Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 71

   
    అతను మాట్లాడలేదు.


    "ముందుగా గ్రహించుకున్నందుకు చాలా సంతోషం."


    అతను అలాగే చూడసాగాడు.


    "ఈ ఇంద్రసేన మీరు కట్టిన తాళికి తలవంచి మీతో కాపురం చెయ్యడానికి సిద్ధంగా లేదు" అంటూ మంగళసూత్రాలు చేత్తో పట్టుకుంది.


    "మగవాడ్ని అన్న అహంకారంతో బలవంతంగా తాళికట్టి ఆ తాళి పేరుతో ఉరిత్రాడు బిగించి బ్రతుకంతా బానిసగా చేసి మీలాంటి మగవాళ్ళ ఆట కట్టించి మగవాడి ఆధిక్యత కాలరాచి పారేసే స్త్రీలలో మొదటిదాన్ని నేనే అని రుజువుచేస్తాను."


    "ఈ తాళిని అగౌరపరుస్తాను."


    "మిమ్మల్ని నలుగురిలో నవ్వులపాలు చేస్తాను."


    "మీ జీవితం అంతా చీకటిమయం చేస్తాను."


    "మీకు బ్రతుకు అంటే భయం కలిగేలా చేస్తాను" అంది కోపంగా.


    "అతనికి ఆ క్షణంలో ఇంద్రసేనపై ప్రేమ ఒక్కసారిగా తెగిపోయినట్టు అయింది."


    ఆమె అంటే అసహ్యం కలిగింది.


    "నువ్వు నాకు పాఠాలు చెప్తావా!" అన్నాడు.


    "నాకు బ్రతుకు అంటే భయం కలిగేలా చేస్తావా!" అడిగాడు.


    "తప్పకుండా చేస్తాను. ఈ జరిగిన పెళ్ళికి ఇప్పుడు ఎంత సంతోషిస్తున్నారో అంతకు రెట్టింపు బాధపడి ఏడ్చుకునే పరిస్థితికి తెస్తాను" అంటూ మెడలో మంగళసూత్రాన్ని తీసి అతని పాదాలదగ్గరకు విసిరికొట్టింది. కృష్ణమౌళి ఆమెవేపు తన పాదాలదగ్గర పడిన సూత్రాలవేపు మార్చిమార్చి చూడసాగాడు.


    ఇది ఏ స్త్రీ చెయ్యలేని పని.


    ఇంద్రసేన చేసింది.


    అతనివేపు హేళనగా చూసింది.


    "ఈ మంగళసూత్రాలతో నన్ను బంధించేశాననుకున్నారు కదూ పాపం ఓడిపోయారు."


    "గెలిచింది నేను. మీరు కాదు."


    "ఈ తాళిబొట్టుతో నేను మీకు బానిసను అయిపోతానని అనుకున్నారు కదూ? ముల్లుని ముల్లుతోనే తియ్యాలి. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్న విషయం నాకు బాగా తెలుసు"


    అతను మాట్లాడలేకపోయాడు.


    "కట్నాల పేరుతో ఉరికంబానికి ఎక్కి బలయిపోతున్న స్త్రీ పేదలు చాలామంది ఉన్నారు. ఈ తాళిబొట్టు తీసుకెళ్ళి ఏ పేదపిల్ల మెడలో వేసినా మిమ్మల్ని జీవితాంతం పూజిస్తుంది, గౌరవిస్తుంది! అంతేగాని నాలాంటి గొప్పింటి అమ్మాయిలు ఇలాంటి తాళిబొట్టుకోసం ఎగబడరు. అర్ధం అయిందా నేను అంటే ఏమిటో! నేను గణేశ్ రావుగారి అమ్మాయని గుర్తుంచుకోండి. జీవితంలో ఎప్పుడూ కూడా నావేపు తలెత్తి చూడకండి. చూడటానికి ప్రయత్నించకండి" అంటూ అతనివేపు గర్వంగా చూస్తూ అంది.


    "నేను మూడునెలలు తిరిగేసరికి చక్కని అందమైన అతన్ని పెళ్ళి చేసుకుని తీరతాను. అతనితో సుఖంగా, సంతోషంగా రోజులు గడుపుతాను. జీవితాంతం కుమిలిపోతూ మగ్గిపోయేది మీరే అని తెలుసుకోండి వస్తాను" అంటూ వెనుతిరిగింది.


    అతను "ఆగు" అన్నాడు.


    ఇంద్రసేన ఆగిపోయింది. వెనుతిరిగి చూడలేదు.


    ఏం చేస్తాడా అన్నట్టు చూసింది.


                                   66-A


    అతను వొంగి కాళ్ళ దగ్గరపడిన మంగళసూత్రాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు.


    అంబిక మాటలు గుర్తుకు వచ్చాయి.


    ఆమె మాటలు నిజమే అనుకున్నాడు.


    ఇంద్రసేన మవునంగా ఉండిపోవటం చూచి ఇప్పుడు అర్ధం అవుతుంది. ఆమె గురించి ఆమెలో అహంభావం పోలేదు.


    మనిషిలో పొగరు కళ్ళకి పొరలు కమ్మేస్తాయి. తను ఏం చేస్తుందో ఏం మాట్లాడుతుందో కూడా గ్రహింపు కాదు. ప్రతి మగవాడు ఓ స్త్రీ మెడలో ఎప్పుడో ఒకప్పుడు తాళి కట్టి తీరవలసిందే.


    అయితే ప్రతి పురుషుడు గ్రహించవలసిన విషయం ఒకటి ఉందనిపిస్తుంది. తను స్త్రీ మెడలో తాళికట్టి ఆమె తన అర్ధాంగిని చేసుకుని ఆమెకు ఒక గౌరవమయిన స్థానం కల్పిస్తాడు. ఆ గౌరవమయిన స్థానం ఆమెకు కల్పించేముందు ఆ గౌరవాన్ని అందుకునే అర్హత ఆమెకు ఉందా లేదా అని ఆలోచించాలి. అలా ఆలోచించక తను చేసిన ఈ పనికి ఇప్పుడు విచారించవలసివస్తుంది.


    తాళి కట్టిన స్త్రీ ఎక్కడికి వెళ్ళలేదు అనుకున్నాడు. నిజమే కాని ఇంద్రసేన తన ఊహనే తారుమారు చేసింది. ఆమె గెలిచానని గర్వంగా చెప్పుకుంటుంది.


    తను ఆమె ముందు ఓడిపోయి తల వంచటమా! అతని మనసు కుతకుతలాడిపోయింది.


    ఒక్క అడుగువేసి ఆమెను సమీపించాడు.


    ఆమె భుజంపై చెయ్యివేశాడు.


    ఇంద్రసేన ఆ చేతిని విసిరికొట్టబోయింది. అతను ఆమె భుజంపై గట్టిగా గుచ్చి పట్టుకున్నాడు.


    కోపంగా చూసింది, అతను నవ్వాడు.


    "నేను మగవాడ్ని. నేను తలుచుకున్నాను అంటే ఈ క్షణంలో నీ జీవితాన్ని నాశనంచేసి నిన్ను నలుగురిలో నవ్వులపాలు చేసి నీ జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చెయ్యగలను. ఇది నా యిల్లు నువ్వు అరిచి గీ పెట్టినా నిన్ను రక్షించేవాళ్ళు ఉండరు. నా కోరికలకి నీ అందాన్ని బలిపెట్టినా అడిగేవాళ్ళు ఉండరు"


    ఇంద్రసేన మనసులో భయపడింది.


    గుండెలు దడదడలాడాయి.


    "కాని నేను అంత దుర్మార్గుడిని కాను. నాలో ప్రవహించేది రక్తం. ఉత్తములైన తల్లిదండ్రుల కడుపున పుట్టాను. నేను అంటే ఇష్టంలేని స్త్రీని నా కోరికలకి బలి తీసుకునేంత నీచుడిని కాను" అంటూ ఆమె వేపు చూశాడు.


    ఇంద్రసేన తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది.


    "నువ్వు గెలిచానని గర్వంగా చెపుతున్నావే! అప్పుడే గెలుపు ఎక్కడ! నువ్వు పెళ్ళి చేసుకుని భర్తతో సుఖంగా, సంతోషంగా కాపురం చెయ్యాలి అప్పుడు గెలిచినట్టు. అంతేగాని ఇప్పుడు గెలుపు ఎవరిదీ కాదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS