అంటే నేను చేసింది తప్పా!
ఇష్టంలేని అతన్ని భర్తగా భావించాలా.
ఆలోచనలతో సతమతమవసాగింది.
"తాళి త్రెంచి విసిరికొట్టి వచ్చినంత మాత్రాన నీవు అవివాహిత అనరు. నువ్వు వివాహితవే అతను నీ భర్తే."
"నీవు తప్పుచేశావు."
"అది నీ తప్పు కాదు. నిన్ను కన్న నీ తండ్రిది. నిన్ను, ఇలా పెంచారు ఆయన."
"నీవు చేసిన ఈ పొరపాటు ఇప్పుడు నీకు తెలీదు. తరువాత, తరువాత తెలుస్తుంది."
నీవు జీవితంలో ఏం పోగొట్టుకున్నావో.
"పోగొట్టుకున్నా దాన్ని, తిరిగి పొందటం అంత సులభం కాదు."
"అతను మగవాడు. మగవాడు ఎన్ని పెళ్ళిళ్ళు అయినా చేసుకోవచ్చు. అతనికి ఆ హక్కు ఇచ్చింది సంఘం. స్త్రీలిలా చేసుకోలేరు. ఒకవేళ చేసుకున్నా లోకం విరగబడి నవ్వుతుంది. హేళన చేస్తుంది. సంఘం ఆమెను వెలివేస్తుంది."
"నువ్వు మరో వివాహం చేసుకున్నా మొండిగా అది రెండవ పెళ్ళే అవుతుంది."
"మమ్మీ" అంది సహించలేనట్టుగా.
"తెలుసా!"
"మా అమ్మ మా నాన్నను రెండవ పెళ్ళి చేసుకుంది. మొదటి భర్తను వదిలేసింది. మేము రెండవ భర్తకు పుట్టిన పిల్లలం అని అంటారు. పిల్లలు దృష్టిలో కూడా నువ్వు చులకన అయిపోతావు."
"మమ్మీ ఇక ఆపు నా దగ్గర నువ్వేం చెప్పవద్దు, నేను వినలేను" అంది రెండు చెవులూ గట్టిగా మూసుకుంటూ.
ఆవిడ నవ్వింది.
ఆ నవ్వులో ఎన్నో అర్ధాలు గోచరించాయి.
"వినడానికే నువ్వు భయపడుతున్నావే! నిజంగానే నువ్వు ఈ సమస్యలను ఎదుర్కోవలసి వస్తే భరించగలవా! ఆ నమ్మకం ఆ ధైర్యం నీలో ఉన్నాయా!" అడిగింది ఆవిడ సూటిగా.
ఇందు తలవంచేసింది.
"ఆలోచించుకో. నువ్వు చిన్నదానివి కాదు. నీ విషయం నీవు ఆలోచించుకోగలిగే వయసు ఉంది. తొందరగా ఒక నిర్ణయానికి రా. తల్లిని కాబట్టి నీ మంచికోరి ఇది అంతా చెప్తున్నాను. తరువాత నీ ఇష్టం" అంది ఆవిడ ఆ గదిలోంచి వెళ్ళిపోతూ.
తల్లి వెళ్ళినవైపే చూస్తూ అలా మంచంమీద కుప్పకూలిపోయింది.
తల్లి మాటల్లో నిజం ఎంతవరకు ఉంది!
` తను చేసింది తప్పా!
తను అవునన్నా కాదన్నా తను అవివాహితా?
ఇష్టం లేకుండా బలవంతంగా తాళి కట్టాడు కృష్ణమౌళి.
పంతాలు పట్టింపులూ వదిలేసి అయిష్టాన్ని, ఇష్టంగా మార్చుకోవాలా!
అతనితో జీవితం సాగించాలా!
అలా అయితే!
అతని దగ్గర ఓడిపోయినట్లు కాదా!
అది అవమానం కాదా!
తల్లి మాటలే చెవుల్లో మారుమ్రోగసాగాయి.
తల్లి ఇలా చెప్తుంది.
తండ్రి, అన్నయ్య అలా చెప్తారు!
ఇంతకు ఎవరిమాట నిజం.
ఎవరిమాట వినాలి!
ఆమె మస్తిష్కంలో రకరకాల ఆలోచనలు తలయెత్తసాగాయి.
తల్లిమాట వినేటట్లయితే,
తను అతని దగ్గరికే వెళ్ళిపోవాలి.
తండ్రిమాట వినేటట్లయితే,
తను మరొకర్ని వివాహం చేసుకోవాలి.
ఎలా చేస్తే మంచిది?
ఆమె మనసులో ఎంత నచ్చచెప్పు కోవాలనుకున్నా కృష్ణమౌళి భార్యగా ఉండడానికి మనసు
అంగీకరించటంలేదు.
తల్లి మాటలు మాటమాటకు గుర్తుకు వస్తున్నాయి.
ఏదో తెలియని బాధ మనసుని నులిమేయసాగింది తల్లిమాట నిజమే!
ఆమెకు దుఃఖం ముంచుకు వచ్చింది.
తన నిజజీవితం ఇలా అయింది ఏమిటి!
ఎంతో వైభవంగా జరగవలసిన పెళ్ళి ఈ విధంగా జరిగి జీవితానికే ఓ మచ్చ ఏర్పడింది.
ఇందుకి కన్నీళ్ళు ఆగలేదు.
కృష్ణమౌళి ఎందుకు అంత పంతం పట్టాడు!
మరే విధంగానైనా కక్ష తీర్చుకుని ఉంటే బాగుండేది. ఈ విధంగా తనమీద కక్ష తీర్చుకుంటాడా.
తను ఏం అపకారం చేసింది?
చిన్నప్పుడు మాట యిచ్చి ఒప్పుకున్నంత మాత్రాన ఈ పెళ్ళి జరిగిపోవాలని ఉందా!
దానికి తన ఇష్టాఇష్టాలతో పనిలేదా!
ఏమనుకుంటున్నాడు!
తను ఓ మరబొమ్మనుకున్నాడా!
భగవంతుడా ఇప్పుడు ఏమిటి చెయ్యటం?
తండ్రి చెప్పిన మాటల్లో నిజం ఉందా.
తల్లి మాటల్లో నిజం ఉందా?
