అంబిక రకరకాలుగా ఆలోచిస్తుంది.
ఆమెకు ఉపాయాలు చిక్కటంలేదు.
ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు.
మనసంతా అదోలా వుంది.
హాస్పిటల్ కి వెళ్ళి ఆ రోజు తొందరగా వచ్చేసింది.
మంచంమీద అలా పడుకుని ఆలోచిస్తుంది.
జయరామ్ వచ్చి మంచంమీద పక్కన పడుకున్నాడు.
అతని పెదవులమీద చిరునవ్వు కదలసాగింది.
ముఖంలో గర్వరేఖ తొంగి చూడసాగింది.
అంబిక భర్త ముఖంలోకి పరీక్షగా చూసింది.
"ఏమిటలా ఉన్నా?" అడిగింది కుతూహలంగా.
అతను నవ్వాడు.
"ఏమిటీ మహా సంతోషంగా ఉన్నారు!"
"సంతోషమే."
"ఏమిటి ఆ సంతోషానికి కారణం."
"ఏముంది! ఇందూ ఆ కృష్ణమౌళి పొగరు అణచి వచ్చింది. కట్టిన తాళిని విసిరికొట్టింది. నాకు తలుచుకుంటే చాలా గర్వంగా ఉంది."
"నా చెల్లెలు మంచిపని చేసిందనిపిస్తుంది" అన్నాడు నవ్వుతూనే.
అంబిక ఆ మాట వింటూనే వెంటనే మాట్లాడలేకపోయింది.
భర్తంటే ఆ క్షణంలో కోపం ముంచుకొచ్చేసింది.
తను ఏమంటున్నదో, ఏం మాట్లాడుతున్నదో ఎవరితోనో అన్న విషయం ఆమెకు అప్పుడు గుర్తుకురాలేదు.
"మీ చెల్లెలు విసిరికొట్టింది తాళిబొట్టుకాదు, పచ్చని జీవితాన్ని విసిరికొట్టింది" అంది ఆవేశంగా.
"అంటే" అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి.
"లేకపోతే ఏమిటి? కట్టిన తాళిని ఏ స్త్రీ అయినా విసిరికొడుతుందా" అంది.
"వాడు మంచివాడయితేకదా!"
"అందుకని తాళిని విసిరికొడుతుందా?"
"కాకపోతే ఆ తాళిని పూజించమంటావా? ఆ కృష్ణమౌళి సంగతి నీకు తెలుసుగా ఎలాంటి దుర్మార్గుడో."
"తెలుసు కాని భార్య భర్తని మార్చవచ్చుగా" సూటిగా అంది.
"అతను మారతాడని నమ్మకమేమిటి?"
"ఎందుకు మారడు."
"మారడు. అలాంటివాళ్ళు ఎప్పటికీ మారరు. ఆ రాక్ష,స వివాహానికి ఎవ్వరమూ అంగీకరించము. త్వరలో దాని పెళ్ళి జరిపించేస్తాము" అన్నాడు.
"మారడని అంటున్నారా! మీరు మారలేదా, నేను మార్చలేదా!" సూటిగా ప్రశ్నించింది.
ఆ ప్రశ్న వింటూనే దెబ్బతిన్నట్టు చూశాడు.
గతాన్ని తవ్వి దెప్పిపొడుస్తుందా!
"అంటే నేనంత మూర్ఖుడినా?"
"అని నేను అనలేదు."
"మరి!"
"భర్త ఎలాంటివాడయినా భార్యకు మార్చగల శక్తి ఉంటుందని అంటున్నాను"
"అంటే నీ ఉద్దేశం అలాటివాడితో నా చెల్లెలు కాపురం చెయ్యాలనా" కోపం ఆపుకుంటూ ప్రశ్నించాడు.
"భర్తతో కాపురం చేస్తే తప్పా!"
"వాడు నా చెల్లెలికి భర్తా? వాడి అంతస్తు ఏమిటి నా చెల్లెలి అంతస్తు ఏమిటి! అలాంటి బికారివాడు నా చెల్లెలికి భర్తా! అందుకు చచ్చినా ఒప్పుకోము."
"మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది బ్రహ్మ వ్రాసిన రాత" తాపీగా చెప్పింది.
"బ్రహ్మ వ్రాసిన రాతా! మరొకతనితో ఇందూ పెళ్ళి జరిపించి ఆ విధాతే ముక్కున వేలేసుకునేటట్లు చేస్తాను."
అంబిక మాట్లాడలేదు.
ఈయనలో ఇంకా మూర్ఖత్వం పూర్తిగా పోలేదు అనుకుంది.
"ఆ కృష్ణమౌళికి ఈ యింటికి అల్లుడయ్యే అర్హతలేదు"
"అని మీరనుకుంటున్నారు. అతన్ని మించిన గొప్ప సంబంధం మీరు తేలేరు. అతను చాలా ఐశ్వర్యవంతుడు."
"అంబికా!" కోపంగా అరిచాడు.
ఆమె అలా చూసింది.
"నిన్న మొన్నటివరకు ఆ కృష్ణమౌళి అంటే మండిపడే నువ్వు ఇప్పుడు ఇంతగా అతని గురించి ఎందుకు చెబుతున్నావో నాకు అర్ధం కావటంలేదు" అన్నాడు.
అంబిక అప్పుడు తన తప్పు తెలుసుకుంది.
వాళ్ళతో తను వాదించకూడదు.
అలా ఐతే ఇంతవరకూ నడిపిన కథ ఎదురు తిరుగుతుంది. మళ్ళీ మొదటికి వస్తుందనుకొని తనకు తానే సర్దుకుంది.
భర్త జయరాం మీద చెయ్యివేసింది.
అతను చేతిని విసిరికొట్టాడు.
"నేను చెప్పింది మీరు అర్ధం చేసుకోవడం లేదండీ" అంది మెల్లిగా.
"ఏమిటి అర్ధం చేసుకునేది!"
"అబ్బా కాస్త కోపం తగ్గించండీ" అంది చిన్నగా నవ్వుతూ.
అతను నవ్వలేదు. మనిషి శాంతపడలేదు. అతనిలో కోపం అలా రగులుతూనే ఉంది.
"ఏమండీ!"
