Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 74


    "నీ పెళ్ళి నెలరోజులలో జరిపించి తీరతాను. అప్పుడు వాడికి బుద్ధి చెప్తాను" అంటూ.


    అంతవరకు అంబిక అలా వింటున్నదల్లా మతిపోయినదానిలా చూస్తుండిపోయింది, ఆడపడుచు సాహసం విని.


    సుభద్రమ్మ అంతవరకు కృష్ణమౌళినే నిందించుకోసాగింది.


    ఇప్పుడు కూతురు చేసిన పని పెళ్ళి అయిన వెంటనే మంగళసూత్రాలు తీసి పడేసింది భర్తను కాదని వచ్చేసింది.


    కూతురిమీద కోపం ముంచుకు రాసాగింది.


    "ఇందూ! వాడికి చెప్పుతీసి కొట్టినట్లు బాగా చేశావు" అన్నాడు జయరామ్.


    గణేశ్ రావు గారు గర్వంగా పకపకా నవ్వసాగారు కూతురు చేసిన గొప్ప పనికి.


    తండ్రి, కొడుకు, కూతురు నవ్వుకుంటుంటే అత్తాకోడలూ వారివేపు విచిత్రంగా చూస్తుండిపోయారు.

 

                                                                   67


    ఇంద్రసేన లోపలికెళ్ళింది.


    సుభద్రమ్మ ఆమె వెనకాల వెళ్లింది.


    "ఇందూ!" మెల్లగా పిలిచింది.


    "ఏమిటి మమ్మీ!"


    "నువ్వు చెప్పింది అంతా నిజమా!" అడిగింది ఆవిడ.


    "నిజమే మమ్మీ ఎందుకు అలా అడుగుతున్నావు" తల్లివేపు చూస్తూ అడిగింది.


    కూతురివైపు బాధగా చూసింది.


    "కృష్ణ చేసిన పని నాకు నచ్చలేదు. అతనికి నిన్ను ఇచ్చి పెళ్ళి చెయ్యాలని చిన్నప్పుడే శ్యామలమ్మ మేము అందరం మాట ఇచ్చి పుచ్చుకున్నాం. తరువాత మేము అనుకున్నవి అన్నీ తారుమారు అయిపోయాయి. శ్యామలమ్మ రాతే మారిపోయింది. దానితో మీ నాన్నగారిలో మార్పు వచ్చింది రెండు కుటుంబాలు వేరు అయిపోయాయి. కృష్ణ మాట ప్రకారం నిన్ను చేసుకొనడానికి ఇష్టపడటం నిన్నే భార్యగా కావాలని కోరుకోవటం నిజంగా మెచ్చుకొనదగిన విషయం."


    "అయితే కృష్ణ నిన్ను ఎత్తుకెళ్ళి పెళ్ళి చేసుకోవటం నాకు నచ్చలేదు. అందుకు నేను అంగీకరించలేను కూడా."


    ఇంద్రసేన అలా చూడసాగింది ఒక్కోమాట శ్రద్ధగా ఆలోచిస్తూ.


    "నిన్ను నవమోసాలు మోసి కని పెంచిన తల్లిగా ఒకే ఒక్క మాట చెబుతున్నాను. నువ్వు చేసిన పని చాలా తప్పు!"


    "ఏ తెలుగు ఆడపడుచు ఇలా చెయ్య సాహసించదు"


    "మంగళసూత్రాన్ని గౌరవిస్తుంది, పూజిస్తుంది"


    "తాళి కట్టిన వాడిని భర్తగా భావించి గౌరవిస్తుంది."


    "నువ్వు, నువ్వు ఏం చేశావు!"


    "మమ్మీ!" అంది విస్తుపోతూ.


    "అవును నువ్వు చేసింది చాలా తప్పు."


    ఇంద్రసేన మాట్లాడలేదు.


    "కట్టిన తాళిని ఆ తాళి కట్టిన భర్తను అవమానించి వచ్చావు అది నువ్వు నిన్ను కన్నందుకు మేము సిగ్గుపడవలసిన విషయం."


    "తాళి కట్టిన నీ భర్త కురూపి అని కాదని వచ్చావా! చదువు సంస్కారం లేదని వచ్చేశావా! పరువు మర్యాదలేదని, ఆస్తి అంతస్తులేదని వచ్చేశావా? ఎందుకు కాదని వచ్చేశావు?"


    "మమ్మీ!" ఆమె ఆలోచనల్లో పడింది.


    ఆమెకు ఆ క్షణంలో ఏదో తప్పు చేసినట్టుగా బాధగా అనిపించింది.


    ఎటూ చెప్పలేకపోయింది.


    ఏమీ అనలేకపోయింది.


    "కృష్ణమౌళి అందము, ఆస్తి, అంతస్తు నలుగురిలో పలుకుబడి ఉన్నవాడు. అతను కోరుకుంటే కోటిమంది అమ్మాయిలు ముందుకివస్తారు"


    "తల్లి పుట్టింటి బంధాన్ని అతను త్రెంచుకోలేక నిన్నే భార్యగా కోరుకున్నాడు. అందుకు మేము ముఖ్యంగా మీ నాన్న అంగీకరించరని నిన్ను ఎత్తుకుపోయి పెళ్ళి చేసుకున్నాడు. అది ఒక్కటే అతను చేసిన పొరపాటు."


    "ఇప్పుడు ఆలోచిస్తుంటే అతను చేసింది మంచిది అనిపిస్తుంది. అతను వచ్చి అడిగితే మీనాన్న ఒప్పుకుంటారా! ఒప్పుకోరు అందుకే ఆలోచించి ఈ విధంగా చేసాడు. నీ పెళ్ళి అతనితో జరిగిపోయింది.


    నువ్వు కాదన్నా నేను కాదన్నా ఎవరు కాదన్నా అతను నీ భర్త. నువ్వు అతని భార్యవు."


    "మమ్మీ" సహించలేనట్టుగా అంది.


    "అవునమ్మా ఇందూ" కూతురి దగ్గరగా వెళ్ళి తల నిమురుతూ చెప్పింది.


    "కట్టిన తాళిని విసిరికొట్టటం ఎంత తప్పో తెలుసా!"


    "స్త్రీ పూజించేది మంగళసూత్రాన్ని, స్త్రీ మొదట పూజించేది భర్తను"


    భార్యకంటే భర్త పెద్దవాడు.


    భార్య చిన్నది తనకంటే చిన్నది అయిన భార్యను ఆశ్రయం ఇచ్చి రక్షణ కల్పిస్తాడు భర్త.


    ప్రతి స్త్రీకి పురుషుడి అండ వుండాలి.


    రోజులు మారుతున్నాయి. స్త్రీ పురుషులు సరిసమానం అని అనుకున్న భర్త దగ్గర ఆమె పసిపాపతో సమానం.


    భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే ప్రశ్నలేదు.


    ఇద్దరూ సరిసమానం.


    పురుషుడి అవసరం స్త్రీకి.


    స్త్రీ అవసరం పురుషుడికి ఉంది.


    అందుకే స్త్రీ పురుషుల ఇద్దరికి సంసార బంధాన్ని సృష్టించాడు ఆ భగవంతుడు.


    అందుకే స్త్రీకి మెడలో మంగళ సూత్రం పడగానే ఆమె జీవితంలోనే కాక మనసులో కూడా మార్పు వస్తుంది.


    ఆమె మనసు అంతా భర్తకే అంకితం చేస్తుంది. అంటూ సుభద్రమ్మ చెప్పి కూతురివైపు చూసింది.


    ఇందూ బొమ్మలా అలా నిలబడిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS