Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 64


    వాళ్ళ మాటలు అన్నీ విన్నది.


    తిరిగి ఒక్కమాట మాట్లాడలేకపోయింది.


    లక్ష్మీనారాయణగారి భార్య ఇక్కడ నుండి వెళ్ళిపోయి భర్తను పక్కకు పిలిచింది.


    ఆయన ఏమిటి అని వచ్చారు.


    "చూడండి అందరు తలో విధంగా అనుకుంటున్నారు. కృష్ణ ఈ పెళ్ళి జరక్కుండా ఆపేస్తే బాగుండును. ఎందుకు వచ్చిన పెళ్ళి" ఆయన ఏం మాట్లాడలేదు.


    "వెళ్ళి మీరు అబ్బాయికి నచ్చచెప్పండి"


    "ఏమని!"


    "ఈ పెళ్ళి ఆపించేయమని. ఎందుకు ఈ పెళ్ళి? ఆ పిల్ల తిండి తినటంలేదు. ప్రాణంగాని పోతుంది ఏమో అని భయం వేస్తుంది."


    ఆయన ఒక్క క్షణం ఏం మాట్లాడలేకపోయారు. "కాని ఇప్పుడు పెళ్ళి ఆపటం ఏమిటి కొద్ది నిముషాలే టైము ఉంది."


    "అసలు చెప్పి చూడండి పెద్ద వాళ్ళం కాబట్టి ఏదో చేస్తాం వింటే సరే లేదా ఊరుకోండి" అంది ఆవిడ.


    ఆయన తల ఊపి అక్కడనుండి వెళ్ళి కృష్ణమౌళిని పక్కకు పిలిచారు.


    "ఏమిటి పిలిచారా!" అడిగాడు.


    "ఏం లేదు అమ్మాయి ఏం తినటం లేదు చాలా నీర్సంగా ఉందట"


    అతను ఏం మాట్లాడలేదు.


    "అలా ఎన్నాళ్ళు ఉంటుంది"


    కృష్ణమౌళి నవ్వాడు.


    ఆ నవ్వులో నిండుతనం లేదు.


    నన్ను ఏం చెయ్యమంటారు! అన్నట్టుంది ఆ నవ్వులో అర్ధం.


    "కృష్ణా ఇది నవ్వులాటకాదు" అన్నారు ఆయన గంభీరంగా.


    ఆ మాటలు వింటూనే అతని ముఖంలో నవ్వు మాయమయి గంభీరంగా అయింది.


    "ఇది చిన్న విషయంకాదు. నవ్వుతూ తీసిపారేయడానికి."


    అతను మాట్లాడలేదు.


    "ఆ అమ్మాయి పంతంపట్టి భోజనం మానేసింది. మనిషి లేవలేక పోతుంది. చాల నీర్సంగా ఉంది" కృష్ణమౌళి మాట్లాడలేదు.


    "ఆ అమ్మాయికి ఈ పెళ్ళి అసలు ఇష్టంలేదు. ఈ పెళ్ళిగాని జరిగిపోతే ఏదైనా పెద్ద గొడవ జరిగితే" అన్నారు మాట మధ్యలో ఆపేస్తు.


    "గొడవా! ఏమిటి గొడవ" అన్నాడు నుదురు చిట్లిస్తూ. అతనికి నిజంగానే అర్ధంకాలేదు. "అమ్మాయికి ఈ నీర్సంలో ప్రాణంపోతే."


    అతను ఒక్కక్షణం అలా ఉండిపోయాడు.


    ఒకవేళ పంతం పట్టినట్లు ఈ పెళ్ళి తన ఇష్టంలేకుండా జరిగిపోయిందని ప్రాణం తీసుకుంటే అది అంతా గొడవ కాదా! ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఊరుకుంటారా అన్నారాయన.


    కృష్ణమౌళికి లక్ష్మీనారాయణగారు అంటే ఎలాంటి కోపంలేదు, అతని మంచికోరే ఆయన చెప్తున్నారు.


    కృష్ణమౌళి ఆ మాటలకు నవ్వి,


    "నాకు పిరికిమందు నూరిపోస్తున్నారా! ఇంత జరిగాక ఈ పెళ్ళి ఆపేయటమా" అంటూ ఆగి.


    "మీరు అన్నట్లుగా ఇందూ ప్రాణం తీసుకుంటే ఆ తరువాత జరిగేది ఏమిటో నేను ఇప్పుడు ఏం చెప్పను, అప్పుడు మీకు అందరికీ తెలియనే తెలుస్తుంది. అందుకే ఈ ధీమా, ఈ ధైర్యం" అంటూ నవ్వి.


    "మీరు ఇలాంటి విషయాలు ఏం మనసులో పెట్టుకోకండి నేను ఎలాంటి చిక్కుల్లో చిక్కుకోను అన్నాడు"


    లక్ష్మీనారాయణగారు అతని భుజం తట్టారు. అంతలో పెళ్ళిముహుర్తం దగ్గర పడిపోతుంది అని ఒకరు చెప్పగా.


    ఆయన కృష్ణమౌళిని తీసుకుని పెళ్ళి మండపం వద్దకు వెళ్ళారు.


    కృష్ణమౌళి పెళ్ళి పీటలమీద కూర్చున్నాడు. పురోహితుడు మంత్రాలు చదువుతూ పెళ్ళి కుమార్తెను తీసుకురండమ్మా అంటూ గొంతుక చించుకుని అరవసాగాడు.


    కొద్దిసేపటికి ఇంద్రసేనని పట్టుకుని నడిపించి తీసుకువచ్చారు ఇద్దరు ముత్తయిదువులు.


    ఇంద్రసేనని కృష్ణమౌళి పక్కన పీటలమీద కూర్చోబెట్టారు.


    కళ్ళు తెరిచి నీర్సంగా చూసి కళ్ళు మూసేసి అతని భుజంపై తల వాల్చేసింది.


    పౌరోహితుడు ఒక్కక్షణం అలా ఉండిపోయి ఎవరో హెచ్చరించటంతో మళ్ళీ తేరుకుని మంత్రాలు చదవసాగాడు.


    "మంత్రాలు తగ్గించి తొందరగా పెళ్ళి జరిపించేయండి అమ్మాయికి ఒంట్లో బాగాలేదు జ్వరం" అన్నారు లక్ష్మీనారాయణగారు.


    పౌరోహితుడు తలఊపి తొందరగా పెళ్ళి జరిపించసాగాడు.


    తన భుజంమీద ఆనుకుని పడుకుని ఉన్న ఇందూని లేపి సరిగ్గా కూర్చోబెట్టాడు.


    లక్ష్మీనారాయణగారి భార్య మిగతావాళ్ళు ఇంద్రసేనని పట్టుకున్నారు.


    కృష్ణమౌళి లేచి ఆమె మెడలో మూడుముళ్ళు వేశాడు.


    ఇంద్రసేన మెడలో మూడుముళ్ళు వేస్తుంటే అతని చేతులు ఎందుకో వణకసాగాయి.


    ఇందు తన భార్య అయిపోయింది.


    తన పంతం నెరవేరింది.


    తల్లిమాట నిలబెట్టాడు.


    మనసులో సంతోషం పొంగి పొర్లసాగింది.


    ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తియ్యసాగారు.


    కృష్ణమౌళి, ఇంద్రసేనల పెళ్ళి జరిగిపోయింది.


    అతనితోపాటే ఇందూ కూడా లేచి నిలబడింది.


    ఆ లేచి నిలబడేటప్పుడు తూలి అతనిమీద పడింది.


    కృష్ణమౌళి ఆమెను పడిపోకుండా పట్టుకున్నాడు.


    అతని భుజంమీద తల ఆన్చేస్తూ "ఏమండీ" అంది నీర్సంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS