మానవత్వానికి నిదర్శనం
ఈనాడు సుదినం. ఎంత మధురంగా ఉందొ, ఎంత ఆనందమయంగా ఉందో చెప్పడానికి నా తరం కావడం లేదు. ఎందుకంటె సోదరులు రామచంద్రన్ గారు మాట్లాడుతూ వారు వ్యక్త పరచి నటువంటి ప్రేమకు, అనురాగానికి నేను ఒక తమ్ముడిగా పరవశించి పోయాను. ముగ్దుడ్నయిపోయాను. ఈనాడు మీ అందరి సమక్షంలో వారి ఆశీస్సులు అందుకునే అవకాశం నాకు కనిగినందుకు కూడా అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈనాడు ఇది మానవత్వానికే పట్టం కట్టిన ఒక మధురమైన రోజు. ఈనాడు తమిళసోదరులు, ఆంధ్ర సోదరులు అందరూ కూడా ఒక్క తల్లి కన్నబిద్దల్లాగే ప్రేమలు కలబోసుకుంటూ, ఆనందాన్ని పంచుకుంటూ, ఉత్సాహంతో, ఉల్లాసంతో ఒకరి కష్టాలు ఒకరు తీర్చుకునే సుదినంగా భావిసృన్నారు అంటే అంతకంటే మంచి పండుగ దినం మనకు లేదని నేను పరిపూర్ణంగా భావిస్తున్నాను. ఈనాడు సాటి సోదరులు త్రాగడానికి మంచినీళ్ళు లేనప్పుడు - ఇప్పుడే చెప్పారు సోదరులు రామచంద్రన్ గారు ------ నూరు సంవత్సరాల చరిత్ర చేయలేని దానిని ఈనాడు మనం పరిష్కరించకోగలుగుతున్నామంటే నిజంగా అది మానవత్వానికి నిదర్శనమని మీకందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈనాడు మనం తినటమో, త్రాగటమో ఆదర్శం కాకూడదు. ప్రక్కన లేనివారికి ఇంత పెట్టగాలిగినప్పుడు , నీ ప్రేమను ఇంత పంచి ఇచ్చినప్పుడు, సోదరభావంతో వాడగాలిగినప్పుడు అదే మానవత్వానికి పరమార్ధంగా ఉంటుందని కూడా మీకందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఈనాడు అన్ని వనరులు ఉన్నప్పటికీ కూడా, 35 ఏళ్ళు స్వాతంత్యం వచ్చి కూడా ఇంతవరకు రాయలసీమకు సంపూర్ణంగా త్రాగడానికి నీళ్ళు వేసవికాలంలో లభించనటువంటి దురదృష్టం ఇంకా ఉన్నది, అదే సాగుతున్నది అంటే అది ఎటువంటి దురదృష్టకరమో ఒక్కసారి ఆలోచిస్తే సోదరులందరికీ తెలుస్తుంది. పేదవారికి తినడానికి తిండి, త్రాగడానికి మంచినీళ్ళు, ఉండడానికి ఇళ్ళు కల్పించడం ప్రభుత్వ ధర్మం. అదేవిధంగా ఈనాడు ఈ కార్యక్రమం జరుపుతున్నా మంటే మీ అందరూ మా అండన ఉన్నారని , తమ్ముళ్ళఅందరూ నా వెనుక ఉన్నారనీ, ఆ బలంతో నేను ముందుకు నడవగాలుగుతున్నానని నేను మీకందరికీ మనవి చేస్తున్నాను.
ఈనాడు ప్రభుత్వానికి, ప్రజలకు ఏమీ భేదం లేదు, ఏమీ తేడా లేదు. ప్రజలే ప్రభుత్వం, ప్రజలదే ఈ ప్రభుత్వం. ఎంతవరకు మీ సంక్షేమం కోసం, మీ సౌభాగ్యం కోసం, ఈ పరిపాలన సాగుతుందో, పాలన జరుగుతుందో అంతవరకే ఇక్కడ నేను ఉండగలుగుతానని ,మనవి చేస్తున్నాను. ఏనాటి కానాడు మీరిచ్చిన ప్రోత్సాహంతో, మీరిచ్చిన బలంతో, సహకారంతో ఎప్పటికప్పుడు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అన్నిటికీ ముందుకు దాటి వెళ్ళగలుగుతాను. మీరే నాకు బలం. ఈ విధమైన అండదండలు ఇచ్చి, ప్రోత్సహించి ముందుకు నడుపుతున్న సోదరీ సోదరులందరికీ కృతజ్ఞతాభావంతో ఒక్కసారి నా బాధ్యతను ఈ విధంగా నెరవేర్చుకున్నాను. ప్రజా సంక్షేమం కోసం ఈ ప్రాజెక్టును అంకితం చేయడానికి నేను ఎంతో ఆనందంగా భావిస్తున్నాను.
ఈనాడు తమిళనాడులో తెలుగు సోదరులు ఉన్నారు. అన్నగారు చెప్పినట్లుగా ఈనాడు తెలుగునాడులో తమిళ సోదరులున్నారు. ఒక అమ్మగన్న బిడ్డల్లాగా , అన్నదమ్ముల్లాగా మనం మెలగవలసిన అవసరం ఉంది. ఈనాడు ఒకరినొకరు పరామర్శించుకుంటే, ఒకరి కష్టాలు ఒకరు తీర్చుకుంటే , ఒకరి సుఖాలలో ఒకరు పాలుపంచుకుంటే, కాలులో కాలు చేతిలో చెయ్యి వేసికొని ముందుకు రావలసిన అవసరం మనకెంతో ఉంది. మన సంక్షేమాన్ని గమనించుకుంటూ ముందుకు సాగడమే ఆదర్శంగా కావాలని, ఈనాడు మీ అందరి సమక్షంలో అన్నగారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో నాచే పునాది వేయబడినటువంటి ఈ తెలుగుగంగ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని, ప్రతి తెలుగువారికి, ఈ ప్రాంతంలో వున్నటువంటి - కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో ఉన్నటువంటి తెలుగువారందరికీ ఆధారం కల్పించాలని, అమృత వర్షం కురిపించాలని మనపూర్వకంగా వేడుకుంటున్నాను.
ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఎంత త్వరితంగా చెయ్యగలిగితే త్వరితంగా చేస్తాము, సాగిస్తామని మీ అందరికీ మనవి చేస్తున్నాను.
1983 ఏప్రిల్ 27 న చిన్నముక్కపల్లిలో తెలుగుగంగ శంకుస్థాపన కార్యక్రమంలో.
