Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 79


    "ఊ"


    "నేను చెప్పింది మీకు అర్ధం కాలేదు."


    "ఏమిటి?"


    "అతడు చెడ్డవాడు అవునా కాదా?"


    భార్యవైపు సూటిగా చూస్తూ "చెడ్డవాడే" అన్నాడు.


    "అందుకే నేను చెబుతున్నాను. ఇందూని బలవంతంగా ఎప్పుడయితే పెళ్ళి చేసుకున్నాడో మనందరిమీదా చాలా కక్ష కట్టి ఉన్నాడనే అర్ధం, అటువంటివాడు మనల్ని వదులుతాడా! ఇందూకి వివాహం చేద్దామనుకున్నా చెయ్యనిస్తాడా! చెప్పండి."


    "ఊ అందుకని"


    "మనిషి అందగాడు, ఐశ్వర్యవంతుడు. మీకు మేనత్త కొడుకు, దగ్గరవాడు. ఈ వివాహానికి అంగీకరించి ఇందూని అతన్ని మార్చమంటే బాగుంటుందని నా ఉద్దేశం" భర్తవైపు ఓరగా చూసింది.


    "ఏడ్చినట్టుంది నీ సలహా"


    "ఏం?"


    "అంత ఖర్మ మాకు పట్టలేదు. వాడికి జడవటమా! వాడు ఏం చెయ్యలేడు. నా చెల్లెలి పెళ్ళి నేను చేసి తీరతాను" అన్నాడు పట్టుదలగా.


    "మీకు నమ్మకం ఉందా?"


    "అహ"


    "ఐతే ఇకనేం ఆ కృష్ణమౌళి ఓడిపోయినట్టే" నవ్వింది.


    అతను భార్యవేపు చూశాడు.


    "నాకు తెలుసు మీరన్నమాట దక్కించుకుంటారు. మీరు ధైర్యవంతులు" అంటూ అతని మెడచుట్టూ చేతులువేసింది.


    అతనిలో కోపం క్రమక్రమంగా మాయమవుతోంది.


    "అందుకే నేను ఏం కోరుకుంటున్నానో తెలుసా!"


    "ఏం కోరుకుంటున్నావు" అన్నట్టు కుతూహలంగా భార్య ముఖంలోకి చూశాడు.


    "బుద్ధుల్లోనూ, ధైర్యంలోనూ, అందంలోనూ మిమ్మల్ని పోలిన కొడుకు పుట్టాలని" అంటూ అతని గుండెల్లో తలదూర్చింది.


    అతను ఆ మాటతో మంచులా కరిగిపోయాడు.


                           *    *    *
        

    ఆరోజు గణేశ్ రావు గారు హడావుడిగా యింటికి వచ్చారు.


    సుభద్రమ్మ విషయం తెలుసుకుని విస్తుపోయింది. కూతురి నుదుటిరాత ఎలావుంటే అలా జరుగుతుందని ఆవిడ మౌనం వహించింది.


    జయరాంకి, అంబికకు చెప్పారు ఆయన, ఇంద్రసేనను చూడ్డానికి పెళ్ళివాళ్ళు వస్తున్నారని.


    అంబిక ఆడపడుచు గదిలోకి వెళ్ళింది.


    ఇందూ పుస్తకం చదువుకుంటూ కూర్చుంది.


    "ఈ వార్త విన్నావా!" అడిగింది.


    "ఏమిటి వదినా" అడిగింది నవ్వుతూ.


    "నిన్ను చూడ్డానికి పెళ్ళివాళ్ళు వస్తున్నారు రేపు" అంది ఆడపడుచు ముఖంలో భావాలు గమనిస్తూ.


    ఆ మాట వినగానే ఆమె ముఖం ఒక్కక్షణం చిన్నబోయి మరుక్షణంలో మామూలుగా అయిపోయింది.


    "ఇక ఒకటే హడావుడి."


    ఆమెవేపు చూసింది ఇందూ.


    "మా అన్నయ్య ఎలా ఉంటాడో!"


    "పెళ్ళిచూపులనాడు నువ్వు చక్కగా చూడాలి, మళ్ళీ చూడలేదు అంటే ఒప్పుకోం" అంది.


    ఇంద్రేసన నవ్వింది.


    అంబిక క్షణంసేపు అలాగే చూసింది.


    ఆమెలో సిగ్గు, బాధపడటం లేదు.


    జరిగినదానికి ఏ స్త్రీ అయినా బాధపడి ఏడుస్తుంది.


    ఇందూ అలా కాదు.


    చాలా మొండిది.


    ధైర్యవంతురాలు.


    అలా ధైర్యం యిస్తున్నారు తండ్రీ అన్నయ్య మనసులో అనుకుంది అంబిక.


                            *    *    *        


    ఆరోజు రాత్రి జయరామ్ యింకా యింటికి రాలేదు. ఇందూ, గణేశ్ రావు గారు హాలులో కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు.


    సుభద్రమ్మ లోపల ఎక్కడో వుంది.


    అంబిక కృష్ణమౌళికి ఫోన్ చేసింది.


    అతను ఆతృతగా "అంబికా! నువ్వా!" అడిగాడు.


    "మీరేనా!"


    "ఆ ఏమిటి! ఇందూ ఎలా ఉంది!"


    "ఆవిడకు ఏం బాగానే ఉంది"


    "ఏమిటి విశేషాలు!"


    "ఏముంది! మా యింట్లో మామూలే"


    "అంటే!"


    ఆమె నవ్వింది.


    "కూతురు చేసిన పనికి ఆయన మెచ్చుకుంటున్నారు"


    "ఎవరు మామయ్యా?"


    "అవును"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS