ఆమె లోపలకు వచ్చి,
"లేచావా అమ్మా నీ కోసమే చూస్తున్నాం నువ్వు ఇంకా లేవలేదేమో అని. స్నానం చేస్తావా!" అడిగింది ఆమె ఎంతో నెమ్మదిగా చిరునవ్వుతో.
ఈయనగార్కి అందరూ ఆత్మీయులే అందరూ ఆయన తరుపునే మాట్లాడతారు.
ఎవ్వరూ తన మాట వినిపించుకునేవాళ్ళు లేరు.
ఒక్కక్షణం తనలోతాను ఆలోచించుకుని నిర్ణయానికి వచ్చింది.
టైము చూసింది. ఏడుగంటలు దగ్గర అవుతుంది.
అంటే తను ఇంతసేపు కూర్చుని ఆలోచిస్తుందా!
ఆలోచనలతో టైము తెలియలేదా!
ఉండు వీళ్ళపని చెప్తాను.
అందరికీ ఒక్కసారే చెప్తాను.
పెళ్ళిపెద్దలు అందరూ పెళ్ళికొడుకుతో సహా మూర్ఛపోయేలా చేస్తాను!
తొందరపడకండి పెళ్ళివారూ అనుకుంది ఇంద్రసేన మనసులో కోపంగా.
ఆమె మాటలకు తల ఊపింది.
స్నానం చేస్తాను అంటూ.
ఆమె వెళ్ళి ఇంద్రసేనకు బట్టలు తీసుకువచ్చి ఇచ్చింది.
ఇంద్రసేన మౌనంగా స్నానానికి వెళ్ళిపోయింది. స్నానంచేసి ముస్తాబు అయి కృష్ణమౌళికోసం చూడసాగింది.
టైము ఎనిమిది గంటలు అయింది.
కృష్ణమౌళి రాగానే తను ఏం మాట్లాడాలి!
మనిషిని ఎలా దులపాలి.
ముఖం వాచేలా చివాట్లు ఎలా పెట్టాలి!
అని ఒకటే ఆలోచిస్తూ అతని రాకకోసం ఎదురు చూడసాగింది.
ఆమెకు ఇప్పుడు భయంగా, బెంగగా అనిపించటం లేదు.
మనసునిండా సంతోషంతో మనిషి ఉక్కిరి బిక్కిరి అవుతుంది.
తను ఓడిపోలేదు. అతనే ఓడిపోయాడు. ఆమాట ధైర్యంగా ధీమాగా తను చెప్తే అతను ఏమయిపోతాడు!
విని తట్టుకోగలడా!
మనసులో గర్వంగా నవ్వుకుంటూ అతని రాకకోసం ఎదురు చూడసాగింది.
* * *
కృష్ణమౌళి అంబికకు రహస్యంగా ఫోన్ చేసి చెప్పసాగాడు.
"అంబికా! నేనే గెలిచాను ఇంద్రసేన మెడలో మూడు ముళ్ళువేసి ఆమెను నా భార్యని చేసుకున్నాను" ఉత్సాహంగా చెప్పాడు.
"పెళ్ళి జరిగిపోయిందా? ఇందూ ఏం గొడవ చెయ్యలేదు కదా!" అడిగింది అంబిక మెల్లగా.
"ఊహు"
"అయితే పెళ్ళి బాగా జరిగిందన్నమాట"
"ఆ బాగా జరిగింది"
"ఫోటోలు తీయించారా!"
"ఆ ఫోటోలు తీయించాను. వీడియోకూడా తీయించాను."
అంబిక నవ్వింది. "అయితే పెళ్ళి బాగా జరిగింది అన్నమాట."
"ఆహా నిజంగా నేను చాలా భయపడ్డాను. అంబికా ఇందూ యేం గొడవ చేస్తుందో అని నేను భయపడినట్టు కాకా బాగా జరిగిపోయింది" అన్నాడు.
"ఇందూ యేం చేస్తుంది! భోజనం చేసిందా?"
"భోజనం చేసిందని కాదు ఆమెచేత బలవంతంగా చేయించాను. భోజనం చేసి పడుకుంది."
"ఇంకా లేవలేదా!"
"లేదు లేచిందేమో వెళ్ళి చూడలేదు! చూస్తాను" అన్నాడు.
"ఇక్కడ మీ మామగారు అత్తగారు అంతా కంగారు పడుతున్నారు. ఇందూ స్నేహితురాలి యింటికి వెళ్ళి ఇంకా రాలేదు, ఉత్తరం కూడా వ్రాయలేదు అని."
"మా మామగారు అత్తగారే కాదు. మన మావగారు అత్తగారు అనాలి" అన్నాడు.
ఫోన్ లో ఇద్దరూ నవ్వుకున్నారు.
మళ్ళీ "ఉష్" అనుకున్నారు. ఎవరైనా వింటారు అన్నట్టుగా.
"అయితే మీరు ఇద్దరూ కలిసి ఎప్పుడు వస్తున్నారు!" అడిగింది.
"రేపు తెల్లవారేసరికి వస్తాం. పాపం అలా బెంగతో పడుకుని ఉండి ఉంటుంది. లేచాక నచ్చచెప్పి బయలుదేరతాం."
"అలాగే మీకోసం చూస్తుంటాను."
"ఆ నువ్వు ఎక్కడికి వెళ్ళకు. అత్తగారు, మామగారు, జయరామ్ లతో పాటు మమ్మల్ని చూసి నువ్వుకూడా ఆశ్చర్యం నటించు" అంటూ చెప్పాడు.
"అలాగే" అంది నవ్వుతూ.
"అయితే ఉంటాను. రేపు ఉదయం ఇద్దరం కలిసివస్తాం" అన్నాడు రిసీవర్ పెట్టేస్తూ.
ఇంద్రసేన నిద్రలేచింది అని ఆమె వచ్చి అతనితో చెప్పగానే లేచాడు.
ఆమె గదిలోకి వెళ్ళడానికి.
ఇంద్రసేనలో కోపం అంతా పోయింది.
అంబిక చెప్పినట్టు తాళి కట్టగానే ఆమె మారిపోయింది.
అది తాళి మహత్యం.
హిందూ స్త్రీ మెడలో మంగళసూత్రానికి ఇచ్చిన విలువ గౌరవం మరి ఎవ్వరికీ ఇవ్వదు.
మంగళసూత్రాన్ని పూజిస్తుంది.
స్త్రీ కోరుకునేది పసుపు కుంకుమ.
కృష్ణమౌళి మనసులో నవ్వుకున్నాడు.
అమ్మమాట నెరవేర్చాను.
అంబికను వెతికితెచ్చాను. గణేశ్ రావుగార్కి కోడల్ని, జయరామ్ కి భార్యను చేశాను.
నేను ఇందూని పెళ్ళి చేసుకున్నాను.
అమ్మ ఆత్మ శాంతిస్తుంది అనుకున్నాడు. అందాల ఇందు ఏం చేస్తుంది.
సిగ్గుతో తన రాకకోసం ఎదురుచూస్తుందా!
అతని మనసులో చిత్రవిచిత్ర భావాలు తియ్యగా తల ఎత్తసాగాయి.
అందాల ఇందూ!
మనసులో పదేపదిసార్లు అనుకుంటూ ఆమె గది వద్దకు వెళ్ళాడు.
66
తలుపు తీసుకుని లోపలకు ప్రవేశించి తలుపులు మూసి గడియవేశాడు.
మంచంమీద ఇంద్రసేన కూర్చునివుంది.
ఆమెవేపు చూసి నవ్వాడు.
ఆ నవ్వు ఎంతో మెత్తగా, హాయిగా, తియ్యగా అనిపించేది ఏ ఆడపిల్లకయినా.
ఇంద్రసేనకు అలా అనిపించలేదు.
అతన్ని చూసి చిరునవ్వు నవ్వలేదు. మామూలుగా చూసింది.
"చాలాసేపు నిద్రపోయినట్టున్నావు" నవ్వుతూనే అడిగాడు.
ఆమె మాట్లాడలేదు.
ఎలా అతన్ని హడలగొట్టాలా అని ఆలోచిస్తుంది.
"మన పెళ్ళి జరిగిపోయింది. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది."
"ఎందుకు!" సూటిగా ప్రశ్నించింది.
"ఎందుకేమిటి ఇందూ! ఇన్నాళ్ళ మన కల ఫలించింది. నువ్వు నా భార్యవు అయ్యావు. ఈరోజు రాత్రి మనకి మొదటిరాత్రి" అంటూ నవ్వి ఆమె దగ్గరగా వచ్చాడు.
ఇంద్రసేన గుండె గుభేల్ మంది.
అప్రయత్నంగా లేచి నిలబడింది.
దగ్గరకు వచ్చేశాడు.
అతను తనకు భర్తగా అధికారంగా ప్రవర్తిస్తే ఏం చెయ్యాలి!
ఏం చేస్తుంది!
తన కిష్టం లేకుండా తన ఒంటిమీద అతని చెయ్యిపడితే ఊరుకుంటుందా!
చెంప ఛెళ్ళుమనిపిస్తుంది.
ఛీ కొడుతుంది.
స్త్రీకి ఇష్టం లేకుండా మగవాడు ఏం చెయ్యలేడు. ఇందూ ధైర్యాన్ని అంతా కూడదీసుకోసాగింది.
అతను ఆమె భుజంపై చెయ్యివేశాడు.
