చాప మీద పడుకుని ఉంది పిన్ని. ఆమెను బల్లిలా అంటిపెట్టుకుని నిద్రపోతున్నాడో వ్యక్తి. ఇద్దరికీ బట్టలు లేవు.
తృళ్ళి పడింది అర్చన. ఆమె గుండె క్షణం పాటు ఆగి తిరిగి కొట్టుకోసాగింది. మెదడు పనిచెయ్యడం మానేసింది. హఠాత్తుగా శరీరానికి చమట పట్టింది. అతి కష్టం మీద తేరుకుని వెనక్కి తిరిగి దీపాన్ని ఆర్పేసింది. అక్కడా నుంచి బయటకు వెళ్ళాలనే ఉద్దేశ్యంతో ఓ అడుగు వేసింది.
"ఎవరది?"
కాంతం ప్రశ్న బాణంలా దూసుకొచ్చింది.
"నే....నేనమ్మా!" తడబడుతూ అంది.
"అక్కడే నిలబడు, దీపం వెలిగిస్తాను...." చెప్పింది కాంతం.
ఆమె చాపపై నుంచి లేచిన చప్పుడయింది. ఆ వ్యక్తి పిల్లిలా గుమ్మం దాటడం అర్చన గమనించింది. రెండు నిముషాలు భారంగా గడిచాయి.
కాంతం దీపం వెలిగించింది.
"అదేదీ?" అడిగింది అర్చన మొహంలోకి పరీక్షగా చూస్తూ.
"అయ్యా దగ్గర పడుకుంది...." చెప్పి మొహం కనపడకుండా ప్రక్కకి తిరిగి చాప తీసుకుని వెళ్ళబోయింది.
"ఇక్కడ పడుకో..."
"బయట చల్లటి గాలేస్తోంది..." చెప్పి బయటకొచ్చింది. రెండో అరుగుపైన చాప వేసుకుని పడుకుంది. ఆమె గుండెల్లో దడ తగ్గలేదు. అంతేకాదు, ఆ రాత్రి అర్చానకి నిద్రపట్టలేదు.
కాన్తం కూడా నిద్రపోలేదు.
దీపం వెలిగించే ముందు వత్తి కాలిన వాసన గుర్తించింది. రెండు వేళ్ళతో వత్తిని పట్టుకుంది. వత్తి నిలబడడానికి వాడిన రేకు గొట్టం వేడిగా ఉంది.
ఉచ్చ్వాస నిశ్వాసలతో ఆమె గుండెలు ఎగిరిపడుతున్నాయి. ఆ చప్పుడు నిశ్శబ్ద నిశీధిలో పాము బుసలా ధ్వనిస్తోంది.
* * * *
ఉదయం పిన్ని తన మొహం వంక పట్టి పట్టి చూడటం గమనించింది అర్చన. వీలైనంత వరకూ తప్పించుకుని తిరిగింది. ఆమె ఎదురైనప్పుడు మాత్రం మొహంలో ఎటువంటి భావం వ్యక్తం కాకుండా జాగ్రత్త పడింది.
చద్దన్నం తిన్న తరువాత చెల్లెలితో కలిసి పుల్లలు ఏరుకురావడానికి వెళ్ళింది అర్చన. రాత్రి తను చూసింది తండ్రికి చెప్పకూడదని అప్పటికే నిర్ణయించుకుంది. తండ్రికి చెబితే ఏం జరుగుతుందో అంచనా కట్టలేకపోయింది. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్న ఆయనకీ తెలియకపోవటం మంచిదని అనుకుంది.
"ప్రొద్దుట్నుంఛీ అలా ఉన్నావేమే?" చెల్లెలు అడిగింది.
"ఏం లేదు."
"నాకు తెలుసు. రాత్రి చూసిన సినిమా గురించి ఆలోచిస్తున్నావ్. పట్నం మనుషులు సినిమాలోలా పాటలు పాడతారా?" అమాయకంగా అడిగింది.
"అంతా ఉత్తదే..." నవ్వుతూ అంది.
"ఉత్తదే అయితే ఎందుకు చూపించారు?" అక్కవైపు చూస్తూ అడిగింది.
"ఏమో...."
పద్నాలుగు వచ్చాయి చెల్లెలికి. ఇంకా పైట వెయ్యడానికి అలవాటుపడలేదు. బిగుతు జాకెట్ ఎదుగుతున్న ఆమె యవ్వనాన్ని దాచడానికి విఫలయత్నం చేస్తోంది. తండ్రి పోలికలు పుణికి పుచ్చుకున్న చెల్లెలు అంటే ప్రాణం అర్చనకి.
ఇద్దరూ మాట్లాడుకుంటూ పుల్లలు ఏరి రెండు మోపులుగా కట్టారు. అదే సమయంలో గేదెలు తోలుకుని వచ్చాడు పాలేరు శీతయ్య. అతనికి ఇరవై సంవత్సరాలు ఉంటుంది వయసు. కండలు తిరిగిన శరీరంతోను, నూనూగు మీసాలతోను నల్లరేగడి మట్టితో పోతపోసిన విగ్రహంలా ఉంటాడు. అతన్ని చూడగానే చెల్లెలి కళ్ళు మెరవడం అర్చన గమనించింది. ఆమె మొహం కోపంతో ఎర్రబడింది. అదీ కొన్ని క్షణాల పాటు. మోపు తీసుకుని గబగబా అడుగులు వేస్తూ చెప్పింది.
"రా వెళ్దాం...."
"ఈ రోజు మీ అక్కని తీసుకొచ్చావేం?" అసంతృప్తి నిండిన గొంతుతో చిన్నంగా గొణిగాడు.
"అది ప్రొద్దుట్నుంచి అదోలా ఉంది. నాతో వస్తానని అదే బయలు దేరింది." చెప్పింది చిన్నగా.
ప్రతి రోజూ తోటలో కలుసుకుంటారు ఇద్దరూ. చెట్ల క్రింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. అతను పశువులు కాసే వాడయినా ఆమెకు మాత్రం ఆప్తుడు. గంటల తరబడి అతనితో మాట్లాడుతూ కూర్చుంటుంది. అతనే పుల్లలు ఏరి మోపు కడతాడు. గేదె మీద కూర్చుని కర్రతో మిగతా వాటిని తోలుకొస్తుంటే, అతన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలవు.
"రేపు మాట్లాడుకుందాం..." చెప్పి మోపు ఎత్తుకుంది. అక్క వెనక్కి తిరిగి చూడటం గమనించి, గబగబా నడిచి అక్కని కలుసుకుంది.
"అతనితో ఏం చెప్పావ్?" అడిగింది అర్చన.
"మొన్న మామిడికాయలు కోసి తెచ్చాను. నేను కోసినట్టు తోటమాలి పసికట్టాడట. ఈసారి అటువైపు వెళ్లొద్దని శీతయ్య చెబుతున్నాడు...." చెప్పింది తడుముకోకుండా.
వాళ్ళు ఇల్లు చేరుకునేసరికి జనార్దనం అరుగుపైన కూర్చుని ఉన్నాడు. పిన్ని, తండ్రి అతనితో మాట్లాడుతున్నారు. జనార్ధనానికి నలభై ఉంటుంది వయసు. చాలా కాలం క్రితం పట్నం వెళ్ళి అక్కడా ఉండిపోయాడు. అప్పుడప్పుడు గ్రామానికి వచ్చివెళతాడు, కాంతానికి అతనుచుట్టం.
"రావే అర్చనా! నీ గురించే మాట్లాడుకుంటున్నాం...." ప్రేమగా పిలిచింది పిన్ని. ఆమె గొంతు క్రొత్తగా వినిపించడంతో ఆశ్చర్యపడింది అర్చన. ఇంటి వెనుక పుల్లల మోపు పడేసి వచ్చి తండ్రి ప్రక్కన కూర్చుంది.
"జనార్ధనంతో పట్నం వెళతావా?" కూతుర్ని అడిగాడు లక్ష్మీ నారాయణ. అతనికి పిల్లలంటే అంతులేని ప్రేమ. ఆ వయస్సులో కూడా ఉత్సాహంగా ఉంటున్నాడంటే దానికి కారణం పిల్లలే.
"దేనికి?"
"చిన్న పిల్లని అడిగితే అదేం చెబుతుంది? నీ పిచ్చిగాని దాని మేలుకోరి పంపుతుంటే కాదంటుందా? చెట్టంత ఎదిగినా ఇంకా పాలుత్రాగే పిల్లలే అనుకుంటావ్...." భర్తని కసిరింది కాంతం.
"నేను మీకు కడుపునిండా తిండి పెట్టలేక పోతున్నాను తల్లీ! పట్నంలో దొరల బంగాళా ఒకటి ఉందట. దానిని కనిపెట్టుకుని ఉంటె జీతం ఇస్తారట. రెండు పూటలూ భోజనం పెట్టి, సంవత్సరానికి ఒకసారి బట్టలు కొనిపెడతారట. మమ్మల్ని చూడటానికి అప్పుడప్పుడూ పంపుతారట..." చెప్పాడు తండ్రి.
ఆ మాటలకు తలూపాడు జనార్దనం.
"జనార్దనం! అది రేపు నీతో వస్తుంది...." చెప్పింది కాంతం అదే చివరిమాట అయినట్టు.
"తెలియని చోట ఒంటరిగా ఎలా ఉంటానని అనుకుంటున్నారు?" కోపంగా అడిగింది అర్చన.
"దానికి నువ్వు భయపడాల్సిన పనిలేదు. నీతోపాటు మరోకామె ఉంటుంది. నేను అప్పుడప్పుడూ వచ్చి వెళతాను. బంగళాకి నా ఇల్లు దగ్గరే!" చెప్పాడు జనార్దనం.
కడుపునిండా తిండి పెట్టలేకపోయినా గంజినీళ్ళతో పిల్లల్ని పెంచగలం కాని మీరు ఆడపిల్లలు, మీకు వయసు వస్తోంది. పెళ్ళిళ్ళు చెయ్యాలి రెండు సంవత్సరాలలో నీ చెల్లెలు కూడా పెళ్ళి కెదుగుతుంది. ఇప్పుడే కష్టపడి డబ్బు దాచుకోవాలి. నేను సవతి తల్లినని అందరూ ఆడిపోసుకుంటున్నారు. మొగుడికి మాయమాటలు చెప్పి ఎదిగిన కూతుర్ని పట్నం తరిమేసిందని అంటారు. వాళ్ళు ఎన్ని అనుకున్నా మీకు పెళ్ళి చేసి పంపడం నా బాధ్యత..." బాధగా చెప్పింది కాంతం. ఆమె కళ్ళ నీళ్ళు తిరగడం అంతా చూశారు.
"నీ మాటలు దురుసుగా ఉన్నా నీ మనస్సు వెన్నలాంటిదని లక్ష్మీనారాయణకు తెలియదా? ఊరికే మనసు కష్టపెట్టుకోకు. భార్య పోయినవాడిని కట్టుకున్న ఆడది నిందలు పడటం మామూలే! మీరు దిగులు పడొద్దు. అర్చనని కంటికి రెప్పలా చూసుకుంటాను." చెప్పాడు జనార్దనం.
రాత్రి సంఘటన చూసిన తరువాత అర్చన మనసు పాడైపోయింది. ఇంట్లోకి వెళ్ళాలంటే రోతగా ఉంది. పదే పదే ఆ దృశ్యం కళ్ళముందు కదుల్తోంది. ప్రతిక్షణం దానిని గుర్తు చేసుకుంటూ అశాంతిగా బ్రతకడం ఎంతో కష్టం. అందుకే కొన్ని రోజులపాటు ఆ ఇంటికి దూరంగా వెళ్ళడం మంచిదని అనుకుంది.
అర్చన తన అంగీకారం తెలిపిన తరువాత వెళ్ళిపోయాడు జనార్దనం. లక్ష్మీనారాయణ మాత్రం దిగులుగా కూర్చుండిపోయాడు. తొలికాన్పుకి అర్చన తల్లి పుట్టింటికి వెళ్ళింది. రాత్రి పన్నెండు గంటలకు పుట్టింది అర్చన. అప్పుడు అక్కడే ఉన్నాడు లక్ష్మీనారాయణ. బిడ్డ శరీరం శుభ్రం చేసేవరకూ అతన్ని చూడనివ్వలేదు. అతను చూసేసరికి తల్లి పక్కలో చిన్న మాంసం ముద్దలా కనిపించింది. జుట్టు మాత్రం నల్లగా నిగనిగలాడుతోంది. ముందుగా తల్లిని గుర్తుపట్టడం నేర్చుకుంది. తరువాత అతన్ని గుర్తుపట్టింది. బోసి నవ్వులు చిందిస్తూ దగ్గరకు వచ్చేది. ఆ నవ్వు చూసి కష్టాలు మర్చిపోయేవాడు. అటువంటి కూతురు దూరంగా వెళుతుంటే అతని గుండె తట్టుకోలేకపోతోంది.
