ఆమె మనసు పరిపరి విధాల పోయింది.
అతను మోసం చేశాడు.
మోసంచేసి రప్పించి, బంధించి పెళ్ళి చేసుకున్నాడు.
ఇది పెళ్ళా!
కాదు ఇది పెళ్ళికాదు.
ఈ పెళ్ళికి తను అంగీకరించదు.
తన తల్లి, తండ్రి, అన్నయ్య, వదిన తన పెళ్ళి గురించి ఎన్నెన్ని అనుకున్నారు.
ఒక్కగానొక్క ఆడపిల్ల ఆ అమ్మాయికి వైభవంగా పెళ్ళి చెయ్యాలని ఎంతగా అనుకుని ఆశపడి మురిసిపోయారు.
చివరకు తన పెళ్ళి ఇలాగా జరిగేది!
ఈ రాక్షసుడికి జడిసే వదిన అంబిక అన్నయ్యను ఎవ్వరికి తెలియకుండా పెళ్ళి చేసుకుంది. ఈ విషయం వదినకు తెలిస్తే!
ఇతన్ని ఎంత అసహ్యించుకుంటుంది!
తండ్రికి, అన్నయ్యకు చెప్తే వాళ్ళు కోపంతో ఏమయినా చేస్తారు.
వాళ్ళ సంగతి ఇంకా ఇతనికి తెలియదు.
తెలిస్తే ఇలాటి పని చచ్చినా చేసేవాడు కాదు. అతని ముందు తను తన వాళ్ళు అందరూ ఓడిపోవటమా!
అతను పంతం పట్టాడు.
తనని పెళ్ళి చేసుకోవడానికి తండ్రి అసలు ఇష్టపడలేదు.
ఆయన తన కూతురికి చాలా గొప్ప సంబంధం తెచ్చి చెయ్యాలని అనుకున్నారు.
ఈ పెళ్ళి ఇలా జరిగింది అని తెలిస్తే ఆయన తట్టుకోగలరా!
అన్నయ్య భరించగలడా!
ఇందూ గుండె పగిలిపోయింది.
కళ్ళనీళ్ళు ధారలు కట్టి చెక్కిళ్ళు తడిపేయసాగాయి.
మెడలో మంగళసూత్రాలు పదే పదిసార్లు చూసుకుంది.
భగవంతుడా! ఏమిటిది!
తనకి పెళ్ళి అయిపోయిందా!
అంటే!...అంటే!... తను ఓడిపోయిందా!
జీవితంలో తను కాలు కదపకుండా పెదవి విప్పి మాట్లాడకుండా ఈ మంగళ సూత్రాలతో తనని బంధించేశాడా!
స్నేహితురాలి యింటికి వెళ్ళిన తను ఈ విధంగా ఇక్కడ బందీ అయిందని తల్లిదండ్రులకి, అన్నా వదిన ఎవ్వరికీ తెలియదు.
తను పెళ్ళి చేసుకుని భర్తతో యింటికి వెళితే వాళ్ళు తట్టుకోగలరా!
ఆ తల్లిదండ్రుల గుండె పగిలిపోదూ!
భగవంతుడా! ఇప్పుడు ఏం చెయ్యాలి!
అన్నీ భరించి ఈ పెళ్ళికి తలవంచాలా! లేక ఈ పెళ్ళినే ఎదిరించి ఎదురు తిరగాలా!
ఇప్పుడు ఏం చెయ్యాలి!
ఇంద్రసేన ఆలోచించసాగింది.
భోజనం మానేసిన ఆమె భోజనంచేసి పడుకుని లేచింది.
ఒంట్లో క్రొత్త శక్తి వచ్చినట్టు అయింది.
కళ్ళు తెరిచి సూటిగా చూడగలుగుతుంది.
కాళ్ళల్లో శక్తి పుంజుకుంది.
మనిషిలో మునుపటి బలం వచ్చేసినట్టుగా అనిపించసాగింది.
గట్టిగా మాట్లాడగలను అన్న నమ్మకం యేర్పడింది ఆలోచించగా, ఆలోచించగా.
ఆమె కళ్ళనీళ్ళ ధారలు ఒక్కసారిగా ఆగిపోయాయి.
కళ్ళు వెడల్పు అయ్యాయి.
తను ఎందుకు భయపడాలి!
తను ఎవరికి తలవంచాలి!
కృష్ణమౌళి ఎవరు!
అతనికి తనకి ఏమిటి సంబంధం?
మనసులో మండి పడిపోయింది.
కళ్ళల్లో ఎర్రజీరలు అలుముకున్నాయి.
మంగళసూత్రాల వైపు కోపంగా చూసుకుంది. మెడలో మంగళసూత్రాలు ఆమెను చూసి వెక్కిరించినట్టుగా అనిపించసాగింది.
నువ్వే ఓడిపోయావు.
కృష్ణమౌళియే గెలిచాడు.
ఈ మంగళ సూత్ర బంధాల్ని తెంచుకుని నువ్వు ఎక్కడికి పారిపోతావు.
ఇది నిజం ముమ్మాటికీ నిజం.
అంటూ హేళన చేస్తున్నట్లుగా అనిపించసాగింది.
ఇంద్రసేనకి పిచ్చెత్తిపోయినట్టు అయింది.
ఏమిటీ తను లొంగిపోతుంది అనే అనుకున్నాడా!
ఎంత తెలివి తక్కువవాడు.
ఈ ఇంద్రసేన అంటే ఏమిటో తెలియచేస్తాను.
"తను జీవితంలో ఓడిపోనని ఎంత కష్టం నష్టం అయినా గెలిచి తీరతానని."
ఈ ఇంద్రసేనతో ఎప్పుడూ పంతంపట్టి పోటీ చెయ్యకు అని గట్టిగా చెప్తాను.
మనసులో కోపంగా అనుకుంది.
అంతలో తలుపు దగ్గర చప్పుడు అవటంతో అటు చూసింది.
ఒకామె లోపలకు తొంగి చూసింది.
కోపాన్ని మింగుకుంటూ ఆలోగే చూసింది ఇంద్రసేన!
