Previous Page Next Page 
రాక్షసుడు పేజి 6


    "కానీ నాకున్నది అదొక్క ఫ్యాక్టరీయేనే" అంటూ లోహియా నవ్వేడు.

 

    అతడికి అర్థమైంది.

 

    దారుణం. ఇది మహా దారుణం. కేవలం తన ఉత్పత్తి పెంచుకోవటానికి ఇంత పెద్ద నాటకం ఆడి పబ్బం గడుపుకోవటం... ఇది ఎక్కడ మునిగి ఎక్కడ తేలుతుంది? మనిషిని ఎక్కడికి తీసుకువెళుతుంది?

 

    "డాక్టర్ ఫాస్టస్ బలహీనతలు ఏమిటో మనకు తెలీదు. అతడు ఇక్కడ వున్న పదిరోజుల్లో ఎలా నువ్వు మానేజ్ చేస్తావో నీ యిష్టం. నాక్కావల్సిందల్లా అతడు తన స్వహస్తాల్తో ఈ రిపోర్టు మీద సంతకం పెట్టి యివ్వటం". అంటూ ఒక రిపోర్ట్ అందజేసాడు.

 

    "అలా పెట్టిస్తే?"

 

    "డాక్టర్ ఫాస్టస్ రిపోర్టుని మా పత్రికలన్నీ ప్రముఖంగా మొదటి పేజీలో ప్రచురిస్తాయి. బాగా పబ్లిసిటీ ఇస్తాయి. తరువాత ఏమవుతుందో తెలుసా?

 

    "తెలుసు" అన్నాడతను. "....ప్రజలకి ఆరోగ్యం సమకూర్చలేని ఈ ప్రభుత్వానికి తిరిగి ఓటు వేస్తారా? ప్రజల కోసం డబ్బు ఖర్చు పెట్టలేని ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావటం మీ కిష్టమేనా? వగైరా స్లోగన్స్ ఇస్తారు. 'మలేరియా వచ్చిన ప్రతివాడూ, జాండిస్ వచ్చిన ప్రతికుటుంబం ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి...' అని గోడల మీద వ్రాస్తారు. బ్రహ్మాస్త్రంకన్నా బాగా పనిచేస్తుంది. ముఖ్యమంత్రి డి-ఆలమ్ కొనాలన్న నిర్ణయం తీసుకుంటే మీకు వ్యక్తిగతంగా లాభం. వద్దన్న నిర్ణయం తీసుకుంటే మీ పార్టీకి లాభం. ఎలాగైనా మొత్తం మీద మీకే లాభం".

 

    "గుడ్. సరిగ్గా అర్థం చేసుకున్నావ్".

 

    "ఫాస్టస్ ఎప్పుడొస్తున్నాడు?"

 

    "పదిహేను రోజుల్లో".

 

    అతడు లేచాడు "నేను వెళ్లొస్తాను".

 

    "మరి ఈ పని?"

 

    "పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను".

 

    లోహియా మొహం విప్పారింది. జేబులోంచి కవరు తీసి ఇస్తూ "ఇదిగో నెగెటివ్ ల కవరు" అన్నాడు. "నీ చెల్లెలిది".

 

    "అప్పుడే ఎందుకు?"

 

    "నువ్వు ప్రయత్నిస్తే అది పూర్తికాకుండా వుండదు. నాకా నమ్మకం వుంది.

 

    "థాంక్స్. ఆ కవర్ నా కవసరం లేదు. పని పూర్తికాగానే మీరే చింపెయ్యండి. నాకూ ఆ నమ్మకం వుంది" అంటూ, లోహియా ఇచ్చినా ఫాల్స్ రిపోర్టు కాగితాలు పట్టుకుని అతడు బయటకు నడిచాడు.

 

    గడియారం నాలుగు కొట్టింది. చల్లటి గాలి రివ్వున వీస్తూంది. కారు స్టార్టు చేసేడు. జరిగినదంతా చెప్తే చెల్లి సంతోషిస్తుంది. తండ్రి సంతోషిస్తాడు.

 

                                         3

 

    ఆ గదిలో నలుగురు వున్నారు అందులో అతనొకడు- మిగతా ముగ్గురూ అతడి అసిస్టెంట్లు. అసిస్టెంట్లు అన్న పదం ఒక్కడ సరికాదేమో. వాళ్లు సలహాదార్లు, కొన్ని కొన్ని విషయాల్లో గైడ్స్, అన్నీ-

 

    కుడివైపు చివరి కుర్చీలో కూర్చుని లోహియా ఇచ్చిన కాగితాలు పరిశీలిస్తున్నది సింహం. నోట్లో పైపు తీయకుండా రిపోర్టు చదువుతున్నాడు. అతడొక గొప్ప సంభాషణా చతురుడు, డిప్లొమాట్. ఎటువంటి విపరీతమైన పరిస్థితివచ్చినా తొణకడు. అతడిలో ఒకే ఒక బలహీనత స్త్రీ. ఏదైనా ఒక పెద్ద అసైన్ మెంట్ పూర్తిచేయవలసి వచ్చినప్పుడు నూటికి తొంభై తొమ్మిది పాళ్ళు చేసి, ఒకపాలు స్త్రీ దగ్గిర ఫెయిల్ అవుతుంటాడు. ఆ ఒక్కపాలు మిగతా ఇద్దరూ సాయం పట్టాల్సిందే. అతడి రెండో అసిస్టెంటు వాణి.వాళ్ళందరికి ఆమె ఒక గొప్ప అసెట్. అత్యంత ఆధునిక మారణాయుధాల దగ్గిర నుంచీ, లేటెస్ట్ ఎకనమిక్ డెవలప్ మెంట్స్ వరకూ ఆమె దగ్గిర స్థిరంగా వుంటుంది. ఆమె ఒక పెద్ద ఎన్ సైక్లోపిడియా. ఒక పెద్ద లైబ్రరీ. ఎంతో అవసరమైతే తప్ప ఆమె బయటికి కదలదు. రాజకీయాలనుంచి మార్కెట్ వరకూ ఆ హాలులో కూర్చొని ఎప్పుడూ చదువుతూ వుంటుంది. కావల్సినప్పుడు కావల్సిన రీతిలో ఒక రెడీ రికనెర్ లాగా, విషయాన్ని 'అతడి'కి అందజేస్తూ వుంటుంది. సింహాన్ని చూస్తే ఆమెకి భయం. ఒంటరిగా దొరికితే సింహంలాగానే మీద పడతాడు. ఆ భయంలో కాసింత ఇష్టం కూడా వుందని అతడు నాలుగు సంవత్సరాల క్రితమే గ్రహించాడు. అప్పట్నుంచీ ఆమె ఒంటరిగా దొరకాలనే కోరుకుంటాడు.

 

    మూడోవాడు రాబోట్. అసలు పేరు అందరూ మర్చిపోయారు. కేవలం రాబోట్ గానే వ్యవహరిస్తారు. అతడికా పేరు సరిగ్గా సరిపోతుంది. సంవత్సరానికి తొమ్మిది నెలలు జైలులోవుంటాడు. బయటికొచ్చాక మళ్ళీ జైలుకి వెళ్ళేపని ఒకటి అతడికి చెప్తారు. చేస్తాడు. తిరిగి వెళ్తాడు. 'అత'డంటే రాబోట్ కి గౌరవం. ఏం చెప్పినా చేస్తాడు. ఇప్పటికి నాలుగు మర్డర్లు, అత్యవసర పరిస్థితిలో ఒక రేపు చేశాడు. నాలుగుసార్లు మృత్యుముఖంలోకి వెళ్ళి తప్పించుకున్నాడు. ఒకసారి ఉరిశిక్ష పడబోయి కొద్దిలో తప్పిపోయింది. అతడికి సెక్స్ అంటే ఉత్సాహంలేదు. మిగతా రౌడీల్లాగా తాగడు. సిగరెట్ కూడా తాగడు. అన్నిటికన్నా చిత్రం ఏమిటంటే అతడికి మెదడు అనే పదార్ధం వుందో లేదో అన్నది అనుమానమే. చెప్పినపని చేస్తాడు. లేకపోతే ఏ పనీ లేకుండా అలా చెక్కబల్ల దగ్గిర కూర్చొని వుంటాడంతే. అలా ఒక మునిలా వున్న అతడిని చూసి, అతడో జడుడు అని ఎవరయినా పొరపడితే ప్రమాదమే. మెరుపుకన్నా వేగంగా పిస్టల్ కాల్చగలడు. వెంట్రుకవాసి గురి తప్పకుండా కత్తి విసరగలడు. అతడి శరీరం మీద ఇరవయి ఆరు చోట్ల కత్తిపోట్లు వున్నాయి. ఒక ప్రమాదంలో కుడికన్ను పోయింది. రాబోట్ కి ఇంకా చాలా అవయవాల అవసరం లేదని వాణి అప్పుడప్పుడు ఏడిపిస్తుంది కూడా.

 

    ఆ ముగ్గురి సాయంతో 'అతడు' రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. అతడంటే అతడు కాదు. అతడి సాయం తీసుకొని మిగతావాళ్ళు.

 

    తన తండ్రి అయిన జి.కె. ఏం చెప్తే అతడు అది చేస్తాడు. అందువల్ల పనికావల్సిన వాళ్ళు జి.కె.ని పట్టుకుంటారు. అతడి కూతురు ఎవడితోనో ఉండగా ఫోటోలు తీసి,మాకీ పని కావాలంటారు. కొడుకుని కిడ్నాప్ చేసి పనులు చేయించుకుంటారు.

 

    జి.కె. చెప్తే మారుమాట్లాడకుండా అతడు చేస్తాడు.

 

    ఇంకెంతకాలం చేస్తాడు?

 

    మరో రెండు సంవత్సరాలు.

 

                                     *    *    *

 

    "చాలా దారుణం" అన్నాడు సింహం తలెత్తి. "ఈ ఫాల్స్ రిపోర్టుగానీ ప్రజల్లోకి వెళితే ప్రభుత్వం పడిపోవటం ఖాయం. అంత దారుణంగా వుంది".

 

    "నేనూ అదే అనుకుంటున్నాను" అంది వాణి. "తిండి, భోజనపథకాలు, ఇల్లు, గృహవసతి- అన్నీ అయిపోయాక ఇది మొదలయింది. మిగతావాటికన్నా ఇది బలమైన ఆయుధం. "మీ అనారోగ్యానికి కారణం ఎవరూ? ఈ ప్రభుత్వమే - మళ్ళీ దీనికే ఓటువేస్తారా!" చాలా గొప్ప స్లోగన్ ఇది. తనకి వచ్చిన అనారోగ్యానికి కారణం ఈ ప్రభుత్వమే అని అతడి సబ్-కాన్షస్ మీద ముద్ర పడిపోతుంది. లోహియా గ్రూపు పేపర్లన్నీ ఈ విధంగా చిత్రీకరిస్తాయి".


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS