తన జీవితంలోకి ప్రవేశించిన అమ్మాయి పేదపిల్ల కావచ్చు. ఆమెకు అందం లేకపోయినా ఫర్వాలేదు.
అంతే అలాగే చెయ్యాలి.
గణేశ్ రావు గారికి, జయరామ్ కీ, ఇంద్రసేనకు బుద్ధి వచ్చేటట్టు చెయ్యాలి.
ఆ ఆలోచన రాగానే గర్వంగా తలయెత్తాడు. లోపలికి వెళ్ళిపోయాడు.
* * *
ఇంద్రసేన కారు దిగింది.
కారు తిరిగి వెళ్ళిపోయింది.
ఆమెకు దుఃఖం ఉబికుబికి రాసాగింది.
తను ఎక్కడికని ప్రయాణమయింది! దారిలో ఏం జరిగింది!
తను వెళ్ళింది ఎక్కడికి!
కృష్ణమౌళి మోసగాడు, వంచకుడు, తనని బలవంతంగా పెళ్ళి చేసుకుంటాడా!
ఆమెకు అంతకుముందు అతని ఎదుటవున్న ధైర్యం, కోపం, గర్వం అన్నీ కరిగిపోయి కన్నీటి రూపంలో మారిపోయాయి.
తెల్లవారి ఆరుగంటలకు యింట్లో అడుగుపెట్టింది.
గణేష్ రావు కూతుర్ని అప్పుడే "ఇందూ! వచ్చేశావా! అమ్మా ఇన్ని రోజులుండిపోయా వేమిటి? ఒక ఉత్తరంగాని, ఫోన్ గాని చెయ్యలేదేమిటి!" అని అడిగారు సంతోషంగా ఎదురుచూస్తూ కూతుర్ని చూసి ఎన్న సంవత్సరాలు అయిపోయినట్టుగా భావిస్తూ.
"డాడీ" అంది తండ్రిని ఒక్క ఉరుకులో చుట్టేసి బావురుమంటూ ఏడ్చేసింది.
"అమ్మా ఇందూ! అందూ! ఏమిటమ్మా? ఏమయింది! చెప్పు తల్లీ చెప్పమ్మా" అంటూ కంగారుపడుతూ బుజ్జగించినట్టుగానే అడగసాగారు.
ఏమిటి అంటూ సుభద్రమ్మ వచ్చింది.
కూతుర్ని చూస్తూనే "ఇందూ" అంది. ఆవిడ కూతురు ఎందుకు ఏడుస్తుందో అర్ధంకాలేదు.
కూతురు వచ్చేసిందని ఒకవైపు సంతోషం. ఇలా వచ్చిందేమిటి! మనిషి ఇలా అయిపోయింది అన్న కంగారు, గాబరా ఆవిడ్ని చుట్టేశాయి.
"మమ్మీ" అంది తిరిగి తల్లిని పట్టుకు ఏడ్చేస్తూ.
"ఏమిటమ్మా మా తల్లివి కదూ చెప్పు అమ్మా. ఏం జరిగింది!" అడిగింది ఆవిడకూడా బుజ్జగిస్తూ.
ఈ కంగారు మాటలు అవీ చెవిన పడీపడక ఏం అర్ధంకాక ఏమిటి అంటూ అంబిక, జయరామ్ మేడదిగి వచ్చారు హాలులోకి.
"అన్నయ్యా!" అంది ఏడుస్తూనే.
ఇంద్రసేన విషయం చెప్పకుండా ఒకటే వెక్కివెక్కి ఏడ్వసాగింది. అంబిక అలా నిలబడిపోయింది.
కృష్ణమౌళి తనకి రహస్యంగా ఫోన్ చేసి చెప్పాడు. ఇందూని పెళ్ళి చేసుకున్నాను అని. ఇద్దరం కలిసివస్తాం ఆశీస్సులు తీసుకొనడానికి అని చెప్పాడు. ఇందూ బాగానే ఉంది, మారిపోయింది అని చెప్పారు. ఇందు ఒక్కర్తే ఎందుకు వచ్చింది? కృష్ణమౌళి కూడా ఎందుకు రాలేదు! ఇద్దరూ పెళ్ళయ్యాక ఏమయినా దెబ్బలాడుకున్నారా?
అంబిక అయోమయంగా చూస్తూ ఆడపడుచు మెడవేపు చూసింది. మెడలో పసుపుతాడు లేదు. మెడ బోసిగా ఉంది. ఆమెకు ఏం అర్ధంకాలేదు.
"చెప్పు తల్లీ చెప్పు అమ్మా"
"మా బంగారు తల్లీ ఏం జరిగింది అమ్మా? అక్కడ నిన్ను ఎవరేమన్నారమ్మా?" అని అందరూ అడగ్గా అప్పుడు దుఃఖం ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ.
"నేను ఊరు వెళుతుంటే మధ్యలో...." అంటూ జరిగింది అంతా తండ్రికి, తల్లికి అన్నకు వివరంగా చెప్పసాగింది.
"ఏమిటి!" గణేశ్ రావుగారు మండిపడిపోయారు.
"వాడు నిన్ను బలవంతంగా ఎత్తుకెళ్ళి పెళ్ళి చేసుకుంటాడా! వాడికి ఎంత ధైర్యం? ఈ జయరామ్ సంగతి వాడు మర్చిపోయాడా!" జయరామ్ కోపంతో ఊగిపోయాడు.
అన్నయ్యా నాకు చాలా అవమానం జరిగింది, నేను భరించలేక పోతున్నాను.
"చెప్తాను వాడి పని" అంటూ పళ్ళు పటపట లాడించాడు.
సుభద్రమ్మకు మతిపోయింది. అలా నిలబడిపోయింది. వీళ్ళు ఊహించినంత దుర్మార్గుడు కాడు కృష్ణమౌళి. కాని ఆవిడకు అతనిపై కోపం వచ్చింది.
ఇందూని పెళ్ళి చేసుకోవాలని ఉంటే ధైర్యంగా యింటికి వచ్చి అడగాలిగాని ఇదేం పని! ఇది సినిమా అనుకున్నాడా!
ఆవిడకు కూతురు అలా ఏడుస్తుంటే కడుపు తరుక్కుపోయింది.
పిల్లను అంత కష్టపెడతాడా!
ఆ అబ్బాయి అంటే కాస్తో కూస్తో అభిమానం తనకి ఉండేది. ఈ సంఘటనతో ఆ అభిమానం పోయిందనిపించసాగింది ఆవిడకు.
ఇంద్రసేన వాళ్ళకి ఇంకా సగం కథే చెప్పింది. పెళ్ళి జరగటంవరకే.
ఆ తరువాత ఏం జరిగిందీ ఇంకా చెప్పలేదు.
కోడలికి ప్రత్యేకించి చెప్పారు ఆయన. ఏం అంటుంది.
అంబిక ఆమె మనసుకి ఆమె సమాధాన పరుచుకోలేక పోయింది.
"ఆ అదే వింటున్నా ఎంత పని చేశాడు" అంది తడబడుతూ. ఆ తడబాటుని పైకి కనిపించనీయకుండా జాగ్రత్తపడసాగింది.
జయరాం కోపంతో ఊగిపోసాగాడు.
"వాడిని ప్రాణాలతో ఉంచను. కత్తి తీసికెళ్ళి వాడిని నరికి పారేస్తాను అంటూ మండిపడసాగాడు."
"అన్నయ్యా! ఆవేశపడకు. నేను అతనికి తగినట్లే చేసి వచ్చాను, అలాగే బుద్ధిచెప్పి వచ్చాను" అంటూ జరిగింది పూర్తిగా చెప్పింది, అందరికీ గర్వంగా.
ఆ మాట వినగానే జయరామ్, గణేశ్ రావు గారు అలా క్షణంసేపు ఉండిపోయారు.
"నా కూతురు నా మాట నిలబెట్టింది" అన్నారు పొంగిపోతూ గణేశ్ రావు గారు.
జయరామ్ మెచ్చుకున్నాడు చెల్లెల్ని.
