ఇంద్రసేన బెంగగా, దిగులుగా అదోలా ఉండటం గణేశ్ రావు గారు గమనించారు.
జయరామ్ కూడా గమనించాడు.
మునుపటిలా లేదు. ఇంటికి వచ్చినప్పుడున్న ధైర్యం ఆమెలో లేదు.
గణేష్ రావు, జయరామ్ ఇద్దరూ ఆమెను అడిగారు. ఎందుకలా ఉన్నావని.
"డాడీ! నేను చేసినపని తప్పా?" అంటూ ఏడ్చేసింది.
"ఎవరన్నారలా!" అడిగారాయన కూతుర్ని బుజ్జగిస్తూ.
మమ్మీ! అంటూ తల్లిచెప్పిన మాటలన్నీ చెప్పింది.
ఆయన కోపంతో మండిపడుతూ కూతురికి ధైర్యం చెప్పారు.
"మీ అమ్మదంతా చాదస్తం. ఆవిడమాటలు నువ్వు మనసులో పెట్టుకోకు. నీకు ఇష్టంలేనివాడు నీ మెడలో బలవంతంగా తాళికడితే వాడితో కలిసి కాపురం చెయ్యాలని ఉందా! నా కంఠంలో ప్రాణముండగా అందుకు నేను ఒప్పుకోను. నీకు మంచి సంబంధం చూశాను." వాళ్ళు రెండురోజుల్లో మన యింటికి వస్తారు. అబ్బాయి డాక్టరు, ఒక్కడే కొడుకు. అతను ఈ మధ్యే స్టేట్స్ నుండి వచ్చాడు. అబ్బాయికి పెళ్ళిచేసి కొడుకుని, కోడల్ని అక్కడికి పంపించేస్తారు.
"వాళ్ళు లక్షాధికార్లు."
మన కృష్ణలాంటివాళ్ళని వెయ్యిమందిని కొనగల తాహతు వాళ్ళకు ఉంది.
ఆ అబ్బాయి చాలా అందగాడు.
"ఆ సంబంధం తొందరలో సెటిల్ చేసేస్తాను. నీకలాంటి సంబంధం చూసి చేస్తానుగాని ఇలాంటివాడ్ని చేస్తానా! నీవు అలాంటి భయాలేమీ మనసులో పెట్టుకోవద్దు"
"నీవు చేసినపని చాలా మంచిది. నువ్వు నా కూతురివి అనిపించావు"
ఆ మాటతో ఇందుకి ధైర్యం వచ్చింది.
అంతవరకు కలిగిన దుఃఖం మనసులోనుండి మాయమయింది.
జయరామ్ అన్నాడు.
"ఇందూ! నీవలా బెంగపడి మనసు పాడుచేసుకోకు. అమ్మ మాటలు నీవు ఏమీ నమ్మకు"
"అంతా చాదస్తం"
"నీ పెళ్ళి ఒక నెలరోజులలోపే చేసేస్తాను. హాయిగా, ఆనందంగా ఉండేటట్లు చేసే బాధ్యత మాది."
"అన్నయ్యా" అంది సంతోషంగా.
"అవునమ్మా నీవు ఎప్పుడూ కంటతడి పెట్టకూడదు. ఆ కృష్ణకు పాఠం ఎలా చెప్పాలో నాకు తెలుసు."
ఇంద్రసేన మాట్లాడలేదు.
గణేష్ రావు గారు అన్నారు.
"నీవు పెళ్ళయిపోయిందని మర్చిపో అంతా పీడకల అనుకో."
"తాళి త్రెంచి అతని ముఖాన విసిరికొట్టావు. అప్పుడే కుక్కకాటుకి చెప్పుదెబ్బ అయింది.
నీవు ఆ తాళికి తలవంచే పిరికిపందవనుకున్నాడు. ఈ గణేశ్ రావు కూతురు ధైర్యవంతురాలని రుజువు చేసావు" ఆయన పొంగిపోతూ చెప్పసాగారు.
ఇంద్రసేనకి పూర్తి ధైర్యం వచ్చేసింది.
తండ్రి, అన్నయ్య చెప్పిన అతన్నే గనుక పెళ్ళి చేసుకుంటే కృష్ణమౌళి....
మనసులో కసిగా, కక్షగా అనుకుంది.
తను పెళ్ళిచేసుకుని భర్తతో అతని కళ్ళెదుటపడాలి.
అప్పుడు చూడాలి ఆయనగారి ముఖం అనుకుంది మనసులో కోపంగా.
ఆ విషయం చెప్పుకుంటూ తండ్రి, కొడుకు, కూతురు మనసారా, హాయిగా నవ్వుకుంటుంటే!
సుభద్రమ్మ అలా నిండిపోయింది నిశ్చేష్టురాలై.
తండ్రి పిల్లలు ముగ్గురు కూడా మూర్ఖులు.
మూర్ఖులకి ఒక్క మాట కూడా చెప్పలేరు ఎవ్వరూ. ఎంత తోస్తే అంత.
ఆ తరువాత ఏమయినా అయితే-
కూర్చుని కృంగిపోతారు.
అంతే ఎవరి రాతలు ఎలా ఉన్నాయో!
ఎవ్వరూ ఏం చెప్పలేరు.
ఇందూకి మరో పెళ్ళి చేస్తామంటున్నారు.
చేస్తే చేస్తారు.
ఎలా చేస్తారో కళ్ళతో చూస్తూ మౌనం వహించడమే ఉత్తమం అనుకుంది ఆవిడ.
వాళ్ళ ముగ్గురుకి నచ్చచెప్పే శక్తి ఆవిడలో నశించిపోయింది.
అందుకే ఏం మాట్లాడలేదు.
మవునంగా ఊరుకుంది.
68
ఆ రాత్రి అంబిక కృష్ణమౌళికి ఎలాగయినా ఫోను చెయ్యాలని చాలా ప్రయత్నించింది.
ఎవరో ఒకరు అక్కడ ఉండటంతో ఆ ప్రయత్నం మానుకుంది.
అంబికకు ఇంద్రసేనంటే ఒళ్ళు మండిపోతుంది.
ఇందూ చిత్రాతి చిత్రమైన అమ్మాయి.
లేకుంటే మెడలో పడిన తాళిని విసిరి కొడుతుందా! ఎంత పొగరు!
అంత పొగరుబోతు అమ్మాయిని కోరుకుని పెళ్ళి చేసుకున్నాడు.
వేరే అమ్మాయిని పెళ్ళిచేసుకున్నా అతని జీవితం బాగుపడేది.
ఇందూకోసం ఎంత కష్టపడ్డాడు.
ఎన్నెన్ని ఉపాయాలు ఆలోచించాడు.
అంబిక బాధపడింది.
ఇందూని ఎలా కృష్ణమౌళి వద్దకు చేర్పించాలా అని ఆలోచిస్తుంది!
లేకుంటే ఇందూ జీవితం నాశనమయిపోతుంది.
కృష్ణమౌళి మరో పెళ్ళి చేసుకుంటే పాపం ఇందూ...!
