ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య సహకారానికి శ్రీకారం
ఈనాడు ఈ ప్రజాహిత కార్యానికి విచ్చేసినటువంటి సోదరులు, తమిళనాడు ముఖ్యమంత్రి , గౌరవనీయులు శ్రీ యం. జి. రామచంద్రన్ గార్కి, ఇచ్చట వెదిక మీద వున్నటువంటి ఈ కర్నూలుజిల్లా, ప్రకాశం జిల్లా కార్యకర్తలకు, శాసనసభ్యులకు, అందరికీ , - పూజ్యులు, విజ్ఞులు ప్రతిభా విశేషం కల్గినటువంటి పూజ్యులకు, పెద్ద లందరికి --- ఈనాడు ఈ సమావేశాన్ని ప్రజా బాహుళ్యంగా అందరికీ తీర్చి చెప్పడానికి --- విచ్చేసి నటువంటి పత్రికా ప్రతినిధులకు --- ఈనాడు ఎంతో దూరం నుంచి అటు మద్రాసు నుండి, ఇటు హైదరాబాదు నుండి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధికార వర్గానికి , అనధికార వర్గానికి --- ఎండనక ఎంతో ప్రయాసతో ఈ శ్రమనంతా ఓర్చి, ఎంతో ఆప్యాయతతో, ఆదరంతో ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి అశేష యువ సోదరులకు, యువ శక్తికి -- ఎంతో కరుణతో ఆదరంతో ఆరు కోట్ల ప్రజానీకానికి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు ను ఆశీర్వదించడానికి , నాకు దీవెనలు అందించడానికి విచ్చేసినటువంటి మా తెలుగింటి ఆడబడుచులందరికి నా హృదయ పూర్వకమైనటువంటి నమస్సులు.
ఇదంతా కూడా మీ చలవ.
ఇది ప్రజా యుగం. ప్రభుత్వానికి ప్రజలకు ఏమీ తేడా లేదు. ప్రజలే ప్రభుత్వం. ప్రభుత్వమే ప్రజలు. ఈనాడు ప్రభుత్వం ఏది తలపెట్ట్టినా ప్రజాభిమాతానుసారం ప్రజలు ఏది కోరుతారో, ప్రజలకు ఏది అవసరమో, ప్రజలకు ఏది క్షేమమో , ప్రజలకు ఏది అభివృద్ధికరంగా వుంటుందో అటువంటి కార్యక్రమం చేపట్టడం ప్రభుత్వ ధర్మంగా నేను భావిస్తున్నాను. అందుకనే ఆనాడు ఎన్నికల సమయంలో మీ అందరికి వాగ్దానం చెయ్యడం కూడా జరిగింది. సామాన్య ప్రజానీకానికి, అట్టడుగువున్నటువంటి పేద ప్రజానీకానికి 35 సంవత్సరాల పరిపాలన ప్రజల కందుబాటులో లేక, దారిద్ర్యరేఖకు అట్టడుగున ఉన్నటువంటి 50 శాతం ప్రజలందరికి కూడా కట్టుకోడానికి బట్ట, తినడానికి తిండి, ఉండడానికి వాసయోగ్యమైన ఇల్లు ఇస్తామని ఆనాడు మీ అందరికి నేను వాగ్దానం చేసియున్నాను. వంద సంవత్సరాలుగా కలగానేవుంటూ ఈనాటికి కూడా ఒక రూపం దాల్చకుండా , ఇంటిముందే యెరువున్నది గాని త్రాగడానికి గుక్కెడు మంచినీళ్ళకు సోదరులకు అవకాశం లేని ఈ తరుణంలో ఏమైనా సరే ఈనాడు రాయలసీమకు వున్నటువంటి ఈ క్షామ భాధ నివారణ తక్షణం కరిగి తీరాలి అనే భావనతో ఈనాడు ఉభయ కుశాలోపరి అన్నట్లుగా ఇద్దరి యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, అటు తమిళనాడు సోదరులకు ఇటు ఆంధ్రప్రదేశ్ సోదరులకు అనువైన విధంగా 'తెలుగు గంగ' ను ఏర్పరచడం జరిగిందని మీ అందరికి సవినయంగా మనవిచేస్తున్నాను.
ఈనాటిది కాదు ఈ సమస్య. ఎప్పటి నుంచో వున్నది. కృష్ణానది జలాలు మద్రాసు పట్టణానికి మంచినీటి కోసం తరలించాలని. కాని ఇంత వరకు అది ఫలప్రదమైన జయప్రదమైన ఒక ఆకారం దాల్చలేదు. ఈనాడు మద్రాసుకు నీటితో పాటు ఒకనాటి రత్నాలసీమగా వున్న రాయల సీమలో వున్న సోదరులందరికీ మంచినీళ్ళు ఇవ్వాలి, రైతులకు వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వాలనే భావంతో ఉభయత్రా రెండు రాష్ట్రాల క్షేమాలను కలిపి ఈ తెలుగుగంగగా రూపొందించబడింది.
ఈనాడు కర్నూలు జిల్లాలో, కడప జిల్లాలో , నెల్లూరు జిల్లాలో, చిత్తూరు జిల్లాలో 6 లక్షల ఎకరాల సాగుకు ఈ నీరు ఇవ్వబడుతుంది. ఇది ఇంకా 4 లక్షల ఎకరాలకు అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ ని ----- ఆ భూజల నిక్షేపాన్ని ----- ఒక పరిమితిలో వుంచడం కూడా జరుగుతుంది. ఆ విధంగా ఈనాడు భావులకు కాని, అన్నిటికి గాని వనరులు ఏర్పరచబడతాయి. ఈవిధంగా 10 లక్షల ఎకరాలకు ఈ వ్యవస్థ ద్వారా, ఈ పధకం ద్వారా నీరు అందించబడుతుంది.
ఈనాడు తమిళ సోదరులకు, ఆంధ్ర సోదరులకు ఏమాత్రం కూడా భేద భావం లేదు. ఇక్కడ తమిళ సోదరులున్నారు. మద్రాసు రాష్ట్రంలో మన ఆంధ్ర సోదరులున్నారు. అందరు కూడా ఒక తల్లి బిద్దల్లాగా పొరపొచ్చాలేమీ లేకుండా, అరమరికలు లేకుండా అన్నాదమ్ముల్లాగా కలిసి మెలిసి వున్నారు. వారి వ్యాపారాలు గాని, వ్యవహారాలు గానీ అన్నీ సాగించుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం ఎపప్తికప్పుడు సోదరుల కష్టాలను గమనిస్తూ, వారి కష్టసుఖాల్లో కూడా పాలు పంచుకుంటూ అండగా ఉంటున్నాము. ఇరుగు పొరుగు రాష్ట్రాలే కాదు, ఒక్క తల్లి కన్నబిడ్డ ల్లాగా ఈనాడు తమిళులు , తెలుగువారు కూడా ఉంటారన్న భావం ఎప్పటికప్పుడు వ్యక్తం చెయ్యడం మన ధర్మం, మన ఆదర్శంగా నేను భావిస్తున్నాను.
ఎప్పుడో ఒడంబడిక జరిగింది. కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యీ మూడు రాష్ట్రాలు కలిసి 15 టి.యం.సి. ల వాటాను తమిళ సోదరులకు త్రాగడానికి కిస్తామని అన్నారు.ఎన్నో సంవత్సరాలు గతించాయి . ఎన్నెన్నో ఆలోచనలు జరిగినాయి. కానీ ఈనాటికీ కూడా ఒక రూపం ధరించలేదు. ఏమైనా సరే ఈ నవతరం లోనే ఇది నెరవేరాలనేతతువంటి దృక్పధంతో ఏవిధంగానైనా సరే ఇది జాగు చెయ్యకూడదు అనే అభిప్రాయంతో ఈ నాటికి యీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటె 35 సంవత్సరాలుగా అన్నగారు (ఎం.జి.ఆర్.) నన్ను తమ్ముడుగా ఆదరిస్తున్నారు. గౌరవిస్తున్నాడాయన. మేమిద్దరం కలిసి ఒక కాగితం మీద, అగ్రిమెంటు మీద సంతకం చేసే అదృష్టం నాకు కల్గింది.
ఈనాడు తెలుగుగంగ రావడం మూలకంగా శ్రీశైలం కుడి కాల్వ పని ఆగిపోతుందనే ఒక తప్పుడు ప్రచారాన్ని కొందరు చేస్తున్నారు. అటు వంటిది ఏమీ జరుగదని సోదరులందరికీ సవినయంగా మనవిచేస్తున్నాను.
దాని కార్యక్రమం అది సాగుతుంది. ఈ ప్రక్కన ఈ కార్యక్రమం కూడా సాగింపబడుతుందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తు ఇటువంటి అనుమానాలేవీ పెట్టుకోవద్దని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాదు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇన్నిన్ని పధకాలు మొదలు పెట్టారని ఏవేవో సంకోచ భావాలు, ప్రచారం చేస్తున్నారు. మనిషికి ఆలోచన ఉండాలి. మనిషికి పట్టుదల ఉండాలి. ఆత్మవిశ్వాసం ఉండాలి, నిర్మలం ఉండాలే గాని డబ్బు కోసరమని మంచి ఆలోచనలేవీ నిలువకూడదు. మనకోసం కాలం ఆగదు. ఈ కాల గమనాన్ని బట్టి మనం కూడా ముందుకు వెళ్ళాల్సిందే తప్ప డబ్బు లేదు, డబ్బు లేదని ఏమాత్రం నిలుపుదల చేయడానికి వీలులేదు.
ఇంతమంది సోదరులున్నారు, సోదరీమణులున్నారు. డబ్బు లేకపోతే జోలె కట్టుకుని మీ అందరి ముందుకు వస్తే మీరందరూ ఇచ్చే డబ్బులే చాలు - ఇటువంటి పదకాలన్నీ సమూలంగా నెరవేర్చడానికి. నాకు ప్రజా సంక్షేమం, తెలుగు తల్లి యొక్క వికాసం, తెలుగు సోదరుల యొక్క అభివృద్ధి తప్ప మరేది కూడా నా మనస్సులో లేదు. నా జీవితమే తెలుగు గడ్డకు అంకితం. తెలుగు తల్లికి ఇదే విధంగా నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్దంగా ఉన్నాను. మీరు నా అండ నున్నంత వరకు, మీరు నా అండదండగా ఉండి నడిపించినంతవరకూ ఏ అడ్డంకులు గాని, ఏ అవాంతరాలు గానీం నా ముందుకు రాలేవు. ఈనాడు ప్రజశాక్తిని ప్రతిఘటించే ఏ రాజకీయ పార్టీ గాని, ఏ రాజకీయ నాయకుడు గాని, నిలబడడు. ఈ ప్రజాయుగంలో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టే టటువంటి వారు ఎవరైనా సరే ప్రజా నాయకులుగా ముందుకు వెళ్ళవలసిందే గాని, ప్రజల మనస్సులో అనుమానాలు కల్పించి, అవాంతరాలు తెచ్చేటటువంటి వారిని యిక ప్రజలు సహించరని నేను హెచ్చరిక చేస్తున్నాను.
ఇదేకాదు, ఇకముందు మనం ఎన్నో కార్యక్రమాలు చేపట్టవలసి ఉన్నది. ఈనాడు ఎడారిగా వున్నటువంటి ఈ నేల అంతా కూడా సస్యశ్యామలం కావలసి వున్నది. పచ్చగా పరవళ్ళు తొక్కుతూ కన్నుల పండుగగా మన తెలుగు తల్లి మన ముందు చిరునవ్వులతో కలకలలాడాలి. అదే మన ధ్వేయం. అదే మన ఆశయం. ఆ ఆశయ సిద్దికి ఏమాత్రం కూడా వెనుదీయకుండా , మీరెన్నుకొన్న నాయకత్వానికి తగిన అర్హత వున్న వ్యక్తీనని, నిరూపించుకోడానికి ఏమాత్రం కూడా వెనుకాడనని, ఈనాడు నాకు కుడి ఎదమలుగా నిలిచిన ఈ సహచరులందరూ కూడా ప్రజా సక్షేమానికే బద్దకంకణులై అంకితమయ్యే నాయకులని, ఈ ప్రభుత్వము ప్రజల కొరకే, ప్రజల సంక్షేమానికే నిర్వహించబడే పరిశుద్దమై నటువంటి పాలన ఇచ్చే యంత్రాంగమని, ఇదంతా కూడా ఈ ఆరు కోట్ల ప్రజానీకానికే అంకితమని ఈ సభాముఖంగా మీ అందరికి నేను సవినయంగా మనవి చేస్తున్నాను.
ఎంతో సంతోషం. అన్నగారిని ఆహ్వానించే అదృష్టం కల్గింది. ఈనాడు ఆరుకోట్ల తెలుగువారి తరపున సోదరులకు నేను స్వాగతం చెప్తూన్నాను. ఈనాడు ఇక్కడ వెలిసే తెలుగుగంగ ఉభయ రాష్ట్రాలకు చిరకాలం వారి యొక్క అనుబంధానికి, ప్రేమకు, అనుభూతికి, చిహ్నంగా ఉండాలని, ఏవిధంగా ఈనాడు మేమిద్దరం అన్నదమ్ములుగా ఈ సభా వేదిక మీద మీ అందరు ఆశీస్సులిస్తుండగా నిలబడ్డామో , కూర్చున్నామో, ఈ కార్యక్రమానికి ఉపక్రమించామో అదేవిధంగా తెలుగు, తమిళుల యొక్క కలయిక చిరకాలం ఇలాగే వర్ధిల్లాలని, ఒక తల్లి గన్న బిద్దల్లాగా , అన్నదమ్ముల్లాగా వ్యవహించాలని, ఒకరి కష్టాలలో ఒకరి సుఖాలలో ఒకరినొకరు పాలు పంచుకుంటూ చెయ్యిలో చెయ్యి, అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగాలని, ఇది ఆదర్శావంతమైనటువంటి కృషి కావాలని, భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదేవిధంగా అన్యోన్యతతో, ఆనందంతో ఒకరినొకరు పరామర్శించుకుంటూ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. ఈనాడు ఈ శుభకార్యానికి పునాది వేయడానికి వచ్చినటువంటి సోదరులకు మరొక్కసారి ఈ ఆరు కోట్ల తెలుగు ప్రజానీకం తరపున అభినందనలు తెలుపుతూ, ఈనాడు ఈ కార్యక్రమంలో వారు కూడా భాగస్వాములుగా నిలిచినందుకు, ఈ వ్యవస్థ నిర్మాణం ఈ ప్రాజెక్టు నిర్మాణంలో వారు కూడా సహాయ భూతులై, సానుకూలతతో మన ప్రక్కన ఉన్నందుకు వారికి అభినందనలు తెలుపుతున్నాను.
1983 ఏప్రిల్ 27 న వెలుగోడువద్ద తెలుగుగంగకు తమిళనాడు ముఖ్యామంత్రి శ్రీ యం.జి.రామచంద్రన్ శంకుస్థాపన చేసిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధ్యక్షోపన్యాసం.
