Previous Page Next Page 
నన్ను ప్రేమించవు పేజి 6

    అతను తన ముందున్న పుస్తకంలోని పేజీలు తిప్పి చూసి రెండు నిముషాల తరువాత చెప్పాడు.
    "ఆ కండక్టర్ మధురవాటి ట్రిప్ కెళ్ళాడు. పది నిముషాలలో బస్సు ఇక్కడికొస్తుంది కూర్చోండి...."
    ఒకతను అడిగాడు రామకృష్ణని.
    "కొత్త రోడ్డు దగ్గర యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరక్కడే ఉన్నారా?"
    తలూపి బెంచీమీద కూర్చున్నాడు రామకృష్ణ.
    "యాక్సిడెంట్ లో మరణించిన వ్యక్తి హఠాత్తుగా వచ్చి బస్సు క్రింద పడ్డాడా? లేక నడిచి వెళుతున్న అతన్ని బస్సు గుద్దిందా?"
    "అతను తలవంచుకుని నడిచి వస్తున్నప్పుడు వెనుకనుండి వచ్చిన బస్సు అతన్ని గుద్దింది..." చెప్పాడు రామకృష్ణ.
    "ఆ బస్సు డ్రైవరు చెప్పిందేమిటి, రోడ్డు నిర్మానుష్యంగా ఉండటం చూసి బస్సు వేగంగా నడిపానని, అతను బస్సు క్రింద ఎలా పడ్డాడో అర్ధంకావటంలేదని అన్నాడు..."
    కొన్ని క్షణాల తరువాత అతను విచారంగా చెప్పాడు.
    "ఈ మధ్యనే అతని భార్య వళ్ళుకాలి మరణించింది. ఆ గొడవ నుండి బయటపడిన కొద్ది రోజులకే ఈ కేసులో చిక్కుకున్నాడు. నిజానికి వెంకటేశం వంటి డ్రైవర్ మా స్టాఫ్ మొత్తంలో లేడు."
    అరగంటసేపు అక్కడే కూర్చున్నాడు రామకృష్ణ. వివిధప్రదేశాల నుంచి బస్సులు వచ్చి పోతున్నాయి. కండక్టర్లు కంట్రోలర్ వద్దనున్న రిజిష్టర్ లో సంతకం పెట్టి కొద్దిసేపు అక్కడా గడిపి వెళ్ళిపోతున్నారు.
    "ఆయన చాలా సేపటినుంచి నీకోసం చూస్తున్నారు...." చెప్పాడు కంట్రోలర్, అప్పుడే వచ్చిన ఓ కండక్టరుతో. అతను రామకృష్ణని అడిగాడు.
    "నా గురించి వచ్చారా?"
    "అవును. నాలుగోతేదీ మధ్యాహ్నం గాజువాక వెళ్ళాలని మీ బస్సు ఎక్కుతూ కిటికీ ప్రక్కన కూర్చున్న వ్యక్తికి నా సర్టిఫికెట్లు ఇచ్చాను. అతను వాటిని మీకు ఇచ్చాడా?"
    "ఎవరూ ఇవ్వలేదండి...." చెప్పాడతను.
    ఒకసారి పోస్టాఫీసువద్ద ఒకతన్ని అడిగి పెన్ తీసుకున్నాడు రామకృష్ణ. రాసిన తరువాత చూస్తే పెన్ ఇచ్చిన వ్యక్తి లేడు. కౌంటర్ లోని వ్యక్తికి పెన్ ఇచ్చి ఎవరైనా అడిగితే ఇచ్చేయమని చెప్పాడు. అతను అనుకున్నట్టుగానే అ వ్యక్తి గంట తరువాత వచ్చి పెన్ తీసుకెళ్ళాడట. అదేవిధంగా కండక్టర్ కి తన సర్టిఫికెట్లు ఇవ్వొచ్చనని అక్కడకు వచ్చాడు.
    తనకి ఉపయోగపడని ఆ సర్టిఫికెట్లు అతను ఏంచేసి ఉంటాడో?
    ఆ ప్రశ్నకి జవాబు కావాలంటే కొన్ని రోజులు వెనక్కి వెళ్ళాలి.

                                                                              *    *    *    
    మెకానిక్ మొహంలోకి చిరాగ్గా చూసాడతను, ఆగిపోయిన మోటార్ సైకిల్ తీసుకుని ఆ షాపుకి వచ్చాడు. అది బాగు చెయ్యడానికి నాలుగైదు గంటలు పడుతుందని మెకానిక్ చెప్పటం వల్ల మొహంలో ఆ మార్పు వచ్చింది. ఎప్పుడూ చూసే మెకానిక్ అయితే వెంటనే చేసి  ఇచ్చేవాడు. ఆ షాప్ కి రావటం మొదటిసారి కావడం వల్ల అతను మాట్లాడలేక పోయాడు.
    సాయంకాలం వస్తానని చెప్పి అక్కడనుంచి పాత పోస్టాఫీస్ కి వచ్చాడు. ఓ సిటీబస్సు ఎక్కి కూర్చున్నాడు. నడవడమంటే అతనికి ఎంతో చిరాకు. ఎక్కడకు వెళ్ళాలన్నా మోటార్ సైకిల్ ఉపయోగిస్తాడు.
    అతనురూపాయి బిళ్ళ ఇచ్చి టిక్కెట్ తీసుకున్నాడు. బస్సులో ప్రయాణం చెయ్యడమంటే తలకొట్టేసినట్టు బాధపడతాడు. కాలేజీకి వచ్చిన వెంటనే తండ్రి మోటార్ సైకిల్ కొన్నాడు. అప్పటినుంచి అతను వేరే వాహనం ఎక్కలేదు. మోటార్ సైకిల్ రెండురోజులు మెకానిక్ దగ్గరుంటే కాలేజీ మానేసేవాడు.
    బస్సు బయలుదేరింది. రెండో స్టాప్ లో జనంతో నిండిపోయింది. లక్ష్మీటాకీస్ సెంటర్ చేరేసరికి జనం వ్రేలాడుతున్నారు. అక్కడా మరో స్సుకి సరిపడే జనం ఉన్నారు. ఒక వ్యక్తి తన చేతికి ఫైలు అందించటంతో అయిష్టంగానే తీసుకున్నాడు. తన స్టాప్ లో దిగుతున్నప్పుడు కూడా ఆ ఫైలు ఎవరూ అడగలేదు.
    అతను తిన్నగా ఇంటికి వెళ్ళి తన గదిలోకి వెళ్ళబోతూ ఆల్మారా లోకి ఆ ఫైలు విసిరాడు. అల్మారాలో చక్కగా పేర్చిన పుస్తకాలపైన పడింది అది.
    అన్నిటికంటే పైనున్న పుస్తకంమీద అందంగా రాసిన అక్షరాలు కనిపిస్తున్నాయి.
    ఆ అక్షరాలు కలిపితే వచ్చే పదం__ఎమ్. భాగ్యాలక్ష్మి.
                                                                                       4
    సాయంకాలం స్నేహితుని రూం కి చేరుకున్నాడు శివరావు. రూమ్ కి తాళం వేసివుంది. తన పోర్షన్ లో కూర్చున్న ఇంటి యజమానిని అడిగాడు.
    "ఇప్పుడే వెళ్ళాడు. పదినిముషాల్లో వాతాన్ని చెప్పమన్నాడు" అన్నాడాయన.
    శివరావు మాట్లాడకుండా రోడ్డుపైకి వచ్చాడు. అక్కడనుంచి లీలా మహల్ థియేటర్ కనిపిస్తోంది. సినిమాకి పెద్దగా జనం లేరు.
    ఆదివారం రాత్రి స్నేహితునితో కలిసి భీమిలి వెళ్ళాడు. అక్కడా రాత్రంతా హుషారుగా గడిచింది. తనకి తెలిసిన అమ్మాయిని తీసుకొచ్చాడు స్నేహితుడు. ఆమెకు ఇరవై ఉంటుంది వయసు. అటువంటి ఏర్పాట్లు చెయ్యడంలో అతను అందె వేసిన చెయ్యి, వాళ్ళ మధ్య స్నేహం వృద్ది చెందడానికి అదో కారణం. తన అవసరం స్నేహితుని ద్వారా తీరుతున్నది.
    స్నేహితుడు రూముకి తిరిగొచ్చాడు. అరగంట తరువాత ఇద్దరూ బయటకొచ్చి బార్ కి వెళ్ళారు. రాత్రి పది వరకూ బార్ లో గడిపారు. శివరావు స్వంతంగా ఎప్పుడూ బార్ కి వెళ్ళడు. అతనికి తాగే అలవాటు లేదు.
    ఆటో పిలిచి ఇద్దరూ ఎక్కారు. కస్టమ్స్ ఆఫీసు వద్ద దిగి ఆటోని పంపేశారు. కొంతదూరం నడిచి ఒక సందులోకి వెళ్ళారు. పదిగజాలు వెళ్ళిన తరువాత చప్పున శివరావు చెయ్యి పట్టుకొని ప్రక్కకు లాగాడు స్నేహితుడు. ఇద్దరూ రెండిళ్ళ మధ్యనున్న ఖాళీస్థలంలో నిలుచున్నారు. అక్కడ చీకటిగా ఉండటంవల్ల వాళ్ళు బయటికి కనిపించడంలేదు. కళ్ళు చిట్లించి ముందుకి చూశారు.
    వెలగని స్ట్రీట్ లైట్ క్రింద ఒక పోలీస్ వ్యాన్ ఆగివుంది. ఆ వ్యాన్ ప్రక్కనుంచి వెళ్ళి ఒకతను ఓ ఇంటి తలుపుతట్టాడు. కొన్ని క్షణాల తరువాత తలుపు తెరుచుకుంది. అతను లోపలకు వెళ్ళిన తర్వాత తిరిగి తలుపు మూసుకుంది.
    కొన్ని నిముషాల సమయం చీకటిలో భారంగా గడిచాయి. యూనిఫాం వేసుకున్న సబ్ యిన్ స్పెక్టర్ వ్యాన్ నుండి దిగి ఆ ఇంటిని సమీపించి తలుపుకొట్టాడు. మరోసారి తట్టిన తరువాత తలుపు నెమ్మదిగా తెరుచుకుంది.
    అంతవరకూ ఇంటికి రెండువైపులా చీకటిలో పొంచివున్న సిబ్బంది లోపలకు ప్రవేశించారు. గుమ్మంలో లైటు వెలిగింది. ఇద్దరూ ఆడవాళ్ళని. అంతకు ముందు లోపలకు వెళ్ళిన వ్యక్తిని బయటకు తీసుకొచ్చారు.
    "వ్యాన్ ఎక్కించండి..." చెప్పాడు యస్సై.
    ఒకామె చెప్పింది కంగారుగా,
    "వంటరిగా పడుకోవడానికి భయమేసి ఈమె దగ్గరకు వచ్చాను. నా ఇల్లు వీధి చివర ఉంది..."
    ఆమెకు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది వయసు.
    యస్సై పూనకం వచ్చిన వాడిలా నవ్వాడు.
    "వ్యభిచారి వద్దకు ఓ సంసారి పడుకోవటానికి వచ్చిందట. నేను నేరం చేశాను, నన్ను కోర్టుకి తీసుకెళ్ళి శిక్షించండి అన్న వ్యభిచారి నా సర్వీస్ లో నాకు తగల్లేదు." అన్నాడతను.
    "నిజంగానే పడుకోవడానికి వచ్చాను...." చెప్పిందామె దీనంగా.
    "నీకు పెళ్ళయిందా?" అడిగాడు.
    ఆమె సమాధానం చెప్పలేదు.
    "తల్లిదండ్రులున్నారా?"
    "ఉన్నారు."
    "వాళ్ళకి తెలియకుండా ఈ పని చేస్తున్నావన్నమాట, వాళ్ళు ఎక్కడున్నారు?
    "మా గ్రామంలో ఉన్నారు..."
    "ఉద్యోగం చేస్తున్నావా?"
    "లేదు."
    అతను నవ్వి ప్రశ్నించాడు.
    "ఇక్కడకు ఎందుకొచ్చావ్?" ఎంతకాలమయింది వచ్చి? తిండి ఎవరు పెడుతున్నారు? ఇంటి అద్దె ఎలా చెల్లిస్తున్నావ్?"
    ఆమె నిస్సహాయంగా చూచింది.
    "నాకు తెలుసు.  నువ్వు చాలా ప్రశ్నలకు జవాబులు చెప్పలేవని. నీలాంటి చాలా మంది ఇక్కడ బ్రతకాలని వస్తారు. కూలిచేసి బ్రతకలేరు. పెట్టుబడిలేకుండా, కష్టపడకుండా సంపాదించే ఈ మార్గం ఎన్నుకుంటారు. వెళ్ళి వ్యాన్ ఎక్కు...." చెప్పాడు ఎస్సై.
    ఆమెకు ఉప్పెనలా దుఃఖంతన్నుకొచ్చింది. ఏడుస్తూ వెళ్ళి వ్యాన్ ఎక్కింది. రెండో ఆవిడ ఇంటికి తాళంపెట్టి ఎటువంటి ఆందోళన లేకుండా తన స్వంత వాహనం ఎక్కినట్టు వ్యాన్ లో కూర్చుంది. వ్యాన్ అక్కడ నుంచి కదిలింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS