చివ్వున తలయెత్తి చూసింది.
అతని ముఖంలో నవ్వు అలాగే ఉంది.
ఆమె ముఖంలో కోపం తొంగిచూసింది.
అతను ఆ సమయంలో అంతగా పట్టించుకోలేదు.
"ఇందూ!" మృదువుగా పిలిచాడు.
ఆమె గుండెలు దడదడలాడసాగాయి.
"మనం దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన తొలి సోపానం ఈ మొదటిరాత్రి. మన ఇద్దరం ఎప్పుడూ అన్యోన్యంగా, ఆనందంగా గడిపేయాలి. జీవితం అంతే ఏమంటావే!" నవ్వుతూ ఆమె చుబుకంపట్టి పైకెత్తి ఆ కళ్ళల్లోకి చూశాడు.
ఇందు వెంటనే అతని చేతిని తీసేసింది.
అతను అది సిగ్గుగా భావించాడు.
ఏ ఆడపిల్ల అయినా ఈరోజు సిగ్గుపడటం సహజం. "సిగ్గా!" అడిగాడు.
ఆమె జవాబు ఇవ్వలేదు.
"ఈరోజు మనకి తొలిరాత్రి అయినా మనం నిజం అయిన తొలిరాత్రి పెద్దల దీవెనలు అందుకున్నాకే. వాళ్ళకి తెలియకుండా మనం పెళ్ళి చేసుకున్నాం. వాళ్ళు నీకోసం చూస్తుంటారు" అన్నాడు.
ఆమె తలయెత్తి రోషంగా చూసింది.
"వాళ్ళు అక్కడ నీకోసం ఎదురుచూస్తుంటే మనం...." అంటూ మాట సగంలో ఆపేసి నవ్వాడు.
అతనినేపు సూటిగా రెప్పవాల్చకుండా చూసింది.
"ఏమిటి ఇందూ అలా చూస్తున్నావు కొత్తగా" అడిగాడు.
"మన పెళ్ళి జరిగినందుకు మీ ముఖంలో కనిపించే ఆనందాన్ని చూస్తున్నాను" అంది వస్తున్న కోపాన్ని దిగమింగుకుంటూ.
"నిజమే ఇందూ నాకు చాలా ఆనందంగా ఉంది" అన్నాడు మనస్ఫూర్తిగా సంతోషిస్తూ.
ఆమె జవాబుగా ఏం మాట్లాడలేదు.
"నీకు ఆనందంగా లేదా?" నవ్వుతూనే అడిగాడు.
"నాకా! ఆనందమా! ఎందుకు!" కావాలని ఆశ్చర్యం నటిస్తూ సూటిగా ప్రశ్నించింది.
అతను ఈసారి తెల్లబోయినట్టు చూశాడు.
"ఎందుకేమిటి ఇందూ మన పెళ్ళి జరిగినందుకు మనకి ఆనందమేగా?"
"మనకి అంటున్నారు ఏమిటి! ఈ పెళ్ళి జరిగినందుకు మీకు ఆనందంగా ఉండవచ్చు గాని నాకు మాత్రం లేదు" ఖచ్చితంగా చెప్పేసింది.
"ఇందూ!"
"ఏం అలా తెల్లబోయారు! మీరు చేసిన ఘనకార్యానికి మీకు గర్వకారణం ఆనందం కావచ్చు కాని నాకు మాత్రం అసహ్యం వేస్తుంది" అంది.
"అసహ్యమా!"
"అవును" ఠీవిగా చెప్పింది.
"దేనికి అసహ్యం? ఈ పెళ్ళి జరిగినందుకా? నన్ను చూస్తే అసహ్యమా?"
"మీరు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు."
"అంటే నీ ఉద్దేశం!" సూటిగా ప్రశ్నించాడు.
ఇందూని చూస్తుంటే మనిషి మారింది అంటే ఇష్టపడుతుందనుకున్నాడు. అది పొరపాటు. ఆమెకు తనంటేనే కోపం పోలేదు.
"నాకు ఇంకా పెళ్ళికాలేదనే అనుకుంటున్నాను" ఆమె శాంతంగా ఏమాత్రం తేడా లేకుండా చెప్పింది.
"ఇందూ!" అతని కంఠస్వరం ఖంగుమంది వస్తున్న కోపాన్ని బలవంతంగా ఆపుకోవడానికి ప్రయత్నించాడు.
"ఏం మీరు అరిస్తే నేను జడిసిపోతా ననుకుంటున్నారా! మీరనుకునేంత పిరికితనం నాలో లేదు"
"ఇందూ నన్ను రెచ్చగొట్టకు"
"నేను అదేమాట చెబుతున్నాను మీరూ నన్ను రెచ్చగొట్టవద్దు అని" శాంతంగానే చెప్పింది.
"అయితే ఈ పెళ్ళి పెళ్ళి కాదంటావు" అడిగాడు కోపం ఆపుకుంటూ.
"అంతే ముమ్మాటికీ అంతే అంటాను" కచ్చితంగా తన మాటకు తిరుగులేదన్నట్టుగా చెప్పింది దర్జాగా, ధీమాగా.
కృష్ణమౌళి ఆమె చెయ్యి పట్టుకున్నాడు.
"ఛీ" అంటూ అతని చేతిని విడిపించుకోవడానికి చూసింది. అతను వదిలిపెట్టలేదు.
ఆమె మెడలో మంగళసూత్రాల్ని బయటకు లాగి ఆమెవైపు హేళనగా చూస్తూ.
"ఈ మంగళసూత్రాలు చూసి జడిసిపోయి ఇష్టం లేకపోయినా ఆ సూత్రాల బరువుని జీవితాంతం మోస్తూ భూమిలోకి కృంగిపోవడానికి నేను ఆనాటి స్త్రీని కాను. ఈనాటి స్త్రీని."
"చదువు ఉంది, అందం ఉంది, డబ్బుంది. తెలివితేటలు ఉన్నాయి. ఈ మంగళసూత్రాలకి గౌరవం ఇచ్చి, నా గౌరవాన్ని, సంతోషాన్ని మంట కలుపుకోవడానికి నేను అంత తెలివితక్కువదాన్ని కాను."
"పెళ్ళి పేరుతో మూడుముళ్ళ బంధంలో నన్ను బంధించాలనుకోవటం అది మీ తెలివితక్కువతనం. నన్ను పెళ్ళి చేసుకుని మీరు పదిమందిలో నవ్వులపాలయ్యే క్షణం వచ్చింది."
"నాకు ఇష్టంలేని పెళ్ళీ ఇది పెళ్ళికాదు. ఇది రాక్షస వివాహం. ఈ వివాహానికి తలవంచి గౌరవించను" అంటూ మెడలో మంగళసూత్రాల వైపు చూసుకుంది.
కృష్ణమౌళి ఆమె మాట్లాడుతున్న మాటలువింటూ ఏమనాలో తోచక అలా నిలబడిపోయాడు ఆమె చెయ్యి వదిలి పెట్టేశాడు.
అతని కోపం మింగుకుంటూ శాంతంగానే నచ్చచెప్పడానికి చూశాడు.
"ఇందూ! నీ తెలివితక్కువతో ఈ పెళ్ళి కాదనుకున్నా ఇది పెళ్ళే."
"హు పెళ్ళి! ఎందుకు ఈ పెళ్ళి జరగాలని ఇంతగా పంతం పట్టారు! నన్ను నా అందం చూశా! లేక నా డబ్బు చూశా" అడిగింది హేళనగా.
దెబ్బతిన్నట్టు చూశాడు.
