Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 62


    ఇందు ఒక్కమాట మాట్లాడలేదు.


    కళ్ళు విప్పి నీరసంగా చూడటం తప్పించి ఏం ఎదురు తిరగలేదు.


    ముస్తాబు చెయ్యటం పూర్తయింది.


    పోర్టికోలో కారు ఆగి వుంది.


    అన్ని కార్లు వరుసగా ఉన్నాయి.


    ఇందూని ఇద్దరు మెల్లగా నడిపించుకువచ్చి కారులో కూర్చోబెట్టారు.


    ఆమె పక్కన కృష్ణమౌళి కూర్చున్నాడు.


    ఇందూకి శక్తి లేనందువలన అతని భుజంమీద తలవాల్చేసింది.


    అతను అపురూపంగా ఆమెను పట్టుకున్నాడు. కార్లు అన్ని వరసగా గుడి దగ్గరకు బయలుదేరాయి.


    కృష్ణమౌళిలో ఆలోచనలు రకరకాలుగా పరిగెడుతున్నాయి.


                                 64


    కారులన్నీ వరసగా గుడిదగ్గర ఆగాయి. గుడిలో మంటపం చాలా అందంగా ముస్తాబు చేశారు పూలతో.


    చాలామంది జనం వున్నారు అక్కడ.


    అందరూ కృష్ణమౌళికి తెలిసినవాళ్లే.


    అతని భుజంమీద తల ఆన్చుకుని పడుకున్న ఇందు కారు ఆగగానే అతను ఆమె చెవిలో మెల్లగా చెప్పాడు.


    "గుడి దగ్గరకు వచ్చేశాం లే" అంటూ.


    ఆమె నీరసంగా కళ్ళు తెరిచి చూసింది.


    ఆ కళ్ళల్లో భయం తొంగి చూసింది.


    అతను నవ్వాడు.


    నీకు ఏం భయం వద్దు.


    నువ్వు నా ప్రాణం.


    ఇప్పుడు మన ఇద్దరం పెళ్ళి చేసుకుంటున్నాం అంతే ఇక భయం దేనికి?


    అన్నట్టుంది అతని నవ్వులో అర్ధం.


    ఇందు ముఖం తిప్పేసుకుంది.


    ఏదో చెప్పాలనిపిస్తుంది.


    కాని చెప్పలేకపోతుంది.


    చెయ్యెత్తి అతన్ని చాచి లెంపకాయ కొట్టాలనిపిస్తుంది.


    కాని కొట్టలేక పోతుంది.


    ఏం చెయ్యాలో తోచటంలేదు.


    ఆలోచించడానికి శక్తిలేదు.


    కనురెప్పలు బరువుగా క్రిందకు వాలిపోతున్నాయి. కళ్ళు విప్పి సూటిగా చూడ్డానికి కూడా శక్తి లేనట్టు అనిపిస్తుంది.


    దాహం గొంతుక ఆర్చుకుపోతుంది.


    కడుపులో ఆకలి మండిపోతూ కరకర లాడిపోతుంది.


    ఆవురావురుమనే మంట కడుపులో బయలుదేరసాగింది.


    ఇందూ కళ్ళు గట్టిగా మూసుకుంది.


    "ఇందూ!" అంటూ పిలిచాడు.


    "ఊ" నీరసంగా పలికింది.


    "లే మనపెళ్ళి మహూర్తం టైము అవుతుంది."


    ఆమె మాట్లాడలేదు.


    మౌనంగా కళ్ళుమూసుకుని అతని భుజంమీద తల ఆన్చుకునే అలాగే పడుకుని ఉంది.

 

    కారు దగ్గరకు ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు.


    నీర్సంగా ఉన్న ఇంద్రసేనను మెల్లిగా చెయ్యిపట్టి లోపలకు తీసుకు వెళ్ళారు.


    ఆ పక్కన చిన్న కాటేజిలా ఉంది.


    లోపలకు వెళ్ళారు.


    నిలబడలేక పోతుంది, పడుకుంటాను అన్నట్టు చెప్పింది సైగచేస్తూ.


    అక్కడ మంచంమీద పడుకోబెట్టారు.


    "మంచినీళ్ళు కావాలా!" ఒకావిడ అడిగింది. ఒద్దు అన్నట్టు తల తిప్పింది. కళ్ళు తెరిచి చూడకుండానే.


    "కొంచెం ఏమయినా తినమ్మా నీకు కళ్ళు తిరిగిపోతున్నాయి. లేవలేకపోతున్నావు" అంది ఒకావిడ బ్రతిమాలినట్లుగా.


    ఇందూ మాట్లాడలేదు.


    "ఏమ్మా ఏమయినా తింటావా!" అడిగింది ఆప్యాయంగా ఒంగి ఆమె ముఖంలోకి చూడసాగింది.


    ఇందూ కళ్ళనీళ్ళు దారలు కట్టాయి.


    వాళ్ళందర్ని పట్టుకుని తిడదామన్నంత ఆవేశం వస్తుంది.


    లేచి ఛెడామడా దులిపేయాలనిపిస్తుంది. ఈవిడ ఎవరో చాలా మంచి ఆవిడలా ఉంది. ఆవిడ అలా అడుగుతుంటే.


    ఇందూకి ఇంకా దుఃఖం వస్తుంది.


    నీర్సంగా అలాగే పడివుంది.


    "అమ్మా!" ఆవిడ మళ్ళీ పిలిచింది.


    "ఏం మాట్లాడలేదు."


    "అలా పంతం పట్టటం మంచిదికాదు తల్లీ ఇప్పుడు ఏమయింది! లక్షణంగా పెళ్ళి జరగబోతుంది!"


    "అబ్బాయి అందగాడు, బుద్ధిమంతుడు, అయిశ్వర్యవంతుడు, పైగా చదువుకున్నాడు. అలాటి అబ్బాయి నిన్ను కోరి పెళ్ళాడుతుంటే కోపం ఎందుకమ్మా?"


    "ఇది అదృష్టంగా భావించాలి, ఆనందించాలి అంతేగాని ఇలా బాధ పడకూడదు"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS