.
69
పెళ్ళివాళ్ళు వచ్చారు.
అబ్బాయి, తల్లిదండ్రులు ముగ్గురే వచ్చారు.
వాళ్ళకి అతను ఒక్కడే కొడుకు.
చాలా ఆస్థివుంది.
అతను డాక్టర్, స్టేట్స్ లో ఉంటున్నాడు.
గణేశ్ రావు గారు, జయరాం వాళ్ళు రావటంతో చాలా హడావుడి చేశారు.
సుభద్రమ్మ పైకి మామూలుగానే ఉంది.
ఆవిడకు కూతురికి ఈ పెళ్ళిచూపులు ఇష్టంలేదు. పెళ్ళయిందని వాళ్ళకు తెలిస్తే ఎంత పరువుపోయినమాట, ఆవిడ బాధ అది.
పెళ్ళికొడుకు శ్యామసుందర్ చాలా బాగున్నాడనే చెప్పాలి. అందం చదువు, ఆస్థి అన్నీ ఒకే మనిషిలో ఉండటం చాలా గొప్పతనమనే చెప్పాలి.
గణేశ్ రావు గారు కూతురికి ఈ సంబంధం నిశ్చయం చేయాలని పట్టుదలమీద ఉన్నారు.
అంబిక దృష్టిలో అతను గొప్పవాడిగా అనిపించలేదు కృష్ణమౌళి కంటే అందగాడా? గొప్పవాడా?
నిజంగా ఇందూ ఎంత తెలివితక్కువది.
కోరి పెళ్ళాడినవాడిని కాదని ఎవరికోసమో ఎదురుచూస్తుంది అనుకుంది.
ఇంద్రసేనని శ్యామ్ సుందర్, అతని తల్లిదండ్రులు చూశారు.
వాళ్ళందరికీ ఇంద్రసేన నచ్చింది.
జయరాం భార్యని పిలిచి చెల్లెలికి ఇష్టమో కాదో కనుక్కోమన్నాడు.
అంబిక అయిష్టంగానే ఇంద్రసేనని చాటుగా ఆమె అభిప్రాయమడిగి తెలుసుకుంది.
ఇందూకి ఎందుకో శ్యామసుందర్ నచ్చలేదు. కారణం తెలియలేదు.
అతను అందంగా ఉన్నాడు.
చదువుంది, ఐశ్వర్యవంతుడు.
ఇందూకే ఏమిటో నచ్చలేదు.
ఎన్ని విధాల కృష్ణమౌళితో పోల్చిచూసినా, ఎంత సరిపెట్టుకోవాలన్నా శ్యామ్ సుందర్ ఆమె మనసులో ఓడిపోసాగాడు.
కృష్ణమౌళి ఆ నవ్వు, అతను నిలబడే తీరు, కూర్చునే తీరు, మాటమాటకి ఎడంచేత్తో తన జుత్తుని పైకి తీసుకునే ఆ అలవాటు, ప్యాంట్ జేబుల్లో రెండుచేతులు పెట్టుకుని ఎటోచూస్తూ ఆ ఆలోచించే తీరు, అతని రూపం తన కన్నెమనసుకి నచ్చాయి.
అయితే అతనిలో గుణంలేదు.
మంచితనంలేదు.
మనిషిలో రాక్షసత్వం పేరుకుపోయి ఉంది.
అందుకే తనకి అసహ్యం.
