ఇందుకి మతిపోతున్నట్లు అనిపించసాగింది.
రోజంతా ఆమె గది వదిలి బయటకు రాలేదు.
ఆమెను ఎవ్వరూ ఎక్కువ మాట్లాడించలేదు.
గణేశ్ రావు గారు, జయరామ్ ఎవరికి వారే మవునం వహించారు.
సుభద్రమ్మ మనసు మనసులో లేదు.
జరిగింది ఏమిటి?
ఇకముందు జరగబోయేది ఏమిటి?
ఇది మంచికా! చెడ్డకా! ఇలా జరిగింది.
అని ఆలోచించసాగింది.
అంబికకు అయితే పూర్తిగా మతిపోయినట్టయింది.
సుభద్రమ్మ, గణేశ్ రావు గారు గదిలో వుంటే వెళ్ళింది.
"ఏమండీ" మెల్లగా పిలిచింది.
"ఊ" ఆయన పరధ్యాసగా పలికారు.
"ఇందుని గురించి ఏమాలోచించారు?"
"ఇందుగురించా! ఏమిటి" భార్యవైపు తలతిప్పి చూశారు.
"జరిగిన విషయం గురించి"
"ఏం జరిగింది?"
"ఇంకా ఏం జరగాలి! ఒక్కగానొక్క కూతురు దాని పెళ్ళి మన చేతులమీద జరిపించాలని ఎన్నెన్నో అనుకున్నాం, ఆ పెళ్ళి జరిగిపోయింది మన ప్రమేయం లేకుండా" అంది మెల్లగా.
ఆయన భార్యవైపు కొద్ది కోపంగా చూశారు.
"ఇప్పుడు దాని పెళ్ళయిపోయిందనా!"
"జరగలేదా?"
"సుభద్రా" ఆయన శాంతంగా పిలిచాడు.
"మన ఇందు పెళ్ళి జరగలేదు. మన మనుకుంటున్నట్టు మన చేతులమీద దాని పెళ్ళి జరిపిద్దాం."
"ఏమిటండీ ఆ మాటలు మీకేమయినా మతిపోయిందా?"
"నీకు మతిపోయింది."
"నాకా!"
"కాకపోతే ఆ కృష్ణగాడు దాన్ని ఎత్తుకెళ్ళి రాక్షస వివాహం చేసుకుంటే అది పెళ్ళంటావా."
"మీరు కాదంటున్నారా?"
"కాదూ! కాదు! ఖచ్చితంగా చెబుతాను" అన్నారాయన.
"ఈ ప్రపంచంతో ఎదురునిలిచి మీరు పోట్లాడి ఈ పెళ్ళి జరగలేదు. అది పెళ్ళికాదని చెప్పినా అది పెళ్ళనే అంటారు" అంది ఆవిడ శాంతంగా.
"దానికి ఇష్టంలేకుండా బలవంతంగా తాళికడితే అది పెళ్ళయి పోయినట్టేనా?"
"కాదా!"
"నేనలా అనుకోను" ఆయన గట్టిగా చెప్పారు.
"అయితే ఏమిటంటారు?"
"ఇంతకీ నువ్వు ఏమిటంటావు?"
"జరిగిందంతా మర్చిపొండి. చనిపోయిన శ్యామలమ్మ మీ చెల్లెలు. ఆవిడ్ని బట్టయినా కాస్త ఆలోచించండి. చిన్నప్పుడు ఎలాగు అనుకున్నాం. తరువాత కాదనుకున్నా ఈ పెళ్ళి ఈ విధంగా జరిగింది" నచ్చ చెబుతున్న ధోరణిలో అంది.
"అయితే"
"మీరు వెళ్ళి ఆ అబ్బాయిని మన యింటికి పిలుచుకురండి" ఆయన ఒక్కసారి తృళ్ళపడినట్టయ్యారు.
ఏమన్నావు?
"ఆ అబ్బాయిని మనింటికి తీసుకురండి పంతాలు పట్టింపులు మర్చిపొండి. ఆడపిల్లని కన్నవాళ్ళం మనం, ఈరోజు కాదనుకుంటే జీవితమంతా దాన్ని చూసి మనం, మనల్ని చూసి అది ఏడవాలి"
"అంత ఖర్మ దానికీ పట్టలేదు, మనకీ పట్టలేదు" కోపంగా అన్నారు.
ఆవిడలా చూస్తుండిపోయింది.
ఆయనకు ఇంకెలా నచ్చచెప్పాలో అర్ధం కావటంలేదు ఆవిడకు.
"ఇందూకి వాడికి జరిగిన పెళ్ళి పెళ్ళే కాదు. వాడ్ని నా కంఠంలో ప్రాణముండగా ఈ యింటికి అల్లుడిగా అంగీకరించను."
"ఏమండీ మీరు తొందరపడకండి"
"నేను ఆలోచించే చెబుతున్నాను"
"కృష్ణ పరాయివాడు కాదండీ, భగవంతుడే వాళ్ళిద్దరికి వ్రాసిపెట్టి ముడి పెట్టినప్పుడు, మనం ఆ బంధాన్ని తెంచేయటం ఏమిటండీ."
"నాకు ఎవరిమాటా లక్ష్యంలేదు. బ్రహ్మరాసిన రాతయినా నేను తిరగరాస్తాను. నేను పంతం పట్టానంటే అంతే. నా కూతురికి పెళ్ళి జరిపిస్తాను."
"ఏమండీ దాని జీవితాన్ని చేతులారా నాశనం చేస్తున్నారు."
"దాని జీవితం నాశనం చేస్తున్నానా! అలా చూడు. రాజాలాంటి సంబంధం వెతికి తీసుకొచ్చి పెళ్ళిచేస్తాను" అన్నారాయన శపధం చేస్తున్నట్టుగా.
సుభద్రమ్మ ఏం మాట్లాడలేదు.
ఎంతగా నచ్చచెప్పాలని చూసినా ఆయన భార్య మాట కొట్టి పారేస్తున్నారు.
చేతులారా చేసుకున్నదానికి ఎవ్వరేం చెయ్యలేరు.
ఆయన అలాంటివారే.
పిల్లలు ఇద్దరూ అలాంటివాళ్ళే.
మొండివాళ్ళు, మాటవినే రకాలుకాదు. వాళ్ళని ఎవ్వరూ మార్చలేరేమో.
ఆవిడ బరువుగా నిట్టూర్చింది.
* * *
