Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 80


    "నిజంగా ఇందూ అలా చేస్తుంది అనుకోలేదు" అన్నాడు బాధపడుతూ.


    "నేనూ అనుకోలేదు. ఏ ఆడపిల్లా అలా చెయ్యదు. కాని ఇందూ అలానే చేసింది" అంది అంబిక ఫోన్ లో.


    "యిప్పుడు నీవు చెప్పేది ఏమయినా ఉందా!"


    "మీరు ఏం చేస్తారో అని ఫోన్ చేశాను."


    "నేను ఏం చేస్తాను! నా ఆలోచనలు తారుమారు చేసేసింది అంబికా! నా మనసు ఎందుకో విరిగిపోయింది."


    "కృష్ణమౌళిగారూ!"


    "అవును అంబికా! స్త్రీ అయిన ఆమె వివాహబంధాన్ని గౌరవించనప్పుడు నేను ఎందుకు ఆ బంధాన్ని పట్టుకు కూర్చోవాలి!"


    అంబిక మాట్లాడలేదు.


    "అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను"


    "ఏమిటి ఆ నిర్ణయం!"


    "నేను మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని."


    "మళ్ళీ పెళ్ళా!"


    "ఏం చేసుకోకూడదా!"


    "అహ అదికాదండీ..."


    "మరి ఏమిటి అంబికా! ఇన్నాళ్ళు అమ్మక ఇచ్చిన మాటకోసం ప్రాకులాడాను. ఆ మాట చెల్లించుకున్నాను. బలవంతంగా తాళి మెడలో పడితే నన్ను అర్ధం చేసుకుంటుందనుకున్నాను. కాని మనిషిని అర్ధం చేసుకునే స్వభావం ఆమెది కాదు."


    అంబిక వింటోంది.


    "గణేశ్ రావుగారు ఏమంటున్నారు?"


    "ఇందుకి సంబంధాలు చూస్తున్నారు. రేపు పెళ్ళిచూపులు ఏర్పాటు చేశారు."


    "చెయ్యనీ, ఈలోగా నా పెళ్ళి జరిగిపోతుంది. ఇందూకి పెళ్ళి జరుగుతుందో లేదో వాళ్ళే చూసుకుంటారు" అన్నాడు ఆవేశంగా.


    "మీరు ఆలోచించే మాట్లాడుతున్నారా! బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి" అంది నచ్చచెబుతున్న ధోరణిలో.


    "ఆలోచించటమా! నా జీవితమంతా ఆలోచనలకే ధారపోశాను. నాకు ఇంక ఆ శక్తిలేదు."


    "నేను మగవాడిని, నాలోనూ కోరికలు, ఆశలు ఉంటాయి. ఇన్నాళ్ళు ఈ పంతానికి పట్టుదలకి నాలో ఆశలు చంపుకున్నాను."


    "ఆడపిల్ల అయిన ఆమెకే అంత పంతంవుంటే నాకేనా పంతము లేనిది."


    "తొందరలో నేను పెళ్ళిచేసుకుంటాను" అన్నాడు ఒక నిశ్చయానికి వచ్చినట్టుగా.


    "బాగా ఆలోచించండి! మీరు పెళ్ళి చేసుకుంటే ఇందూ జీవితం!"


    "బాగా ఉంటుంది అంబికా. ఆమెకు తండ్రి, అన్నయ్య, అమ్మ, వదినా అందరూ ఉన్నారు. నాకే ఎవ్వరూ లేనిది" అన్నాడు బాధగా.


    "అదికాదండీ ఆ అమ్మాయికి పెళ్ళి కాకపోతే జీవితమంతా కుమిలిపోతుంది."


    "కుమిలిపోదు అంబికా. ఇందూ ధైర్యవంతురాలు. తండ్రి సంపాదించిన నోట్లకట్టలను మెడలో వేసుకుని తాళిబొట్టుని చూసుకుని మురిసిపోయినట్లుగా మురిసిపోతుంది."


    అంబిక మాట్లాడలేదు.


    "ఆమె బాధపడటమంటూ ఉండదు. ఎంతసేపూ తండ్రి ఆస్తి అంతస్తుల గురించే ఆలోచిస్తుంది. ఆ ఆస్తి అంతస్తులు ఆమె కన్నీళ్ళు తుడుస్తాయేమో చూస్తాను."


    "ఐతే మీ నిర్ణయం ఇదేనా?"


    "అంతే అంబికా!"


    "మీరు వివాహం చేసుకోబోయే అమ్మాయి ఎవరు?"


    అతను నవ్వాడు.


    "ఇంకా నిర్ణయం కాలేదు. ఈసారి నా నిర్ణయం తెలివితక్కువగా ఉండదు. నేను ప్రేమించిన అమ్మాయిని చేసుకోదల్చుకోలేదు. నన్ను నన్నుగా ప్రేమించే అమ్మాయిని చేసుకుంటాను. ప్రేమించటం కంటే ప్రేమించబడటం గొప్ప అని నాకు ఇప్పుడు తెలిసింది.


    "మీరు ఈ ఊళ్ళోనే ఉంటారా!"


    "ఎందుకు?"


    "ఊరికే అడుగుతున్నాను."


    "లేదు రేపు ఫ్లయిట్ లో హైద్రాబాద్ వెళ్ళిపోతున్నాను."


    "రేపేనా!"


    "అవును. నేను వచ్చినపని అయిపోయింది వెళ్ళిపోతున్నాను."


    "మళ్ళీ ఎప్పుడు వస్తారు?" బాధగా అడిగింది.


    "వెళితే ఇక ఈ ఊరు రావటమంటూ ఉండదు" నవ్వాడు.


    "మీ పెళ్ళికి తెలియపరుస్తారా!"


    "తప్పకుండా."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS