మాటలు అన్నీ ఇంద్రసేన చెవిని పడుతున్నాయి.
వాళ్ళమాటలకు జవాబు ఇవ్వలేదు.
ఇతని సంగతి మీకు ఏం తెలుసు!
పైకి మెత్తగా కనిపించేవాళ్ళే గొంతుకలు కోస్తారు.
అనుకుంది ఆమె మనసులో బాధగా.
అలా నువ్వు అలిగి అన్నం మానేసావు చాలా తప్పు అంది ఆవిడ మెల్లగా.
అతను చేస్తున్న పని ఏమిటి!
అతన్ని ఎవరూ ఏం అనరేం?
నన్ను తీసుకువచ్చి ఇక్కడ బంధించటం బాగుందా!
నా తల్లిదండ్రులకి తెలీకుండా నన్ను పెళ్ళాడటం బాగుందా!
ఇవన్నీ మీకు బాగున్నాయా!
ఇందూకి దుఃఖం ఆగటంలేదు.
కళ్ళనీళ్ళు అలా ధారలు కడుతూనే ఉన్నాయి. పైకి ఒక్కమాట చెప్పలేకపోతుంది.
తనకు ఇప్పుడు పెళ్ళి జరగబోతుందా!
ఎవ్వరూ పెళ్ళి ఆపలేరా?
భగవంతుడా!
తన పెళ్ళి ఇలాగా జరిగేది!
కళ్ళు విప్పి చూసింది.
"అమ్మా!"
"ఊ" అంది నీర్సంగా.
"కొంచెం ఏమయినా తినమ్మా అలా ఉండకూడదు. పెద్దదాన్ని చెపుతున్నాను" అంది ఆవిడ.
మీరు పెద్దావిడకదా! అతనికి ఎందుకు చెప్పరు?
అందరూ నాకు ఎందుకు చెపుతారు!
మనసులో అనుకుంటూ తల తిప్పింది.
ఏం వద్దు అన్నట్టు.
"నా మాట వినమ్మా"
మళ్ళీ తలతిప్పి కళ్ళు గట్టిగా మూసుకుంది. లేచి నడిచే శక్తివస్తే!
ఈ పెళ్ళి జరగకుండా పారిపోయి ఉండేది.
అలా పారిపోవడానికి శక్తిలేదు.
తన కాళ్ళల్ల శక్తి అంతా ఏమయింది?
నడిచే శక్తి పోయింది.
ఇక నడవలేదా!
ఈ జీవితం అంతా ఇంతేనా!
ఇంద్రసేనకు గుండె జల్లుమంది.
భయంతో మనిషి బిగుసుకు పోయింది.
కళ్ళు మూసుకు అలా పడుకుంది.
అక్కడ ఉన్న ఆడవాళ్ళు ముఖముఖాలు చూసుకున్నారు.
ఎంత బ్రతిమాలినా లాభంలేదు అన్నట్లు లక్ష్మీనారాయణగారి భార్య దూరంగా నిలబడి ఉంది,
వాళ్ళ మాటలు వింటూ
"అమ్మాయి చాలా మొండి" అంది ఒకావిడ.
"అవును" అంది ఒకావిడ.
"ఆ అబ్బాయికి ఏం తక్కువని ఇంత పట్టుపట్టి పెళ్ళి చేసుకుంటున్నాడు!"
"ఆ అబ్బాయి కోరుకోవాలే కాని కోటిమంది కాళ్ళ దగ్గరకు వస్తారు."
"ఈ అమ్మాయికి ఆ అబ్బాయి మంచితనం విలువ తెలియటం లేదు. అదృష్టం కోరి యింటి తలుపు తడుతుంది అర్ధంకావటం లేదు."
"ఒట్టి పెంకితనం"
"అర్ధం లేదు"
"తల్లీ తండ్రికి ఈ ఒక్క కూతురేనట కదా!"
"అందుకే ఈ అతిగారాబం"
"కన్న తల్లిదండ్రులు ఎవరోగాని ఇదా పెంపకం. ఆడపిల్లను ఇలాగేనా పెంచటం" అంది ఆవిడ.
అందరికీ ఆశ్చర్యంగా వింతగా విడ్డూరంగా ఉండి చెప్పుకోసాగారు.
"చిన్నప్పుడు అనుకున్న మాట నిలబెట్టడానికి అబ్బాయి ఇంతా అవస్త పడుతున్నాడు."
"ఆ ఎందుకు వచ్చిన అవస్థ!" అంది ఒకావిడ.
"ఇంత కష్టపడి ఇలా ఈ విధంగా పెళ్ళి చేసుకుంటున్నాడు. ఈ పిల్ల అబ్బాయితో కాపురం చేస్తుందా."
"ఏమోనమ్మా ఈ పిల్లను చూస్తుంటే నాకు ఆ నమ్మకంలేదు."
"పోనిద్దురూ మనకు ఎందుకు."
అలాగా చెప్పారు.
పదికాలాల పాటు సుఖంగా, సంతోషంగా ఉండాలనే కోరుకుంటాం. ఆ తరువాత ఈ అమ్మాయి అదృష్టం, అబ్బాయి అదృష్టం.
"మగవాడికి ఏముంది! ఈ భార్యవలన సుఖం లేకపోతే మరో పెళ్ళి చేసుకుంటాడు. ఆడపిల్ల మళ్ళా పెళ్ళి చేసుకోగలదా! మన సంఘం మన కట్టుబాట్లు ఒప్పుకుంటాయా!"
అని తలోమాట అనుకుంటుండగా.
ఇంద్రసేన కళ్ళువిప్పి చూసింది.
అందరివైపు పరీక్షగా.
ఆమె కళ్ళు విప్పి చూడగానే.
"ఏమ్మా ఏం కావాలి!" అడిగారు అందరూ ఒకసారే.
