కార్మిక జాతి ఆశాజ్యోతి మే డే
జాతీయాభివృద్దికీ, దేశాభ్యున్నతికీ , శ్రమజీవులే ప్రధానమైన పునాది. ఉత్పత్తిని పెంచి, జాతి జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో వారి పాత్ర నిరుపమానమైంది. జాతి ప్రగతికి వారే పట్టుగొమ్మలు. వారి శ్రమే వారి సంక్షేమానికి ప్రయోజనకారి కావాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ దృడ సంకల్పం. వారి శ్రమ దోపిడీకి గురి కాకుండా చూడాలన్నది ప్రభుత్వ నిశ్చితాభిప్రాయం. ఇందుకోసం వారూ సంఘటిత శక్తిగా పోరాటం సాగించాలి. సమైక్యంగా ముందుకు సాగుతామన్న తమ ప్రతినను పునరుద్ఘాటించాలి.
సమాజంపై వెనుకటి రోజుల్లో ఉన్న క్రీనీడలు క్రమంగా చెదరి పోతున్నాయి. విజ్ఞానం ద్వారా ప్రపంచవాప్తంగా గల శ్రమజీవులు తమ అభ్యున్నతి కోసం సాగిస్తున్న మహోద్యమానికి, హక్కుల సాధన కోసం కార్మిక వర్గం శపథం చేసి సాగిస్తున్న పోరాటాలకు పర్వదినం "మే డే" . సమ సమాజ స్థాపన కోసం ప్రపంచ కార్మికులు ఆశతో జరుపుకునే పండుగ రోజు "మే డే"
దేశదేశాలలో గల కార్మికశక్తిని, ఏకతాటిపై సమీకరించుకుని, సంప్రదించుకుని శ్రమజీవుల జీవితాభ్యుదయం కోసం ముందుకు సాగే మంచి రోజు "మే డే" . కార్మిక వర్గం సంఘటిత శక్తిగా , సమైక్య శక్తిగా రూపొంది ఏకోన్ముఖంగా పోరాటపదంలో పయనించెందుకు జరుపుకునే నిండు పండుగ రోజు "మేడే" . ఒకరినొకరు అర్ధం చేసుకుని సమతాపధాన ముందుకు సాగే అవకాశాలు మెరగవుతున్నాయి. కార్మిక సోదరులు ఈ విశయాలను గమనించాలి. హక్కుల రక్షణతో పాటు తమ బాధ్యతలను కూడా గమనించి క్రమశిక్షణతో పారిశ్రామికాభివృద్దికి దోహదం చేసి ఉత్పత్తులను పెంచాలి.
శ్రమకు తగ్గ విలువను ముట్ట జెప్పే సమంజసమైన పారిశ్రామిక విధానాన్ని అమలు జరపాలన్నది ప్రభుత్వ ఆశయం. ఆనాడు ఇంతకన్నా మంచి సమాజం ఏర్పడుతుంది. శ్రమజీవుల ఆర్ధికాభున్నతి, సంక్షేమం మా ప్రభుత్వ లక్ష్యం. వారి జీవితాలకు నూత్న వసంతం చేకూర్చాలని మా ఆశయం. సమాజప్రగతికి రెక్కలు ముక్కలు చేసుకునే కార్మికులు కడగండ్లు లేకుండా కమ్మగా బ్రతకాలని మా ఆకాంక్ష. అందుకోసం మా ప్రభుత్వం అనుక్షణం కృషి చేస్తున్నది.
స్వాతంత్ర్యం వచ్చి 35 సంవత్సరాలు గడచినా ఇంకా 50 శాతం ప్రజలు దారిద్ర్యరేఖ అట్టడుగున బ్రతుకుతున్నారు. ఈ పరిస్థితిని మార్చనంత కాలం సమసమాజాన్ని స్థాపించలెం. అందుకే నిర్మాణాత్మక కార్యక్రమాలను గ్రామిన వ్యవస్థ నుంచి ప్రారంభిస్తున్నాం. కిలో బియ్యం 2 రూపాయలకే అమ్మించినా, నిరుపేదలకు శాశ్వత గృహ నిర్మాణ వసతి కల్పించినా, మంచినీటి పధకాలను అందరికీ అందుబాటులోకి తెస్తున్నా, మురికివాడల సముద్దరణకు పూనుకున్నా అన్నీ శ్రమశక్తి మీద బ్రతికే పీడిత ప్రజానీకం కోసమే.
పరిశ్రమలలో శ్రామికులను భాగస్వాములుగా గుర్తించి గౌరవించటమే మా ప్రభుత్వ ధ్యేయం. సంపన్నులకు పెట్టడం మా ప్రభుత్వ ధ్యేయం కాదు. లేనివారిని, అవసరం ఉన్న వారిని ఆదుకోవటమే ప్రభుత్వం ఆశయం. ఎందరు ఎన్ని అనుకున్నా, ఎన్ని విపరీర్ధాలు కల్పించినా శ్రామికసోదరులందరూ మా ప్రభుత్వం పై ఉంచిన నమ్మకాన్ని ఎన్నటికీ వమ్ము చేయం. వారికిచ్చిన హామీలను పూర్తిగా పాటిస్తూ వారి సంక్షేమానికి త్రికరణశుద్దిగా పాటుపడగలమని మరోసారి హామీ యిస్తున్నాను.
పారిశ్రామిక శాంతిని పరిరక్షించుకుంటూ అన్ని రంగాలలో ఉత్పత్తులను ఇతోదికం చేయటానికి కార్మిక సోదరులంతా కలిసికట్టుగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
1983 మే డే సందర్భంగా హైదరాబాద్ లో ..........
