"కొంతవరకూ ఇది నిజమే. ప్రభుత్వం లిమ్నాలజీ డిపార్ట్ మెంట్ వాళ్ళ సలహాలకి ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వటంలేదు గానీ, లేకపోతే కేవలం శుభ్రమైన నీళ్ళు సప్లయ్ చేయటం ద్వారా నూటికి తొంభైశాతం రోగాల్ని తగ్గించవచ్చు. ఈ నిజాన్ని కూడా మనం కాదనలేం -"
"అప్పుడు డాక్టర్ల రిట్రెంచ్ మెంట్ జరిగి, అదో గొడవ".
అతడు తప్ప మిగతా అందరూ నవ్వేరు. "మనం ఈ చర్చ ఆపి, జరగవలసిన విషయం ఆలోచిద్దామా" అని అతడనేసరికి అందరూ మౌనం వహించారు. కొంచెం నిశ్శబ్దం తరువాత వాణి కదిలింది. "డాక్టర్ ఫాస్టస్ ఇచ్చిన రిపోర్టు తీసేసి, దాని స్థానంలో ఈ ఫాల్స్ రిపోర్ట్ పెట్టటమే" అంది.
"సంతకం?"
"ఫోర్జరీ! ...మనకి అది చాలా సులభం".
"కష్టం" అన్నాడు అతడు. "ఒకసారి అ రిపోర్టు నాలుగో పేజీ చూడు".
"ఆమె గబగబా నాలుగో పేజీ తిప్పింది. ఆమె చూస్తూవుంటే అతడు చెప్పాడు. "ఏమని వ్రాసి వుంది? bacterial populations in hussain sagar in the vicinity of periphyton were also extraordinary dense to the extent of 1,62,000/ ఎమ్.ఎల్. అని లేదూ. నిజానికి వుండాల్సింది. 62,000 ఎమ్.ఎల్. అని".
అక్కడవున్న ముగ్గురూ స్తబ్ధులై అతనివైపు చూశారు. తెల్లవారుఝామున నాలుగింటికి లోహియా అతడికి రిపోర్టు యిచ్చాడు. ఇప్పుడు ఎనిమిదైంది. ఈ నాల్గుగంటల్లో, నిద్ర లేకుండా- ఒకసారి రిపోర్టు అంతా చదివి- దాదాపు కంఠతా పట్టేశాడు. అంతేకాక డాక్టర్ ఫాస్టస్ ఇచ్చే రిపోర్టుకీ దీనికి తేడాలుకూడా మనసులో నోట్ చేసుకున్నాడు. అంత వేగంగా, తొందరగా రియాక్టు అవగలడు కాబట్టే అందరూ అతడిమీద ఆధారపడుతున్నారు.
"చాలా కొద్ది మార్పులు చేశాడు లోహియా. కానీ తరువాత ఆ మార్పుల గురించి డాక్టర్ ఫాస్టస్ కి తెలిస్తే ఈ ఫోర్జరీ బయటపడుతుంది. అందువల్ల అలా వద్దు" అని సింహంవైపు తిరిగి, "నాకు భారతదేశంలో డాక్టర్ ఫాస్టస్ ప్రోగ్రాం కావాలి" అన్నాడు.
సరిగ్గా గంట తర్వాత ఆ రిపోర్టు తీసుకొచ్చాడు.
"ఫాస్టస్ యింకెక్కడా ఆగకుండా సరాసరి హైద్రాబాద్ వచ్చేస్తున్నాడు. రెండో తారీకు- అంటే యిప్పటికి సరిగ్గా పధ్నాలుగు రోజులు వుంది. మధ్యాహ్నం రెండింటికి ఫ్లెయిట్ లో దిగుతున్నాడు. అదే రోజు అతడి గౌరవార్థం ముఖ్యమంత్రి విద్యాభవన్ లో టీ పార్టీ ఇస్తున్నాడు. అక్కడే ఆ సాయంత్రం ఒక కల్చరల్ ప్రోగ్రాం వుంది. మరుసటి రోజు నుంచీ అతడు తన పనిలోకి దిగుతాడు".
"టీ పార్టీకి నాకు ఆహ్వానం కావాలి"
"తెప్పించగలను".
"కల్చరల్ ప్రోగ్రాముక్కూడా".
"చాలా సులభం".
"డాక్టర్ ఫాస్టస్ పక్కన కూర్చొని చూడాలి నేను".
సింహం యిబ్బందిగా చూసి "చాలా కష్టం" అన్నాడు. "ఫాస్టస్ కి ఇటువైపు ముఖ్యమంత్రి కూర్చుంటాడు. అదీగాక మొదటి రెండు వరసలూ డాక్టర్లకీ, ప్రొఫెసర్లకీ రిజర్వ్ చేయబడ్డాయి" అన్నాడు.
నిజానికి అతడు సింహానికి చెప్పింది ఫాస్టస్ ప్రోగ్రాం తీసుకురమ్మని. కానీ సింహం ఎంత డిటైల్డుగా ఆ సమాచారం సేకరించాడంటే, కల్చరల్ ప్రోగ్రాంలో ఎవరి పక్కన ఎవరు కూర్చుంటారో కూడా "ఆ ఒక్క గంట" లో సంపాదించి తీసుకువచ్చాడు. బహుశా సింహంలాంటి వాళ్ళందరూ వెనక ఉండబట్టే అతడు అంత గొప్పవాడయ్యాడేమో!
"మొదటి రోజే ఫాస్టస్ తో పరిచయం పెంచుకోవాలంటే డాక్టర్ గానీ, ప్రొఫెసర్ గానీ అయి వుండాలన్నమాట".
ఎవరూ మాట్లాడలేదు.
అతడు వాణీవైపు చూసి, "వాణీ! పదిరోజుల్లో నా పేరు ముందు డాక్టరు అని రావాలి. పేరు వెనుక పి.హెచ్.డి. కావాలి. ఆ ఏర్పాట్లు నువ్వు చూడు".
బాంబుపడ్డట్టు అదిరిపడ్డారు అక్కడి వాళ్ళు. కొంచెంసేపుపాటు అతడు చెప్పినది వాళ్ళకి అర్థం కాలేదు.
"ఏ యూనివర్శిటీ నుంచి యిప్పిస్తావో నీ యిష్టం. ఏ సబ్జెక్టులో యిప్పిస్తావో కూడా నీ యిష్టమే. నాకు మాత్రం డాక్టరేట్ కావాలి".
ఈ లోపులో వాణి తేరుకుంది. నమ్రతగా, "మీ క్వాలిఫికేషను ఏమిటి సార్" అని అడిగింది.
"ఇంగ్లీషులో సంతకం పెట్టగలను. బాగా మాట్లాడగలను. తెలుగు, కాస్త ఇంగ్లీషు వ్రాయగలను".
ఆమె లేచి వెళ్ళిపోయింది. తన మీద పెట్టబడింది చాలా పెద్ద బాధ్యత అని ఆమెకు తెలుసు. అందులోనూ పది రోజుల్లో అంటే, ఈ క్షణం నుంచీ దానికోసం పనిచెయ్యాలి. రాబోట్ తనలో తను అనుకుంటున్నట్టు "పది రోజుల్లో డాక్టరేటా - అందులోనూ ఒకటో క్లాసు పాసవని వాడికి" అన్నాడు.
ఆ మాటలకి విసురుగా అతడు రాబోట్ దగ్గిరకి వెళ్ళాడు. ఒక అనూహ్యమైన కసి అతడి మొహంలో కనపడుతూంది. "ఈ ప్రపంచంలో- ముఖ్యంగా భారతదేశంలో ఏదీ అసాధ్యం కాదు! మామూలు సబ్జెక్టు కాదు- పది రోజుల్లో లిమ్నాలజీలోనో, ఎకాలజీలోనో డాక్టరేట్ తీసుకుంటాను చూస్తూ వుండు".
ఎప్పుడూ సాధారణంగా కనబడని కసి అతడి మొహంలో కనపడేసరికి రాబోట్ చకితుడై అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు. అంతలో వెనుక నుంచి అతడి భుజం మీద చెయ్యి పడింది.
సింహం.
అతడిప్పుడు అసిస్టెంట్ లా లేడు. ఇరవై సంవత్సారాల క్రితం స్నేహతుడిలా వున్నాడు. "ఎందుకీ ప్రపంచం మీదా, మనుష్యుల బలహీనతల మీదా నీకింత కసీ, ఉక్రోషం, ఆడుకోవాలన్న తపనా?"
"నీకెందుకు ఆ అనుమానం వచ్చింది?"
"నిజంగా డాక్టర్ ఫాస్టస్ పక్కన ఓ అరగంట కూర్చోవటం కోసం నువ్వీ డాక్టరేట్ సంపాదించటం లేదు. నీకున్న ఈగో తృప్తి పర్చుకోవటానికీ, అవతలివారి మూర్ఖత్వాన్ని నిరూపించటానికి కసితో ఇది చేస్తున్నావ్. అవునా?"
అతడి మొహంలో మునుపటి రిలాక్సేషన్ వచ్చింది. "కొంతవరకూ నువ్వు చెప్పింది నిజమే అయినా, పూర్తిగాకాదు. డాక్టర్ ఫాస్టస్ తో పది రోజులు సన్నిహితంగా వుండాలంటే ఆ మాత్రం డిగ్రీ వుంటే బావుంటుందనుకున్నానంతే. ఒకవేళ ఇందులో నా మానసిక సంతృప్తి ఉన్నా అందులో తప్పులేదు. ఈ ప్రపంచం నాకు చేసిన అన్యాయానికి నేను పూర్తి సాడిస్ట్ గా మారలేదు. అంతవరకూ సంతోషం" అంటూ అతడు కిటికీ దగ్గిర నిలబడి బయటకు చూడసాగాడు. తొమ్మిదిన్నర కావొస్తూంది. దూరంగా రోడ్డుమీద జనం ఆఫీసులకి చీమలబారులా కదిలి హడావుడిగా వెళుతున్నారు.
