ఆయువతి రోదన క్రమంగా ఆ చీకటిని చుట్టుముట్టింది.
"వాళ్ళు ఏ స్టేషన్ వాళ్ళు?" అడిగాడు శివరావు.
"ఒన్ టౌన్...." చెప్పాడు స్నేహితుడు.
అంతవరకూ నిలబడ్డ ప్రదేశం నుండి బయటకొచ్చారు వాళ్ళు.
"మనం వచ్చింది వాళ్ళకోసమే. చివర వ్యాన్ ఎక్కినా దాని పేరు శకుంతల. అందమైన అమ్మాయిల్ని మచ్చిక చేసుకుని వాళ్ళని వృత్తిలోకి దింపుతుంది..." చెప్పాడు.
"అదిసరే...ఆమె తనకేం తెలియదంటుంది కదా" శివరావు అన్నాడు.
"అనడానికే ముందిలే....ఎన్నయినా అనొచ్చు. ఆమె వ్యభిచారం చేస్తున్నదో, లేదో ఎవరు నిర్ణయించారు. ఒక వ్యభిచారి ఇంట్లో ఆమె దొరకడం నిజం కదా. ఒకవేళ వృత్తి చేయకపోవడం నిజమైతే, రెండు మూడు రోజుల్లో చేస్తుందనేది పచ్చి నిజం. ఎందుకంటే శకుంతలతో స్నేహం చేసిన అమ్మాయి వృత్తికి సగం అంగీకరించినట్టు లెక్క..."
"ఆమె చెయ్యడం లేదంటోంది.."
ఓసారి శివరావు మొహంలోకి చూసి అతను మౌనంగా ఉండిపోయాడు. కొన్ని క్షణాల తరువాత అన్నాడు.
"ఒకామె వ్యభిచార గృహంలో దొరికినప్పుడు ఆమె వ్యభిచారం చేస్తున్నదా, లేదా అనే నిర్ణయం తెలుసుకోవడానికి అవసరమైన సమయం, శక్తి పోలీస్ డిపార్టుమెంట్ కి లేవు. ఆమె చెబుతున్నది నిజమైనా కూడా ఆ నిజాన్ని, పరిస్థితులు డామినేట్ చేస్తున్నాయి."
సబ్ యిన్ స్పక్టర్ తో ఆమె అన్న మాటలు శివరావు మనసులో కదలసాగేయి. ఆ మాటల్లో అబద్దం లేదని అతనికి అనిపించింది. వృత్తి చేస్తూ పట్టుబడి నేను చెయ్యడం లేదని వాదిన్చాల్సిన అవసరం లేదు. అందుకే శకుంతల ఒక్కమాట కూడా పోలీసులతో అనలేదు. ఆ యువతీ చెప్పుకోలేని ఇబ్బందుల్లో ఉందా?
ఆ ప్రాంతానికి దూరంగా వచ్చినా ఆమె రోదన ఇంకా చెవుల్లో మారుమ్రోగుతోంది. అది క్రమంగా శివరావు గుండెల్ని తాకుతోంది.
* * * *
చుట్టూ చూశాడు శివరావు.
యూనివర్సిటీకి వెళ్ళే దారిలో రోడ్డు ప్రక్కన ప్రహరీ వెనుక పెంకులతో నిర్మించిన పురాతనమైన ఇళ్ళ సముదాయం ఉంది. గేటుకి రెండు వైపులా బ్రహ్మాండమైన వృక్షాలు విస్తరించుకుని ఉన్నాయి.
అందులోనే ఉంది జిల్లా కోర్టు.
అక్కడ మనుషులు కనిపించడం లేదు. శివరావు లోపలకు నడిచి ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు, ముందురోజు రాత్రి నిద్రలేకపోవడం వల్ల అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. డ్యూటీ పూర్తయిన వెంటనే అక్కడకు వచ్చాడు. అతని మొహంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. రాత్రి పోలీసులు పట్టుకున్న అమ్మాయిల్ని ఆ రోజు మెజిస్ట్రేట్ ముందు హాజరు పెడతారు. శివరావు తన జీవితంలో కోర్టుకి రావడం అదే. అందుచేత కోర్టు వ్యవహారాలు అతనికి తెలియదు. అతను తెలుసుకున్న దానిని బట్టి తన ముందు హాజరు పెట్టిన అమ్మాయిలకు మెజిస్ట్రేట్ ఫైన్ వేస్తాడు. అది చెల్లించి బయటకు రావాలి. లేకపోతే శిక్ష అనుభవించాలి.
కోర్టు బయట కిళ్ళీ బడ్డీ, టీ దుకాణం వెలిశాయి. క్రమంగా ఒక్కొక్కరు రాసాగారు. వ్రేలాడుతున్న ప్రయాణీకులతో సిటీ బస్సులు భారంగా వెళుతున్నాయి. పెద్ద హోటల్ కి చెందిన వెనుక భాగం బోసిగా కనిపిస్తోంది.
శివరావు సిగరెట్ ముట్టించాడు.
పది గంటలకు ఓ పోలీస్ వ్యాన్ కోర్టు బయట ఆగింది. ఇద్దరు పోలీసులు క్రిందకు దిగి దొరుకి రెండు వైపులా నిలుచున్నారు. ముద్దాయిలు బేడీలతో దిగారు. అంతా దిగిన తరువాత వాళ్ళని తీసుకెళ్ళి వరండాలో కూర్చోబెట్టారు.
మరో వ్యాన్ వచ్చింది. అందులోంచి ఇద్దరు ఆడవాళ్ళు, ఒక లేడీ కానిస్టేబుల్ దిగారు. రాత్రి సబ్ యిన్ స్పెక్టర్ తో మాట్లాడిన అమ్మాయిని శివరావు గుర్తు పట్టాడు. రాత్రి గమనించలేదు కాని ఆమె చాలా అందంగా వుంది. శకుంతల మొహంలో కనిపిస్తున్న అలంకరణ ఆమెకు లేక పోవడం అతను గమనించాడు. వాళ్ళని తీసుకెళ్ళి ఒకచోట కూర్చోబెట్టారు.
శివరావు ఆలోచించసాగేడు. ఫైన్ కట్టి ఆమెను విడిపించాలని అతనొచ్చాడు. ఆ విషయం ముందుగా ఆమెకు తెలియపర్చాలి. ఎలా?
టీ తీసుకుని అటుగా వెళుతున్న కుర్రవాడిని గమనించి పిలిచాడు శివరావు. ఒక టీ తీసుకుని అడిగాడు.
"చిన్న పని చేస్తావా? రెండు రూపాయలిస్తాను...."
ఆ కుర్రవాడు వెంటనే తలూపాడు. ఏం చెయ్యాలో చెప్పాడు శివరావు. వాడు ఉత్సాహంగా ఆడవాళ్ళవైపు వెళ్ళాడు. ఐదు నిముషాల తరువాత తిరిగొచ్చి చెప్పాడు.
"ఒప్పుకుంది...."
శివరావు వాడికి టీ డబ్బులతో పాటుగా అదనంగా రెండు రూపాయలు ఇచ్చాడు. నెమ్మదిగా సమయం గడుస్తోంది. ముద్దాయిల్ని కలవడానికి వచ్చిన బంధువుల్ని దూరంగా వెళ్ళమని చెబుతున్నారు పోలీసులు. తను కూర్చున్న చోట ఎండ రావడంతో లేచి మరోచోట కూర్చున్నాడు శివరావు.
పదకొండున్నరకి ఆడవాళ్ళని మెజిస్ట్రేట్ దగ్గరకు తీసుకెళ్ళారు. ఒక్కొక్కరికి యాభై రూపాయలు ఫైన్ వేసారు. ఆ తతంగం చూస్తే మెజిస్ట్రేట్, పోలీసులు, ముద్దాయిలు కలిసి ఎన్నో సంవత్సరాల నుండి ఆడుతున్న నాటకాన్ని తిరిగి ప్రదర్శించినట్లు అనిపించింది శివరావుకి.
అతను ఫైన్ చెల్లించి రసీదు తీసుకున్నాడు. శకుంతల గురించి పట్టించుకోకుండా ఆమెను తీసుకుని రోడ్డు పైకి వచ్చాడు శివరావు.
"మీరెక్కడికి వెళ్ళాలి!" అడిగాడు.
"తెలియదు..." అని "నేను మీకెలా తెలుసు" అడిగింది.
"మిమ్మల్ని పోలీసులు తీసుకెళుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. మీ మాటల్ని బట్టి నిర్దోషులు అనిపించింది...."
ఆమె ఆశ్చర్యంగా చూసింది. వ్యభిచార నేరంపైన అరెస్ట్ చెయ్యడము చూసి విడిపించడానికి రావడం నమ్మశక్యంగా లేదు. అతను రాకపోతే శకుంతల ఫైన్ కట్టేది. శకుంతల ద్వారా బయటకు రావడం ఇష్టం లేదు. ఫైన్ కట్టలేనని, శిక్ష అనుభవిస్తానని మెజిస్ట్రేట్ తో చెప్పాలనుకుంది. అతనొచ్చి ఆమె నిర్ణయాన్ని మార్చాడు.
"ఎక్కడైనా కాసేపు కూర్చుందామా?" అడిగాడు శివరావు.
ఆమె సమాధానం చెప్పలేదు.
"నా వల్ల మీకు నష్టం కలగదు..."
"ఒక వ్యక్తి నష్టం కలిగించేంత మంచి పొజిషన్ లో నేను లేను. మీ సహాయానికి ఏ విధంగా కృతజ్ఞత చెప్పాలో అర్ధం కావడం లేదు."
సిటీ బస్సు ఎక్కి రామకృష్ణ మిషన్ దగ్గర దిగి బీచ్ లో నడిచారు. ఒక గొడుగు క్రింద కూర్చున్నారు. బీచ్ లో అక్కడక్కడా మనుషులు కనిపిస్తున్నారు. దూరంగా ఓ గొడుగు క్రింద ఒక జంట కూర్చుని ఉంది.
చిన్నగా బయలుదేరి క్రమంగా కదులుతూ ఉధృతంగా ఒడ్డుని తాకి తిరిగి సముద్రంలోనే కలిసిపోతున్న కెరటాల్ని కాసేపు చూస్తూ కూర్చున్నాడు శివరావు. అతని మస్తిష్కంలో ఆలోచనలు కూడా అలాగే కదులుతున్నాయి. వాటికి స్పష్టమైన రూపం లేదు. తలతిప్పి ఆమె వైపు చూశాడు. ఆమె తలవంచుకుంది దీర్ఘాలోచనలో మునిగినట్టు.
"మీరు ఇక్కడికెలా వచ్చారు?" అడిగాడు.
శివరావు మొహంలోకి ఓసారి చూసి తిరిగి తలదించుకుంది. తన గురించి చెప్పాలంటే గతాన్ని కదిలించాలి. అది కదిలితే నివురుకప్పిన నిప్పులాంటి గాయాలు రేగుతాయి. అది ఇష్టంలేకపోయినా ఆమె మెదడులో జ్ఞాపకాల పొరలు విచ్చుకున్నాయి.
ఎందుకో ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి.
* * * *
సెకండ్ షో వదిలారు. టూరింగ్ టాకీస్ నుండి జనంతోపాటు బయటకొచ్చింది అర్చన. అక్కడ నుంచి వాళ్ళ గ్రామం రెండు కిలోమీటర్ల దూరంలో వుంది. చెల్లెల్ని వెంట పెట్టుకుని గ్రామంలో కొంతమంది ఆడవాళ్ళతో కలిసి మొదటిసారి సినిమాకొచ్చిందా అమ్మాయి. ఎప్పుడో తల్లి బ్రతికున్నప్పుడు రెండుసార్లు వచ్చింది. తల్లిపోయిన తరువాత రావడము అప్పుడే. సినిమా చూసి అక్కాచెల్లెళ్ళు ఎంతో ఆనందాన్ని పొందేరు.
ఎప్పుడూ రుసరుసలాడే పిన్ని ఆరోజు సినిమాకి వెళ్ళమని డబ్బు లిచ్చింది. అనుభవిస్తున్న కష్టాలు మర్చిపోయి సంతోషంతో ఉక్కిరిబిక్కిరిరయ్యారు అక్కా చెల్లెళ్ళు. అన్నం తినేసి సినిమాకి బయలుదేరారు.
తండ్రి లక్ష్మీనారాయణ ఆ గ్రామంలో రైతు కూలీ. భార్యపోయిన తరువాత బంధువుల వత్తిడిపైన కాంతం అనే ఆమెను చేసుకున్నాడు. కొద్ది రోజులకే కాంతం నోటి దురుసుతనం అనుభవానికొచ్చి ఎదురుచెప్పడం మానుకున్నాడు. పిల్లలకోసమే ఆ పెళ్ళి చేసుకున్నా నిజానికి అప్పటి నుంచే పిల్లలకు కష్టాలు మొదలయ్యాయి. వాళ్ళు ఆ కష్టాలను మౌనంగా భరించడం నేర్చుకున్నారు.
గ్రామం నుండి సినిమాకొచ్చిన వాళ్ళంతా తిరిగి వెనక్కి బయలుదేరారు. చూసిన సినిమా గురించి మాట్లాడుకుంటూ నడవసాగేరు. అరగంటలో వాళ్ళు గ్రామం చేరుకున్నారు. ఇద్దరిని ఇంటి వద్ద వదిలి మిగతావాళ్ళు వెళ్ళిపోయారు.
తండ్రి అరుగుపైన నిద్రపోతున్నాడు. అతను గాఢనిద్రలో ఉన్నట్టు గురక వినపడుతోంది. చెల్లెలు వెళ్ళి తండ్రి పక్కలో దూరింది. అర్చన నవ్వుకుంటూ తలుపునెట్టి లోపలsకు నడిచింది. అలవాటుగా గూట్లోకి చెయ్యిపోనిచ్చి అగ్గిపెట్టె అందుకుని వెలిగించి దీపం ముట్టించింది. వత్తి పెద్దదిచేసి వెనక్కి తిరిగింది.
