Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 72


    "మగవాడు ఎన్ని పెళ్ళిళ్ళు అయినా చేసుకోవచ్చు. ఆ పెళ్ళి నేను చేసుకున్న రోజున నువ్వు ఏమిటో నీకు అప్పుడు అర్ధమవుతుంది. అప్పుడు నువ్వు ఈ తాళిబొట్టుకోసం పరిగెత్తుకు వచ్చినా ఈ తాళిబొట్టు నీకు దక్కదు. ఈ తాళిబొట్టు మరో ఉత్తమురాలి కంఠాన్ని అలంకరిస్తుంది. గుర్తుంచుకో" అన్నాడు.


    ఇంద్రసేన కోపంగా చూసింది!


    "పెళ్ళి కాకపోతే చావనయినా ఛస్తాను గాని మీకోసం పరిగెత్తుకు రావటం వట్టిమాట. పాపం అలా కలలుకంటూ కూర్చోండి అంది."


    "నేను మగవాడ్ని నా జీవితం హాయిగా గడిచిపోతుంది. నీ గురించే ఆలోచించుకో!"


    "నా గురించా! అంటే?"


    "అంటే నీ పెళ్ళవుతుందా! ఆ నమ్మకం నీకు ఉందా అని."


    "అంటే నాకు పెళ్ళవుతుందన్న నమ్మకం మీకు లేదు!"


    "లేదు" తాపీగా చెప్పాడు.


    "అయితే వినండి నా పెండ్లి శుభలేఖ మీకు తొందరలోనే పంపిస్తాను. మీరు వచ్చి మా దంపతులని ఆశీర్వదించి వెళ్ళండి"


    "ఆశీర్వదించడానికి నాకేం అభ్యంతరం లేదు. నీవు పెళ్ళి పీటలమీద కూర్చోవాలేగాని..." అంటూ నవ్వాడు.


    ఇంద్రసేనకు ఒళ్ళు మండిపోయింది.


    "ఏమిటా వెటకారం మాటలు! నా పెళ్ళి జరగదనా మీ భావన" అడిగింది.


    "జరగదని కాదు. నీ పెళ్ళి అందరమ్మాయిలాంటి పెళ్ళి కాదు. ఒక పెళ్ళయిందని ఒక భర్తను వదిలేసి మరో పెళ్ళికోసం మరో భర్తకోసం వేటాడటం చూస్తుంటే ఎవరికయినా అనుమానం రాక తప్పదు. ఆ వచ్చే అతను విశాల హృదయుడయి ఉండాలి" అన్నాడు,


    "మీతో మాటలు నాకు అనవసరం. నా పెళ్ళి నా అంతస్తుకి తగిన వ్యక్తితో తొందరలో జరిగి తీరుతుంది, వస్తాను" అంది వెనుతిరిగి వెళ్ళబోతూ.


    "సరే మంచిది. నీ రెండవ వివాహం జరిగితే నేనే ఎక్కువ సంతోషిస్తాను."


    "నాది రెండవ వివాహం ఎప్పటికీ కాదు. నాది మొదటి వివాహమే. ఈ పెళ్ళి పెళ్ళేకాదు" అంది కోపంగా.


    "సరి సరి వెళ్ళు, గెలుపు ఎవరిదో ఇంకా అప్పుడే ఏం తేలలేదుగా, ఇక తేలుతుంది నెమ్మదిగా" ఆమె మాట్లాడలేదు.


    అతనివైపు కోపంగా చూసింది.


    "నేను వెళుతున్నాను."


    "వెళ్ళు, నీకు అడ్డుచెప్పను కాని ఈ రాత్రివేళ వెళ్ళటం అంత మంచిదికాదు" అన్నాడు.


    "ఎందుకని! మీకంటే కిరాతకులు మరెవరూ ఉండరు. వాళ్ళు ఎంత దుర్మార్గులయినా మీకంటే మంచివాళ్ళే అయివుంటారని నా నమ్మకం."


    "సరే, నీ ఇష్టం. ఒక్క అయిదు నిముషాలు ఆగు" అంటూ బయటకు వెళ్ళిపోయాడు.


    ఇంద్రసేనకు అతను ఎందుకలా వెళ్ళిపోయాడో అర్ధంకాలేదు. అతను వెళ్ళి అయిదు నిముషాల్లో తిరిగివచ్చి,


    "కారు సిద్ధం చేయించాను, బయలుదేరు" అన్నాడు.


    అతను ఆ మాటలు చాలా మామూలుగా చెప్పాడు.


    "కారా!" ఆశ్చర్యంగా చూసింది.


    "నువ్వు నన్ను ఎంత అసహ్యించుకున్నా నిన్ను ఈ రాత్రివేళ ఒంటరిగా పంపించడం నాకు ఇష్టంలేదు"


    ఆమె అతనివైపు చూసింది. అతని ముఖంలో ఎలాంటి భావము కనిపించలేదు.


    మాట్లాడకుండా కారెక్కి కూర్చుంది.


    డ్రయివర్ ఉన్నాడు. అతడితోపాటు మరొకతను ఉన్నాడు! అతనితో "జాగ్రత్త, యింటిదగ్గర దించేసి కారు వెనక్కి తీసుకు వచ్చేయండి" అంటూ టైము చూసుకున్నాడు. "సరే తెల్లవారేసరికి వెళ్ళిపోతారు" అంటూ చెప్పాడు.


    వాళ్ళు అలాగే అంటూ తలూపారు.


    ఇంద్రసేనకు తలతిప్పి అతనివైపు చూడాలనిపించింది.


    కాని తలతిప్పి చూడలేదు. నిర్లక్ష్యంగా ఎటోచూస్తూ కూర్చుంది.


    కారు బయలుదేరి వెళ్ళిపోయింది.


    కారు వెళ్ళిపోయినా అలాగే చూస్తూ నిలబడ్డాడు. వెళ్ళిపోయేముందు మాట వరసకయినా చెప్పి వెళుతుందేమో అనుకున్నాడు. అసలు తలతిప్పే చూడలేదు.


    ఇంద్రసేనకి చాలా గర్వమని తెలుసు. మరీ ఇంత గర్వమని అనుకోలేదు. తన నీడకూడా ఆమెమీద పడటం సహించలేకపోతుంది. ప్రతీ మాటలు అంతస్తులు గుర్తుకొస్తుంది.


    స్త్రీకి అంతస్తుకాదు ముఖ్యం. భర్త అనురాగం, ఆ అనురాగం దూరమయిపోతే అప్పుడుగాని తెలియదు జీవితంలో తను ఏం పోగొట్టుకున్నది సరే వెళ్ళనీ వెళ్ళి ఎన్నాళ్ళు అలా రోజులు గడుపుతుంది! తను ఆమె గురించి మర్చిపోయినా మర్చిపోవచ్చు.


    అతనికి వెంటనే శంకర్ చెల్లెలు లీల గుర్తుకువచ్చింది. లీలను తనకిచ్చి పెళ్ళి చేయాలని శంకర్ పట్టుదల. హైదరాబాద్ వెళ్లినప్పుడల్లా ఆ విషయమే మెల్లగా కదిపేవాడు. తను తప్పించుకోడానికి చూసేవాడు.


    ఇప్పుడు దయానంద్ రావు గారు తన కూతురు ఉదయిని ఇచ్చి పెళ్ళి చేయడానికి చూస్తున్నారు.


    ఉదయిని చాలా అందంగా ఉంటుంది.


    ఆ అమ్మాయికి కూడా తనంటే ఇష్టమే అని తెలిసింది.


    ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే! మనసులో కోపం, కసి తలెత్తాయి. మగవాడు తలుచుకుంటే ఏమయినా చెయ్యగలడు.


    ఇంద్రసేన ఏదో అనుకుంటుంది. ఆమె స్థానం ఉదయినికి ఇచ్చేస్తే! అవును అలాగే చెయ్యాలి. వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోవాలి, వైజాగ్ మకాం ఎత్తేయ్యాలి. ఒక పనికోసం తను ఈ మజిలీ వేశాడు.


    వచ్చిన పని అయిపోయింది.


    తను హైద్రాబాద్ వెళ్ళిపోయి దయానంద్ రావు గారితో మాట్లాడాలి.


    ఉదయినితో మాట్లాడి తనంటే ఇష్టమో కాదో ముఖాముఖీ తేల్చేసుకోవాలి.


    ఈ పెళ్ళికి తొందరగా ముహూర్తం పెట్టించేయాలి. ఇంద్రసేనకు ఇచ్చిన స్థానం ఆమె ఎప్పుడయితే కాలదన్నకు వెళ్ళిపోయిందో ఆ స్థానం మరిక జన్మలో దక్కకుండా చెయ్యాలి, అంతే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS