"ఏమిటి! ఇందూ" అన్నాడు కంగారుగా.
ఇంద్రసేన కళ్ళముందు చీకటి వలయంలా ఏర్పడసాగింది.
కాళ్ళు తేలిపోసాగాయి. కళ్ళకి ఏం కనిపించటం లేదు.
"ఏమండీ నాకు... నాకు... ఏమేమో... అయిపోతుందండీ" అంది చాలా నీర్సంగా.
"ఏమిటి ఇందూ" ఆమె భుజాలు పట్టి ఊపుతూ కంగారుగా అడిగాడు.
"ఏమో" అంటూ చెప్పింది. ఆ తరువాత ఆమెకు ఏం తెలియలేదు.
ఇంద్రసేన స్పృహతప్పి పడిపోయింది.
కృష్ణమౌళి కంగారుగా ఆమెను రెండు చేతులతో లేవనెత్తి తీసుకెళ్ళి మంచంమీద పడుకోబెట్టి ముఖంమీద నీళ్ళు జల్లాడు.
అందరూ ఆతృతగా చూడసాగారు.
అతనికి ఒకటే కంగారు గాబరాగా ఉంది. ఈ సమయంలో ఇందూకి ప్రాణంపోతే!
ఆ ఊహే భరించలేకపోయాడు.
వెంటనే కారు సిద్ధం చెయ్యమని కారులో ఇంటికి తీసుకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు.
ఎక్కడనుండి అయితే గుడి దగ్గరకు వచ్చారో అక్కడికే తిరిగి కారులో బయలుదేరారు.
ఇంద్రసేన తల అతని ఒడిలో వుంది. కారు బయలుదేరింది.
65
కారు పోర్టికోలో ఆగింది.
కృష్ణమౌళి ఒడిలో తల పెట్టుకుని వెనకసీట్లో పడుకుని ఉంది ఇంద్రసేన.
ఆమెను లోపలకు తీసుకువెళ్ళారు.
ఇందూకి స్పృహ వచ్చి కళ్ళు విప్పి చూసింది.
తను ఒక గదిలో మంచంపై పడుకుని ఉన్నట్టు గ్రహించుకుంది. టైము చాలా అయిపోయింది అని కనురెప్పలు ఎత్తి పక్కకు చూసింది.
తల దగ్గర కృష్ణమౌళి కూర్చుని ఆమె తలపై చెయ్యివేసి ఆప్యాయంగా నిమురుతున్నాడు.
ఒక్కక్షణం కళ్ళు మూసుకుంది.
"ఇందూ!" అనురాగంతో పిలిచాడు.
"ఊ" నీరసంగా పలికింది.
"కాఫీ తాగుతావా!"
ఆమె మాట్లాడలేదు.
"ఇందూ ఎందుకీ పట్టుదల? మన ఇద్దరం భార్యాభర్తలం అయ్యాం. మనలో మనకి ఈ పంతాలు, పట్టింపులూ ఏమిటి చెప్పు"
ఆమె మాట్లాడలేదు.
"నా మాటవిని భోజనం చెయ్యి. ఇన్ని రోజులా పచ్చి మంచినీళ్ళు కూడా గొంతుకలో పోసుకోలేదు. నువ్వు ఏమయినా అయిపోతే నేను అంటూ ఉంటాననే అనుకుంటున్నావా!" అతని కంఠం గాద్గదికం అయింది.
ఇందూ ముఖంలో కోపంగాని, శాంతంగాని ఎలాంటి భావాలు కనిపించలేదు.
ఆమె మాటకు ఎదురుచూడకుండా ఒకామెను పిలిచి ఇందూకి భోజనం తెమ్మని చెప్పాడు.
పదినిముషాల్లో ఆమె భోజనం తెచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది.
ఇందూ భోజనం చెయ్యడానికి ఇష్టపడలేదు. మొదట ముఖం తిప్పేసింది.
అతను ఆమెను వదిలిపెట్టలేదు.
"పట్టుదల వస్తే నేను మనిషిని కాదు. రాక్షసత్వం వస్తుంది నాలో, నా మాటవిను" అంటూ బ్రతిమాలసాగాడు.
కంచంలో అన్నం కలిపి దగ్గరకు తీసుకువచ్చాడు.
"నాకు.... నాకు... వద్దు" నీరసంగా చెప్పింది. అతను వినలేదు.
ఆమె భుజాలచుట్టూ చెయ్యేసి అతని గుండెలకు ఆమెను జేరేసి బలవంతంగా తనే రెండుముద్దలు తినిపించసాగాడు.
ఇందూ ఇక తప్పదు అన్నట్టు బుద్ధిమంతురాలిలా తనే తినసాగింది.
"ఆ అదీ అలా తినాలి నువ్వు చాలా మంచిదానివి" అంటూ నవ్వి ఆమె నుదుటిమీద ముద్దు పెట్టుకున్నాడు.
ఇందూ భోజనం చెయ్యటం పూర్తయింది. భోజనం చెయ్యటం అవగానే శరీరం తన స్వాధీనం తప్పినట్టు అయింది.
కడుపునిండగానే ప్రాణం తాపీ పడినట్టు అయింది.
మనసులో ఎలాటి ఆలోచనలు లేకుండా ఆ క్షణం హాయిగా అనిపించసాగింది.
కనురెప్పలు బరువుగా మూతలు పడసాగాయి. "నిద్రవస్తుందా!" అడిగాడు.
"ఊ"
"ఐతే పడుకో ఎలాటి ఆలోచనలూ మనసులో రానివ్వకు. హాయిగా పడుకో. ఈ గదిలోకి ఎవ్వరూ రారు" అంటూ ఆమె తలక్రింద తలగడ సరిచేసి పడుకోమన్నాడు.
ఇందూ తలవూపి బుద్ధిమంతురాలిలా పడుకుంది.
ఆమెకు అప్పుడే కళ్ళమీదకి మత్తులా వచ్చేస్తుంది.
ఆమె కళ్ళకు అతను కృష్ణమౌళి అవునో కాదో కూడా తెలియటం లేదు.
అంత త్వరగా హాయిగా నిద్రపట్టేసింది.
కృష్ణమౌళి క్షణంసేపు అలాగే చూశాడు.
"ఇందూ!" చాలా మెల్లగా పిలిచాడు.
ఆమె పలకలేదు.
ఆమె కళ్ళు అప్పటికే నిద్రలో కూరుకుపోయాయి.
ఒంటిమీద తెలివిలేకుండా పడుకుని నిద్రపోతుంది.
ఇంద్రసేన ముఖంలోకి అలాగే చూడసాగాడు.
ఎంత సౌందర్యరాశి!
