Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 61


    ఆమె మాట్లాడలేదు.


    అతనితో వాదించ దల్చుకోలేదు.


    మౌళితో మాట్లాడాలి అనిపించటం లేదు.


    "నేను ఏమయినా చెయ్యగలను కాని చెయ్యలేదు. కారణం ఉత్తములు అయిన తల్లిదండ్రుల కడుపున పుట్టాను. అందుకే నాకు వంక గౌరవ మర్యాదలు ముఖ్యం, అర్ధమయిందా!" సూటిగా ప్రశ్నించాడు.


    ఆమె జవాబు ఇవ్వలేదు.


    "చెప్పు కాఫీ త్రాగుతావా లేదా!"


    "త్రాగను" చాలా తాపీగా ఏమాత్రం తొణక్కుండా చెప్పింది.


    "బలవంతంగా ప్రాణం తీసుకుందాం అనుకుంటున్నావా!"


    ఆమె కళ్ళు తిప్పి చూసింది అంతే.


    జవాబు ఇవ్వలేదు.


    "సరే నువ్వు ఎన్నాళ్ళు ఇలా ఉంటావో నేనూ చూస్తారు ఎల్లుండేగా మన పెళ్ళి" నవ్వుతూ చెప్పాడు.


    "ఛీ మీతోనే నా పెళ్ళి" అంటూ ఛీ కొట్టింది.


    "ఏం! నీ అందచందానికి దేవలోకంనుండి దేవేంద్రుడు దిగి వస్తాడు అనుకున్నావా! లేక చంద్రలోకంనుండి చంద్రుడు దిగివస్తాడు అనుకున్నావా! నోరు మూసుకుని కూర్చో ఎల్లుండి రాత్రి రెండు గంటలకి మన పెళ్ళి జరిగిపోతుంది. ఆ మర్నాడు నువ్వు నేను కలిసి మీ అమ్మ నాన్నగారి దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పివద్దాం"


    "ఎల్లుండి రాత్రి రెండు గంటలకు పెళ్ళా!" తనలో తాను అనుకుంటున్నట్టుగా పైకే అంద ఆ మాటలు.


    ఆమె కళ్ళల్లో భయం తొంగిచూసింది.


    ఈ పెళ్ళి జరక్కుండా ఆపటం ఎలా!


    ఈ పెళ్ళి ఎవరూ ఆపలేరా! అన్నట్టు అలా ఉండిపోయింది. బొమ్మలా నిలబడిపోతే ఆమె చెయ్యి వదిలి పెట్టేశాడు.


    "నా మాట విని కాఫీ త్రాగు భోజనం చెయ్యిలేదా నీ ఇష్టం ఈ పెళ్ళి మాత్రం జరగటం మానదు" అంటూ చెప్పి అతను అక్కడనుండి వెళ్ళిపోయాడు.


    ఇందులో ఉన్న ధైర్యం కాస్త కరిగిపోయింది. భయం కలిగింది.


    తను కృష్ణమౌళి భార్య కావటమా!


    తన పంతం నెరవేరే మార్గంలేదా!


`    అతన్నుండి తప్పించుకునే మార్గంలేదా! గెలుపు అతనిదే అవుతుందా!


    అతని భార్యగా ఇష్టంలేకుండా జీవితమంతా గడిపేయాలా!


    ఇందూకి దుఃఖం ముందుకు రాసాగింది.


    ఇలా ఒంటరిగా ఈ ఊరు రావలసింది కాదు. అనవసరంగా తను ఇక్కడ చిక్కుకుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి?


    ఎలా తప్పించుకోవాలి.


    అని ఆలోచిస్తూ కుమిలికుమిలి ఏడ్వసాగింది.


    ఆమె పంతం పట్టినట్టు పచ్చి మంచినీళ్ళు కూడా త్రాగటం మానేసింది.


    ఆరోజు మర్నాడు గడిచిపోయాయి.


    ఆమెలో శక్తి తగ్గిపోసాగింది.


    నీరసం మనిషిని ముంచేయసాగింది.


    లేచి నడిచే ఓపికలేదు.


    కళ్ళు తెరిచి చూసే శక్తిలేదు.


    నీరసంగా మంచంమీద పడుకునే ఉండసాగింది.


    అలా అయినా ప్రాణం పోతుంది అని ఇందు ఆశ. ఇష్టంలేని పెళ్ళి జరిగకంటే ప్రాణం పోవటం మేలనుకోసాగింది.


    ఈ విషయం కృష్ణమౌళికి తెలిసి అంబికకు వెంటనే ఫోన్ చేశాడు. అతని కంగారు చూసి ఆమె ఆమె ధైర్యం చెప్పింది.


    మీరు ఏం కంగారుపడకండి పెళ్ళి జరిగిపోనివ్వండి.


    ఈ రాత్రికేగా పెళ్ళి అంది.


    అవును అన్నాడు.


    "మీరేమి కంగారు పడకండి. పెళ్ళి అయిపోయాక బలవంతంగా హార్లిక్స్ ఏదయినా కలిపియ్యండి."


    "మనిషి మొండివలన ఏం తీసుకోవటం లేదు అంతే" అంటూ చెప్పి ఫోన్ పెట్టేసింది.


    కృష్ణమౌళి రిసీవర్ పెట్టేసి ఆలోచనల్లో పడ్డాడు.


    ఇందూలో శక్తిలేదు.


    భోజనం చెయ్యని కారణంగా మనిషి తోటకూర కాడలా వాలిపోతుంది.


    నిలబడే శక్తిలేదు ఎలా?


    ఈ పెళ్ళి ఎంత త్వరగా జరిగిపోతుంద అని ఉంది అతనికి.


    ఈ రోజు కోసమేగా ఇన్ని అవస్తలు పడింది.


    ఇకముందు ఎలా జరుగుతుందో జరగనీ అనుకున్నాడు.


    పెళ్ళి టైము దగ్గర పడుతుంది.


    కృష్ణమౌళిని ముస్తాబు చెయ్యసాగారు. అతను ఫుల్ సూట్ వేసుకున్నాడు. మెడలో చెమ్కీ దండలు వేసుకున్నాడు. తలకి గులాబీరంగు పట్టుపాగా చుట్టారు. ఆ పాగాకి అందంగా గొలుసులు వేలాడదీశారు.


    కళ్ళకు కాటుక ఎడం చెంపను చుక్క పెట్టారు దృష్టి తగలకుండా.


    నుదుట కళ్యాణబొట్టు పెట్టారు.


    అతని ముస్తాబు పూర్తయ్యింది.


    ఇందూకి స్నానం చేయించి పట్టుచీరకట్టి జాకెట్ తొడిగారు.


    పూలజడ వేశారు.


    కళ్ళకు కాటుక బుగ్గన చుక్క నుదుట కళ్యాణబొట్టు దిద్దారు.


    ఇందూ వాళ్ళకి ఎదురు చెప్పే శక్తి లేనందువలన అలా ఉండిపోయింది.


    వాళ్ళు తనని ఎలా ముస్తాబు చేసినా ఏం అనకుండా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS