క్షణంసేపు అతని నోటమాట రాలేదు. వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు.
అ స్త్రీ అయినా తన మెడలో మంగళసూత్రం కట్టినవాడే తన భర్త అని గౌరవించి పూజిస్తుంది మరి ఈ ఇంద్రసేన!
తాళికట్టిన భర్తనే హేళనగా మాట్లాడుతుంది. ఏ భార్య భర్తతో అయినా ఇలా మాట్లాడుతుందా?
"నీ అందం చూసి నిన్ను పెళ్ళి చేసుకోలేదు. నీ అంతస్తు, నీ డబ్బు చూసి పెళ్ళి చేసుకోలేదు."
"మరి!"
"చిన్ననాడు మన పెద్దలు ఇచ్చిపుచ్చుకున్న మాటకు కట్టుబడి ఈ పెళ్ళి చేసుకున్నానే గాని నీ అందంచూసి నీకంటే అందగత్తెలు ఈ ప్రపంచంలో లేరనిగాని ఈ పెళ్ళి చేసుకోలేదు. అందం విషయంలో చెప్పాలంటే నీ అందం ఒక అందమే కాదు. నీకంటే అందగత్తెలు చాలామంది ఉన్నారు. నువ్వు ఒక అందగత్తెవని మిడిసిపోతుంటే అది నీ తెలివితక్కువతనం. ఇక డబ్బంటావా! నా ఆస్తి విషయంలోగాని నా పేరు విషయంలోగాని మీరు నాకేవిధంగా సరితూగలేరు. నా అంతస్తుకి మీరు ఎగబ్రాకాలి అనుకుంటే మీరు ఎన్నో సంవత్సరాలు తపస్సు చెయ్యాలేమో!" అంటూ ఆగి మళ్ళీ చెప్పసాగాడు.
"నేను నిన్ను పంతంపట్టి చేసుకున్నది నువ్వు నా అంతస్తుకి సరితూగే అమ్మాయివికాదు. నేను మా మామయ్య కూతురిని పెళ్ళి చేసుకున్నానంటే అందరూ ఓహో అంటారేమోకాని గణేశ్ రావు గారి అమ్మాయిని పెళ్ళి చేసుకున్నానంటే అందరూ నవ్వుకుంటారేమో కూడా."
"ఎందుకు అంటావా?"
"నా అంతస్తుకి మీరు ఏ విధంగాను సరిపోరని ఇంతకంటే నీకు గొప్ప సంబంధం దొరకలేదా! ఇంతకంటే అందమైన అమ్మాయే నీకు కనిపించలేదా అని తప్పకుండా అడుగుతారేమో కూడా, ఇప్పుడు అర్ధమైందా" అంటూ ఆమెవైపు హేళనగా చూశాడు.
అతని మాటలు వింటూనే ఇంద్రసేన కోపంతో మండిపోయింది.
"నన్ను అవమానించి రెచ్చగొడుతున్నారా!"
"నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోతావని బెదిరిస్తే బెదిరిపోతావనే నేను ఉన్నమాట అన్నాను. అది అవమాన మనుకుంటే అది నీ తప్పుగాని నా తప్పుమాత్రం కాదు" చెప్పాడు తాపీగా.
"కృష్ణమౌళిగారూ" కోపంగా కేకపెట్టింది.
ఏమిటన్నట్టు తాపీగా చూశాడు.
"పెద్దలు మాట ఇచ్చిపుచ్చుకున్నారన్న వంకతో నన్ను పెళ్ళాడి నా ఆస్తిని కాజేయాలని ప్లాను వేశారు. నేను మిమ్మల్ని ఇష్టపడకపోవటంతో రెచ్చిపోతున్నారు" అంది ఆవేశంగా.
"నోర్ముయ్" అన్నాడు కోపంగా.
"మీకు భయపడి నోరుమూసుకు పడి వుండవలసిన ఖర్మ నాకేం పట్టలేదు. మీరు నామీద అధికారం చెలాయించడానికి నేను మీకు భార్యను కాను, బానిసను కాను, ఆ విషయం గుర్తుంచుకోండి" అంటూ క్షణము ఆగి,
"ఆనాడు మన పెద్దవాళ్ళు మాట ఇచ్చి పుచ్చుకున్నారు అంటే అప్పుడు మన అంతస్తులు సరిసమానం కావచ్చు" అంటూ అతనివైపు అదోలా చూస్తూ.
"కాని ఇప్పుడు!" అంటూ హేళనగా చిన్న నవ్వు నవ్వింది.
"ఆనాడు నాకు మేనత్త అనబడే మీ అమ్మ తమరితోపాటు మా పంచకు వచ్చింది. మా యింటిలో వంటమనిషిగా చేరింది. ఈనాడు మా అంతస్తుకి ఎగబ్రాకడానికి మేనరికం పేరుతో సంబంధాల వంకతో ఇన్ని నాటకాలు ఆడారు. ఇంతమోసం చేశారు. ఆనాటికి ఈనాటికి మన స్థితిగతులు మారిపోయాయి. మా అంతస్తు పెరిగిపోయింది. మీ అంతస్తు కూలిపోయింది" అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది.
అంతే.
ఆమె చెంప అదిరిపోయింది.
ఆపుకోలేని ఆవేశంతో ఆమె చెంప ఛెళ్ళుమనిపించాడు కృష్ణమౌళి.
మటలు ఆపేసి కందిపోయిన చెంపని తుడుముకుంటూ అలా నిలబడిపోయింది.
ఇంద్రసేనకి కళ్ళనీళ్ళు గిర్రున తిరిగాయి.
రోషంగా చూసింది అతనివైపు.
అతని కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి.
అతనిలో ఆవేశం చల్లారలేదు.
"మళ్ళీ ఆ మాట ఎత్తితే నాలిక చీల్చేస్తాను జాగ్రత్త. ఏం అన్నావు! మా అమ్మ నాతోపాటు మీ పంచన చేరిందా! ఎందుకు! ఎందుకు అని అడగవేం!" అతని కంఠం కంగ్ మంది
"ఆవిడ భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంతో కన్నబిడ్డను తీసుకుని పుట్టింటికి వచ్చింది ఎందుకు? ఎందుకో తెలుసా!" అతను ఖండించినట్టుగా ప్రశ్నించాడు.
ఆమె జవాబు ఇవ్వలేదు.
"తోడబుట్టిన అన్న ఆదరిస్తాడు. చెల్లెల్ని కన్నబిడ్డలా కడుపులో దాచుకుంటాడు అని పుట్టెడు ఆశతో బిడ్డను తీసుకువచ్చింది. ఆ బిడ్డ కోసమే ఆవిడ జీవించింది. భర్తపోయిన దుఃఖాన్ని గుండెల్లో అగ్నిలా దాచుకుంది. ఆ అగ్ని గుండెల్లో ప్రతిక్షణం కాల్చేస్తున్నా భరించి బ్రతకడానికి సిద్ధపడింది ఎందుకు? తన బిడ్డను అయిన నాకోసం అప్పుడు మీరు ఏం చేశారు? పనిమనిషిగా వంటమనిషిగా భావించి, చాకిరీ చేయించుకున్నారు! జీతం బత్తెం లేకుండా ఇంత అన్నం పెట్టారు తల్లీ కొడుకులకు అంతే! ఏం చేశారు మీరు మా అమ్మ దేవత నిజంగా దేవత. ఒక మాటకూడా బయటకు రాకుండా కన్నీళ్ళు మింగుకుని రోజులు గడిపింది. నా కళ్ళు తుడిచి గుండెల్లో దాచుకుంది" అంటూ బాధను గుండెల్లో దాచుకోవడానికి అన్నట్టు క్షణంసేపు కళ్ళు మూసుకుని మళ్ళీ చెప్పసాగాడు. "ఆనాడు నాకు చదువు చెప్పించడమే దండగ అనుకున్నాడు. పసివాడ్ని అని మీనాన్న ఎప్పుడూ నాపై జాలి తలచలేదు. అయినా మా అమ్మ పిచ్చిగా మేనకోడలే కోడలు కావాలని ఆశపడింది. నేను అప్పుడు ఏదో తెలిసో తెలియకో మీ నాన్నతో నీ కూతుర్ని ఎత్తుకెళ్ళి పెళ్ళి చేసుకొంటాను అంటే ఆనాడు మీ నాన్న అన్న మాటలు నా చెవులో ఇంకా మారు మ్రోగుతూనే ఉన్నాయి! అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆ మాట మర్చిపోను" అంటూ అదోలా నవ్వాడు.
అది నవ్వుకాదు. విరక్తితో కూడిన భావంలా ఉంది.
"చిన్ననాటి మాట నిలబెట్టటం కోసం పెద్దల మాటకోసం పంతంపట్టి పెళ్ళి చేసుకున్నాను. అంతే! అంతేగాని నీతో సుఖపడతాను అనిగాని నీతో జీవితాన్ని పంచుకుంటాను అన్న నమ్మకంతోగానీ నేను ఈ పెళ్ళి చేసుకోలేదు" అన్నాడు కోపంగా.
"ఓహో" అంది వెటకారంగా.
అతను తీక్షణంగా చూశాడు.
"అయితే ముందుగానే గ్రహించుకున్నారు అన్నమాట!" అంది.
