Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 66


    ఇంత అందాలరాశికి అంత కోపం ఎందుకో! అంత గర్వం ఏమిటో! అంత పొగరు దేనికో. మనసులో నవ్వుకున్నాడు.


    స్త్రీకి పొగరు, గర్వం, గడుసుతనం ఉంటే అదో అందం.


    ఆ అందమే పురుషుడ్ని రెచ్చగొడుతుంది!


    పంతం పెరుగుతుంది. పట్టుదల తోడు అవుతుంది. ఎవ్వరికీ లొంగని స్త్రీకి కళ్ళెంవేసి లొంగదీయటంలో ఎంత ఆనందం.


    చిన్నతనంలో మేనమామ దగ్గర అన్నమాటలు నిజం చేశాడు.


    ఇందూని ఎత్తుకు వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుంటాను అన్నాడు.


    అప్పుడు చిన్నతనం పెళ్ళంటే ఏమిటో తెలియని వయసు అయినా మామయ్య అలా అనగానే ఎందుకో రోషంతో అలా అనేశాడు.


    ఆ తరువాత తను ఎంత జడిసిపోయి బెదిరిపోయాడు.


    తల్లి ఇందూని కోడలిగా చేసుకోవాలని కోరింది.


    మేనమామ దగ్గర ఆనాడు అన్నమాట ప్రకారం ఈరోజు చేశాడు.


    ఇందూకి తనకి పెళ్ళి అయిపోయింది.


    ఇక ఇద్దర్ని ఎవ్వరూ వేరు చెయ్యలేరు.


    ఇందూ తనని కలిసి ఆశీర్వాదం కోసం మేనమామ యింటికి వెళితే!


    కృష్ణమౌళి గుండెలనిండా సంతోషం అయింది.


    అప్పుడు ఆయనగారి ముఖం చూడాలి.


    మేనల్లుడే అల్లుడు అయ్యాడు అంటే ఆయన ఏమంటారు!


    ఇక ఎవ్వరు ఏం చేస్తారు.


    పెళ్ళి అయిపోయాక బ్రహ్మ కూడా వేరు చెయ్యలేడు. మొదట ఆయన ముఖం మారిపోయినా తరువాత సరిపెట్టుకుని తన దగ్గరగా వచ్చి కృష్ణా అన్నీ మర్చిపో అంటారు.


    అప్పుడు మేనమామ మీద కోపం ఏముంటుంది!


    "ఛ ఏమిటి మామయ్య ఆ మాటలు" అంటూ తను తేలిగ్గా అనేస్తాడు.


    అందరూ సంతోషంగా, సరదాగా ఉంటారు.


    ఇందూలాంటి అందాలరాశి తనకు భార్య అయింది.


    కృష్ణమౌళి ఇందూవైపు మళ్ళీ చూశాడు.


    ఒంటిమీద తెలివిలేనట్టు పడుకుని వుంది.


    తలపై ప్రేమగా నిమిరాడు.


    ఆమె మెడలో పచ్చని పసుపుతాడుతో మంగళ సూత్రాలు మెరుస్తున్నాయి, ఆమె వివాహిత అని తెలియచేస్తు.


    మెడకి నల్లపూసలు నిండుగా కనిపిస్తున్నాయి.


    ఈమె తన భార్య.


    మనసులో పదే పదిసార్లు గర్వంగా అనుకున్నాడు. ఇన్నాళ్ళగా వున్న సమస్యలు, పంతాలు, పట్టుదలలు అన్నీ ఈ రోజుతో మాయమయ్యాయి.


    అందరం కలసిపోతాం.


    అమ్మ వుంటే ఎంత సంతోషించేది.


    మనసులో బాధపడ్డాడు.


    ఇందూ పడుకుంది. లేచాక తీరిగ్గా మాట్లాడుకుని యింటికి ప్రయాణం అయి వెళ్ళొచ్చు అనుకున్నాడు.


    అక్కడనుండి లేస్తూ చేతివ్రేళ్ళతో ఆమె చెంపమీద మృదువుగా రాసి అక్కడనుండి వెళ్ళిపోయి తలుపు దగ్గరగా చేరేశాడు.


    ఉదయం పదిన్నర గంటలకు భోజనంచేసి పడుకున్న ఇంద్రసేన సాయంత్రం నాలుగున్నర గంటలకు గాని నిద్రలేవలేదు.


    అప్పుడు మెలకువ వచ్చింది ఆమెకు.


    కళ్ళు విప్పి చూసింది.


    తను గదిలో మంచంమీద పడుకుని వుంది.


    అప్పుడే తెల్లవారిందా?


    అనుకుంది.


    టైము చూశాక తెలిసింది. సాయంత్రం నాలుగున్నర గంటలు అని.


    చటుక్కున లేచి కూర్చుంది.


    ఆమెకు అప్పుడు గుర్తు వచ్చింది.


    రాత్రి పెళ్ళి అవటం.


    ఆమె స్పృహ తప్పిపోవటం అతను బలవంతంగా అన్నం తినిపించటం.


    అంతా సినిమా రీల్స్ లా కళ్ళముందు కదిలింది.


    ఇందూ గుండె ఒక్కసారి ఆగిపోయింది.


    తనకి పెళ్ళి అయిపోయిందా!


    ఇది నిజమా!


    తలవంచి మెడలో మంగళసూత్రాలు చూసుకుంది.


    వణికే చేతులతో ఆ మంగళ సూత్రాలని చేతుల్లోకి తీసుకుంది.


    అంటే తను వివాహితా!


    తను కృష్ణమౌళి భార్యా!


    భగవంతుడా!


    ఆమె గుండె ఆగిపోయినట్లు అయింది.


    తను అనుకున్నది ఏమిటి జరిగింది ఏమిటి!


    కృష్ణమౌళికి తను భార్య కావాలని కోరుకుందా!


    వీల్లేదు తను అతని భార్య కావడానికి వీల్లేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS